Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏమి కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు.. అన్నట్టు తయారైంది నేటి మన జీవితం. కూరగాయల దగ్గర నుంచి పప్పులు, నూనె, బియ్యం, కోడి గుడ్డు, ఒకటేమిటి ఏది కొందామన్నా షాక్ కొడుతున్నది. ఒక వైపు కరోనా లాక్డౌన్- ఆంక్షలతో ఉపాధి-ఆదాయాలు పోతున్నాయి. మరొక వైపు ధరలు మండిపోతున్నాయి. కుటుంబ ఖర్చుల్లో కోత పెట్టుకోవాల్సి వస్తున్నది. దీనికితోడు ఎప్పుడు ఎవరికి కరోనా వస్తుందోనని భయం వెంటాడుతున్నది. కానీ బతుకు బండి లాగడానికి ఆటో, టాక్సీ, లారీ, బస్సు లాంటి రవాణా విధి నిర్వహించక తప్పదు. కరోనా వస్తే ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చు, లేదంటే ఇంట్లోనే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. ఇంతటి దుర్భర పరిస్థితుల్లోకి మనం నెట్ట బడ్డాం.
ధరల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు. రవాణా లేనిదే ముడి సరుకు ఫ్యాక్టరీకి చేరవేయడం, తయారైన సరుకులు వినియోగదారుడు దాకా చేరడం సాధ్యం కాదు. అలానే వ్యవసాయ ఉత్పత్తులు కూడా. రవాణా లేనిదే ప్రజా జీవితం లేదు. అందుకే ఏదేశ ఆర్ధిక వ్యవస్తకైనా రవాణా వెన్నెముక లాంటిది.
ఇంధనం లేనిదే రవాణా ఉండదు. ఇంధన ధరలు పెరిగితే మొత్తం అన్ని సరుకులు, సేవల ధరలు పెరుగుతాయి. అందుకే ఇంధన ధరల స్థిరీకరణ అత్యంత ప్రధానం. ఈ లక్ష్యంతోనే ''అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మెకానిజం''ను ప్రభత్వం ఏర్పాటు చేసింది.
ఇంధన ధరలకు సంబంధించి 4 అంశాలు ప్రధానమైనవి.1. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మెకానిజం 2.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ సుంకాలు తగ్గించడం, ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ తగ్గిన మేరకు రిటైల్ ధరలు తగ్గించడం. 3. దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచి దిగుమతులు తగ్గించడం. 4. ప్రపంచంలో ఎక్కడ తక్కువ ధరకు ముడి చమురు లభ్యం అయితే ఆ దేశం నుంచి దిగుమతి చేసికోవడం. వీటిని గురించి వివరంగా తెలుసుకుందాం..
1. అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ కంట్రోల్ మెకానిజంను 2002లో నాటి ప్రధాని స్వర్గీయ వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు చేసి ప్రభుత్వ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ మార్కెట్ ధరల కనుగుణంగా ఇంధన ధరలు నిర్ణయించే విధానాన్ని తెచ్చింది. ఇది ఒక కీలకమైన మలుపు.
2. 2014 మేలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 84 డాలర్లు ఉండగా క్రమంగా పడిపోయి 2020 ఏప్రిల్‌లో 20 డాలర్లకు అంటే 4వ వంతు కంటే తక్కువకు పడిపోయింది. తదనుగుణంగా 2014 మేలో రూ.55.48 ఉన్న లీటరు డీజిల్ రూ.15.00 కావాలి. కానీ తద్విరుద్ధంగా రూ.62.29కి ఎగబాకింది. కారణం ఆ మొత్తాన్ని సుంకం పెంచి కేంద్ర ప్రభుత్వ ఖజానాకు తరలించుకుంది. ఇది అత్యంత హేయమైన చర్య. కంచే చేను మేసిన చందంగా పాలించాల్సిన ప్రభుత్వమే ప్రజలను పీల్చి పిప్పి చేసింది.
3.దేశంలో ముడి చమురు ఉత్పత్తిని పెంచి దిగుమతులు తగ్గించడం. ఆత్మ నిర్భరత, దేశభక్తి గురించి ఉదరగొట్టే ప్రభుత్వ నిర్వాకం ఆచరణలో ఇందుకు భిన్నంగా ఉంది. 2015-16లో మన దేశంలో 36 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేస్తే 2020-21కి కాస్తా అది 32.2 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోయి దిగుమతులు పెరిగాయి. ఆత్మ నిర్భరత, దేశ భక్తి నినాదాలతో ప్రజలలో సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే లక్ష్యం తప్ప చిత్త శుద్ధి, నిజాయితీ లేదని ఇది రుజువు చేస్తున్నది.
4. ఎవరైనా సరుకు ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ కొనుక్కుంటారు. కానీ మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తే ధర తక్కువ, రవాణా ఖర్చు కూడా తక్కువ. కానీ అందుకు భిన్నంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఇరాన్ నుంచి కొనకూడదనే అమెరికా ఆంక్షలే ఇందుకు కారణం. అమెరికా విషకౌగిలిలో ఒదిగిన మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను బలి పశువులను చేయడం తప్ప మరొకటి కాదు. పైనాలుగు కారణాలను అర్థం చేసుకోకుండా ఇంధన ధరలు ఆకాశంలోకి పోతున్నాయని ఆందోళన చెందడంవల్ల ప్రయోజనం లేదు. ఆయిల్ కంపెనీలే ఇందుకు కారణం అని నిందించడం పొరపాటు.
కరోనా మహమ్మారి కాలం: ఇది మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. ఈ తరుణంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత, సరైన వైద్యం చేయించి ఏ ఒక్కరు మహమ్మారితో మృతి చెందకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక లీటరు డీజిల్ పై 2020 మార్చిలో మూడు రూపాయలు, మే నెలలో రూ.13 వెరసి 3నెలల్లో మొత్తం రూ.16లు ఎక్సయిజ్ డ్యూటీ పెంచింది.(ఈ కాలంలోనే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనం చెందాయని గుర్తుంచుకోవాలి). తాను పీల్చాల్సినంత రక్తం పీల్చి ఇక మీవంతు పిల్చుకోండని ఆయిల్ కంపెనీలను ఎగదోలింది. వెరసి 2020 ఏప్రిల్ లో ఢిల్లీలో రూ.64.70గా ఉన్న లీటర్ డీజిల్ 2021 జూన్ 3నాటికి రూ.85.44కు చేరింది. ఇదే కాలంలో పెట్రోల్ లీటర్ రూ.72.01 నుంచి 94.99కి పెరిగింది. వివిధ రాష్ట్రాలలో వ్యాట్ రేట్లను బట్టి కొద్దిపాటి తేడాలుండవచ్చు. ఇలా ప్రభుత్వమే ప్రజలపై యుద్ధం ప్రకటించింది.
ప్రపంచంలో ఏ దేశంలో కూడా కరోనా కాలంలో ప్రజలపై భారాలు మోపలేదు సరిగదా ఆదాయాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం నేరుగా వారి బాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసింది. కానీ మనదేశంలో రివర్స్‌లో జరిగింది. పైగా పెట్రోల్, డీజిల్‌పై మనదేశంలో ఉన్నంత భారీ మొత్తంలో 69శాతం పన్నులు ప్రపంచంలో ఎక్కడా లేవు.
అంతిమంగా రవాణా/కార్మికులు కుదేలు: తెలంగాణ ఉదాహరణ చూద్దాం. రోజుకు సగటున 5 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందనుకుంటే 2020 మార్చి నుంచి ఇప్పటికి పెరిగిన ధరల (హైదరాబాద్‌లో మార్చి1 2020న డీజిల్ రూ.69.99, పెట్రోల్ రూ.76.21 ఉండగా 2021- జూన్ 3న డీజిల్ రూ.93.13, పెట్రోల్ రూ.98.27కి పెరిగాయి. పెరుగుదల సగటు తీసుకుంటే రూ.11.57 వస్తుంది) ఈ 15 నెలల కాలంలో రూ.27,000 అదనపు భారం పడింది. ఒక క్యాబ్‌కు రోజుకు 9లీటర్ల డీజిల్ ఖర్చు అయితే పడిన అదనపు భారం రూ.48,000. దూర ప్రాంతాలకు వెళ్లే నేషనల్ పర్మిట్ లారీకి రోజుకు 150 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. అంటే రూ.8,00,000 అదనపు భారం పడింది. ఈ మేరకు కిరాయిలు పెరిగాయా అంటే అది లేదు. కొవ్వొత్తి తాను కరిగిపోతు లోకానికి వెలుతురు నిచ్చినట్టు ప్రజలు అసలే ఆదాయాలు లేక, అల్లాడుతుంటే కిరాయిలు పెంచడానికి మనసు అంగీకరించక రవాణా రంగం, కార్మికులు దివాళా తీస్తున్నారు.
ఆర్టీసీలు: తెలంగాణ ఆర్టీసీ ఈ సంవత్సర కాలంలో 9,97,92,921 లీటర్ల డీజిల్ వాడింది. ఫలితంగా పడిన అదనపు భారం రూ.145 కోట్లు. కానీ ఇందుకు బలి అవుతున్నది మాత్రం ఆర్టీసీ కార్మికులు. కొంత కాలం జీతాల్లో కోత... తెలంగాణలో జీతాలు ఒకటో తేదీన తీసికోవటమే మర్చిపోయారు. వర్షం కోసం ఆకాశం కేసి చూసినట్టు జీతాలకు ఎదురు చుడా ల్సి వస్తున్నది.
పరిష్కారం: మన ఓట్లతో అధికార పీఠంపై కూర్చున్న వారు మన శ్రేయస్సు చూడాలి. ఇది రాజ్యాంగ బాధ్యత కూడా. కానీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సహితం ఉల్లంఘించి మనపై భారాలు వేస్తుంటే చూస్తూ ఉరుకోవావాల్సిన అవసరం లేదు. చొక్కా పట్టుకొని నిలదీయాలి. ఇది మన హక్కు. అందుకు సన్నద్ధం కావాలి. ఇందులో భాగంగా జూన్ 8న దేశవ్యాపిత నిరసన వ్యక్తం చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. అందరూ కరోనా ప్రోటోకాల్ అనుసరిస్తూ జూన్ 8న నిరసన వ్యక్తం చేయాలి. వీలైతే పని ప్రదేశంలో లేదా ఇంటివద్దే ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలి. మనం ఏమి చేసినా చలామణి అవుతుందనే ప్రభుత్వ అహంకారానికి చెక్ పెట్టాలి. కదలండి 8న నిరసనలో పాల్గొనండి.
- ఆర్. లక్ష్మయ్య