Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2019 మే 26న రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ ప్రభుత్వం ఏడేండ్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడేండ్లలో 12 భారత్ బంద్‌లు, ఒక దేశవ్యాప్త బ్లాక్ డే జరిగాయి. పెద్ద ఎత్తున నిరసనలు సాగుతున్నా మోడీ తన విధానాలలో ప్రజానుకూల మార్పు చేయకపోగా మరింత ఘనీభవించి కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే విధానాలను కొనసాగిస్తున్నారు. ఆర్డినెన్స్‌లతో పాలన సాగిస్తున్నారు. సహజంగా ప్రజలు, సంస్థలు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు 1961లో కామేశ్వర ప్రసాద్ వర్సెస్ బీహార్ 'బ్యాంకు ఉద్యోగుల' కేసులో తీర్పునిస్తూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(సి) ప్రకారం ట్రేడ్ యూనియన్ హక్కులకు గ్యారంటీ, అది వారి ప్రాథమిక హక్కుగా తేల్చి చెప్పింది. సమ్మె చేసే హక్కునూ కల్పించింది. ట్రేడ్ యూనియన్ రంగంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు 47.65కోట్ల మంది పని చేస్తున్నారు. వీరి శ్రమను యజమానులు కాజేయకుండా యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. యూనియన్లలో 10కోట్ల సభ్యత్వం ఉంది. మెజారిటీ కార్మికులకు, శ్రామికులకు సంఘాలలో సభ్యత్వ లేదు. ''అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్'' ప్రకారం ప్రతి దేశం శ్రమ చేసేవారి హక్కులను కాపాడుతూ చట్టాలు చేయించింది.
లేబర్ చట్టాలను, కార్మిక రంగాన్ని భారత రాజ్యాంగం కాంకరెంట్ లిస్టు (ఉమ్మడి జాబితా)లో చేర్చింది. అందువల్ల తమ హక్కులకు భంగం కలిగినప్పుడు కార్మికులు, శ్రామికులు సమ్మెలు చేస్తారు. అలాగే రాజకీయంగా, సాంఘికంగా ఉపద్రవాలు ఏర్పడినప్పుడు సమ్మెలు చేస్తారు. ఈ సమ్మెలను ప్రభుత్వం బేఖాతరు చేసినప్పుడు బంద్‌లు పాటిస్తారు. దేశవ్యాప్తంగా బంద్‌లు పాటించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనలను తెలియజేస్తారు. స్వాతంత్య్రానంతరం మొదటిసారి 1948 జనవరి 31న మహాత్మగాంధీ హత్య జరిగిన తరువాత దేశవ్యాప్త బంద్ పాటించారు. మోడీ అధికారానికి వచ్చిన ఏడు సంవత్సరాలలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో 12 భారత్ బంద్‌లు జరిగాయి. అయినా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవడానికి సుముఖంగా లేదు.
భారత్ బంద్‌లు : 2.9.2015న కార్మిక సంస్కరణలు-10 కేంద్ర యూనియన్లు సమ్మె చేశాయి. 2.9.2016న 18 కోట్ల మంది కార్మికులు సమ్మె చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. 27.2.2017న మధ్యప్రదేశ్‌లోని మందసోర్లో ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపి 6గురు రైతులను చంపారు. భారత్‌బంద్ తరువాత వారి కోరికలను ఆమోదిస్తూ 6.6.2018న ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రుణ మాఫీ ప్రకటించారు. 6.09.2018న దళిత-గిరిజనులను నష్టపరిచే సంస్కరణల బిల్లు పార్లమెంటులో ఆమోదించినందుకు నిరసనగా, 7.8.2018న రవాణా పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా కార్మిక-రవాణ సమ్మె. 8.01.2019న ఒకే విడత ఎన్నికలు జరుపడం, పౌరసత్వ చట్టాలను మార్చడం, పశ్చిమ బెంగాల్, అసోలలో. 19.12.2019న హిందూవులకు మాత్రమే పౌరసత్వం కల్పించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‌లు జరిగాయి. 8.01.2020న కార్మిక హక్కుల రక్షణ కోసం. 12.2020న కార్మిక హక్కుల రక్షణ కోసం. 26.11.2020న మొత్తం భారత కార్మిక వర్గం తమ హక్కుల కొరకు సమ్మె-రైతులచే ఢిల్లీ దిగ్భందనం మూడు కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బంద్ పాటించారు. మొత్తం గ్రామీణ బంద్ జరిగింది. 26.03.2021న కార్మిక సంఘాలు మూడు రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బంద్ పాటించాయి. 26.05.2021న మోడీ పాలన ఏడేండ్లు ముగిసిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు 'బ్లాక్-డే' పాటించాయి. పై ప్రతి బంద్‌లోనూ కార్మికవర్గంతో పాటు మధ్యతరగతి ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 8.12.2020 భారత్‌బంద్ ఉత్పత్తి నష్టం రూ.32 వేల కోట్లుగా అంచనా వేశారు. బంద్ ప్రకటించడానికి ముందు సమ్మె నోటీసులు ఇవ్వడం, తమ డిమాండ్లను పరిష్కరించమని కోరడం జరుగుతుంది. అనేకసార్లు వారి కోర్కెలను పరిష్కరించడానికి తిరస్కరించడం వలన అనివార్యమై భారత్ బంద్‌కు పిలుపివ్వడం జరుగుతున్నది. ప్రజానురంజకమైన పాలన అంటే ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి. ఢిల్లీలో లక్షలాది రైతులు మే 26, 2021 నాటికి 6 మాసాలుగా ఆందోళన చేస్తున్నారు. అయినా పరిష్కారం చూపలేదు. రైతులకు తోడుగా వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, విద్యార్థులు, మహిళలు అన్ని రంగాలవారు బహిరంగంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు.
నిరుద్యోగం : ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూనే ఉంది. దీనికితోడు కరోనాతో ఉన్న ఉద్యోగాలు పోయి నిరుద్యోగుల జాబితా మరింత పెరుగుతున్నది. 2020 ఏప్రిల్ నాటికి 23.52శాతం, మే నాటికి 21.73 శాతంగా నిరుద్యోగిత రేటు ఉన్నట్టు సిఎమ్ఐఇ పేర్కొంది. యువకులలో 23.7శాతం నిరుద్యోగిత కొనసాగుతున్నది. రాజ్యాంగంలో పనిహక్కు పొందుపర్చబడినప్పటికీ ఇంతమంది ప్రజలు నిరుద్యోగంతో ఆదాయవనరులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగిత రేటును పరిశీలించినపుడు భారత్‌లో 46.3శాతంగా ఉంది. ఐస్లాండ్లో 83.8, స్విట్జర్లాండ్ 80.5, నెదర్లాండ్ 78.2, జపాన్ 77.6, న్యూజిలాండ్ 77.4శాతంగా ఉన్నాయి. 60 దేశాలలో భారతదేశం 55వ స్థానంలో ఉంది. (ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ రిపోర్ట్-ఓఇసిడి ప్రకారం). ఇంత నిరుద్యోగం కొనసాగుతున్నప్పుడు నిరుద్యోగులు ఆందోళన చేయక తప్పని పరిస్థితి. అవకాశాలు ఉండి కూడా ఉద్యోగ కల్పన చేయడంలో ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల టెక్నాలజీకి లోబడిపోయాయి.
పరిశ్రమల మూత : మోడీ ఏడు సంవత్సరాల పాలనలో 6.94 లక్షల పరిశ్రమలు (36శాతం) మూతపడ్డాయి. ఈ మూతపడిన కర్మాగారాల వల్ల దాదాపు 8.5 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. మొత్తం భారతదేశంలో 47.67 కోట్ల మంది కార్మికులుండగా 10 కోట్ల మంది మాత్రమే సంఘాలలో సంఘటితమై ఉన్నారు. వారే ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడానికి ముందుకురాకపోవడానికి కారణాలేమిటి? కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్' ప్యాకేజి ఎన్ని ఫలితాలిచ్చింది? ఎందుకు కార్మికులు నిరుద్యోగులవుతున్నారు? వీటన్నింటికీ ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ మాత్రమే కారణంగా కనపడుతున్నది. భారత జనాభాలో 1 నుంచి 14సంవత్సరాల వయసు కలిగినవారు 36.73 కోట్ల మంది, 15 నుంచి 64 సంవత్సరాల వరకు 92.46 కోట్ల మంది, 65సంవత్సరాలకు పైబడినవారు 8.1 కోట్లమంది ఉన్నారు. పనిచేయగలిగిన 15-64 మధ్య వయసు గలవారిలో దాదాపు సగం మంది కార్మికులుగా పనిచేస్తున్నారు. చట్టాలలో కార్మికుల రక్షణలను తొలగించడం జరిగింది. 2015 నుండి రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళల హక్కులను తొలగించడం జరుగుతున్నది. ఈవిధంగా కేంద్ర ప్రభుత్వమే అన్ని వర్గాలను పోరాటానికి ఒక వేదిక మీదకి తెస్తున్నది. విదేశీ పరిశ్రమలను ఆకర్షించి ఉద్యోగ కల్పన చేస్తామని నిరంతరం ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఫార్మా కంపెనీలను ఆకర్షించడం పై కేంద్రీకరించాయి. ఈ విదేశీ ఫార్మా కంపెనీలు పొల్యూషన్‌ను మనకి వదిలి ఉత్పత్తిని వారు తీసుకెళ్తున్నారు. ఈ కంపెనీలలో టెక్నాలజీ వినియోగించడం వల్ల ఉపాధి అంతగా ఉండదు.
సహజంగా భారత్‌బంద్‌లు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. కోట్లమంది ప్రజలు తమ కోర్కెల కొరకు ఆందోళనలో పాల్గొంటుంటే ప్రభుత్వం పరిష్కరించలేకపోతున్నది. 29.1.2019న జరిగిన భారత్‌బంద్ భారత పౌరసత్వ సమస్యపై జరిగింది. హిందువులు మినహా మిగిలిన వారికి పౌరసత్వం ఇవ్వకూడదని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మన లౌకిక విధానానికి విరుద్ధం. కాశ్మీర్ ప్రజల హక్కులను రద్దు పర్చడానికి ఆర్టికల్ 370కి సవరణ చేయడం జరిగింది. ఎవరూ కోరకుండానే కాశ్మీర్ నుంచి లడఖ్‌ను విడగొట్టి రెండు రాష్ట్రాలుగా మార్చి తన అధీనంలో ఉండేవిధంగా రాష్ట్రపతి పాలన పెట్టాంది. కాశ్మీర్లో భూములను కార్పొరేట్లకు అప్పగించడమే 370 ఆర్టికల్ రద్దు వెనక ముఖ్య ఉద్ధేశం. ఇలాంటి సందర్భాలలోనైనా పార్లమెంటు లో గానీ, ప్రజా ప్రతినిధులతో గానీ చర్చించి అందరి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనలేదు. 26.5.2021 బ్లాక్ డే దేశవ్యాప్తంగా జరిగింది. కానీ కేంద్రం ఈ నిరసనపై స్పందించక పోవడం విచారకరం. కొద్దిమంది కార్పొరేట్ సంస్థల లాభం కొరకు కార్మిక చట్టాలను, రాజ్యాంగ హక్కులను సవరణ చేసినప్పుడు ప్రజలలో పెల్లుబుకుతున్న ఆందోళనలు శాంతిభద్రతలకు కూడా కారణమవుతాయి. చివరకు ఆర్థిక పోరాటాలు రాజకీయ పోరాటాలుగా రూపాంతరం చెందుతాయి. ఇలాంటి భారత్ బంద్‌లు మరికొన్ని చోటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని గ్రహించాలి.
- సారంపల్లి మల్లారెడ్డి
సెల్: 9490098666