Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్నించే గొంతును నొక్కేయడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రజా వ్యతిరేకమైన పాలకుల విధి విధానాలను ప్రతిపక్షాలు, మీడియా పౌర సమాజం ప్రశ్నిస్తాయి. ప్రశ్నించాలి కూడా. అలా ప్రశ్నించిన వారినందరినీ రాజ ద్రోహులుగా (దేశద్రోహులుగా) పరిగణించి కఠినంగా శిక్షించాలని భావించడం మధ్యయుగాలనాటి నిరంకుశ రాజరికమవుతుందే గాని, ఆధునిక ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఈ విధమైన తాజా చర్చకు మళ్ళీ ఇప్పుడు తెరలేచింది. 'స్వాతంత్య్రం నా జన్మహక్కు' అన్నాడు తిలక్. 'పాలనాధికారం దుర్వినియోగం కానప్పుడే నిజమైన స్వాతంత్య్రం లభిస్తుంది' అన్నాడు గాంధీ. ఇలా అన్నందుకు మన స్వాతంత్య్రోదమ నేతలను బ్రిటిష్ సామ్రాజ్యవాదం రాజద్రోహ నేరం కింద నిర్బంధించి శిక్షించడం తెలిసిందే. ఆ కాలపు క్రూర చట్టం సెక్షన్ 124(ఎ) ఇప్పటికీ కొనసాగడం ఎంతటి దుర్మార్గం.
అందుకే సుప్రీంకోర్టు ఇటీవల ఆ 'రాజద్రోహం' చట్టపరిధిని, పరిమితులను పునర్ నిర్వయించి, ప్రాసంగికతను విశదపరచాలని తలచింది. ఈ క్రమంలో పాత్రికేయులపై 'రాజద్రోహం' సెక్షన్ కింద కేసులు పెట్టడం చెల్లదని కూడా తాజాగా తీర్పు ఇచ్చింది. సీనియర్ పాత్రికేయులు వినోద్ దువా యూట్యూబ్‌లో తాను నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీపై విరుచుకుపడ్డారు. మరణాలు, ఉగ్రవాదులు, దాడులను ఉపయోగించుకుని మోడీ ఓట్లు సంపాదించుకున్నారు. అధికారం ఉన్నా, కరోనా నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేదు' అని తెలిపారు. ఇందుకుగాను ఆయనపై బీజేపీవారు రాజద్రోహం కేసుమోపారు. తత్సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లో రిజర్వు చేసిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా వెల్లడిస్తూ ఆ 'రాజద్రోహం' కేసును కొట్టివేసింది. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీ పోలీసులు రాజద్రోహం కేసు మోపారు. ఆ కేసులో నిందితులుగా కొన్ని మీడియా చానళ్ళ వారిని కూడా చేర్చారు. దీనిపై ఆ చానళ్ళు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం రాజద్రోహం 124(ఎ) సెక్షన్‌ను ఇప్పుడున్న కాంలో పునర్ నిర్వచించాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. దీనిని అనేక మంది న్యాయకోవిదులతో పాటు ప్రజాతంత్ర మేథావులు కూడా స్వాగతిస్తున్నారు.
'రాజద్రోహం కేసును ఇటీవల ప్రభుత్వాలు విచక్షణా రహితంగా వినియోగిస్తున్నాయి. సరైన కారణాలు సక్రమంగా చూపడం లేదు. చాలా కేసులు సాధారణ చట్టాల పరిధిలో వచ్చేవే అయినా, 'విశేషమైన' రాజద్రోహం కేసు మోపడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా ఈ సెక్షన్‌కు చెక్ పెట్టడం మంచి పరిణామం. జర్నలిస్టులు, కవులు, కళాకారులపై ఇలా 'రాజద్రోహం' కేసు మోపి ఏండ్ల తరబడి జైళ్ళల్లో నిర్బంధించడం ఎంతకాలం చూస్తుండాలి? ప్రాథమిక హక్కులపై దాడి జరిగితే రక్షణ కల్పించాల్సింది సుప్రీంకోర్టే కదా' అని బి.ఎన్.కృష్ణ, గోవింద మాధుర్, ఎం.బి.లోకుర్ వంటి న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం హర్షణీయం.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి వ్యక్తులను విమర్శించినంత మాత్రాన అది రాజద్రోహ నేరం కాదని, గతంలో కేదార్నాధ్సింగ్ కేసులో స్పష్టంచేసిన విషయాన్ని మాజీ సొలిసటర్ జనరల్ వికాస్‌సింగ్ ఈ సందర్భంగా ఉంటంకించడం గమనార్హం. మనదేశంలో వంశపారంపర్య పాలనా రాజకీయాలు వెళ్ళూనుకోవడం, అధికార వ్యామోహంతో పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవాలని భావించడం సహజంగానే ఇలాంటి సెక్షన్లకు కొమ్ముకాస్తాయి. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, ఉన్నతమైన వారు ఎన్ని వ్యాఖ్యలు చేసినా, ఎన్ని కమిషన్లు వేసి, ఎన్ని నివేదికలు సమర్పించినా ప్రజాస్వామ్యం, పౌరహక్కులు నానాటికి బలహీన పడటం గమనిస్తూనే ఉన్నాం. అధికారం శాశ్వతం చేసుకోవాలనే తలంపుతోనే, ప్రజాస్వామ్య ఫెడరల్ లౌకిక వ్యవస్థలను ధ్వంసం చేయడంలో భాగంగానే బీజేపీ ఇలాంటి సెక్షన్లకు ప్రాణప్రతిష్ట చేస్తున్నది.
2010 తర్వాత దాదాపు 11వేల మందిపై రాజద్రోహం కేసుమోపితే 65శాతం కేసులు మోడీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్లలోనే దాఖలైనట్టు 'ఆర్టికల్ 14 సర్వేసంస్థ' తెలుపుతున్నది. కేవలం మోడీని విమర్శించినందుకు 149 మందిపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యను విమర్శించినందుకు 14 మందిపై రాజద్రోహం నేరం మోపారని ఆ సంస్థ పేర్కొంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. దానిని రాజద్రోహంగా పరిగణిస్తే మనం మన వలస పాలకుల చెప్పుల్లోనే కాళ్ళు పెట్టినట్టు అర్థం అవుతున్నది. గతంలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేసినా దానిని రాజద్రోహంగా పరిగణించలేమని 'బల్వంత్‌సింగ్ కేసులో' కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వంపై చేసే విమర్శ 'రాజద్రోహం' కానేకాదని 21వ లాకమిషన్ స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్యంలో చట్టపాలన (రూల్ ఆఫ్ లా) సిద్ధాంతానికి జవసత్వాలు కల్పించేది న్యాయవ్యవస్థ. పాలకులు ఎంత ఉన్నతులైనా కానీ, వారికంటే ఉన్నతమైనది రాజ్యాంగం - చట్టపాలన. ఈ మార్గానికి జీవం పోసేది ధర్మాసన చైతన్యం. ఇది గనుక విఫలమైతే మనం నిర్మించుకున్న ప్రజాస్వామ్య సౌథం కుప్పకూలుతుంది. మానవ హక్కులు గల్లంతు అవుతాయి. అందుకే మహారచయిత టాల్‌స్టారు అంటాడు 'హక్కులను హరిస్తూ నటించే పాలకులను ఉపేక్షించడం హానికరం' అని..
- కె. శాంతారావు
సెల్: 9959745723