Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కోవిడ్ మహమ్మారి ఉధృతి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో లక్షలాది కుటుంబాల్లో సంభవించిన విధ్వంసం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలో తలెత్తిన ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మోడీ ప్రభుత్వం ఏమాత్రం సంసిద్ధంగా లేకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. మహమ్మారిని సరిగా ఎదుర్కొనక పోవడం, పైగా అశాస్త్రీయ ధోరణి... రెండూ కలిసి ప్రజలకు పెను విపత్తుగా పరిణమించాయి.
సెకండ్ వేవ్ సృష్టించిన విపత్తు నుంచి ఇంకా కోలుకోక మునుపే మరో విపత్తు (ఆర్థిక ముప్పు) పొంచి ఉంది. దాంతో లక్షలాదిమంది ప్రజలు తమ జీవనోపాధులను పోగొట్టుకుని నిరుద్యోగులుగా మారారు. చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు బాగా దెబ్బతిన్నారు. అనేక కుటుంబాలు అప్పుల్లో కూరుకు పోయాయి. ఆకలి విపరీతంగా వ్యాప్తి చెందుతోంది.
జాతీయ గణాంకాల సంస్థ-2021 సంవత్సరానికి ప్రకటించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు చూసినట్లైతే ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం మేర కుంచించుకుపోయింది. గత నాలుగు దశాబ్దాల్లోనే ఇంత అధ్వాన్నమైన పరిస్థి ఎన్నడూ లేదు. వ్యవసాయ రంగం మినహా ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం ఉత్పత్తి క్షీణతను నమోదు చేసింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందంటూ నాలుగవ త్రైమాసికానికి (2021 జనవరి నుంచి మార్చి) వృద్ధి రేటు 1.6 శాతంగా నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. కానీ... ఏప్రిల్, జూన్ మధ్యలో సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా రాష్ట్రాలలో వివిధ స్థాయిల్లో లాక్డౌన్లు విధించడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఈ సంక్షోభ తీవ్రతకు సంబంధించి కొన్ని సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మే మాసంలో నిరుద్యోగ రేటు దాదాపు 12శాతంగా ఉందని సిఎంఐఇ పేర్కొంది. అదే మాసంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు దాదాపు 15శాతంగా ఉంది. మే మాసంలో దేశీయ పారిశ్రామిక ఆర్డర్ల వృద్ధి, ఉత్పత్తి గత పది మాసాల్లోనే అత్యంత తక్కువగా ఉంది. గృహ వినిమయం కూడా మరింత తగ్గింది. డిమాండ్ లేదు, పెట్టుబడులు రావడం లేదు.
ఇటువంటి సమయంలో, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది. నగదు సబ్సిడీలు, ఉపాధి అలవెన్సులు, ఉపాధి హామీ పథక వ్యయం, చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలు వంటి రూపంలో ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచినట్లైతే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా డిమాండ్ పెరుగుతుంది. మౌలిక సదుపాయాలు, గ్రామీణాభి వృద్ధి రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం వల్ల మధ్యస్థ, దీర్ఘకాలిక సహాయం అందుతుంది.
ఎవరో కొద్ది మంది తీవ్ర వ్యతిరేకులు, ఆర్థిక ఛాందసవాదులు మినహా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వ్యయాన్ని మరింత పెంచాలనే కోరుతున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు ఉదరు కోటక్ నగదు సబ్సిడీలతో సహా పెద్ద ఎత్తున ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ కావాలని కోరుతున్నారు. నయా ఉదారవాద విధానాలకు దృఢంగా కట్టుబడే మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కూడా ప్రభుత్వం మరింత ఖర్చు పెట్టాలని కోరుతున్నారు. అవసరమైతే రుణాలు తీసుకోవడం లేదా నగదును ముద్రించడం ద్వారానైనా ఖర్చు పెట్టాలని కోరుతున్నారు. పలువురు ఆర్థికవేత్తలు, ప్రభుత్వ ఫైనాన్స్ నిపుణులు కూడా ఇదే రీతిలో అభిప్రాయపడుతున్నారు.
కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఈ విజ్ఞప్తులు వేటికీ చలించడం లేదు. ఆర్థిక ఉద్దీపనపై ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముందు బడ్జెట్ వ్యయం ప్రజలకు చేరాలని వ్యాఖ్యానించారు. కోవిడ్ సంబంధిత వ్యయ ప్యాకేజీని బడ్జెట్లో ఇప్పటికే అందించామని మంత్రి తెలిపారు.
అయితే ఇదొక బూటకం. 2020-21లో రూ.34,50,305 కోట్లు ఖర్చు పెట్టారు. 2021-22 సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్లో రూ.34,83,236 కోట్ల వ్యయాన్ని చూపించారు. అంటే దానర్థం 2021-22లో రూ.32,931 కోట్లు అదనపు వ్యయం చేశారన్నమాట. బడ్జెట్ కేటాయింపులను నిశితంగా గమనించినట్లైతే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపులు, ఆహార సబ్సిడీలో చాలా కొద్దిగా పెంపుదల కనిపిస్తోంది. అన్నింటికన్నా కాస్త మెరుగ్గా కనిపిస్తున్నది ఆరోగ్య రంగ బడ్జెట్. గత సంవత్సరాల్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ రంగాల్లో ఖర్చు పెట్టినదాని కన్నా ఇప్పుడు కేవలం 11శాతం అదనంగా ఖర్చు పెట్టారు. పేదలకు, అవసరంలో ఉన్నవారికి నగదు సబ్సిడీలు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఆదాయపన్ను యేతర వర్గాలవారందరికీ నెలకు రూ.7500 చొప్పున అందచేయాలంటూ గతేడాది మధ్యలో నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం దీనిపై అస్సలు దృష్టి పెట్టడం లేదు.
సెకండ్ వేవ్ సమయంలో, ప్రభుత్వం చేసిందల్లా ఒక్కటే. ఆహార భద్రతా చట్టం కిందకు వచ్చే అన్ని కుటుంబాలకు మూడు మాసాల పాటు ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు అందించే పథకాన్ని పునరుద్ధరించడమే. అయితే, గతేడాది ఇచ్చిన కిలో పప్పును ఈసారి ఆపేశారు.
నయా ఉదారవాద విధానాలు అవలంబించే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు ఈ సంక్షోభ సమయంలో అనుసరించిన విధానాలను ఆచరించడానికి మోడీ ప్రభుత్వం సుముఖంగా లేదు. గత ట్రంప్ ప్రభుత్వం, ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం కలిసి ఇప్పటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ఉద్దీపనను, నగదు బదిలీలను ప్రజలకు అందించారు. ఇది ఆ దేశ జీడీపీలో దాదాపు 27శాతంగా ఉంది. బ్రిటన్ ప్రభుత్వం తమ జీడీపీలో 17 శాతానికి సమానమైన మొత్తాన్ని ఆర్థిక ఉద్దీపన కింద అందించింది. వీటిల్లోనే ఉపాధి మద్దతు, నగదు బదిలీలు ఉన్నాయి. ఇకపోతే భారత ప్రభుత్వం కరోనా సమయంలో చేసిన అదనపు వ్యయం ఈ దేశ జీడీపీలో కేవలం 2 శాతంగా ఉంది.
ఈ సంక్షోభ సమయంలో బడా కార్పొరేట్లు, ప్రయివేటు ఫైనాన్స్ ప్రయోజనాలను పెంచేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది. 2020-21, 2021-22 రెండు సంవత్సరాల్లోనూ కార్పొరేట్ పన్నులు తగ్గించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం లేదా ఉపసంహరణ ద్వారా వరుసగా రూ.2.1 లక్షల కోట్లు, రూ.1.75 లక్షల కోట్లు సమీకరించడానికి ప్రతిపాదించింది. ఈ లక్ష్య సాధనకు సమీపంగా కూడా రాలేకపోయిందన్నది మరో విషయం.
కరోనా సంక్షోభ సమయంలో కూడా నయా ఉదారవాద విధానాల పట్ల మోడీ ప్రభుత్వం ప్రదర్శించే ప్రభుభక్తితో స్టాక్ మార్కెట్లు అమాంతం పెరిగిపోయాయి. దేశ, విదేశాలకు చెందిన బడా వ్యాపార సామ్రాజ్యాల యజమానులు, సట్టా వ్యాపారులు మరింత సంపన్నులయ్యారు. ఫలితంగా, 2020లో భారత్‌లో కోటీశ్వరులు 55 మంది పెరిగారు. అదే సంవత్సరంలో టాప్ వంద మంది కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. దీనికి రెండో పార్శ్వంలో వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, గ్రామీణ ప్రాంత కార్మికుల ఆర్థిక దుస్థితి మరింత పెరిగింది. లక్షలాదిమంది నిరుద్యోగంతో రుణాల ఊబిలో చిక్కుకుపోయారు. ఆకలి, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
అదనపు వ్యయానికి అవసరమైన వనరులను పెంచుకోవడానికి గాను కార్పొరేట్ పన్నులను పెంచడానికి, మూలధన పన్నులు లేదా సంపద పన్ను విధించడానికి ప్రభుత్వం తిరస్కరిస్తోంది. అందుకు బదులుగా, పెట్రోల్, డీజిల్‌లపై అసాధారణమైన రీతిలో లెవీలు విధించడం ద్వారా తగ్గిన రెవెన్యూ ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న సమయంలో, మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నెల రోజుల్లో డీజిల్, పెట్రోల్ ధరలు 17 సార్లు పెరగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. లీటరు డీజిల్ ధర రూ. 4.65 పెరగగా, పెట్రోల్ ధర ఒక్క మే నెల్లోనే రూ.4.09 పెరిగింది.
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తీవ్రంగా పెరిగిన ఫలితంగా టోకు ధరల సూచీ, ద్రవ్యోల్బణం పెరిగింది. ఇతర అన్ని ఉత్పత్తుల, వస్తువుల ధరలపై కూడా పెట్రో ధరల పెంపు ప్రభావం కనబడింది. ఈ తరుణంలోనే నిత్యావసరాల ధరలు, ఆహార పదార్థాల ధరలు పెరగడమంటే... అసలే తగ్గిన ఆదాయాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో ఎదురు దెబ్బ తగలడమే.
ఇక ఈ ఆర్థిక సంక్షోభంలో మరో కోణం... రాష్ట్రాల పైకి భారాన్ని నెట్టివేయడానికి కేంద్రం ప్రయత్నించడం. మోడీ ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్యపూరిత, ప్రజా వ్యతిరేక వ్యాక్సినేషన్ విధానంతో రాష్ట్రాలు అధిక రేట్లకు వ్యాక్సిన్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడానికి కట్టుబడినందున ఈ భారాన్ని అవి మోయాల్సి వస్తోంది. జీఎస్టీ కింద ఇవ్వాల్సిన చట్టబద్ధమైన నష్టపరిహార మొత్తాలను కూడా రాష్ట్రాలకు ఇవ్వడం లేదు. కోవిడ్ సంబంధిత కీలకమైన ఔషధాలకు, వైద్య పరికరాలకు పన్నలను రద్దు చేసే ప్రతిపాదనలను కూడా పరిశీలించేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో, ఈ విషయాన్ని పరిశీలించడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విషయాన్ని పక్కకు నెట్టేశారు. వ్యాక్సిన్లు అందించడంలో కానీ, నగదు సబ్సిడీల కోసం రాష్ట్రాలకు ఆర్థిక సాయాన్ని అందించడంలో కానీ కేంద్రం తన బాధ్యతలను విడిచిపెడుతోంది. ఇది మూఢపు సైన్స్, మూర్ఖపు అర్థశాస్త్రం కేసుగా చూడాల్సి ఉంటుంది.
కేంద్రమే పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను సమకూర్చి, రాష్ట్రాలకు ఉచితంగా అందచేయడం ద్వారా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేలా ప్రతిపక్ష పార్టీల నేతత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడాలి. ఇందుకు సంబంధిత రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు చేయూతనివ్వాలి. నగదు సబ్సిడీలు, ఉపాధి హామీ నిధులు, ఉచిత ఆహార ధాన్యాలు, నిరుద్యోగ భృతి, ప్రజారోగ్య వ్యయాలను పెంచడం వంటి చర్యల ద్వారా ప్రజలకు అత్యవసర ఉపశమనం కల్పించేందుకు పోరాటం సాగాలి. రానున్న రోజుల్లో ఈ పోరాటాల కోసం అన్ని ప్రజాతంత్ర, రాజకీయ, సామాజిక శక్తులు ఒక తాటి పైకి రావాలి.
-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం