Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాటికి 87శాతం యాసంగి ధాన్యం కొనుగోలు జరిగింది. మరో మూడు, నాలుగు రోజుల్లో మిగిలిన ధాన్యం కొనుగోలు పూర్తి అవుతుంది అని రాష్ట్ర వ్యవసాయ సమీక్షలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ గర్వంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏ సమాచారం ఆధారంగా పై గణాం కాలు ప్రకటించారు? గతశనివారం ముఖ్య మంత్రి ప్రకటన చేసిన రోజు, తెల్లారి రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగిన రోజు కూడా రైతులు మా ధాన్యం కాటాలు వేయకపోవడం, కాటాలు అయిన బస్తాలు మిల్లులకు తరలింపు చేయడం లేదనీ రాష్ట్రంలో పలు జిల్లాలో రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఒక రైతు తన ధాన్యం కాటావేస్తారేమోనని వచ్చి చూసి చూసి గుండెఆగి అక్కడే ప్రాణాలు వదిలాడు. సోమ, మంగళవారాలలో కూడా ధాన్యం రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. ధాన్యం కాటాలు అయి 50రోజులు గడిచినా బస్తాల తరలింపు లేక రైతులు గగ్గోలు పెడుతుంటే అన్ని సమస్యలు అధిగమించి కొనుగోలు పూర్తి చేశాం అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది.
ధాన్యం కొనుగోలు రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తాం అని ముఖ్యమంత్రి ఎలా ప్రకటించారు?
ముఖ్యమంత్రి వరంగల్‌లో ఎంజిఎం సందర్శనకి వెళ్ళిన సందర్భంగా పది రోజులలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ప్రకటించారు. అసలు రైతు నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు మంగళం పాడుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. జాన్ 15వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతులు అమ్మకోవచ్చు అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో గందరగోళ ప్రకటనలు చేయడం వల్ల రైతులు తమ ధాన్యం విక్రయం చేయలేం అనే అనుమానంతో అయిన కాడికి క్వింటాల్‌కు రూ.1200, 1300 లోపు 75 కేజీల బస్తా 900 లోపు దళారులకు ఇచ్చేశారు. అవే ధాన్యం బస్తాలు మిల్లులకు చేరాయి. గత రెండు వరస సీజన్ల ధాన్యం కొనుగోలు కంటే ఈ యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు, పడిగాపులు, రైతులకు జరుగుతున్న నష్టం ప్రభుత్వం తమ దృష్టికి రానట్టుగా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నది. గత యాసంగి సీజన్లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంలో 70శాతం కూడా చేరుకోలేదు. ఈ సీజన్లో ఇప్పటికే 87లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది అన్న ముఖ్యమంత్రి ప్రకటన నిజమేనా అనే అనుమానం కలిగిస్తుంది! ముఖ్యమంత్రి గణాంకాలు వాస్తవాలకు దూరంగా, పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. దొడ్డు రకాలు వద్దు, సన్నాలు ముద్దు అంటూ గత వానాకాలం సీజన్లో ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. తీరా పంట దిగుబడి వచ్చాక సన్నాలకు సున్నం వేసారు (కొనుగోలు చేయకుండా). 45లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి దిగుబడి కొనుగోలు చేయలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి కోటిఎకరాల మాగాణాం వాస్తవ రూపం దాల్చితే ఎన్ని ఇక్కట్లను రైతులు ఎదుర్కొవాల్సి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు ప్రభుత్వ కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాత్కాలికంగా చట్టాల అమలు నిలుపుదల చేసినా కేంద్రం ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు అనేక కొర్రీలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు వచ్చినందుకు సంతోషించాలి. కానీ కొనుగోలుకు అవసరమైన గన్నీ సంచులు సమకూర్చటం దగ్గర నుంచి అన్నీ సమస్యలే. గన్నీ సంచుల కొరతతో కాటాలు కావడం లేదు. మిల్లులు అందుబాటులో లేకపోవడంతో కాటాలు పూర్తి చేసిన ధాన్యం బస్తాలు 50రోజులు గడిచినా ఎగుమతికి నోచుకోలేదు. ఒక వ్యవసాయ మార్కెట్లో 20క్వింటాళ్ల ధాన్యం ఎగుమతికి నోచుకోలేదు. వందల సంఖ్యలో కొనుగోలు కేంద్రాల్లో నుంచి ధాన్యం ఎగుమతిలేక రైతులు అకాల వర్షాలు, తుఫాన్ వల్ల ధాన్యం బస్తాలు తడవకుండా జాగ్రత్తలు తీసుకొనేందుకు ప్రయాసపడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం తడిసి మొలకెత్తిన పరిస్థితి నెలకొంది. వాటిని ఆరబెట్టేందుకు అదనపు భారం పెరుగుతుంది. గత నెల రోజుల్లో 6, 7 సార్లు అకాల వర్షాలు, తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి లారీలు వెళ్ళకపోవడంతో ట్రాక్టర్ల ద్వారా బయటకు తరలించేందుకు ఖర్చు భారం పడుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ట్రాన్స్ పోర్ట్ ఛార్జితో లారీలు రాకపోవడంతో 40 కేజీల బస్తాకు రూ.10 రైతు చెల్లించాల్సి వస్తుంది. ఇది కాక సకాలంలో మిల్లుల దగ్గర దిగుమతి కావడం లేదు అని రోజుకు 1500 వెయిటింగ్ చార్జి వసూలు చేస్తున్నారు. ధాన్యం బస్తాల కాటా సమయంలో 40 కేజీలతో పాటు అదనంగా 1.5 నుంచి 2 కేజీలు వేస్తున్నారు. ఇది కాక మిల్లర్లు అక్రమంగా క్వింటాలుకు 5 నుంచి 12 కేజీలు కట్టింగ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రూ.1888లలో అదనపు ఖర్చులు, కటింగ్ రూ.300 వరకు రైతుకు రాకుండా పోతున్నాయి. గతంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాటాలు లోడింగ్, హమాలీ చార్జి రాష్ట్ర ప్రభుత్వం భరించేది. గత ఏడేండ్ల నుంచి ప్రభుత్వం హమాలీ చార్జి విడుదల చేయకపోవడంతో రైతులపైనే ఆ భారం పడుతున్నది.
ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కొనుగోలు ప్రారంభం చేయలేదు. సీజన్లో ధాన్యం దిగుబడి ఎంత వస్తుంది, గన్నీ సంచులు ఎన్ని అవసరం, అందుబాటులో ఉన్న రైస్ మిల్లులు, వాటి నిల్వ సామర్థ్యం, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సకాలంలో సరఫరా చేయగలిగిన లారీలు, రైతులు కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం తీసుకుని వచ్చినప్పుడు అకాల వర్షాలు తుఫాన్లకు తడిసి పోకుండా అవసరమైన టార్పలిన్ పట్టాలు అందుబాటులో ఉంచటం ముందుస్తు చర్యలుగా ఉండాలి. కాని దప్పిక అయితే మంచినీటి బావి త్రవ్వకం ప్రారంభించినట్టు రాష్ట్ర ప్రభుత్వం రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయం కోసం తెచ్చి రోజుల తరబడి పడిగాపులు పడుతుంటే అప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000 కోట్లు అప్పుగా సమీకరించి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసినా, రైతుల కంటే మిల్లర్లకు లాభాల భోరోసా కల్పించినట్టు ఉంది తప్ప రైతులకు భోరోసా కల్పించినట్టు లేదు.
- బొంతు రాంబాబు
సెల్:9490098205