Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వికె) అనగానే రాష్ట్రంలో అందరికి గుర్తుకొచ్చేది అక్కడ జరిగే సభలు, సమావేశాలే. నిత్యం ఏవో కళా ప్రదర్శనలు, మహాసభలు, ఉద్యమ మీటింగ్‌లతో కళకళలాడుతుంది. 1987లో ఏర్పడినప్పటి నుంచి ఉద్యమాలకు కేంద్రంగా నిలుస్తూ, అభ్యుదయ భావజాలాన్ని విస్తృత పరుస్తుంది. లెఫ్టిస్టుల నుంచి రైటిస్టుల వరకు ఇక్కడ సమావేశాలు నిర్వహించని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలే లేవంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడా ఉద్యమ కేంద్రం హాస్పిటల్‌గా మారింది. అనేక మంది కరోనా బాధితులకు పునర్జన్మనిస్తున్నది. గత ఏడాదిన్నర కాలంగా విశ్వమానవాళిని భయాందోళనలకు గురిచేస్తూ, లక్షలాది చావులకు కారణమైన 'కరోనా వైరస్', తన లక్షణాలను మార్చుకుంటూ విజృంభిస్తుంది. పేషంట్లకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, సిబ్బంది లేరు, ఆక్సిజన్ లేదు, టీకాలు లేవు, మందులు కొరత కూడా ఉంది. వైరస్‌ను కట్టడి చేయాల్సిన పాలకులు ప్రజల ప్రాణాలను గాలికొదిలి, ఎన్నికలు, 'మేళా'లు నిర్వహించి మరీ వైరస్‌ను ఎగదోశారు. చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అంటూ ప్రజలను మూఢత్వంలో ముంచి ఇప్పుడు దొంగ ఏడుపులేడుస్తున్నారు.
రాజకీయ పార్టీలు ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పడినవి. ప్రజలను చైతన్య పరుస్తూ, మెరుగైన సమాజం కోసం పాటుపడుతూ, ఆపత్కాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత వాటిపై ఉంది. నేడు కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు నాయకులను, ఉద్యమకారులను, డాక్టర్లను, ప్రజా సేవకులను, ఎందరో జర్నలిస్టులను పొట్టన పెట్టుకుంటుంది. ఈ తరుణంలో అన్ని పార్టీల ఎజెండా ప్రజలను రక్షించేదిగా ఉండాలి. కాని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చేతులు ముడుచుకు కూర్చున్నాయి. వీటికి భిన్నంగా కమ్యూనిస్టులు ప్రభుత్వాలను ప్రశ్నించడం, తగు సూచనలివ్వడమే కాకుండా ప్రజాసేవలో నిమగమయ్యారు. కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులన్నీ కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా, హెల్ప్‌లైన్ సెంటర్లుగా మార్చారు. ఆ పార్టీల కార్యకర్తలంతా తమ శక్తిమేర ప్రజలకు సహాయపడుతున్నారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఎస్వికెతోపాటు మరో 6 జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజాసంఘాల రాష్ట్ర ఆఫీసులతోపాటు మిగతా చోట్ల హెల్ప్‌లైన్ సెంటర్లు నడుపుతున్నారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రభుత్వమే ఉపయోగించు కోవాలని మొదట సీపీఐ(ఎం) సూచించింది. సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మే 3న తామే 25 బెడ్లతో ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించి, ఇప్పుడు 50 బెడ్లకు పెంచారు. ఈ కేంద్రానికి వచ్చిన పేషంట్లకు ప్రతిరోజు సాయంత్రం ఒక డాక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణ, మూడుసార్లు మరో ముగ్గురు వైద్యులు ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు. సుశిక్షుతులైన వైద్య సిబ్బంది రోజుకి నాలుగుసార్లు ఆక్సిజన్ లెవల్స్, పల్స్ రేట్, బీపీ చెక్ చేస్తూ డాక్టర్ల సూచన మేరకు సరైన మందులు ఇస్తున్నారు. అవసరమైన వారికి ఆక్సిజన్ కూడా అందించడానికి 9 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చారు. సమయానికి పౌష్టికాహారం అందిస్తున్నారు. పేషంట్ల మానసిక ఉల్లాసానికి భారీ స్క్రీన్‌పై వినోద కార్యక్రమాలతోపాటు, సైకాలజీ డాక్టర్ల మోటివేషన్ వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌కి తీసిపోని విధంగా వార్డును రోజుకు నాలుగుసార్లు శుభ్రం చేస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆక్సిజన్ లెవల్స్ బాగా పడిపోయి, వెంటిలేటర్ అత్యవసరమైతే వెంటనే అంబులెన్సులో గాంధీ, కింగ్ కోఠి, టిమ్స్, ఫివర్ హాస్పిటల్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందేలా ప్రయత్నిస్తున్నారు.
ఈ సెంటర్ నిర్వహణకు దాతలు సహకరించాలని కోరగానే వివిధ సంస్థలు, సంఘాలు, వ్యక్తులు వస్తు, నగదు రూపాల్లో తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కొందరు దాతలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, అంబులెన్సు లేవని తెలుసుకొని వాటిని ఉచితంగా అందించారు. మొదట్లో భయపడిన స్థానిక బస్తీవాసులు, సుందరయ్య పార్కు వాకర్స్ కూడా ఇప్పుడు భాగస్వాములై సహకరిస్తున్నారు. బియ్యం, ఉప్పులు-పప్పులు, కూరగాయలు, పండ్లు, మెడిసిన్స్, పీపీఈ కిట్లు, మాస్కులు మొదలగు వాటిని అందిస్తూ చేతనైనంత మేరకు సహకరిస్తున్నారు. ఇక ఈ సెంటర్ నిర్వహణను సీపీఐ(ఎం) రాష్ట్ర నేతల్లో ఒకరు 24 గంటలు అక్కడే ఉండి పర్యవేక్షిస్తుండగా మరో ఇద్దరు నాయకులు ప్రతిరోజు అందుబాటులో ఉంటూ సహకరిస్తున్నారు. రాష్ట్ర కేంద్రంలోని ప్రజాసంఘాల నాయకులు, ఎస్వికె సిబ్బందితోపాటు సిటీ క్యాడర్ మొత్తం 30 మంది ప్రతిరోజు వాలంటీర్లుగా తమ సేవలందిస్తున్నారు.
ఇప్పటి వరకు 114 మంది పేషంట్లు ఈ ఐసోలేషన్ కేంద్రానికి రాగా, అందులో 72 మంది పూర్తి ఆరోగ్యవంతులుగా ఇండ్లకు వెళ్లారు. 13 మందిని మెరుగైన వైద్యంకోసం వివిధ హాస్పిటల్స్‌కు తరలించగా, మిగతా వారు ఇక్కడే సేవలు పొందుతున్నారు. ఇందులో, నగరంలోని దోమలగూడకు చెందిన 65ఏండ్ల వద్దురాలికి, ఆమె కొడుకుకి కరోనా సోకిందని తెలియడంతో ఇంటి ఓనర్లు గెంటేయగా ఒక రోజంతా రోడ్డుపై గడిపారు. తర్వాత ఎస్వికె ఐసోలేషన్ సెంటర్లో ఆశ్రయంపొంది, చికిత్స తీసుకొని 16 రోజుల తర్వాత క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంబర్‌పేట్‌కు చెందిన భార్యాభర్తలిద్దరు 14 రోజులు ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళుతూ ''మేం పేదోళ్లం, లక్షలు పెట్టి ప్రయివేట్ దవాఖానాల్లో సూపెట్టుకోలేనోళ్లం, గవర్నమెంటు ఆస్పత్రిలో బెడ్లు లేవు, బతుకుతమో లేదో అని భయపడ్డాం. 'మా అమ్మ జన్మనిస్తే, ఈ సెంటర్ మాకు పునర్జన్మనిచ్చింది' ఇప్పుడు ఆనందంగా ఇంటికి వెళ్తున్నాం'' అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. కొందరు ఓ.యు. విద్యార్థి సంఘాల నాయకులు ఎస్వికె అంటే ఉద్యమ మీటింగులకే కాదు ప్రజల ఆరోగ్య కష్టాల్లో కూడా ముందుందని, కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే బెటరని, ఇక్కడి సర్వీస్ చాలా బాగుందని కొనియాడారు. మీర్‌పేట్‌కు చెందిన ఓ ప్రయివేట్ ఉద్యోగిని ''మా ఇంట్లో కంటే ఇక్కడే బాగా చూసుకున్నారు'' అని చెప్పి తనవంతుగా సెంటర్‌కు ఆర్థిక సహకారం చేసింది. సామాన్యుల నుంచి నాయకుల వరకు అనేకమంది ఎస్.వి.కె సేవలను వినియోగించుకుంటున్నారు.
ప్రజలకు ఆపద వచ్చినప్పుడల్లా కమ్యూనిస్టులు ప్రజాసేవలో ముందుంటారని చెప్పడానికి కరోనా తీవ్రతలో మరొకసారి ఉదాహరణగా నిలిచారు. ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఇలా అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ప్రజలకు కష్టాల్లో మేమున్నామంటూ తమ సేవలందించడం అవసరమే కదా!!
- ఉడుత రవీందర్
సెల్:9490098487