Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వా నేనా! ఒక వైపు పచ్చిమితవాద, అవినీతి వారసత్వం మరోవైపు మచ్చలేని వామపక్ష ఘన వారసత్వం. నరాలు తెగే ఉత్కంఠ. ఓటు ఓటుకూ అభ్యర్థులు, మద్దతుదారుల రక్తపోటులో తేడా. ఆదివారంనాడు పెరూలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష అభ్యర్థి పెడ్రో కాస్టిల్లో స్వల్ప మెజారిటీతో ముందున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, విదేశాల నుంచి ఓట్ల వివరాలు రావటంలో ఆలశ్యం కారణంగా లెక్కింపు ఇంకా పూర్తికాలేదు. మంగళవారం తెల్లవారు ఝామున ఐదున్నర గంటల వరకు జరిగిన 96.8శాతం ఓట్లలో కాస్టిల్లో 50.25, ప్రత్యర్థి మితవాద కెయికు ఫుజిమోరీ 49.75ఓట్లు సాధించారు. గ్రామీణ ప్రాంతాలలో వామపక్ష అభ్యర్థికి పెద్ద ఎత్తున మద్దతు ఉన్నట్టు వెల్లడైన కారణంగా మిగిలిన ఓట్లు అక్కడివే కావటంతో తమ అభ్యర్థి విజయం సాధించినట్టు కాస్టిలో మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు లెక్కింపులో అక్రమాలు జరిగినందున ఫలితాన్ని తాను అంగీకరించేది లేదని కెయికూ ప్రకటించినందున పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్టు పరిగణిస్తున్నారు. పరిశీలకులుగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల సంస్థ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. పది సంవత్సరాల కాలంలో మూడవసారి కూడా ఓడిపోతుండటంతో కెయికు నిరాశతో ఇలాంటి ఆరోపణలకు దిగారని విమర్శలు వచ్చాయి.
అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప వామపక్ష అభ్యర్థి విజయం సాధించవచ్చనే భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్, వాణిజ్య, పారిశ్రామికవేత్తలలో వెల్లడైన భయం కూడా ఒక సూచిక. స్టాక్‌మార్కెట్ కుప్పకూలటంతో సోమవారంనాడు కొద్ది సేపు క్రయ విక్రయాలను నిలిపివేయాల్సి వచ్చింది. కరెన్సీ విలువ కూడా గణనీయంగా పడిపోయింది. వామపక్ష నేత అధికారానికి వస్తే మార్కెట్ శక్తుల ఆధిపత్యంలోని వ్యవస్థను మార్చివేస్తారనే ఆందోళన వ్యక్తమైంది. పట్టణ ప్రాంతాల నుంచి తొలుత లెక్కింపు ప్రారంభమైంది. ఎనభై ఆరుశాతం ఓట్ల లెక్కింపు వరకు మితవాద అభ్యర్థిని కెయికు ఫుజిమోరీ 52శాతానికి పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగారు. అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటంతో 93శాతానికి చేరగానే ఇద్దరి ఓట్లు సమం తరువాత కాస్టిల్లో ఓట్లు పెరగటం ప్రారంభమైంది.
పెరూ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలిదశలోనే 50శాతానికి మించి ఓట్లు తెచ్చుకుంటే రెండవ సారి అవసరం ఉండదు. లేనట్టయితే తొలిదశలో మొదటి రెండు స్థానాలలో ఉన్న అభ్యర్థుల మధ్య అంతిమ పోటీ జరుగుతుంది. దీని ప్రకారం ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలలో 18 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో మార్క్సిస్టు భావజాలంతో పని చేస్తున్న ఫ్రీ పెరు పార్టీ అభ్యర్థి పెడ్రో కాస్టిల్లో 18.92శాతం ఓట్లతో ముందుండగా ద్వితీయ స్థానంలో పాపులర్ ఫోర్స్ పార్టీకి చెందిక కెయికు ఫుజిమోరి 13.41శాతంతో రెండవ స్థానంలో నిలిచారు. పార్లమెంట్‌లోని 130 స్థానాలకు గాను 27 బహుళనియోజకవర్గాల నుంచి ప్రతినిధులను దామాషా ప్రాతిపదికన ఎన్నుకుంటారు. మొత్తంగా ఐదుశాతంపైగా ఓట్లు సాధించటం లేదా ఒక నియోజకవర్గంలో ఏడుగురు ప్రతినిధులు గెలిచినా దేశం మొత్తంలో దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు 20పార్టీలు పోటీ పడగా పది పార్టీలు ఐదుశాతానికి పైగా ఓట్లు సాధించి పార్లమెంట్లో ప్రవేశం పొందాయి. ఫ్రీ (విముక్త)పెరు పేరుతో రంగంలోకి దిగిన కొత్త పార్టీ 13.4శాతం ఓట్లు పొంది 37 స్థానాలతో పెద్ద పార్టీగా ఎన్నికైంది. .
దేశంలో జరిగిన అభివృద్ధి సామాన్యులకు ఉపయోగపడ లేదని, కరోనా సమయంలో పిల్లలు ఇంటి దగ్గర నుంచి చదువుకొనేందుకు అవసరమైన లాప్‌టాప్‌లు, ఇంటర్నెట్కు నోచుకోలేక పోయారని పేదలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నరకాల మాదిరి తయారయ్యాయని విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నికైన పదిమంది అధ్యక్షులలో ఏడుగురు అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారు. గత మూడు సంవత్సరాలలో నలుగురు అధ్యక్షులు మారారంటే రాజకీయ అనిశ్చితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్ర మాంద్యం, కరోనా కేసులతో పాటు మరణాల రేటూ ఎక్కువగా ఉంది. కేవలం మూడు కోట్ల 20లక్షల మంది జనాభాలో కరోనా కారణంగా ఇప్పటి వరకు రెండు లక్షల మంది మరణించారు. ప్రపంచంలో ఇది అత్యధిక రేటు. ఇదే సమయంలో పదకొండుశాతం మంది అన్నార్తులు పెరిగారు. చిలీ తరువాత ప్రపంచంలో రాగి ఎగుమతి చేసే రెండవ దేశంగా ఉంది. రాగి ఎగుమతులతో జీడీపీలో పదిశాతం ఆదాయం వస్తోంది.
తుది పోరులో పోటీ బడిన కైయికు ఫుజిమోరి జనానికి పరిచయం అవసరంలేని పేరు. కుట్రతో అధికారానికి వచ్చిన తిరుగుబాటుదారుగా, నియంతగా పేరున్న తండ్రి ఆల్బర్ట్ ఫుజిమోరి నుంచి రాజకీయవారసత్వం, ధనికులకు అనుకూల వైఖరితో పాటు, గత రెండు ఎన్నికలలో ఆమె అధ్యక్షపదవికి పోటీ పడ్డారు. 2016 ఎన్నికలలో విజయం సాధించిన పెడ్రో పాబ్లోకు ప్రత్యర్థి కెయికు ఫుజిమోరి మీద కేవలం 42,597 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. తాను గెలిస్తే కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 2,600 డాలర్ల విలువగల స్థానిక కరెన్సీ చెల్లిస్తానని, గనుల నుంచి వచ్చే ప్రతిఫలంలో 40శాతం సొమ్ము ఆ ప్రాంత పౌరులకు నేరుగా అందచేస్తానని వాగ్దానం చేశారు. కెయికో ఫుజిమోరీ మాజీ ఎంపీ, అవినీతి కేసులు శిక్ష అనుభవించారు. పాతిక మందిని హత్య చేయించటం, అవినీతి కేసులో పాతిక సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న తన తండ్రిని విడుదల చేస్తానని చెప్పారు. గత ఎన్నికల తరువాత దేశంలో తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిణామాలకు తనను క్షమించాలని వేడుకున్నారు. ఆల్బర్టో ఫూజిమోరి పాలన అవినీతి అక్రమాలు, సంఘటిత నేరాల మయంగా మారింది. పది సంవత్సరాల పాలనలో పాల్పడిన నేరాలకు గాను పాతికేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆల్బర్ట్ కుమార్తె కెయికు నాయకత్వంలోని పార్టీ గత ఐదు సంవత్సరాలలో రాజకీయ అనిశ్చితికి కారకురాలు కావటంతో పాటు అవినీతి కేసులో కెయికు కూడా జైలు శిక్ష అనువించింది. అయితే ధనికులందరూ ఆమె తమ ప్రయోజనాలను కాపాడే సమర్థురాలనే అభిప్రాయంతో మద్దతుగా నిలిచారు.
వామపక్ష అభ్యర్థి కాస్టిలో ఒక స్కూలు టీచరు. ఫుజిమోరి హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని ఆయన వాగ్దానం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా పెరూలో ధనికులు-పేదల మధ్య అంతరాలు పెరిగాయి. ఎన్నికల్లో కూడా ఇదే సమీకరణ కనిపిస్తోంది. పెరూ ప్రయోజనాలకు విరుద్ధమైన వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులను సమీక్షిస్తామని, గ్యాస్ ప్రాజెక్టులను జాతీయం చేయటం వంటి చర్యలు తీసుకుంటామని, లూటీ చేసిన సంపదలను స్వాధీనం చేసుకుంటామని పెరూ విముక్త పార్టీ వాగ్దానం చేసింది. 2007లో తొలుత పెరూ విముక్త రాజకీయ ప్రాంతీయ ఉద్యమంగా ప్రారంభమైంది. 2012లో పెరూ విముక్త పార్టీగా ఏర్పడింది. 2016లో దీన్ని ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేశారు. 2019లో పెరూ విముక్త జాతీయ రాజకీయ పార్టీగా పేరు ఖరారైంది. తమది సోషలిస్టు సంస్థ అని, తాము మార్క్సిజానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది
ఓట్ల లెక్కింపులో తన మెజారిటీ తగ్గటం ప్రారంభం కాగానే కెయికో ఆరోపణల పర్వానికి తెరలేపారు. తనకు పడిన ఓట్లను బయట పడవేశారని, ఫలితాన్ని అంగీకరించేది లేదని ప్రకటించారు. లెక్కింపు సమయంలో ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలని అంతకు ముందు కాస్టిలో తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. రెండవ దశ ఎన్నికలకు ముందు ఆయన మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరిగింది. గత నెలలో గుర్తు తెలియని సాయుధులు జరిపిన దాడిలో నలుగురు పిల్లలతో సహా 16మంది మరణించారు. దీనికి షైనింగ్ పాత్ పేరుతో సాయుధ చర్యలకు పాల్పడిన మావోయిస్టు గెరిల్లాల నుంచి విడిపోయిన వారే కారణమని ప్రచారం జరిగింది. ఈ మారణకాండను కాస్టిలో తీవ్రంగా ఖండించారు.
తొలిదశ ఎన్నికల్లో వామపక్ష కాస్టిల్లో ప్రథమ స్థానంలో నిలవటంతో మీడియాలో, సామాజిక మాధ్యమంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు. ఉగ్రవాద ముద్రవేసి ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నించారు. విముక్త పెరూ పార్టీ నేత కాస్టిలోకు షైనింగ్ పాత్‌తో సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతుదారులు నాయకులుగా ఉన్న టీచర్స్ యూనియన్ నాయకత్వంలో నాలుగు సంవత్సరాల క్రితం సమ్మెకు నాయకత్వం వహించాడని మీడియా ప్రచారం చేసింది. తన పదవీకాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన తరువాత గ్రామీణ ప్రాంతాలలోని తన పాఠశాలలో తిరిగి బోధన చేస్తానని కాస్టిలో చెప్పాడు.
రాజ్యాంగం ప్రకారం ఒకసారి ఎన్నికయిన తరువాత వెంటనే జరిగే ఎన్నికలో పాల్గొనేందుకు అవకాశం లేదు. ఐదు సంవత్సరాల తరువాత తిరిగి పోటీ చేయవచ్చు. పెరూ రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ప్రత్యక్ష ఎన్నిక జరిగిన తరువాత మరణించినా, ఏకారణంతో అయినా పదవి కోల్పోయినా, రాజీనామా చేసినా తదుపరి ఎవరిని ఎన్నుకోవాలో కూడా నిర్థిష్టంగా ఉంటుంది. ఆమేరకు వారిని ఎన్నుకోవాలి తప్ప కొత్తగా ఎన్నికలు ఉండవు. అధ్యక్షుడిని అభిశంసించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. స్పెయిన్ వలస నుంచి విముక్తి పొందిన జూలై 28న ఎన్నికైన ప్రభుత్వం నూతన బాధ్యతలను స్వీకరిస్తుంది. ఇక పెరూలో ఉన్న రాజకీయ అనిశ్చితి విషయానికి వస్తే ఐదు సంవత్సరాల క్రితం పెడ్రో పాబ్లో కుజిన్స్కి ఎన్నికయ్యాడు. 2018లో రాజీనామా చేయటంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మార్టిన్ విజికారా బాధ్యతలు స్వీకరించాడు. అతగాడిని 2020లో అభిశంసించి పదవి నుంచి తొలగించారు. తరువాత పార్లమెంట్ స్పీకర్ మెరినో బాధ్యతలు స్వీకరించిన వారంలోగానే జనం నిరసన కారణంగా రాజీనామా చేశాడు. తరువాత ఫ్రాన్సిస్కో సగస్తీని పార్లమెంట్ ఎన్నుకుంది.
తొలి దశ ఎన్నికలో పోటీపడి గణనీయంగా ఓట్లు సంపాదించిన పార్టీలలో వామపక్ష శక్తులతో పాటు ఫుజిమోరిజంగా వర్ణితమైన మితవాదులను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. తుది దశ ఎన్నికల్లో వారంతా కాస్టిలోకు మద్దతు ప్రకటించారు. రాజధాని లిమా, ధనికులుండే పట్టణ ప్రాంతాలలో కెయికు మెజారిటీ సాధించగా పేదలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు కాస్టిలోను ఎంచుకున్నారు. ఇద్దరి మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉన్నందున ఏమైనా జరగవచ్చు. వామపక్ష అభ్యర్థి విజయం సాధించటం లేదా కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయినా దేశ రాజకీయాల్లో వామపక్ష శక్తుల పలుకుడి పెరిగినట్లే. రానున్న రోజుల్లో విధానపరమైన మార్పుల కోసం పెరూవియన్లు పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం ఉంది. అనేక దేశాల అనుభవం చూసినపుడు వామపక్ష శక్తులు అధికారంలో ఉండి పెట్టుబడిదారులను, ప్రపంచ ద్రవ్య పెట్టుబడిని వ్యతిరేకించే చర్యలు తీసుకుంటే ఆశక్తుల కుట్రలను ఛేదించేందుకు జనం అవసరమైతే వీధుల్లోకి రావాల్సి ఉంటుందని బొలీవియా, వెనెజులా అనుభవాలు తెలుపుతున్నాయి.
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288