Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్నాభిప్రాయాలు లేకుండా సజీమైన శక్తివంతమైన ఉద్యమం ఉండదని నా విశ్వాసం. సర్వ సంపూర్ణమైన ఏకాభిప్రాయం శ్మశానంలో మాత్రమే సాధ్యపడుతుంది.. - స్టాలిన్.
మానవ హక్కుల్ని అణగద్రొక్కుతూ పౌరహక్కుల కార్యకర్తలపై 38దేశాల ప్రభుత్వాలు ప్రతీకారం తీసుకుంటున్నాయని, అలాంటి దేశాలన్నీ సిగ్గుపడాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గుపడాల్సిన దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉన్నందుకు దేశ పౌరులుగా మనమంతా విచారించాలి. ఇజ్రాయిల్, ఈజిప్టు, గ్యాటిమలా, గయానా, హొండూరస్, మాల్దీవులు, కిర్గిస్తాన్, మొరాకో, మయన్మార్, ఫిలిప్పైన్స్, రువాండా, సౌదీ అరేబియాలతో పాటు భారత్ కూడా ఉందన్న నిజాన్ని గ్రహించి, ఆ పరిస్థితిలోంచి బయటపడడానికి ప్రయత్నించాలి. మానవ హక్కుల కార్యకర్తలాంతా అత్యంత గౌరవనీయులని, వారు ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేస్తున్నారని వారిపై దాడులు చేసేవారు వెంటనే ఆపేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పిలుపులోని స్ఫూర్తిని మనం అందిపుచ్చుకోవాలి. అందుకే చెప్పేదేమంటే.. కేవలం ప్రాణాలు కోల్పోయిన వారే మరణించినట్టు కాదు. తమ హక్కులు, అధికారాలు పోతున్నప్పుడు కూడా ఎవరైతే చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోతారో వారు కూడా మరణించినట్టు లెక్కే.
ఒక రోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పార్లమెంటు నుంచి బయటికి వస్తున్నప్పుడు పార్లమెంటు మెంబరు కృపలానీ ఎదురుపడి.. ''ఈ రోజు సంతోషంగా కనిపిస్తున్నారేమిటీ?''.. అని అడిగారు.
అందుకు అంబేద్కర్ ఇలా అన్నారు.. ''మొదట్లో రాణుల కడుపుల నుంచి రాజులు పుట్టేవారు. నేనిప్పుడు ప్రజల ఓట్లతో ఓట్ల పెట్టె నుంచి రాజు పుట్టే ఏర్పాటు చేశాను. అందుకే ఈ సంతోషం'' అని అన్నారు.
''అయితే మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు'' అని అన్నారు కృపలానీ. ''ఎందుకంటే నీ ప్రజలు పేదలు. నిస్సహాయులు. అడుక్కునే వాళ్ళు. అమ్ముడు పోయే వాళ్ళు... మేము వారి ఓట్లను కొని, మా ప్రభుత్వాలను మేం ఏర్పాటు చేస్తాం. అప్పుడు మీరేమీ చేయలేరు'' అని వివరించాడు. అందు కు అంబేద్కర్ ఆత్మ స్థైర్యం కోల్పోలేదు. నింపాదిగా జవాబిచ్చారు.
''నా ప్రజలు పేదలే. నిస్సహాయులే. అడుక్కు తినేవారే కావొచ్చు. మీరువారి ఓట్లను కొని ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యొచ్చు.. కానీ, ఏరోజైతే నా ప్రజలు తమ ఓటు విలువను సరిగా గుర్తిస్తారో అప్పుడు మీకంటే పెద్ద బిచ్చగాళ్ళు ఎవరూ ఉండరు. గుర్తుంచుకోండి!'' అంటూ స్వరంలో ఏహ్యభావాన్ని విదిల్చారు. డాక్టర్ అంబేద్కర్ భావనలోని స్ఫూర్తిని మనం అందిపుచ్చుకోవాలి! ప్రాణాలు కోల్పోయిన వారే మరణించినట్టు కాదు.. అని ఎలాగైతే అనుకున్నామో.. ప్రాణాలు ఉన్నవాళ్ళంతా జీవిస్తున్నట్టూ కాదు. అగ్రవర్ణాల వారు నిమ్నవర్గాల్ని శతాబ్దాలుగా ఈ దేశంలో ఎంతటి క్షోభకు గురిచేశారో ఎంత చెప్పుకున్నా తరగదు. ఇప్పటికీ మానసికంగా ఎంతగా హింసిస్తున్నారో రోజూ చూస్తూనే ఉన్నాం. లావో-జె అనే చీనీ సాధువు.. ''మనం మరణిద్దాం.. కానీ, నశించిపోవద్దు. విధ్వంసమై పోవద్దు''.. అని అన్నాడు. ''మరణించినప్పుడు మనం భౌతిక జీవితాన్నే కోల్పోతాం. కానీ, మనం నశించిపోతే మానవత్వమే మంటగలిసిపోతుంది. మాన వత్వం అంటే.. మానవులుగా మనం నిర్వర్తించాల్సిన ధర్మం'' అన్న విషయం గుర్తుచేశారు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్.
లోకమాన్య బాలగంగాధర తిలక్ నిమ్నవర్గాల స్వాతంత్య్రానికి పూర్తిగా వ్యతిరేకం. తన పత్రిక 'కేసరి'లో రాజకీయాధికారంలో కింది కులాల భాగస్వామ్యాన్ని తీవ్రంగా నిరసించాడు. 1918లో శూద్రులు, అతి శూద్రులు తమకి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ప్రదర్శన చేపట్టారు. అది చూసి తిలక్ భరించలేకపోయాడు. అందుకే తన పత్రికలో ఇలా రాసుకున్నాడు... ''ఈ నూనె బట్టల వాళ్ళు, గొర్లు కాచుకునే వాళ్ళు, బట్టలుతికే వాళ్ళు, పొగాకు చుట్టలమ్మేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు.. వీళ్ళంతా శాసనసభల్లోకి వెళ్ళాలి.. అని అనుకోవడం ఏమిటో.. నాకు అసలు అర్థం కావడమే లేదు'' అని చిరాకు పడ్డాడు ఆ మహానుభావుడు. అందువల్ల ఎవరినైనా గుడ్డిగా అభిమానించ గూడదు. ఎవరేమిటో బేరీజు వేసుకోవాలి! మహానుభావులు అని అనుకునే వాళ్ళలో కూడా మూర్ఖశిఖామణులుంటారు. హిందువుల ఐక్యత కోసం వినాయకుణ్ణి వీధిలో పెట్టింది ఈయనే. అదే దేశంలో అంటువ్యాధిలా వ్యాపించి గల్లీకి పది వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి. అక్కడ యువతీ యువకులు డి.జె. మ్యూజిక్ పెట్టుకుని ఆడా మగా కలిసి గంతులేస్తున్నారు. అయితే భక్తీ, శ్రద్ధా లేకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది. ఒకప్పుడు యజ్ఞయాగాల్లో దేవుడి పేరు చెప్పి ఎంజారు చేసేవారు. ఇప్పటితరం వాళ్ళూ.. అదే చేస్తున్నారు. ఎవడికి తోచిన విధంగా వాడు వేడుకలు చేసుకుంటున్నప్పుడు, ఇంకా ఎక్కడా లేని ఆ దేవుడి 'సాకు' ఎందుకూ? అని మనలాంటి వాళ్ళం అంటున్నాం. అందులో తప్పేం ఉంది?
''ఒకప్పుడు మన బూట్లు పాలిష్ చేసినోళ్ళు ఇప్పుడు మనల్ని పాలిస్తున్నారు'' అని యూపీ బీజేపీ మహిళా విభాగం చీఫ్ మధుమిశ్రా అన్నారు. కాంగ్రెస్, బహుజన సమాజ్‌వాది పార్టీలు మండి పడడంతో.. బీజేపీ ఆమెను ఆరేండ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక్కడ మన తెలంగాణలో ఎమ్మెల్యే రాజాసింగ్.. ''ముస్లిం స్పీకరైతే - నేను అసెంబ్లీకి రాను'' అని మంకుపట్టు పట్టి కూర్చున్నాడు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది హైదరాబాద్‌లోని గోషామహల్ ప్రాంతం. గోషామహల్ ముస్లింలు కట్టిందే. అసలు హైదరాబాదు నగరం కట్టిందే ముస్లిం రాజు - కులీ కుత్బ్షా. మరి ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఎందుకు ఉన్నట్టూ? అని ప్రతి సామాన్య ఓటరూ ప్రశ్నించడా? ''స్త్రీ ఇంటి పట్టున ఉండాలి. ఆమె భర్త సేవలో ఆమె తరిస్తూ ఉండాలి'' అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. విచిత్రమేమంటే మోహన్ భగవత్‌కు కరోనా వ్యాక్సిన్ వేసింది మహిళా నర్సు. స్త్రీ చదువుకుని, వైద్యం నేర్చుకుని మోహన్ భగవత్ లాంటి వాళ్ళను కూడా బతికిస్తోంది. మరి ఈ దేశభక్తులు ఎప్పుడు కళ్ళు తెరుస్తారో కదా?
కమ్మ, రెడ్డి, కాపు, గౌడ, బలిజ మొదలైన వారంతా (మనువాదుల ప్రకారం) శూద్రాతి శూద్రులు. వారంతా నేడు ఉన్నత చదువులు చదవగలుగుతున్నారంటే అది ఒక మహౌన్నతుడి పోరాట ఫలితం. అంతే కాదు, ఆయన - ఆయన భార్యకు చదువు నేర్పి, భారతదేశానికి తొలి (మహిళా) ఉపాధ్యాయురాలిని అందించారు. బాలికల కొరకు అనేక పాఠశాలలు స్థాపించారు. ఆ మహౌన్నతుడి పేరు జ్యోతిరావు గోవిందరావు ఫూలే (1827-90). ఆయన భార్య సావిత్రీ బాయి ఫూలే (1831-97). వారిద్దరి పేర్లు ప్రతి శూద్రుడు, అతి శూద్రుడు, ప్రతి మహిళా స్మరించుకుంటూ ఉండాలి. ఇంకా ఈ కుల వృత్తుల మీద మహాత్మ జ్యోతిరావు ఏమన్నారో గమనించండి. ''జుత్తు కత్తిరించడం మంగలి యొక్క పవిత్రమైన ధర్మం కాదు. ఇది ఒక వ్యాపారం. చెప్పులు కుట్టడం మాదిగవాడి పవిత్రమైన ధర్మమేమీ కాదు. ఇది కూడా వ్యాపారమే. అలాగే ఉన్నతమైనవిగా ప్రదర్శించే పూజలు, అర్చనలు కూడా వ్యాపారమే. అది బ్రాహ్మణుడి పవిత్ర ధర్మమేమీ కాదు. మన అజ్ఞానం మీద అతనికి జరిగే పెద్ద వ్యాపారం!!'' ఆ మహాత్ముడి మాటల్లోని సత్యాన్ని జనం ఇంకా గ్రహించుకోకపోతే ఎలా? స్త్రీల స్థాయిని హీనాతి హీనంగా దిగజార్చిన మనువాదులు ఏం చేశారో తెలియదా? వారి వ్యాపారం సజావుగా సాగడానికి, పెద్ద సంఖ్యలో జనాన్ని గుడులకు రప్పించడానికి మహిళల్ని ఎరగా వేయలేదా? దేవదాసి, బసివి, జోగిని.. లాంటి వ్యవస్థలు శతాబ్దాలుగా గుళ్ళలో ఎందుకు కొనసాగుతున్నాయి? మనువాదులకు సంభావనలిచ్చేవే సంప్రదాయాలు. వారి ఆదాయం పెంచేవే.. ఆచారాలు. అందువల్ల వివేకమున్నవారు వాటిని తిరస్కరించాలి. మతాన్ని మించిన మారణాయుధం లేదు. కులాన్ని మించిన కుతంత్రం లేదు. కత్తితో భయపెట్టేవాడి కంటే, భక్తితో భయపెట్టేవాడే ఒక పెద్ద దోషి - అని గుర్తించాలి!
పాత సంప్రదాయాల్ని, మూఢత్వాన్ని తిరగదోడుతూ.. ఇప్పుడున్న రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని ప్రతిష్టించాలని తహతహలాడుతున్న ప్రస్థుత భారత ప్రభుత్వ పెద్దలకు ఎలాగూ వైజ్ఞానిక స్పృహ లేదు. ఉంటే గనక మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కుంభమేళాలు, ఎలక్షన్ ర్యాలీలు, నమస్తే ట్రంప్ కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తారూ? తమ అనుచిత చర్యలతో లక్షల మంది దేశపౌరుల ప్రాణాలు ఎందుకు బలి తీసుకుంటారూ? దేశంలో అత్యంత భయానక పరిస్థితుల్ని ఎందుకు నెలకొల్పుతారూ? ''శ్రీవారి కృపతో కరోనా తగ్గుముఖం పట్టిందని'' కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి తిరుమల ఆలయాన్ని దర్శించుకుని ప్రకటించారు. కరోనా మళ్ళీ విజృంభిస్తోందని పేపర్లు, టీవీలు ఒకవైపు ఘోషిస్తుంటే పాపం, అధికారంలో ఉన్న వాళ్ళకు సమాచారం అందదు కదా? దేశంలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండి, మరణాలు లక్షల్లో సంభవిస్తున్నప్పుడు ఆ నిస్సహాయమంత్రి గారు చేసిన ప్రకటన అది! ఆసుపత్రులలో రోగులకు బెడ్స్ లేక, శ్మశానవాటికలో శవాలకు చోటులేక, నదుల్లో శవాలు గుట్టలు కొట్టుకుపోతున్నప్పుడు బీజేపీ వారు వారి మహా నాయకుడి సుపరిపాలన గూర్చి మహౌన్నతంగా కీర్తిస్తూ మాట్లాడడం, ప్రకటనలివ్వడం, వ్యాసాలు రాయడం దేశ ప్రజలు చూశారు.
దేశంలో టీకా ఉత్సవ్ 2021 ఏప్రిల్ 11-14 మధ్యన ఉంటుందని భారత ప్రధాని ప్రకటించారు. కానీ ఏం లాభం? దేశంలో అప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ఏ రాష్ట్రానికీ కేంద్రం సరిపడినన్ని డోసులు పంపలేకపోయింది. కారణం అంతకు ముందే వ్యాక్సిన్ డోసులు విదేశాలకు ఎగుమతి చేశారు. వ్యాక్సిన్ నిలువలు ఎన్ని ఉన్నాయో చూసుకోకుండానే 'వ్యాక్సిన్ ఉత్సవ్' అని గొప్పగా ప్రకటించడం అవమానానికి దారితీసింది. పబ్లిసిటీ పిచ్చివల్ల, ముందుచూపులేని విధానాల వల్ల.. దేశ ప్రజలు ఏమైపోయినా, కేంద్ర ప్రభుత్వం పాపం.. ఏమీ పట్టనట్టుగా ఉండిపోయింది! ఆసుపత్రుల్లో బెడ్స్‌లేక, చాలా మంది కరోనా రోగులకు 108 వాహనం లోనే డాక్టర్లు చికిత్సనందించాల్సి వచ్చింది. అంతిమ సంస్కారాలు అందించలేనంతగా శ్మశాన వాటికల్లో శవాలు కుప్పలు కుప్పలుగా పేరుకు పోయాయి. ఇక నదుల్లో శవ ప్రవాహాల్ని ఈ దేశ ప్రజలు ఎప్పుడైనా చూశారా? ఎందరో వ్యక్తులు, ఎన్నో సామాజిక సంస్థలు కరోనా బాధితుల్ని ఆదుకున్నారు. నాకు తెలిసి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాలు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, డాక్టర్లను ఏర్పాటు చేసి, రోగులకు పౌష్టికాహారం అందిస్తూ, అవసరమైతే ఆక్సిజన్ సిలండర్లు తెప్పిస్తూ.. ప్రభుత్వేతర సంస్థలుగా ప్రజలకు గణనీయమైన సేవలు అందించాయి. ప్రజల ప్రాణాలు నిలడితేనే కదా, మనం ఏ మానవీయ విలువల గురించైనా మాట్లాడుకునేదీ? ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకున్న భారతీయులంతా ఏం చేస్తున్నారో? పాపం! కరోనాకు భయపడి వారు కొనిపెట్టుకున్న దీవులకు వెళ్ళి ప్రశాంతంగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారేమో! పరాన్నజీవులు ఎక్కడైనా ఎప్పుడైనా హాయిగానే బతుకుతాయి!
- వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు