Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ఐ.టి మంత్రిత్వ శాఖ ఇటీవల కొత్త ఐ.టి (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలు-2021ను ఆమోదించింది. సోషల్ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల్లో నెటిజన్లు ఏం పోస్టు చేయాలి? దేన్ని షేర్ చేయాలి? అన్న దానిపై ప్రభుత్వం ఈ నిబంధనల ద్వారా ఏకపక్ష నియంత్రణ విధిస్తోంది. ఈ చట్టం ప్రకారం నడుచుకోకుంటే ఆయా మాధ్యమ సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో మోడీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, మతతత్వ విధానాలపై సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు చేయడం ద్వారానో లేదా ఇతరులు చేసిన పోస్టులను షేర్ చేయడం ద్వారానో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. దేశంలో ఉన్న మెజార్టీ మీడియా సంస్థలను బెదిరించో, బుజ్జగించో తనకు అనుకూలంగా మార్చుకున్న మోడీ సర్కార్ ఈ సోషల్ మీడియాలో పోస్టులు, ఇమేజ్‌ల రూపంలో వస్తున్న విమర్శలను చూసి బెంబేలెత్తుతోంది. దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వరుసకడుతున్నాయి. ట్విట్టర్లో మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలుమార్లు విపరీతమైన ట్రెండింగ్ కూడా నడిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫాంలలో నెటిజన్లు పెట్టే పోస్టులు, వారి అభిప్రాయాలను నియంత్రించేందుకు కొత్త ఐ.టి నిబంధనలను తీసుకొచ్చింది. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా, ప్రభుత్వంపై పెరుగుతున్న అసమ్మతిని అణచివేసేలా ఈ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ద్వారా వినియోగదారుడి గోప్యత హక్కుకు భంగం వాటిల్లుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నెటిజన్ల వివరాలు పొందే అవకాశం
ఒక మెసేజ్ అనేది అసలు మొదట ఎక్కడి నుంచి మొదలైందన్న దాన్ని తెలుసుకునేందుకు ఐ.టి నిబంధనలు-2021 లోని రూల్ 4(2) పోలీసులకు, ఇతర దర్యాప్తు సంస్థలకు అవకాశం కల్పిస్తోంది. సోషల్ మీడియాలో ఇరువురి మధ్య సంభాషణ అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. అదే గ్రూప్ చాట్‌లో అయితే సమాచారం ఆ గ్రూప్‌లో ఉన్నవారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సంస్థలు కూడా ఇదేవిధమైన హామీ ఇస్తున్నాయి. యూజర్, ఇన్ఫర్మేషన్ ట్రేసబులిటీ నిబంధన వినియోగదారుల గోప్యతను పూర్తిగా దెబ్బతీ స్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు వస్తే.. అది ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు.. అనే వివరాలు తెలుసుకొని ఏదొక నిబంధనల కింద సంబంధిత వ్యక్తులపై కేసులు బనాయించి, ఇతరులను బెదిరించే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
వినియోగదారుడి ధ్రువీకరణ
వినియోగదారుడు ఖాతాను ప్రారంభించే సమయంలో ఆధార్ వంటి గుర్తింపు కార్డుల ద్వారానే ధ్రువీకరణ ప్రక్రియ ఉండేలా పలు నిబంధనలు సోషల్ మీడియా సంస్థలకు వీలు కల్పిస్తున్నాయి. ఇది వినియోగదారుడి పేరు, ఇతర అభిరుచులు వంటి వివరాల గోప్యతను తొలగించడం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుంది. ఆధార్, ఇతర కార్పొరేట్ సంస్థల డేటా ఉల్లంఘనలవంటి పలు సంఘటనలు చోటుచేసుకోవడం మనం ఇప్పటికే చూశాం. ఈ ధ్రువీకరణ ప్రక్రియ వలన వినియోగదారుడి మొత్తం వివరాలు ప్రైవేటు కంపెనీలు పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది. దీని వలన యూజర్ డేటాపై పెద్దయెత్తున నియంత్రణ పెరిగిపోతుంది.
డిజిటల్ మీడియా నిబంధనలు
5వ నిబంధన..పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థల అధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోని న్యూస్ వెబ్సైట్లు, పోర్టల్లపై చర్యలను పేర్కొంటోంది. ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానాలపై ఎవరైనా అసమ్మతి, వ్యతిరేకత వ్యక్తం చేస్తే భారీస్థాయిలో సెన్సార్ విధించడంతో పాటు నేరంగా చూస్తుంది.
ఆటోమేటెడ్ ఫిల్టరేషన్
ఈ ఆటోమేటెడ్ ఫిల్టరేషన్ నిబంధనతో షేర్ చేసిన లేదా ప్రచురించిన ఏదైనా పదాన్ని, వ్యాఖ్యలను వడపోత చేసే అవకాశం ఉంటుంది. అంటే వాటిని తీసేసేందుకు వీలుంటుంది. తద్వారా ప్రజల గొంతుకకు స్వేచ్ఛ అనేది లేకుండా నొక్కేసినట్లవుతుంది. ఈ ఆటోమేటెడ్ ఫిల్టరేషన్ ప్రజల అభిప్రాయాలను, ఏదైనా కార్యాచరణను నియంత్రించేందుకు భారీస్థాయిలో పర్యవేక్షణకు అనుమతి ఇస్తుంది.
డేటా దోపిడీలో కంపెనీలు వర్సెస్ ప్రభుత్వం
గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, రిలయన్స్ వంటి డిజిటల్ గుత్తాధిపత్య సంస్థలు మన డేటాను సేకరించి, దాన్ని డబ్బుగా ఆర్జించే వ్యాపారాన్ని జరుపుతున్నాయి. మన వివరాలు, అభిరుచులు, అభిప్రాయాలు, ఇతరులతో జరిపిన సంభాషణలను వంటి డేటాను సరుకుగా మార్చేసి ఇతరులకు వారి అవసరాల దష్ట్యా అమ్ముతున్నాయి. ఇప్పుడు బిజెపి కూడా కొత్త నిబంధనల ద్వారా సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫాం వినియోగదారుల డేటాను కొల్లగొడుతోంది. ఇది సమాచార దోపిడీ కాకుంటే మరేంటి. ఏదైనా నియంత్రణ అనేది పౌరుల ప్రాథమిక హక్కు అయిన గోప్యతను పరిరక్షించే విధంగా ఉండాలి. మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎటువంటి జోక్యాన్నైనా నిరోధించేదిగా ఉండాలి. అయితే ఈ ఆందోళనలకు ఎటువంటి పరిష్కారం చూపకపోగా, వివిధ ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేసిన సమాచారంపై కఠినమైన నియంత్రణను విధించడం మాత్రమే కొత్త నిబంధనల ఉద్దేశ్యంగా ఉంది. స్వతంత్ర జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, ఏవైనా భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే వారిని లక్ష్యంగా చేసుకోవడానికి, అసమ్మతిని అణిచివేసేందుకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను అణిచివేయడంలో సోషల్ మీడియా సంస్థలు, ప్రభుత్వానికి మధ్య భాగస్వామ్యానికి ఇది ఒక ఫ్రేమ్‌వర్క్ ఇస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడం, వాటితో విభేదించడం పౌరుడి ప్రాథమిక హక్కు. ఈ చట్టం ప్రభుత్వ ప్రయోజనాలకు లోబడిలేని వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు, వారిని అరెస్టు చేసేందుకు ఉపయోగపడే సాధనంగా ఉంది. పౌరులు పెట్టే పోస్టులపై నిఘాతో పాటు సెన్సార్షిప్ విధించేటటువంటి రెండు ప్రధానమైన లక్ష్యాలతో ఈ నిబంధనలు ఉన్నాయి.
- పి. వేణు గోపాల్
సెల్ : 8074092061