Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రళయాన్ని మరిపించింది. ప్రస్తుతం లాక్డౌన్, ఇతర కారణాల వలన కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికే లెక్కలేనన్ని నిండు ప్రాణాల్ని మింగింది. ఈ రెండవ ఎపిసోడ్ పూర్తిగా ముగియక ముందే ధర్డ్ వేవ్ గురించి చర్చలు, భయాందోళనలు మొదలయ్యాయి. వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు పలువిధాలుగా ప్రభుత్వాలకు హెచ్చరికలు, సూచనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కోవిడ్ వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రధాన మార్గంగా గోచరిస్తున్న వ్యాక్సినేషన్ గురించి కొన్ని విషయాలు పరిశీలిద్దాం...
మనదేశ జనాభా సుమారు 135కోట్లు. వైద్యనిపుణుల అంచనా ప్రకారం కనీసం 95కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తేనే మంద రోగనిరోధక శక్తి (నవతీస ×ఎఎబఅఱ్y) వచ్చి మనదేశంలో కోవిడ్ అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాసం రాసే నాటికి సుమారు 17కోట్ల మందికి మొదటి డోసు ఇవ్వడం జరిగింది. లెక్క కోసం 20కోట్ల మందికి రెండు డోసుల వేక్సిన్ ఇవ్వడం జరిగింది అనుకుందాం. 95కోట్లలో 20కోట్లు తగ్గితే ఇంకా 75కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వవలసి ఉన్నది. వీరికి రెండు డోసులకు లెక్కవేస్తే 150కోట్ల వ్యాక్సిన్లు అవసరమవుతాయి. ప్రస్తుతానికి మనదేశంలో ఉత్పత్తి కాబడుతున్న వ్యాక్సిన్స్ రెండు రకాలు. భారత్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ''కోవాక్సిన్'', సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా, పూనే ఉత్పత్తి చేస్తున్న ''కోవిషీల్డ్''. మే నెలలో దిగుమతి చేసుకున్న, స్థానికంగా రెడ్డి ల్యాబ్స్ ఉత్పత్తి చేస్తున్న రష్యా వేక్సిన్ ''స్పుత్నిక్-వి'' సంగతి పక్కనబెట్టి ఆలోచిద్దాం. జనవరి, 2021లో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైన నాటినుంచి మొదటి 115రోజులలో జరిగిన వ్యాక్సినేషన్ వేగం విశ్లేషిస్తే సగటున రోజుకు 15లక్షల వ్యాక్సిన్లు అందజేశారు. అంటే నెలకు సుమారు 4.5కోట్లు. సౌలభ్యం కోసం నెలకు 5కోట్ల వ్యాక్సిన్లు లభ్యమవుతున్నా యనుకుందాం. మిగిలిన 75కోట్ల మందికి కావల్సిన 150 కోట్ల డోసులకు ఈ లెక్కన 30నెలలు పడుతుందన్నమాట. వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించిన పత్రంలో జులై చివరకు నెలకు 13కోట్ల వేక్సిన్లు ఉత్పత్తి అయ్యేలా చూస్తామని పేర్కొన్నది. (అంటే జులై నాటికి భారత్ బయోటెక్ నెలకు 5.5కోట్లు, సీరమ్ ఇన్సిట్యూట్ 6.5కోట్లు, రెడ్డి ల్యాబ్స్ ఉత్పత్తి చేస్తున్న స్ఫుత్నిక్-వి 1.2కోట్లు సంఖ్యలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తాయని ప్రభుత్వం పేర్కొన్నది). ఇప్పటివరకూ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం కేంద్రప్రభుత్వం ఉత్పత్తిదారులకు అందించిన ఆర్థిక సహాయం, తీసుకున్న చొరవ వంటి అంశాలు పరిశీలించినట్టయితే ఈ లెక్కల పట్ల విశ్వాసం కలగడంలేదు. పోనీ, కేంద్రం చెప్పినట్టు నెలకు 13కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి జరిగినా మిగిలిన 75కోట్ల మందికి అవసరమైన 150కోట్ల వ్యాక్సిన్లు వేయడానికి 11నెలల పైనే పడుతుందనుకోవాలి. ఈలోగా రూపాంతరం (మ్యుటేషన్) చెందుతూ మరింత వేగంగా వ్యాపిస్తూ, మరింత తీవ్రత కలిగిన వ్యాధిగా పరిణమించే అవకాశం ఉన్న కోవిడ్-19 మూడవ, నాల్గవవేవ్ లు ప్రజల ముందున్న పెద్ద సవాలు.
వ్యాక్సిన్ డ్రైవ్ వేగాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ దిశలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. మనదేశంలో టెక్నాలజి ఆధారంగా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయగల ఇతర సంస్థలు ఉన్నాయి. అవసరమైతే కోవ్యాక్సిన్ మేధోసంపత్తి హక్కులను సవరించి మిగతా సంస్థలు ఉత్పత్తి చేయగలిగేలా చర్యలు తీసుకోవాలి. దేశంలో వేక్సిన్ ఉత్పత్తి చేయగల నేపథ్యం ఉన్న పనేషియా బయోటెక్, సనోఫి-శాంతా బయోటెక్, బయలాజికల్-ఇ, హెస్టర్ బయోసైన్సెస్, జైడస్ కాడిలా వంటి సంస్థల్ని భాగస్వాముల్ని చేసి దేశీయ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచాలి. ప్రస్తుతం ఈ సంస్థల అన్ని రకాల వ్యాక్సిన్ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 8.2 బిలియన్లుగా ఉన్నది. కాబట్టి కోవిడ్ 19 వ్యాక్సిన్ల ఉత్పత్తిలో తక్షణమే ఈ సంస్థల్ని భాగస్వాముల్ని చేసే చర్యలు చేపట్టాలి.
విదేశాలనుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించిన బేరసారాల ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా సాధ్యమైనంత అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాలి. అలాగే విదేశీ వ్యాక్సిస్ సంస్థలు తమ వ్యాక్సిన్లను మనదేశంలోని సంస్థల భాగస్వామ్యంతో ఉత్పత్తి చేసేందుకు జరుపుతున్న సంప్రదింపులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
Pfizer-BioNtech ఉత్పత్తి చేస్తున్నMRNA వ్యాక్సిన్ ఇతర దేశాలకు విక్రయిస్తున్న ధరకంటే తక్కువలో మనదేశానికి నాన్-ప్రాఫిట్ ధరకు సుమారు ఒక్కొక్క డోసు రూ.1400 ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సంస్థ మనదేశానికి ప్రస్తుత సంవత్సరాంతానికి సుమారు 5కోట్ల వేక్సిన్లను సప్లయి చేయగలమని వెల్లడించింది. కేంద్రప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలి. రష్యా అభివృద్ధి చేసిన వేక్సిన్ ''స్ఫుత్నిక్-వి'' ఉత్పత్తిని మన దేశంలో రెడ్డి లేబొరేటరీస్ సంస్థ చేపట్టింది. ఈ సంస్థతోనే కాకుండా మనదేశంలోని ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సంస్థలతో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (RDIF) ఇప్పటికే ఒప్పందాల ప్రక్రియ ప్రారంభించింది. ఫలితంగా సుమారు 85కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు సంసిద్ధమవు తోంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని స్థానికంగా ఉత్పత్తి చేయబడ్డ వేక్సిన్లు మనదేశ అవసరాలు తీరేదాకా ఎగుమతి చేయబడకుండా నిషేధించాలి. అమెరికాకు చెందిన Johnson & Johnson సంస్థ అభివృద్ధి చేసిన ఎడినో వైరస్ వెక్టార్ ఆధారిత ణచీA వేక్సిన్ సింగిల్ డోస్ తోనే వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. ఈ సంస్థ మనదేశంలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ (SII), Blological E అనే సంస్థల భాగస్వామ్యంతో స్థానికంగా వ్యాక్సిన్ ఉత్పత్తికి సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యాక్సిన్ లభ్యత కోసం కూడా అవసరమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం వేగంగా తీసుకోవాలి. మనదేశానికే చెందిన Zydus cadila అభివృద్ధి చేస్తున్నLyCOV-Dఅనబడే DNA వ్యాక్సిన్ త్వరలో అప్రూవల్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ సంస్థ జూన్ లేదా జులైలో వేక్సిన్ విడుదల చేయగల్గితే నెలకు 2కోట్ల వేక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనా. అమెరికాలో Modena సంస్థ అభివృద్ధి చేసిన మరో MRNA వ్యాక్సిన్ (MRNA-1273) ప్రస్తుతం ఉన్న అన్ని వ్యాక్సిన్లలోకీ ఖరీదైనది. ఈ సంస్థతో కూడా మన ప్రభుత్వం సంప్రదింపులు జరిపి వ్యాక్సిన్ల దిగుమతికి ప్రయత్నం చేయాలి.
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా, నిరాటంకంగా కొనసాగేందుకు స్థానికంగా దేశీయ వేక్సిన్ల ఉత్పత్తి పెంచడం, విదేశీ వేక్సిన్ల లభ్యత పెంచుకోవడం వంటి చర్యలతో పాటు ప్రభుత్వం మరికొన్ని చర్యలు చేపట్టాల్సి ఉన్నది. సామాన్య ప్రజలలో వేక్సినేషన్ పట్ల అపోహలు, భయాలు తొలగించి, సంసిద్ధత పెరిగేలా వివిధ పద్ధతులలో అవగాహన కల్గించాలి. వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వమే గ్లోబల్ టెండర్ల ద్వారా కొనుగోలు చేసి రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలకు అందించాలి. వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసాల్ని తొలగించాలి. కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఒకే ధరకు లభ్యమయ్యేలా విధానం రూపొందించాలి. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం సామర్థ్యం ఉన్న సంస్థలకు అవసరమైనంత బడ్జెట్ ఉదారంగా, సత్వరమే కేటాయించాలి. దేశవ్యాప్తంగా అర్హులైన వారందరి కీ ప్రభుత్వమే ఉచితంగా వేక్సిన్లు అందించాలి. సత్వరమైన, సమగ్రమైన వ్యాక్సినేషన్ పాలసీ అమలు ద్వారా మాత్రమే కోవిడ్-19 కలుగజేసే తదుపరి పరిణామాలను ఎదుర్కొని వ్యాధికి అడ్డుకట్ట వేయగలం.
- డాక్టర్ కె శివబాబు
సెల్:9246277022