Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీడియాలో వార్తలు వ్యాఖ్యల ద్వారా తమ వృత్తిధర్మం నిర్వహించే పాత్రికేయులకు రక్షణ ఉండాలని సీనియర్ జర్నలిస్టు వినోద్‌దువా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆహ్వానించారు. మీడియా ప్రసారాలు ప్రచురణలపై 124(ఎ) రాజద్రోహం కేసులు మోపడం సరికాదని పేర్కొంది. పౌరులకు కూడా ప్రభుత్వాల లోపాలను వైఫల్యాలను సమస్యలను విమర్శించే హక్కు ఉంటుందని ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పుల్వామాలో ఉగ్రవాదుల వేటుకు, బాలాకోట్ వైమానిక దాడికి ఇచ్చిన ఉద్వేగ ప్రచారం, ఇప్పుడు కరోనా కట్టడిలో వైఫల్యం వంటివాటిని సూటిగా విమర్శించి నందుకే వినోద్‌దువాపై ఈ సెక్షన్ బనాయించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన వినోద్ యు ట్యూబ్ చానల్లో చేసిన వ్యాఖ్యలపై శ్యాం అనే బీజేపీ నాయకుడు సిమ్లాజిల్లాలో కేసు పెట్టారు. అసత్య సమాచారం, ప్రజలలో అశాంతిని వ్యాపింపచేయడం, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యల ప్రచురణ తదితర ఫిర్యాదులను దానికి జతచేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమతో ఏకీభవించని జర్నలిస్టులపైన మీడియా ప్రసారాల పైన కేసులు పెట్టి వేధించడం పరిపాటి అయిందని వినోద్ దువా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ యుయు లలిత్ ధర్మాసనం జర్నలిస్టుల స్వేచ్ఛకు రక్షణ ఉంటుందని ప్రకటించింది. కేవలం వారి వ్యాఖ్యలు కథనాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన కేసులు రాజద్రోహం కిందకు రావని స్పష్టం చేసింది. కేవలం హింసను ప్రేరేపించడం, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించడం మాత్రమే రాజద్రోహమని 1962లో కేదార్‌నాథ్‌సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం పాత్రికేయులందరికీ రక్షణ ఉండాల్సిందేనని ప్రకటించింది. 2020 మార్చినాటి పరిస్థితుల్లో వలస కార్మికుల దుస్థితి వాస్తవమనీ వాటిపట్ల వ్యాకులతతో ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ పరిష్కార చర్యలు తీసుకోవాలిన వినోద్ దువా కోరడం ఏ విధంగానూ తప్పు కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ కొట్టివేసింది.
తెలుగుఛానళ్ల కేసులోనూ...
అంతకు కొద్ది రోజుల ముందే తెలుగు ఛానళ్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లు దాఖలు చేసిన పిటిషన్లోనూ సుప్రీం కోర్టు ఇదే విధమైన అభిప్రాయం వెలిబుచ్చింది. 124(ఎ)ను మరోసారి సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెల్పింది. దీంతోపాటే భారత శిక్షాస్మృతి(ఐపిసి) సెక్షన్153(ఎ) వివిధ తరగతుల ప్రజల మధ్య వైషమ్య వ్యాప్తి, 505 ప్రజాజీవితంలో కల్లోలసృష్టి అనే నిబంధనలను కూడా మీడియా కోణంలో మళ్లీ పరిశీలించాల్సి ఉందని చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న న్యాయస్థానం ఇచ్చిన ఒక తీర్పులో కరోనా నేపథ్యంలో కోవిడ్ కట్టడికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను మీడియాలో నివేదించినందుకు విమర్శించినందుకు కేసులు బనాయించడం సరికాదని కోర్టు చెప్పిన దాన్ని పైఛానళ్లు తమ పిటిషన్లో పొందుపర్చాయి. ఈ ఛానళ్లపై ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు 124(ఎ)కింద ఎ2, ఎ3లుగా కేసులు నమోదు చేయడం తెలిసిన విషయమే.
ఐపిసి124(ఎ)లో ఏం ఉంది?: ఎవరైనా సరే తమ మాటల ద్వారా గాని మౌఖికంగా లేదా లిఖిత పూర్వకంగా సంజ్ఞలు లేదా ప్రత్యక్ష వ్యక్తీకరణల ద్వారా గాని, మరో విధంగా గాని విద్వేషం లేదా ధిక్కారం వ్యాప్తి చేసేట్టయితే భారతదేశంలో చట్టం ద్వారా స్థాపితమైన ప్రభుత్వం పట్ల అయిష్టతను విముఖతను రెచ్చగొట్టేట్టయితే ప్రేరేపించేట్టయితే వారు కారాగార శిక్షకు పాత్రులగుదురు. ఈ కారాగారశిక్ష మూడేండ్ల నుంచి యావజ్జీవం వరకూ ఉండొచ్చు. రెండూ కలిసి కూడా వుండొచ్చు. ఇందులో అయిష్టత వైముఖ్యం అన్నదాంట్లో విశ్వాసరాహిత్యం, శత్రుభావన కూడా కలిసి ఉన్నాయనీ, ప్రభుత్వ విధానాలను చట్టంద్వారా మార్చడానికి ప్రయత్నిస్తే అది రాజద్రోహం కాదనీ, ద్వేషం ధిక్కారం ప్రేరేపించే వ్యాఖ్యలు కూడా రాజద్రోహం కాదని వివరణలు చెబుతున్నాయి. కాని ఆచరణలో మాత్రం దీన్ని విచక్షణా రహితంగా ప్రయోగిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ యూపీలోని హత్రాస్‌లో దళిత బాలిక అత్యాచారానికి గురైన దారుణఘటనకు సంబంధించి వివరాల సేకరణ కోసం వెళ్లాడు. రాజద్రోహం బనాయించారు. ఆఖరుకు కర్నాటకలోని ఒక విద్యాలయంలో సీఏఏకు వ్యతిరేకంగా నాటకం వేసిన పిల్లల తలిదండ్రులపైన కూడా ఈ రాజద్రోహం కేసులే బనాయించారు. రైతుల ఆందోళనను బలపర్చినందుకు గాను బెంగుళూరులో దిశారవి అనే పర్యావరణ కార్యకర్తపైన 124 ఎ మోపారు. ఇదే ఆందోళనకు సంబంధించి రిపబ్లిక్ దినోత్సవంనాడు జరిగిన ఘటనల వెనక వాస్తవాలు వెల్లడించినందుకు గాను రాజ్‌దీప్ సర్దేశాయి, వినోద్‌జోష్, జఫర్‌ఆఘా, పరేశ్‌నాథ్, అనంతనాథ్ తదితరులపై రాజద్రోహం కేసులే పెట్టారు, సుప్రీం కోర్టు వారిని అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది.
లా కమిషన్ సిఫార్సు చేసినా..
నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో ఈ తరహా కేసులు బాగా పెరిగిపోయాయి. 2014లో 47, 2015లో 30, 2016లో 35, 2015లో 51, 2018లో 70, 2019లో 93 రాజద్రోహం కేసులు నమోదవడం గమనిస్తే ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని అర్థమవుతుంది. వీటి కారణంగా సంబంధిత వ్యక్తులు విచారణ లేకుండా ఖైదులో మగ్గిపోవడం వేధింపులకు గురవడం జరుగుతున్నది. కాని వీటిని అడ్డగోలుగా బనాయిస్తున్నారు గనక అంతిమంగా శిక్షలుపడే శాతం చాలా నామమాత్రం. 2016-17లలో ఒక్కొక్కరికి, 2018లోఇద్దరికి, 2019లో ముగ్గురికి మాత్రమే విచారణలో నేర నిర్దారణ జరిగింది. అదైనా ఏ మేరకు ఏ పద్ధతిలో జరిగిందనేది పరిశీలించవలసిందే. ఒక్క యూపీలోనే హత్రాస్ ఘటన తర్వాత సిద్దిక్ కప్పన్‌తో పాటు మొత్తం 22 మందిపై 124(ఎ) కింద కేసులు పెట్టారు. దీంతోపాటే మణిపూర్ వంటిచోట్ల జాతీయ భద్రతా చట్టం(నాసా)ను కూడా ప్రయోగించారు. వాస్తవానికి ప్రభుత్వ వైఖరితో విబేదించినంతమాత్రాన రాజద్రోహం అనడం సరికాదని 2018లో లా కమిషన్ స్వయంగా వ్యాఖ్యానించింది. అయినా ప్రభుత్వాల వైఖరిలో మార్పు రాలేదు. ఏపీలో ప్రస్తుత కేసునే తీసుకుంటే రఘురామరాజు మాట్లాడింది సరికాదని ఆయనకు కొన్ని మీడియా సంస్థలు విచక్షణా రహితంగా అధిక సమయం ఇచ్చి అదేపనిగా ప్రసారాలు సాగించడం కూడా అనుచితమని భావించినా రాజద్రోహం కుట్ర వంటి కేసులను బనాయించడం సరికాదు. ఇందుకు సంబంధించి పలు ఇతర నిబంధనలు చట్టాలు ఉన్నాయి. అవైనా నిర్బంధం వేధింపులతో కాక కోర్టుద్వారా చేయదగినవే, కాకుంటే ఏపీలో జరిగినదాన్ని విమర్శించే చాలా మంది కేంద్రంలోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ సాగుతున్న విచ్చలవిడి ప్రయోగాన్ని ప్రశ్నించరు.
ప్రపంచవ్యాపితంగా అత్యధిక దేశాలు ఈ రాజద్రోహం వంటి నిబంధనలకు స్వస్తిచెప్పేశాయి. మారిన పరిస్థితులలో తమ కోణంలో దేశభద్రత టెర్రరిజం నిరోధం వంటి చట్టాలు చేసుకున్నాయి. మన దేశంలో నాసా, ఉసా వంటి చట్ట్లాలు ఆ విధంగా చేసినవే అయినా వాటినీ విపరీతంగా దుర్వినియోగ పరుస్తున్నారు. ఈ సమయంలో భీమ కోరెగావ్ కుట్ర పేరిట వయోవృద్ధులైన వరవరరావు, స్టాన్‌స్వామి, వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబ, పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఖైదులో మగ్గిపోతున్నారు. జేఎన్‌యూ విద్యార్థులపైన కూడా ఇలాంటి విద్రోహం కుట్ర ఆరోపణలే మోపడంతోపాటు స్వయానా అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దారుణమైన నిందలు వేయడం గుర్తుండే ఉంటుంది. సీఏఏకు వినాశకరమైన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా సాగే ఆందోళనలకు సంఘీభావం తెల్పినందుకు ఎంతోమంది సామాజిక కార్యకర్తలు జైళ్లలో మగ్గిపోతున్నారు. ఏపీ ఎంపీకి బెయిలు ఇవ్వడం తప్పుగాకున్నా అదే ఉన్నత న్యాయస్థానాలు కరోనాసోకినా స్టాన్‌స్వామికి గాని, సిద్దిక్ కప్పన్‌కు గాని ఉపశమనం కలిగించిందిలేదు. పౌరులకు రాజకీయ పక్షాలకు ప్రజాసంఘాలకు ప్రభుత్వాల తప్పిదాలపై పోరాడే హక్కు ఉందంటూనే కర్కశ చట్టాలతో కటకటాలపాలు చేయడం అత్యంత అప్రజాస్వామికం.
124(ఎ) ఎత్తివేయాల్సిందే
మళ్లీ ఇప్పుడు రాజద్రోహం మీడియా స్వేచ్ఛ అనే అంశానికి వస్తే తెలుగు చానళ్ల కేసులో గాని, వినోద్ దువా విషయంలో గాని సుప్రీం కోర్టు పాక్షికంగానే రక్షణ నిచ్చింది. వీరిని అరెస్టు చేయరాదని (బలప్రయోగంవద్దని) చెప్పడం రాజద్రోహం 124(ఎ)సెక్షన్‌ను లోతుగా పరిశీలించి సమీక్షించాలని చెప్పడం మినహా మొత్తంగా ఎత్తివేయాలని నిర్దేశించలేదు. పైగా వారిపై ఎఫ్ఐఆర్ నమోదును కూడా ఖండించలేదు. ఒకసారి ఈ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైనాక కింద పోలీసులు ఏంచేస్తారనేది చెప్పడానికి లేదు. అందరూ సుప్రీం కోర్టుకు రాలేరు. వచ్చినా అందరి కేసులూ ఒకేలా విచారణకు నోచుకోకపోవచ్చు. గతంలో అర్నబ్‌గోస్వామి, సిద్దిక్ కప్పన్ కేసులు ఒకేసారి వచ్చినా ఒకరికే ఉపశమనం దక్కింది. చీఫ్‌జస్టిస్ ఎన్వి రమణ హయాంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తున్నట్టు చెబుతున్నారు గనక మౌలికంగానే మార్పుల అవసరాన్ని గుర్తించడం అవసరం. పదేండ్ల పైబడిన సీనియారిటీ ఉన్న జర్నలిస్టులకు సంబంధించిన కేసులలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోకూడిన కమిటీ ముందు తగు సమీక్ష తర్వాతనే ఎఫ్ఐఆర్లు నమోదు కావాలని వినోద్ దువా కోరారు. అయితే అందుకు అంగీకరించలేమని అది చట్టసభల పరిధిలో అంశమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. 124(ఎ)పునర్థర్శనం పున:పరిశీలన వంటి మాటలు ఏంచెప్పినా అవి వెంటనే అమలుకు వచ్చేవి కావు. ఐపిసిని పార్లమెంటు సవరించేవరకూ అలాగే ఉంటాయి. 1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్ పత్రికా చట్టం 1917లో రౌలట్ చట్టం ఇవన్నీ పరాయి ప్రభుత్వం దేశ ప్రజలస్వాతంత్రోద్యమాన్ని అణచివేయడానికి తెచ్చినవే. ఐపిసి124(ఎ) ఆ అంశాలకే ప్రతిరూపం, వాటిని ఇంకా కొనసాగిస్తూ ఇప్పుడు సోషల్ మీడియాపైనా అదే దాడి చూస్తున్నాం. మీడియాలో పొరబాటు ధోరణులను సవరించుకోవలసిందే గాని తమకువంతపాడలేదని పాలకులు వాటి స్వేచ్చా స్వాతంత్రాలను కాలరాచివేయడం సరికాదు. పాత్రికేయులను మీడియాను లోబర్చుకోవాలని చూడటం అనుమతించరానిది. ఇందుకోసం ఎలాటి ప్రత్యక్ష పరోక్ష ఒత్తిళ్లు వేధింపులు నిర్బంధాలు సహించరానివి. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సరైన దిశలోవున్నా రాజ్యాంగం 19వ అధికరణంలోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే నిబంధనలు తొలగించబడితేనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. లేకపోతే సూక్తులతో ఆగిపోతుంది.
- తెలకపల్లి రవి