Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివాదం ఏదైౖనా రాందేవ్ బాబా అమ్మే ఏ వస్తువు కైనా ఉచితంగా ప్రచారం లభించడంతో ఆయన వివాదాలను ఆహ్వానిస్తాడు. 'రాందేవ్ బాబా సరుకు' అనే ముద్రే, నూడుల్స్ మొదలు ఆయుర్వేద మందుల దాకా పతంజలి ఉత్పత్తులను విక్రయిస్తుంది. అందుకే పతంజలి మన దేశంలోని ఎఫ్ఎమ్సీజీ గ్రూప్‌లలో ఒక పెద్ద సామ్రాజ్యంగా మారింది. రాందేవ్‌కు, పతంజలికి ఏ వివాదమైనా (ఆఖరికి ఆయన తప్పుడు సమాచారం వలన ప్రజలు చనిపోతున్నా) ఆయన వ్యాపారానికే ఉపయోగపడుతుంది. ప్రభుత్వం (రాందేవ్ పైన ఇటీవల హర్షవర్థన్ చేసిన విధంగా) కొద్దిపాటి విమర్శ చేస్తుంది. కానీ పతంజలి వ్యాపార సామ్రాజ్యానికి ప్రభుత్వ మద్దతు, అండదండలు ఉన్నాయి.
'బాబాగిరి' నుంచి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం రాందేవ్ నుంచే ప్రారంభం కాలేదు. పుట్టపర్తి సాయిబాబా, శ్రీశ్రీ రవిశంకర్ లాంటి వారు అనేకులు మతాన్ని వ్యాపారంగా మార్చారు. వ్యాపారం ద్వారా రవిశంకర్ 50కోట్ల రూపాయల సంవత్సరాదాయాన్ని, పతంజలి 25కోట్ల రూపాయల టర్నోవర్‌తో పోలిస్తే, రాందేవ్ బాబా ప్రాథమికంగా చేసిన వ్యాపారం 'మతం' కాదు, 'యోగా' కాదు. భారతదేశ తాజా బిలియనేర్గా మారడానికి, రాందేవ్‌కు ''యోగా గురువు'' అనే పేరు లాభం చేకూర్చింది.
ఏ దారీలేని తన మార్గంలో, ఆయనకు మొదట భారీగా భూములను కట్టపెట్టి కాంగ్రెస్ పార్టీ బాగా సహాయపడింది. ఆ తరువాత బీజేపీ ఇంకా భారీగా భూములు ఇవ్వడమే కాక, ఆయుష్, ఇతర మంత్రిత్వశాఖల ద్వారా ఆయన కున్న అనేక వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలిచింది. హర్యానా ప్రభుత్వం ప్రజలకు సరియైన ఆరోగ్య రక్షణ, మందులు, టీకాలు సమకూర్చడానికి బదులుగా రాందేవ్ బాబా తయారు చేసిన కరోనిల్ కిట్లను కొనుగోలు చేసి పంచుతుంది.
ప్రభుత్వ మద్దతు, తన యోగా శిబిరాలు, యోగా ప్రదర్శనల ప్రసారాలను తిలకించిన ప్రేక్షకులు చేసే ఉచిత ప్రచారం పైన ఆధారపడి రాందేవ్ వ్యాపార సామ్రాజ్యం నిర్మించబడింది. దీనికి తోడుగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్థన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లాంటి వారితోపాటు ప్రముఖులు కూడా రాందేవ్ కరోనిల్‌ను ఆమోదించారనే ప్రచారం కూడా ఆయనకు సహాయపడింది.
పతంజలి గ్రూపు సంస్థల ఆదాయం ఫెయిర్ నెస్ క్రీం, నూడుల్స్, వెజిటబుల్ ఆయిల్ లాంటి ఉత్పత్తుల ద్వారా వస్తున్నాయి. తన సామ్రాజ్యంలోని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించే ఒక పదార్థం పోషించే కీలక పాత్ర ద్వారా వచ్చే భారీ లాభాలతో ఇతర ఉత్పత్తులను చౌకగా విక్రయిస్తుంది. ఆ విధంగా అల్లోపతీ మందుల కన్నా పతంజలి ఉత్పత్తులే ఉన్నతమైనవి అనే ప్రచారం కూడా అవసరమైంది. రాందేవ్ మ్యాజిక్ నివారణ మార్గాలను కీర్తిస్తూ, వాటిని మూలికా ఉత్పత్తులతో పాటు యోగాకు జోడించి, అవి ఒక స్థాయిలోని వ్యాధులను నయం చేస్తాయని ప్రచారం చేస్తున్నాడు. ఆఖరికి స్త్రీలు పండంటి మగబిడ్డలకు జన్మనిచ్చే మార్గాలను కూడా (ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న ఆరోగ్య భారతి తన బూటకపు గర్భ్ సంస్కార్ కార్యక్రమాల ద్వారా ప్రచారం చేసిన విధంగా) ప్రచారం చేస్తున్నాడు. ఆధునిక మందులు, విజ్ఞాన శాస్త్రంలో జరిగిన అభివృద్ధిపై ఆయన చేస్తున్న దాడి కేవలం తన ఉత్పత్తులను విక్రయించేందుకు మాత్రమే కాక, అది ప్రజలకు సహాయపడే టీకాలు, మందుల నుంచి కూడా వారిని దూరం చేస్తుంది కాబట్టి ఆ దాడి చాలా ప్రమాదకరమైనది.
జాతీయవాద మందులపై నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా వైరస్‌ను ప్రవేశ పెట్టే విధానం (వేరియోలేషన్) గురించి తెలుసుకోవాలి. దానిని భారతదేశం, చైనా, అరబ్ దేశాల్లో ఉపయోగించారు. ఈ విధానంలో భవిష్యత్తులో ఏ వైరస్ వల్ల వ్యాధి సోకుతుందో, ఆ వైరస్‌నే తక్కువ మోతాదులో శరీరంలోకి ప్రవేశపెడతారు. పాశ్చాత్య దేశాలకు చెందిన అల్లోపతీ మందుల్ని, టీకాలను తిరస్కరించే బదులుగా, మనం వాటి వాస్తవ మూలాల గురించి మాట్లాడుకోవాలి. నేడు వ్యాక్సిన్ తయారు చేసే వారిపైనే యుద్ధం జరుగుతుంది. మనం భారతదేశంలో ఉన్న పరిజ్ఞానంతో వ్యాక్సిన్లను తయారు చేద్దామా, లేక కరోనిల్నే అంటిపెట్టుకొని, ఫైజర్, ఆస్ట్రాజెనికా లాంటి కంపెనీలు వ్యాక్సిన్ మార్కెట్‌ను ఏలే విధంగా చేద్దామా?
లాభదాయక మైన ఆధునిక మందుల మార్కెట్‌ను, స్వదేశీ మందుల మార్కెట్‌ను గుత్తాధిపత్యం వహించే సమయంలో పెద్ద ఫార్మా కంపెనీలకు ధారాదత్తం చేయడమే రాందేవ్ బాబా జాతీయ విధానం. వైద్య సంబంధమైన ఆక్సిజన్‌తో అవసరం లేదు, ఎలా ఊపిరి పీల్చుకోవాలో రాందేవ్‌ను అడిగితే, ''కోవిడ్19 నుంచి ఉపశమనం పొందాలా? కొన్ని రకాల మూలికల గోళీలు, నూనెలు పతంజలి నుంచి తీసుకోండి. అవి ప్రజలకు చర్మసౌందర్యాన్ని ఇచ్చిన విధంగానే, పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంలో సహాయపడినట్టే, వ్యాధిని కూడా నయం చేస్తుందని'' చెబుతాడు.
కోవిడ్-19 పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు రాందేవ్ బాబాకు మధ్య ఇటీవల కాలంలో జరిగిన యుద్ధాన్ని పరిశీలిస్తే, ''అల్లోపతీ'' మందులు లేదా ఆధునిక మందులపై రాందేవ్ చేసిన దాడి, సుదీర్ఘకాలంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కోవిడ్‌పై పోరాటం చేస్తున్న డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై దాడిగానే చూడాలి. వారిని, వారి త్యాగాలను ఆయన హేళనచేశాడు. ఇంకా దారుణమైన విషయం ఏమంటే, బాగా పాడైపోయిన ఊపిరితిత్తులతో శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తున్న రోగులను రాందేవ్ దారుణంగా పరిహసించిన తీరు, ఎదుటివారి బాధలను అర్థం చేసుకోలేని తన అసమర్థతను తెలియజేస్తుంది. కోవిడ్-19 ప్రమాదకరమైన వ్యాధి కాదనీ, మనకు శ్వాస తీసుకునే విధానం తెలియక పోవడం వల్లే వ్యాధితో బాధపడుతున్నామనే రాందేవ్ బాబా మాటలు ఒకవేళ ప్రజలు విశ్వసిస్తే, తీవ్రమైన అంటువ్యాధితో బాధపడుతున్న వారు ఖచ్చితంగా చనిపోతారు. వారికి ఆక్సిజన్, ఇతర మందులు అవసరం, దానితో జబ్బును విజయవంతంగా ఎదుర్కొనగలుగుతారు. అందుకే రాందేవ్ బాబా ప్రమాదకారి.
కోవిడ్-19 అంత తీవ్రమైనది కాదని రాందేవ్ అంటాడు. తన మూలికల కిట్ ద్వారా రోగ నిరోధకశక్తిని పెంచి, తన కరోనిల్ మాత్రలతో, శ్వాస తీసుకునే సరియైన విధానం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పే ఆయన మాటలు తన ఉత్పత్తులను విక్రయించే దానిలో భాగమే. తన ఉత్పత్తులు, ఇతర మూలికా ఉత్పత్తులు, టీవీల్లో ప్రసారం అయిన తన యోగా ప్రదర్శనల విక్రయం, ఆయన యోగా శిబిరాలు పతంజలి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి సహాయ పడ్డాయి. ఒకవేళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలత చెందితే, అది వివాదానికి దారి తీస్తుంది. అది కూడా ఆయనకు టన్నుల కొద్దీ ప్రచారాన్ని ఉచితంగా తెచ్చిపెడుతుంది. ఈ భక్తుల ప్రపంచంలో, భారతీయతను కీర్తిస్తూ, ''విదేశీయత''ను తీవ్రంగా విమర్శించే వారు ఎవరైనా (ఆఖరికి వారు చేసే వాదనలు మోసపూరితమైనవి అయినప్పటికీ కూడా) ''నిజమైన'' జాతీయవాదే.
ఒకవేళ రాందేవ్ బాబా వాదనలు కేవలం తన ఉత్పత్తులను విక్రయించేందుకే అయితే మనం వాటిని పట్టించుకోకుండా ఉండేవాళ్ళం. దురదృష్టవశాత్తు, ఆయన వాదనలు భారీ నష్టాలకు దారి తీస్తున్నాయి. తమ కుటుంబ జీవితాలను రోజుకు 15, 16 గంటల పాటు త్యాగం చేస్తూ, తమ ప్రాణాలకు తెగించి ముందుండి పని చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల ధైర్యానికి రాందేవ్ వాదనలు నష్టం కలిగిస్తున్నాయి. పతంజలి, రాందేవ్‌బాబా వలె కాకుండా, వారు అనేక మంది జీవితాలను రక్షిస్తూ, మన ఆప్తులను ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్నారు. అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు పెరిగి మరణాల సంఖ్య పెరిగిన సందర్భంలో ఆసుపత్రులు విఫలం చెందినప్పుడు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను తప్పుడు ఆరోపణలతో, బూటకపు వాదనలతో చులకన చేసి నిందిస్తున్నారు. అందుకు ఆయనకు శిక్షగా దేశ ద్రోహం నేరాన్ని మోపడమే కాకుండా, ఆయన ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపు ఇవ్వాలి.
వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ప్రచారం రాజేయడం ద్వారా రాందేవ్ బాబా మరొక నష్టాన్ని కలిగిస్తున్నాడు. వ్యాక్సిన్లు, తీవ్రంగా విజృంభిస్తున్న అంటువ్యాధులకు వ్యతిరేకంగా రక్షణ కలిగించి, వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికడుతుందని అన్ని వ్యాక్సిన్ల ప్రయోగాలలో రుజువు అయింది. ఏ వ్యాక్సిన్ కూడా 100శాతం రక్షణను ఇవ్వదనీ, కానీ సమూహ రోగ నిరోధక శక్తికి (హెర్డ్ ఇమ్యూనిటీ) అందించగలదు.
వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ, అనేకమంది డాక్టర్లు చనిపోయారని బోగస్ గణాంకాలతో వ్యాక్సిన్ వ్యతిరేక ప్రచారాన్ని రాందేవ్ ముందుకు తీసుకొని పోతున్నాడు. ఈ క్రమంలో ఆయన, భారత దేశంలో వాట్సాప్‌పై ఆధారపడే చిన్న చిన్న వ్యాక్సిన్ వ్యతిరేక శిబిరాలకు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ దేశంలో వ్యాక్సిన్ వ్యతిరేక సంఖ్య పెరిగితే, మనం అమెరికా ఎదుర్కొంటున్న సవాల్ నే మనం కూడా ఎదుర్కొంటాము. వారు (అమెరికన్లు) మళ్ళీ తిరిగి వచ్చిన మీజిల్స్ వ్యాధితో కాలం గడుపుతున్నారు, వారి జనాభాలో చెప్పుకోదగిన భాగం ప్రజలు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోడానికి అయిష్టంగా ఉన్నారు. అదే మన దేశంలో జరిగితే, కోవిడ్-19 వ్యాప్తిని కొన్ని చిన్న చిన్న ప్రాంతాలకే పరిమితం చేయడానికి బదులుగా, కోవిడ్ మనతోనే శాశ్వతంగా ఉండి పోతుంది. కొత్త వ్యాక్సిన్ అవసరం ఏర్పడే విధంగా, వైరస్ కొత్త రూపాన్ని సంతరించుకోవడం కొనసాగుతుంది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ రాందేవ్‌ను సున్నితంగా చీవాట్లు పెట్టినప్పటికీ, బీజేపీ ప్రభుత్వం పతంజలి సామ్రాజ్యానికి చాలా పెద్ద మద్దతుదారు. ఆయుష్ మంత్రిత్వశాఖ, పతంజలి మార్కెట్‌కు ఒక విస్తరణ శాఖగా మారింది. భూములు, బ్యాంకు సేవలతో పాటు పతంజలికి బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల రాయితీలను ఇస్తుంది. రాందేవ్ బాబా బూటకపు వాదనలతో పాటుగా, పురాతన కాలంలో గర్భ సంస్కార్, భారతీయ జన్యుశాస్త్రం, ఎగిరే యంత్రాలకు కూడా బీజేపీ సర్కార్ సమానమైన మద్దతు తెలుపుతుంది. కోవిడ్ వ్యాప్తి సమయంలో ఇటువంటి 'అర్థం లేని సైన్స్' మరింత ప్రమాదకరం.
'పీపుల్స్ డెమోక్రసీ' సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్,
- ప్రబీర్ పుర్కాయస్థ
సెల్:9848412451