Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు వానాకాలం ప్రారంభమైంది. నిన్న, మొన్న రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడ్డాయి. రేపు, ఎల్లుండి అనేక జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ, అతిభారీ వానలు పడే అవకాశముందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జనాలకు గతేడాది సెప్టెంబరు, అక్టోబరులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు గుర్తొస్తున్నాయి. అప్పటి కుంభవృష్టి తాలూకూ చేదు జ్ఞాపకాలు ఇటు హైదరాబాద్ వాసులకు, అటు వరంగల్ ప్రజలకూ ఇంకా మదిలో పదిలమే. వాటి నుంచి తేరుకోకముందే పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చిన ఒక వార్త... గుండెల్ని గుభేల్మనిపించింది. 'కొద్దిపాటి వానకే వరంగల్ అతలాకుతలం...' ఇదీ ఆ వార్త సారాంశం. ఇది తెలిసిన భాగ్యనగర వాసులకు సైతం కంగారు మొదలైంది. పోయినేడాది సంభవించిన జలప్రళయం, ఆ దెబ్బకు చాప చుట్టేసిన కాలనీలు, బస్తీలు... వెరసి జనం పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. మన పాలకులు ఘనాతి ఘనంగా చెప్పుకుంటున్న విశ్వనగరంలో ఇంకా అనేక వార్డులు, డివిజన్లు నీటిలో నానుతూనే ఉన్నాయి. గతేడాది మునకేసిన ఇండ్లలో అనేకం.. ఇప్పటికీ అభ్యంగ స్నానాన్ని ఆచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కలిసిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అధికారిని ఇదే విషయమై... 'సార్... గతేడాది ప్రారంభించిన నాలాల పూడికతీత ఎంతవరకూ వచ్చింది..? డ్రైనేజీ, వాన నీరు పోవటానికి కొత్త పైపు లైన్లు వేశారా..? లోతట్టు కాలనీలు, బస్తీల్లోకి వరద నీరు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు...?' అని అడగ్గా... 'మీరు ఎంతో ఆశతో అడుగుతున్నారు. కానీ ఒక కఠోర వాస్తవాన్ని చెప్పాలి. గతేడాది పైపు లైన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే ఉన్నాయి. గతేడాది నాలాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడూ అదే పరిస్థితి. అందువల్ల ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిస్తే గతేడాది మాదిరిగానే ఇప్పుడూ లోతట్టు ప్రాంతాల్లోకి నీరు రావటం ఖాయం... కాకపోతే అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. క్యాలెండర్ మారింది.. సంవత్సరమూ మారింది... గంతే...' అని జవాబిచ్చారు. బిత్తరపోవడం నావంతైంది సుమా!
-బి.వి.యన్.పద్మరాజు