Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలల్లో కరోనా సంక్షోభం కోట్ల మందిని ఆకలితో అలమటించేలా చేస్తోంది. ఎక్కువ మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దొరికిన పని చేసుకుని వచ్చిన దానితో కలో గంజో తాగుతూ కడుపునింపుకుంటున్న వారిని పోషకాహరం లోపం కోవిడ్ బారీన పడేలా చేస్తోంది.
కోవిడ్ వలన పోతున్న ఉపాధి అవకాశాలు ప్రపంచంలో నిరుపేదల సంఖ్యను పెంచుతున్నాయి. గతంలో యుద్ధాలు, పర్యావరణ మార్పులు, పెట్టుబడిదారీ ప్రపంచీకరణ వలన పేదరికం పెరిగేది. కోవిడ్ మహామ్మారి 2020లో ప్రపంచ వ్యాపితంగా 8.8కోట్ల నుంచి 11.5 కోట్లకు నిరుపేదలను పెంచేసింది. 2021 నాటికి 15కోట్లకు చేరుకునే సంకేతాలు కనబడుతున్నాయి. ఈ పెరుగుదల చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నది. రోజుకు రూ.150 ఆదాయం గలవారిని నిరుపేదలుగా గుర్తిస్తున్నారు అని ''పూ'' అనే అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ వెల్లడించింది. లాక్డౌన్లు, కర్ఫ్యూలలో పేదరికం మరింత పెరిగే అవకాశం ఉన్నది.
ఫ్యాక్టరీలు మూతపడి, వ్యాపారాలు నడవక, వ్యవసాయం అంతంత మాత్రమే జరుగుతుండటంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఆఫ్రికాలోనే ప్రపంచంలోని 87శాతం నిరుపేదలు ఉంటున్నారు. అక్కడే ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. భారత్లోకూడా పేదరికం బాగా పెరిగిపోయింది. కరోనా రాకముందు కంటే నిరుపేదల సంఖ్య 7.5కోట్లు పెరిగి మొత్తం పేదల సంఖ్య 13.5 కోట్లకు చేరింది. ఇప్పుడు భారతదేశంలో ఒకదేశంగా చూస్తే ఎక్కువ నిరుపేదలు ఉన్న దేశం అయింది. ఇక్కడ అభివృద్ధి -11శాతానికి పడిపోవడం దానికి తాజా ఉదాహరణ. ప్రధాని నియోజకవర్గం వారణాసీలోని గ్రామీణ ప్రాంతంలో పిల్లలు గడ్డి తిని కడుపు నింపుకుంటున్న ఫొటోలు వెలుగుచూశాయి. నైజీరియా, ఈతోపియా, బంగ్లాదేశ్, ఫిలిఫైన్స్, ఇండోనేషియా, కాంగో, పాకిస్థాన్, కెన్యా, ఉగండా లాంటి దేశాలు దారిద్య్రంలో ముందు వరుసలో ఉండే దేశాలు. అక్కడ కోవిడ్ వల్ల పేదరికం మరింత తీవ్రంగా పెరిగిపోయింది.
యునిసెఫ్ లెక్కల ప్రకారం పిల్లల్లో 1.2 మిలియన్ల మంది అనేక సమస్యలతో దారిద్య్రం కోరల్లో చిక్కుకున్నారు. పౌష్టికాహారం లోపం, మంచినీరు, సరైన వైద్యం అందదు. ప్రధానంగా విద్యకు దూరమై వారి భవిష్యత్ ఛిద్రం అవుతున్నది. బాలల పేదరికం 70 దేశాలలో 15శాతం పెరిగింది. మహిళలు, ఆడపిల్లల్లో 47 మిలియన్ల మంది నిరుపేదలుగా మారినట్టు అంచనా. కరోనాతో మహిళలల్లో 9.1శాతం పేదరికం పెరిగింది. కోవిడ్ రాని పక్షంలో 2019 నుంచి 2021 మధ్యకాలంలో మహిళల్లో పేదరికం 2.7శాతం పెరుగుతుందని భావించారు. కానీ కోవిడ్ వల్ల అది గణనీయంగా 9.1శాతం పెరిగిపోయింది.
పట్టణ పేదలు ఎక్కువ మంది నిరు పేదలుగా మారితే దీని ప్రభావం గామీణ ప్రాంతాల మీద చాలా తీవ్రంగా ఉండబోతున్నది. పట్టణాలలో అసంఘటిత రంగంలో పనిచేసే వారికి పనులు ఉండటం లేదు. ఉన్నా కూలీ బాగా తగ్గించడంతో ఆదాయాలు బాగా దిగజారిపోతున్నాయి. గ్రామాలకు తిరిగి పోతున్న పరిస్థితి కూడా చాలా ప్రాంతాలలో కనబడుతున్నది. దీనితో గ్రామాలలో పరిమితంగా ఉండే కూలీ పనులు పట్టణాల నుంచి వచ్చిన వారి ప్రభావంతో పోటీ ఏర్పడి వేతనాలు తగ్గిపోయి మరింత కష్టతరంగా మారుతున్నది. చాలా కుటుంబాలు ఒక పూట తిని రెండోపూట నీళ్ళతో కడుపునింపుకుని పస్తులతో బతుకుతున్నారు.
ఈ సంవత్సరం మార్చిలో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు 4.3శాతం పడిపోయింది. ఇది 2007-2008 సంక్షోభ కాలం కంటే ఎక్కువ పతనం. పెట్టుబడిదారీ ప్రపంచీకరణ విఫలం అవ్వడం నిరుపేదల సంఖ్య పేరుగుదలకు ఒక కారణం. పదే పదే వచ్చిన ఆర్థిక సంక్షోభాలను తేలిక చేసి చూడకూడదు. దానికి కోవిడ్ మహమ్మారి ఇప్పుడు తోడైంది అనేది స్పష్టంగా కనపడుతున్నది. పెట్టుబడిదారీ ప్రపంచీకరణ వైఫల్యాను కప్పిపుచ్చుకోవడం కోసం సహస్రాబ్ది సూత్రాలు, సుస్థిరాభివృద్ధి అని కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పాలకులు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. పేదరికం నిర్మూలనకు గడువులు ప్రకటిస్తున్నారు తప్ప వ్యవస్థలో ఉన్న కీలక సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. ప్రతి ఏటా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు కూడా అభివృద్ధి అంటే పెట్టుబడుల అభివృద్ధి అనే భ్రమలు కల్పిస్తున్నది. పెట్టుబడి చలనానికి మార్గం ఏర్పాటు చేస్తే మిగిలిన అభివృద్ధి లక్ష్యాలు దానంతట అవే జరుగుతాయనే బూటకపు వాదనలు ముందుకు తెస్తున్నారు.
లాభాపేక్షతో పెట్టుబడిదారీ విధానం పేదరికాన్ని పెంచితే కోవిడ్ మహమ్మారి ఫలితంగా నిరుపేదల సంఖ్య పెరుగుతున్నది. ముందు నుంచే పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు పూనుకుని ఉంటే ఇప్పుడు మహమ్మారి నుంచి వచ్చే ఆర్థిక సమస్యల ప్రభావం తక్కువగా ఉండేది. దానికి ఉదాహరణ చైనాలో కనబడుతున్నది. అక్కడ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న చైనా లక్షణాలలో సోషలిస్టు ఆర్థిక విధానంతో పేదరికాన్ని నిర్మూలించామని ప్రకటించింది చైనా. వారు కోవిడ్ మహమ్మారిని కూడా సమర్థ వంతంగా ఎదుర్కొని దాని వల్ల పేదలు పెరిగే అవకాశం లేకుండా చేశారు. అదే ప్రపంచ మార్గం కావాలి.
- టిఎన్వి రమణ
సెల్:8985628662