Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషిత్వం మసకబారుతూ
గాయాలు నెత్తురు గక్కుతుంటే
శత్రువు అస్తిత్వం పొట్టలోకి
ఆయుధాన్ని బలంగా దించినపుడు
యుద్ధ విరామ కాలాన కలల గుండెల్లో
తూటాలు దిగిన చీకటి రాత్రి
దేశానికి గర్భస్రావం
ఈ రుతువున మనుషులంతా
నిన్ను వెతుకుతుంటారు
నువ్వు అరుదైన ఔషధపు మొక్కవి!
వేదికల్ని వెక్కిరించడం
నిత్యం పెనుగులాడే అక్షర మొలల్ని దించడం
పొగరుబోతు వాక్యాల్ని ధిక్కరించడం
రెక్కలు తెగిన పక్షుల్ని సిద్ధాంతీకరించడం
భూమ్మీద కాండ్రించి ఉమ్మినట్టు
దళారీతనం ముఖంపై
విరబూసిన మోదుగు పూలన్నీ
మిగుల గాసిన ద్రాక్షగుత్తులన్నీ
బలిసినోడి సంకన జేరినప్పుడు
నువ్వు గోబీ ఎడారిలో గిరిజన వీరుని బాణానివి
మైడియర్ సోషల్ విలన్
కొలపూడి ప్రసాద్!!
నీ పెగ్గు గ్లాసు
నీ సిగరెట్టు పీక
నీ చెరగని చిర్నవ్వు
నీ నల్లని చూపుల రాజ తరంగిణి
మరణమా! నీ ముల్లెక్కడ!!
నిప్పులు చెలరేగితేనే జీవితం
దమ్మిడీకి కారగానోనివి అన్నప్పుడే బతికినట్టు
బతికీ బతకనట్టు బతకడం తెలియనోడ!
కొలపూడి ప్రసాద్ జీవితం వికటించి చనిపోయాడు
లోకమంతా రొచ్చులా గోచరించిందని తెలుసు
ప్రజాస్వామ్యం లైసెన్స్డ్ పడుపువృత్తై
రోత పుట్టించిందనీ తెల్సు
జీతం రాళ్ల కోసం పాకులాడే భద్రజీవిగా బతకలేక
మాటమాత్రం చెప్పకుండా జీవితాన్ని సర్దేశావా?!
చాలా రాసేదుందన్నవ్!
అప్పుడే పోయావు మరణ తీవ్రత లేకుండానే...
నేనొప్పుకోను
రా... కో.ప్ర. రా...!
కొత్త ఎం.బి.సి. రాజ్యాంగం రాసుకుందాం.
- డాక్టర్ కదిరె కృష్ణ,
సెల్: 9505251975