Authorization
Mon Jan 19, 2015 06:51 pm
20వేల కోట్ల రూపాయల ఖర్చుతో సెంట్రల్ విస్టా డెవలప్మెంట్ ప్రాజెక్టు (పార్లమెంట్, దాని చుట్టూ వున్న ప్రాంత అభివృద్ధి పథకం అనవచ్చు)ని పెద్ద హడావుడిగా కేంద్ర బీజేపీ సర్కార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిని 2022 స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలన్నది వారి ఆలోచన. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్లు, పడకలు, వెంటిలేటర్లు చివరికి చనిపోయిన వారిని పాతటానికి స్థలం కూడా లేక అతలాకుతలం అవుతున్నది. ఈ క్రమంలో అన్యామల్హోత్రా, సోహైల్ హష్మిి అనే ఇరువురు ప్రముఖులు ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని, ప్రత్యేకించి కరోనా సమయంలో పెద్దయెత్తున సాగుతున్న ఈ నిర్మాణ పనులు ఢిల్లీ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలుగచేస్తాయని ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. వారు పనులు జరుగుతున్న స్థలంలో వేలాదిమంది కార్మికుల దయనీయ పరిస్థితులను, 12గంటల పనిదినాన్ని, రోజుల తరబడి వేతన బకాయిలను కేసులో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు 1.6.21న వారిని తీవ్రంగా మందలించడమే కాకుండా ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ, ఇది చాలా ముఖ్యమైన పనని, దీన్ని ఎట్టి పరిస్థితులలోను ఆపకూడదని ఓ దురదృష్టకరమైన తీర్పు యిచ్చింది. కేంద్ర గృహ నిర్మాణం, అర్బన్ అఫైర్స్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే 76మంది ప్రముఖ మేధావులు, కళాకారులు, రచయితలు, మ్యూజియం నిర్వాహకులు ఈ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా లేఖ రాశారు. మంత్రిగారు, వీరి వాదన మన దేశానికే తలవంపులు తెస్తుందని, వీరి వాదనలో కుటిలత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని హెచ్చరికలాంటి ప్రకటన చేశారు. ఏది ఏమైనా కేంద్ర బీజేపీ సర్కార్ కోరుకుంటున్నట్లుగా ఈ సంవత్సరం ఆఖరికి ఈ ప్రాజెక్టు పూర్తికావచ్చు. 1921లో పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, తదితర భవనాలు కట్టబడ్డాయి. అంటే ఈ 2021 నాటికి ఆ భవనాల వయస్సు 100సంవత్సరాలు. అందువలన ఈ భవనాలను మారుస్తామని, రాబోయే కొద్ది సంవత్సరాలలో పార్లమెంటు సభ్యుల సంఖ్య కూడా పెరగవచ్చని, అప్పటికి ఈ పార్లమెంటు భవనం సరిపోదని బీజేపీ అధినేతలు వక్కాణిస్తున్నారు. పైకి చూడటానికి ఇదంతా చాలా సహజంగా జరిగే ప్రక్రియలా కన్పిస్తోంది. కాని గత ఏడు సంవత్సరాలుగా అంటే హిందూత్వ శక్తులు కేంద్రంలో అధికారం చేపట్టిన దగ్గర్నుండి దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో బీజేపీపైకి చెబుతున్నది నిజం కాదని, దీనిలో అంతర్లీనంగా ఓ ఫాసిస్టు ఎజెండా తలదాచుకుని ఉన్నదని చెప్పవచ్చు.
అసలు ఎజెండా...
1947 ఆగస్టు 15న పాకిస్థాన్ ఒక మత రాజ్యంగా ఏర్పడింది. భారతదేశం ఒక హిందూ రాజ్యంగా ప్రకటించబడాలని నాటి ఆర్ఎస్ఎస్ బహిరంగంగానే కోరింది. ఆ వాదనని కాంగ్రెస్, కమ్యూనిస్టులే కాదు, యావత్ భారతదేశం తిరస్కరించింది. భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాలని, అప్పుడే అభివృద్ధి, ఆధునికత, సాంఘిక సమానత్వం సాధ్యమని ప్రజలు బలంగా నమ్మారు. అయితే నాటినుంచి ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి పన్నాగాలు పన్నుతూనే ఉంది. అందులో భాగమే మన లౌకిక రాజ్యాంగాన్ని రద్దుచేసి దాని స్థానంలో అతి క్రూరమైన మనుధర్మశాస్త్రాన్ని ప్రతిష్టించడం. అందుకు ఆర్ఎస్ఎస్ రూపొందించిన మేథావుల సంస్థ 'సంస్కార భారత్'కు మనుధర్మశాస్త్రాన్ని ప్రజలందరూ ఆమోదించేవిధంగా చాకచక్యంగా తిరగరాసే ప్రాజెక్టును అప్పగించింది. వాస్తవానికి మనుధర్మ శాస్త్రం ప్రస్తావన లేదు కాబట్టి భారత రాజ్యాంగాన్ని తాము ఆమోదించబోమని 1950లోనే ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. 2014లో అంతకుమించి 2019లో పార్లమెంటులో అత్యధిక సీట్లు సాధించిన హిందూత్వ శక్తులు, 1947 నాటి కలలను సాకల్యం చేసుకోవడానికి ఆరాటపడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి, దానికి మూలస్థంభాలైన లౌకిక వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థ, సామాజిక న్యాయాలపై ముప్పేట దాడి మొదలు పెట్టారు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్నే కాదు ఆ రాజ్యాంగం ఆమోదించబడిన పార్లమెంటు భవనాన్ని కూడా కనుమరుగుచేసే కుట్ర ప్రారంభమైంది. పార్లమెంటు భవనానికి దగ్గరలో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, జాతీయ పురావస్తు శాఖ భవనాలను కూలగొట్టి వాటి స్థానంలో మంత్రుల క్వార్టర్లు, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి భవనాలు వగైరా నిర్మించనున్నారు. విమర్శలు వెల్లువెత్తిన దగ్గరు నుండి అక్కడ జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాల ఫొటోలు తీయడాన్ని కూడా నిషేధిస్తూ, అసలు ఈ మొత్తాన్ని అత్యవసర సర్వీసులకింద పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేశారు.
ఆలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ చరిత్రకారుడు ఎ ఎన్ రజ్వి ''ఇది సౌందర్య శాస్త్రానికి సంబంధించిన విషయం కాదు, ఇది చరిత్రకు సంబంధించిన సమస్య. బ్రిటిషు వాళ్లే ఆనాడు విస్తృతంగా సంప్రదింపులు జరిపి నిర్మాణం ఏ ఇంజనీర్‌కి అప్పచెప్పాలని వెతుకులాడారు. కాని ఇప్పుడు అటువంటిది ఏమీలేదు. పారదర్శకతే లేదు. ఆ ప్రాంతంలోని పుట్‌పాత్ పగలగొట్టినా అది మన జాతి వారసత్వంపై దాడిగానే చూడాలి'' అని సరిగ్గా చెప్పారు. పై మూడు ప్రభుత్వ శాఖలలో మన దేశ చారిత్రక గమనాన్ని తెలియజేసే ఎంతో విలువైన అతి పురాతన వస్తువులు, పరికరాలు, పత్రాలు భద్రపరచబడి ఉన్నాయి. మనదేశ బహుళ సంస్కృతికి అవి ఎంతో విలువైన నిదర్శనాలు. గౌతమ బుద్ధుని అస్థికలు, మొహంజోదారో, హరప్పా కాలంనాటి రాతి వస్తువులు, చోళుల నాటి అనేక టన్నుల బరువైన విగ్రహాలు, వేల సంవత్సరాల నుండి మనదేశంలో వాడబడిన బంగారు, వెండి నాణెములు, నిజాం నవాబు కాలంనాటి ఆభరణాలు, ఇవికాక నాడు రాళ్లపై చెక్కిన అనేక బొమ్మలు, ఆనాటి తాళపత్ర గ్రంథాలు వంటి 2,06,000కి పైగా విలువైన వస్తువులు ఉన్నాయి. నాడు ఈ భవన సముదాయాన్ని నిర్మించిన ఆంగ్లేయులుకూడా మన దేశంలోని బహుళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మొఘల్ తరహా ఉద్యానవనాలు, రాజపుట్ శిల్పకళకు సంబంధించిన దర్వాజాలు, కిటికీలు, గొడుగు వంటి పైకప్పులతో నిర్మించారు. ఇవన్నీ హిందూత్వ శక్తులు నమ్మబలుకుతున్న పుక్కిటి పురాణాలకు విరుద్ధంగా బహుళ జాతుల, అనేక మత సాంప్రదాయాల సంగమంగా భారతదేశాన్ని నిరూపిస్తున్న సాక్ష్యాలు. వీటన్నింటినీ చెక్కు చెదరకుండా రానున్న తరాలకి అందించాలి. మన పురాతన చరిత్ర గురించి అర్ధం చేసుకోవడానికి అవసరమైన ఇంత విలువైన వాటిని మార్చడం, అది కూడా ఇంత భయంకరమైన కరోనా వాతావరణంలో హడావుడిగా మార్చడం వలన చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అయినా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లుతున్నది. అందుకే అనేకమంది దేశభక్తియుత మేధావులు, లౌకిక శాస్త్రవేత్తలు, కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముస్సోలిని, హిట్లర్లు గుర్తొస్తున్నారు...
ముస్సోలినీ, హిట్లర్లని, వారి ఫాసిస్టు సిద్ధాంతాన్ని ప్రశంసిస్తూ 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. జర్మన్లో హిట్లర్ ఆర్యజాతి రక్త పవిత్రతను కాపాడటానికి ఇతర జాతుల్ని ఏరకంగా భౌతికంగా నిర్మూలించాడో అది మనకు ఆదర్శం కావాలని ఆర్ఎస్ఎస్ రెండవ సర్‌సంఫ్‌ుచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడిన వెంటనే వ్యవస్థాపకులలో ఒకరైన బిఎస్ మూంజేను ఇటలీ ఫాసిస్టు అధినేత ముస్సోలినీ వద్దకు, వాళ్లు ప్రారంభించిన ఫాసిస్టు ప్రవేటు సైన్యం గురించి అధ్యయనం చేయడానికి పంపారు. అందువలన ఆర్ఎస్ఎస్ చరిత్ర, అది ముందుకు తెచ్చిన హిందూత్వ సిద్ధాంతం యొక్క సారాంశం తెలుసుకుంటే ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ 'విస్టా డెవలప్మెంటు ప్రాజెక్టు' అసలు ఉద్దేశం అర్థమవుతుంది. వాస్తవానికి ముస్సోలినీ, ఆ తరువాత హిట్లర్లు తమ పాలనాకాలంలో ఫాసిస్టు సిద్ధాంతం ప్రజలపై పట్టు సాధించడానికి భవనాల నిర్మాణాన్ని కూడా వాడుకోవాలని నిర్దేశించారు. హిట్లర్ ''పాత చరిత్రకి సంబంధించిన అభిప్రాయాలను సూచించే కట్టడాలు అనవసరం. వాటి స్థానంలో నూతన భవన నిర్మాణాలు జరగాలి. ఆ నిర్మాణాలు నిరాడంబరత, ఏకాకృతి, జ్ఞాపక చిహ్నాలు, ధృఢమైన, శాశ్వతమైన (అంతంలేని)విగా ప్రజలు గుర్తించేలా ఉండాలి.'' అని ప్రకటించాడు. అంతేకాదు 1933లో అధికారం చేపట్టిన అనంతరం దేశరాజధాని బెర్లిన్ని ఆ విధంగా పునర్ నిర్మించాలని కోరుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభించేముందు తనకు అత్యంత ఆప్తుడైన 'ఆల్బర్ట్ స్పీర్' అనే నాజీ ఆర్కిటెక్ట్‌కి ఆ పని అప్పగించాడు. రెండవ ప్రపంచ యుద్ధాన్ని జర్మనీ గెలవబోతున్నదని, 1951 కల్లా పై పద్ధతులలో బెర్లిన్‌లో 'ప్రపంచ రాజధాని' నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించాడు. అందుకు 12,000 మెట్రిక్ టన్నుల బరువైన ఒక విజయస్థూపాన్ని నాజీ ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే ఆ నరరూప రాక్షసుని ఆశలు ధ్వంసంచేస్తూ సోవియట్ రష్యా ఎర్రసైన్యం హిట్లర్ సైన్యాన్ని, దాన్ని నమ్ముకున్న జపాన్, ఇటలీ సైన్యాలని తుదముట్టించింది. జర్మనీ ఓటమి, హిట్లర్ ఆత్మహత్యలతో 'ప్రపంచ రాజధాని' నిర్మాణం అర్థంతరంగానే ఆగిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఆర్ఎస్ఎస్ హిట్లర్ కథను పునరావృతం చేస్తుందా అనిపిస్తుంది.
కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంతో ఉంటుందట అని ప్రముఖ చరిత్రకారిణి నారాయణి గుప్తా ''ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారాన్ని బట్టి వీళ్లు కట్టబోతున్న భవనాలు నాజీ తరహావి. వ్యక్తి గతంగా వాటి చిత్రాలేవీ మనకు తెలియకున్నా ఇక ఏ చిహ్నాలను ఎక్కడ పెడతారన్నది వేచిచూడాల్సిందే'' అని పేర్కొన్నారు. ఇప్పుడు వాళ్లు ధ్వంసం చేస్తున్న ప్రాంతంలో మాజీ రాష్ట్రపతి ఫక్రుద్ధీన్ ఆలీ అహ్మద్ సమాధి, ఢిల్లీ నగరం నిర్మించినప్పటి మశీదు కూడా ఉన్నాయి. పాపం వేతనాల కోసం తవ్వుతున్న కార్మికులకు ఈ విషయాలు అర్ధం అవుతాయో లేదో. గౌతం భాటియా అనే ప్రముఖ ఆర్కిటెక్ట్ ఈ విషయాలు వివరిస్తూ ''ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఏ చారిత్రక భవనాలను ఉంచాలి, వేటిని కూల్చాలి అని ఏకపక్షంగా నిర్ణయించకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ నిర్ణయించే హక్కు, పిల్లలను సాకే మనిషికి యివ్వరు. అంటే నిర్ణయాలు ప్రజలు చేయాలి. పార్లమెంటులో చర్చించబడాలి.'' అని ప్రకటించాడు. అలాగే ప్రముఖ ఫొటోగ్రాఫర్ మరియు సామాజిక కార్యకర్త అయిన రామ్రహిమాన్ ''మోడిగారి అద్భుత ప్రాజెక్టులన్నీ మౌలికంగా ఫాసిస్టు తరహావి. సబర్మతి నదిలో పారుదలలేని టాంక్ కట్టడం, బెనారస్‌లో కాశీ విశ్వనాధుని మందిరం చుట్టూ ఇళ్లన్నింటినీ తొలగించడం... యిలా ఏ చట్టాన్నీ లెక్కచేయకుండా, ప్రజాభిప్రాయాలు సేకరించకుండా, భౌతికంగా ప్రజల్ని, భవనాలను నిర్మూలిస్తూ పోవడం మన దేశంలో పరిపాటి అయింది. నేడు ఈ ఫాసిస్టు మూక సృష్టిస్తున్న కళలు, ఆర్కిటెక్చర్స్ పూర్తిగా ప్రజావ్యతిరేకమైనవి. సుసంపన్నమైన భారత సంస్కృతిని విధ్వంసం చేసే చర్యలివి'' అని ఆయన హిందూ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో వ్యక్తపరిచారు.
ప్రతీఘాత సాంస్కృతిక దాడిని త్రిప్పి కొట్టాలి
ఫాసిస్టు తరహా హిందూత్వ సిద్ధాంతానికి ఆయువుపట్టు దాని ప్రతీఘాత సాంస్కృతిక దాడిలో ఉంది. ఇప్పటికే ఇది చేయగలిగినంత నష్టాన్ని చేసింది. భారతీయ సంస్కృతిని, నాగరికతని హిందూ సంస్కృతి, నాగరికతలుగా నమ్మించడానికి కాషాయకూటమి పడరానిపాట్లు పడుతున్నది. ఆహార పద్ధతులనుండి, వస్త్రధారణ, మాట్లాడే భాష, ఆచార వ్యవహారాలు అన్నింటా బహుళత్వాన్ని చిదిమి దాని స్థానంలో ఏకీకృతమైన, కృత్రిమ సంస్కృతిని హిందూ సంస్కృతి ముందుకు తెస్తున్నారు. అందులో భాగంగానే అనేక చారిత్రక కట్టడాలను తుడిచిపెట్టనున్నారు.
తాజాగా కోర్టు తీర్పులు కూడా ఇందుకనుకూలంగా ఉండటం మరో ప్రమాదకర పరిణామం. ఆధునికతత్వం, అభివృద్ధి, సమానత్వం అనే లక్ష్యాలన్నీ ఈ దాడికి గురౌతున్నాయి. తాలిబన్ తరహా రాజ్య స్థాపనవైపు ఆర్ఎస్ఎస్ హిందూత్వ శక్తులు అర్రులు చాస్తున్నాయి. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఈ దాడిని ప్రతిఘటించాలి. మన దేశంలో తరతరాలుగా వెల్లివిరుస్తున్న బహుళ సంస్కృతిని, మత సామరస్యాన్ని మరింత అభివృద్ధి చేయాలి. ఈ క్రమంలో హిందూత్వ సిద్ధాంతానికి, హైందవ సంస్కృతికి వెన్నెముక వంటి కుల వ్యవస్థను ధ్వంసం చేయాలి. కులాధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా జరిగిన సంఘ సంస్కరణోద్యమాలను శ్రామిక వర్గ దృష్టితో మరింత సుసంపన్నం చేసి కొనసాగించాలి.
- ఆర్. రఘు