Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్ రాష్ట్రం అభివృద్ధికి ఒక 'నమూనా' అనే పేరు ప్రచారంలో ఉంది. కానీ కరోనా మహమ్మారిని నిరోధించడంలో ప్రభుత్వం విఫలం చెందింది. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ట పర్చడం కోసం కేవలం 4శాతం కన్నా తక్కువ ఖర్చు చేయడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని ఆరోగ్య సంరక్షణా చర్యలను గమనిస్తే అర్థమవుతుంది. గత కొన్ని వారాలుగా గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యంగా అహ్మదాబాద్, సూరత్, రాజ్ కోట్ నగరాల్లో 5000పైగా మ్యూకర్‌మైకాసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధి సోకిన కేసులు నమోదయ్యాయి. దీర్ఘకాలం పాటు కోవిడ్ వ్యాధి నివారణకు అధిక మోతాదులో స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ మందులు వాడినవారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న వారు ముక్కులు బిగుసుకుపోయి, ముక్కు వెంట రక్తం కారుతూ, కళ్ళు వాచి, కనుచూపు మందగించి, కనురెప్పలు వాలిపోవడం లాంటి సమస్యలతో బాధపడతారు. ఇప్పటికే ఈ వ్యాధితో 250మంది చనిపోయారని అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో సుమారు 950మందికి ఈఎన్టీ శాఖ వారు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఒక్క సూరత్‌లోనే 100మంది బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న వారు ఇన్ఫెక్షన్ వల్ల తమ కళ్ళు, లేదా దవడ ఎముకలు కోల్పోయారు. ఈ వ్యాధి సాధారణంగా ముక్కు నుంచి కళ్ళకు, మెదడుకు పాకుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, కరోనా వైరస్ నివారణ కోసం ఎక్కువ స్టెరాయిడ్స్ వాడటం వల్ల (ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు) షుగర్ లెవెల్స్ పెరగడంతో శరీరంలో బ్లాక్ ఫంగస్ పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సూరత్‌లో కోవిడ్ రెండవ వేవ్ తగ్గుముఖం పట్టడం ప్రారంభం అయ్యే సమయానికి మ్యూకర్‌మైకాసిస్ ఒక్కసారిగా పెరిగింది. దేశంలో ఈ వ్యాధి సోకిన కేసుల సంఖ్యలో గుజరాత్‌ది రెండవ స్థానం. అయినా ప్రయివేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే వారి కోసం ప్రభుత్వం వైద్యఖర్చులను స్థిరీకరించలేదు.
ఈ క్రమంలో గుజరాత్లో కరోనా రెండవ వేవ్‌లో మార్చి నెల మధ్య నుంచి, అధికారిక లెక్కల ప్రకారం వైరస్ 6వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. కానీ ఆసుపత్రులు, శ్మశానవాటికలు, ఖనన ప్రదేశాలలో లెక్కలు, స్థానిక వార్తా పత్రికల్లో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రచురించే ఎడ్వర్టైజ్మెంట్ల్లు, ప్రభుత్వం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాల సంఖ్యల ప్రకారం, అధికారిక లెక్కల కంటే 15రెట్లు మరణాలు ఎక్కువ ఉంటాయి. ఇతర వ్యాధులు లేకుండా కేవలం కోవిడ్ వల్లే మరణించిన వారిని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్నారని డాక్టర్లు చెబుతున్నారు. వాస్తవ మరణాల సంఖ్యను దాచి ఉంచడంతో, ఒక టీవీ చానెల్ రిపోర్టర్స్ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ముందు అర్థరాత్రి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూర్చుని 67 శవాలను లెక్కిస్తే, ఆ సమయంలో మృతుల సంఖ్య 20గా చూపారు. 30మంది కోవిడ్‌తో మరణిస్తే, ముగ్గురు మాత్రమే మరణించినట్లు సంతకం చేయమన్నారని ఒక ఉద్యోగి అన్నారు. ప్రధానంగా ఆసుపత్రి తక్కువ మందుల సరఫరా, తక్కువ ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లాంటి సవాళ్ళను ఎదుర్కొంటుందని ఆ ఉద్యోగి తెలిపారు.
కోవిడ్ రెండవ వేవ్‌ను ఎదుర్కోవడంలో గుజరాత్ ప్రభుత్వం సంసిద్ధంగాలేనట్లు కనిపిస్తుంది. డిసెంబర్ 2020 చివరలో పక్కనున్న మహారాష్ట్రలో కోవిడ్ కేర్ సెంటర్లను తెరిచి ఉంచి, ఇంకా కొన్ని కొత్త సెంటర్ల నిర్మాణం చేపడుతుంటే, గుజరాత్ ప్రభుత్వం మాత్రం ఉన్న కొన్ని కేంద్రాలను మూయించింది. గుజరాత్ ప్రభుత్వం ఫిబ్రవరిలో మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపై దృష్టిని మరల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చాలా దూకుడుగా సాగింది. దాదాపుగా కరోనా హెచ్చరికలన్నింటినీ గాలికి వదిలేశారు. ప్రచార సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా సోకినప్పటికీ అటు నాయకులు, ఇటు ప్రజలు ఎవ్వరూ భౌతికదూరం పాటించలేదు, మాస్క్‌లు ధరించలేదు. క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు నిర్మించిన నరేంద్ర మోడీ స్టేడియం ప్రారంభానికి ప్రజానీకానికి అనుమతి ఇచ్చారు. ఇంత సంక్షోభ సమయంలో ఒక లక్ష పడకలు అవసరం ఉండి, వాటిని సమకూర్చడానికి బదులుగా, లక్ష మంది క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు ప్రభుత్వం స్టేడియంను నిర్మించింది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు అనుమతులిచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో లోటు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఒక రకంగా కోవిడ్ నిబంధనలు పాటించకుండా, దాని వ్యాప్తికి కారణమైంది మాత్రం అధికారులు, రాజకీయ నాయకులే. బహిరంగసభల్లో ప్రధాని, హౌం మంత్రి మాస్క్‌లు ధరించకుండా పాల్గొంటే, ప్రజలకు వారు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నట్టు? ఫిబ్రవరి రెండవ వారంలో కోవిడ్ కేసులు పెరగడం ప్రారంభమైంది, కానీ అధికారులు ప్రజారోగ్యం కన్నా ఎన్నికలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
మార్చి మొదటి వారంలో కోవిడ్ వ్యాప్తి పెరిగి, ఆ నెల మధ్య కాలానికి కేసులు, మరణాల సంఖ్య పెరిగాయి. మూడవవారం నాటికి సెమీ అర్బన్ ప్రాంతాల నుంచి కేసులు పెరిగి, చివరి వారంలో గ్రామీణ ప్రాంతాలలో కూడా వ్యాప్తి చెందింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలోని గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ రేటు 10శాతంగా ఉంటుంది. అహ్మదాబాద్‌లోనే ఆక్సిజన్ అందుబాటులో లేకుంటే, గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన జిల్లాల్లోని ఆసుపత్రులలో ఎలా దొరుకుతుంది?
మొదటి వేవ్‌లో తప్పించుకున్న గ్రామీణ ప్రాంతాలలో, ఎటువంటి కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రతీ గ్రామంలో ఎన్నికల సభలు, ప్రదర్శనలు జరగడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని ఒక జిల్లా కలెక్టర్ చెప్పారు. మార్చి మధ్యలో పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రజారవాణా వ్యవస్థను నిలిపివేసి, మార్కెట్లు, మతపరమైన స్థలాల్లో సభలు సమావేశాలను రద్దు చేసి, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు అనుమతి లేకుండా చేశారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ చాలా ఆలస్యంగా జరిగాయి.
గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కేసులు, మరణాలను నివారించడానికి వైద్య ఆరోగ్యశాఖ చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదు. ఆసుపత్రులలో సరిపోను పడకలు లేవు, వైద్యానికి సరిపడా ఆక్సిజన్ సరఫరా లేదు, అంబులెన్స్‌లు, శవాలను తీసుకొని పోయే వ్యాన్లు లేవు. కోవిడ్ వ్యాప్తి కన్నా ఆక్సిజన్, పడకలు, మందులు అందుబాటులో లేకపోవడం వల్లే అనేక మంది చనిపోయి ఉంటారని, అవి అందుబాటులో ఉండి, సరియైన కరోనా నివారణా చర్యల నిర్వహణ ఉండి ఉంటే డాక్టర్లు వేల మంది ప్రాణాలను కాపాడి ఉండేవారు.
ఆసుపత్రుల బయట రోగులను తీసుకొచ్చిన అంబులెన్సులు 80, 90ల సంఖ్యలో నిలబడి ఉండేవి. ఆసుపత్రులలో చేరడానికి వచ్చిన రోగులు క్యూలో నిలబడి ఉండేవారు, అలా చేరడానికి వచ్చి క్యూలో నిలబడిన వారిలో కనీసం 100మందైనా చనిపోయి ఉంటారు. అలాంటి పరిస్థితిలో గుజరాత్ హైకోర్టు కలుగజేసుకొన్న తరువాతనే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. అంతకు ముందు రాష్ట్రంలోని సగం జిల్లాల్లో కూడా లాబ్‌లో పరీక్షలు నిర్వహించే సౌకర్యాలు లేవు. రెండవ వేవ్ ప్రారంభంలో ఆక్సిజన్ సేకరణ, సరఫరా చేసే యంత్రాంగాలు లేవు. ఏప్రిల్ నెలలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండటంతో ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఇద్దరు అధికారులను నియమించింది. ఆక్సిజన్ కొరత కారణంగానే అనేక మరణాలు సంభవిస్తున్నాయనే వాస్తవాన్ని ప్రభుత్వం కొట్టిపారేస్తుంది, కానీ అనేక ఆసుపత్రులలో రోగులు ఆక్సిజన్లేకనే మరణిస్తున్నారని ఒక పత్రికా సంపాదకుడు కూడా అన్నాడు. దూరంగా ఉన్న జిల్లాల్లోని ఆసుపత్రులలో, ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతోనే రోగులు చనిపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యాధికారులు వాస్తవ సమాచారం ఇవ్వకుండా కేసులు, పేషెంట్ల సంఖ్య తక్కువగా చెప్పడం వల్లే, రాష్ట్రానికి 1350 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా, కేంద్ర ప్రభుత్వం 1000టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేటాయించింది. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడుతలతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్ రాష్ట్రం, ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలతో హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో కరోనా నివారణ కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. గుజరాత్లో రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు, మహారాష్ట్ర 70వేలు, కర్నాటక 50వేలు, అయినప్పటికీ గుజరాత్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. వివిధ జిల్లాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 8 వేల మెడికల్, పారా మెడికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా 33జిల్లాలకు గాను 15 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీ.టీ స్కాన్ చేయడానికి హెచ్ఆర్సీటీ మెషీన్లు లేవు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో అహ్మదాబాద్, రాజ్ కోట్, సూరత్, వడోదర లాంటి నగరాల్లో పెరిగిన ప్రయివేటు వైద్య రంగానికి సమానంగా ప్రజారోగ్య వ్యవస్థ పెరగలేదు. ప్రజారోగ్య వ్యవస్థకు ప్రయివేట్ వైద్య రంగం ప్రత్యామ్నాయం కాదని ఇప్పుడు కరోనా మహమ్మారి రుజువు చేసింది కాబట్టి, ప్రభుత్వం ఇప్పుడు ప్రజారోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి విషయంలో గుజరాత్ ఇతర రాష్ట్రాలకు నమూనా అని అన్నారు, కానీ ఇప్పుడు అదే రాష్ట్రం కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ప్రజారోగ్యానికి పెట్టే ఖర్చును 'నమూనా'గా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థలో ఒక నూతన ఉత్తేజాన్ని, శక్తిని నింపింది. ప్రజారోగ్య వ్యవస్థను ''ఆర్ద్రం'' అనే ఆరోగ్య మిషన్ ద్వారా మార్చారు. దానిలో భాగంగా దానికి అవసరమైన నూతన మౌలిక సదుపాయాల నిర్మాణం, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెంచడం, పారిశుద్ధ్యం, పరిశుభ్రతల మెరుగుదలను చేపట్టారు. ఇది కేరళలో విజయవంతమైంది.
2017లో కాగ్ కూడా గుజరాత్ రాష్ట్రంలోని జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో దయనీయమైన ఆరోగ్య సంరక్షణా చర్యల గురించి తన నివేదికలో లేవనెత్తింది. ప్రస్తుత కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో వైద్య సిబ్బంది చాలా తక్కువగా ఉన్న కారణం వల్ల ప్రజారోగ్య వ్యవస్థ కరోనాను అదుపుచేయడంలో విఫలం చెందింది, దీని నుంచి తగిన గుణపాఠం తీసుకొని ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయకుంటే రానున్న కాలంలో వచ్చే మహమ్మారులకు రాష్ట్రంలో మరింత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తాయి.
_ బోడపట్ల రవీందర్
సెల్: 9848412451