Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరశిల్పి జక్కన్న గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఆయన చరిత్ర ఆధారంగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు... సినిమా కూడా తీసి హిట్ కొట్టారు. అద్భుత, అద్వితీయమైన శిల్పాలను చెక్కటం ద్వారా జక్కన్న జగత్ ప్రసిద్ధిగాంచారు. తద్వారా భారతదేశ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఇప్పుడు మన దర్శకధీరుడు రాజమౌళిని కూడా సినిమా ప్రియులు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటున్నారు. మగధీర, బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాలకు ఆయన వేయించిన సెట్టింగులు ప్రపంచం మొత్తాన్ని అబ్బురపరిచాయి. అందుకే ఆనాటి జక్కన్న శిల్పకళతో ఆరితేరితే... ఈనాటి రాజమౌళి సెట్టింగుల కళలో ఇరగదీస్తున్నారంటూ ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. వీరికేమాత్రం తీసిపోని రీతిలో మన తెలంగాణ దళపతి, గులాబీ సేనాని అయిన సీఎం కేసీఆర్ కూడా మరో జక్కన్నలా పేరు తెచ్చుకుంటున్నారంటూ కారు పరివారం తెగ ముచ్చటపడిపోతున్నది. గత నెల వరంగల్ పర్యటన తర్వాత వారు ఈ విషయాన్ని మరింతగా రూఢ చేసుకున్నారు. ఎందుకంటే ఆ పర్యటన సందర్భంగా ఓరుగల్లులో ప్రస్తుతమున్న సెంట్రల్ జైలును ఇప్పటికిప్పుడు కూల్చేసి.. దాని స్థానంలో వైద్యశాలను నిర్మిస్తామంటూ ఆయన ప్రకటించారు కాబట్టి.. (ఆ భవనాన్ని కూల్చకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఆస్పత్రిగా మార్చవచ్చన్న ప్రశ్నను మీరు అడక్కూడదు) ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న పాత సెక్రటేరియట్ కాలగర్భంలో కలిసిపోయింది. మరోపక్క అసెంబ్లీని కూడా వేరే చోటికి తరలిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చారు. ఇంకోవైపు భాగ్యనగరం చుట్టూ మినీ ఔటర్ రింగు రోడ్డులు, ఉక్కు వంతెనలు, కొంగొత్త ఫ్లై ఓవర్లు నిర్మితమవుతున్నాయి. ప్రస్తుత కరోనా సమయంలోనూ, అదీ ఖజానా ఆర్థికంగా కుదేలవుతున్న సందర్భంలోనూ అప్పు తెచ్చైనా సరే... వీటిని కట్టేందుకు సర్కారు వారు రెఢ అయిపోతున్నారు. ఈ విధంగా అత్యాధునిక హంగులు, ఆర్భాటాలతో రంగు పొంగులతో నూతన నిర్మాణాలను చేపడుతున్నప్పుడు మనం మాత్రం ప్రభుత్వాధినేతను అమరశిల్పి చంద్రన్న... అని మాట్లాడుకోవటంలో తప్పు లేదు కదా...? కాకపోతే అప్పటి జక్కన్న శిల్పాలు చెక్కారు... ఇప్పటి చంద్రన్న.. వేల కోట్లతో నిర్మాణాలు చెక్కుతున్నారు. అంతే తేడా... మిగతాదంతా సేమ్ టూ సేమ్....
-బి.వి.యన్.పద్మరాజు