Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెలరాజేందర్ శాసనసభ్యత్వానికీ రాజీనామా చేయడంతో తెలంగాణలో పాతిక రోజులుగా సాగుతున్న ప్రహసనంలో కీలక ఘట్టం ముగిసింది. రేపో మాపో ఆయన బీజేపీలో చేరడమే మిగిలింది. ఎవరి సమక్షంలో చేరతారు, ఎక్కడ కాషాయ కండువా కప్పుకుంటారు వంటివన్నీ ప్రాధాన్యతలేని అంశాలు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులను రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజరు సహా కలసి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి తరుణ్‌చుగ్ తదితరులు వెళ్లి కలుసుకోవడం వరకూ చూస్తే ఇతర పార్టీల వారిని చేర్చుకోవడంలో కమలదళం ఉత్సాహం తెలుస్తుంది. టీఆర్ఎస్లో తిరుగుబాటు తీసుకొచ్చి అసమ్మతివాదులను కూడగట్టి ఏదో దుమారం లేవనెత్తుతారని ప్రచారం జరిగినా చివరకు ఈటెల బీజేపీలో చేరడం ఒక యాంటీ క్లైమాక్స్. ఆయన అదేపనిగా చెప్పిన ఆత్మగౌరవ పోరాటం ఈ విధంగా అధికార అస్తిత్వ ఆరాటంగా ముగియటం వూహించదగిందే, అలాగే ఆయన చెప్పిన కమ్యూనిస్టు భావజాలం సామాజిక న్యాయం వంటి అంశాలకు బీజేపీలో చేరికతో చేచేతులా సమాధి కట్టినట్టే. ఈ కారణంగా ఆయన చాలామందిలో సానుభూతిని పోగొట్టుకుని మరింత వ్యతిరేకత తెచ్చుకోవడం తథ్యం. ఆయన రాజీనామా చేసిన హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ఎప్పుడువస్తుందో గానీ ఓట్లు టీఆర్ఎస్ నుంచి ఈటెలకు మారడం ఆయనతో పాటు బీజేపీకి చేరడం అంత సులభం కాదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ చాలా నగరపాలక సంస్థల్లోనూ బీజేపీకి వచ్చిన ఓటింగు చూస్తే మేమే తెలంగాణలో కాబోయే ప్రత్యామ్నాయమని వారంటున్న దానికి పెద్దగా ఆధారం కనిపించదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మూకుమ్మడిగా చేసే దాడిని తట్టుకుని నెట్టుకురావడం ఈటెలతో పాటు బీజేపీకీ పెద్ద సవాలే. ఆయన బదులు భార్య జమున పోటీ చేస్తారని వస్తున్న సూచనలకు అదే కారణం కావచ్చు. అదే జరిగితే పోటీకి ముందే ఓటమి ఛాయలు ప్రవేశించినట్టవుతుంది.
రాజీనామాకు ముందు ఈటెల ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, టీఆర్ఎస్ ప్రభుత్వంపైన చాలా వ్యాఖ్యలు చేశారు. కాని నిన్నటి వరకూ ఆ వ్యవస్థలో కీలకస్థానంలో ఉన్న వ్యక్తిగా ఆ మాటలకు పెద్ద ప్రభావం ఉండదు. అదే నిజమైతే ఇంతకాలం ఎందుకు సహించారన్న ప్రశ్న వస్తుంది. ప్రగతిభవన్ బానిసల నిలయంగా మారిందనే మాట చాలా పెద్దది. 2016లో ప్రగతిభవన్ కడితే అయిదేండ్లు అక్కడ నుంచి అధికారంలో పాలుపంచుకున్న ఈటెల వంటివారు ఆ మాట అనడం ఎలా చెల్లుతుంది? మమ్ముల్ను లోపలకి రానివ్వలేదని ఆరోపించే వ్యక్తి ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? కేసీఆర్ ఏకపక్షపాలన విమర్శ ఒకటైతే ఆయనగా చర్య తీసుకునేవరకూ అక్కడే కొనసాగి ఇప్పుడు ఆరోపణలకు గురై ధిక్కార స్వరాలు వినిపించడం విడ్డూరంగా ధ్వనిస్తుంది. భూ కబ్జా చేయలేదని ఖండిస్తూనే భూములు కొనుగోలు చేసిన మాట నిజమని ఆయన ఆయన భార్య కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఆయన ఒక్కరే చేశారా అనే ప్రశ్న మరో అంశం. అందరిమీద చర్య తీసుకోవలసిందే గాని అది మరొకరిపై ఆరోపణలను మటుమాయం చేయదు. ఆ మాటకొస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కూడా ఆయనతో పాటు అందరిపై దర్యాప్తు జరపాలని అడిగినవారే. మరి ఆ ప్రక్రియ ఏమీ జరగకుండానే చేర్చుకోవడానికి ఎందుకు తొందరపడుతున్నట్టు?
ఇక ఈటెల రాజేందర్‌పై చర్యతో టీఆర్ఎస్లో ముసలం పుడుతుందనీ, సామాజిక శక్తులతో ప్రత్యామ్నాయ వేదిక వెలుస్తుందని చాలా కథలు నడిచాయి. అవి నిజం కాకపోగా అధికార పార్టీయే ఎక్కువగా ఎదురుదాడి సాగించింది. ఈటెల వాస్తవానికి ఆయన కాంగ్రెస్, బీజేపీ నాయకులను కలుసుకున్నదే ఎక్కువ. కాంగ్రెస్‌తో చర్చలపై ఆపార్టీ నేతలు భిన్నస్వరాలు వినిపించగా, బీజేపీలోనూ అనేక గొంతులు వినిపించాయి. ఎంఎల్ఎ రాజాసింగ్ వంటివారే బేషరతుగా ఆహ్వానం పలికారు. టీఆర్స్తో బీజేపీ కలవబోదని ఈటెల హామీ కోరారని చెప్పారు గాని వారు సూటిగా అలాంటిదేమీ ఇచ్చింది లేదు. ఎన్నికల్లో విడిగానే పోరాడతామనిమాత్రం చెప్పారట. అదెలాగూ తప్పదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ కేంద్రం విధానాలను విమర్శిస్తూనే వ్యూహాత్మకంగా అప్పుడప్పుడు మద్దతుగా మాట్లాడటం, రాజ్యసభలో అనుకూలంగా వ్యవహరించడం తెలిసిన విషయాలే. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం కేసీఆర్ సర్కారు కూడా తమ మనుగడకు అవసరమైన వ్యూహాలే అనుసరిస్తాయి గాని ఈటెల కోసం హామీలు ఇచ్చే అవకాశం ఉండదు. ఆత్మగౌరవం అనే మాట అదేపనిగా వినిపించిన మాజీ మంత్రి ఆ విషయమై బీజేపీకి ఎలాంటి షరతులు పెట్టినట్టు కనిపించదు. నరేంద్రమోడీ అమిత్‌షా ద్వయం అక్కడ అన్నిటినీ నిర్ణయిస్తుందని దేశమంతటికీ తెలుసు. తెలంగాణతో సహా దేశంలో రాష్ట్రాల ఆత్మగౌరవంపై హక్కులపై మొత్తంగా దాడి చేసిన చరిత్ర మోడీ సర్కారుది. వారి రాజకీయ నినాదం హిందూత్వ సిద్ధాంతం, అనేక కులమతాలు, సామాజిక తరగతుల ఆత్మగౌరవంపై దాడి చేసిన చరిత్ర దానికి ఉంది. తెలంగాణ అసోం ఏదైనా ఆ తర్వాతనే. మరి అలాంటి చోట తమ ఆత్మగౌరవం భద్రంగా ఉంటుందని ఈటెల బృందానికి ఎలా నమ్మకం చిక్కిందో బోధపడదు. వాస్తవానికి అటువైపు అడుగుపడటంలోనే దానిపై తొలి వేటు పడినట్టయింది. ఈ పరిస్థితులలో ఈటెల బీజేపీలో చేరడం అస్తిత్వ పరిరక్షణ కోసం తప్ప అంతకు మించి చెప్పేవన్నీ మిథ్యమాత్రమే,
ఏది ఏమైనా దక్షిణ భారతంలో బీజేపీకి అవకాశం చాలా తక్కువ. ఒక్క కర్నాటకలో అది కూడా గాలి జనార్థనరెడ్డి గనుల డబ్బు, యెడ్యూరప్ప కుటిల నీతి కలిసి బీజేపీ అరకొర బలంతో అధికారం సాగిస్తున్నది. మిగిలిన ఎక్కడా ప్రభావం నామమాత్రం. కేరళలో మొన్న పూర్తి భంగపాటుకు గురికాగా, తమిళనాడులో నాలుగేండ్లుగా ఏడీఎంకేను ఆడిస్తూ ఆఖరుకు పొత్తులో నాలుగు స్థానాలు తెచ్చుకున్నారు. తెలంగాణలోనూ దుబ్బాకలో చాలా తక్కువ ఆధిక్యతతో గెలిచి సర్జికల్ స్ట్రయిక్స్ నినాదంతో జీహెచ్ఎంసీిలో గణనీయమైన స్థానాలు తెచ్చుకున్నా తర్వాత వివిధ ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపింది లేదు. ఎంఎల్సీ ఎన్నికల్లో వున్న స్థానం కోల్పోయారు. నాగార్జునసాగర్‌లో అతితక్కువతో సరిపెట్టుకున్నారు. తాజా కార్పొరేషన్ ఎన్నికల్లోనూ డిటో డిటో. 2018 ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో బీజేపీకి 24 వేల ఓట్ల వరకూ వచ్చిన మాట నిజమే గాని ఆ సన్నివేశం వేరు. లోక్‌సభ ఒటింగు శాసనసభల్లో మారడం చాలాసార్లు చూశాం. అప్పటి పొందిక కూడా ఇప్పుడు మారింది. ఈటెల కారుదిగి కమలం తగిలించుకున్న ఈటెలకు లేదా ఆయన కుటుంబ సభ్యులకు పాత ఓటింగు వస్తుందా అనేది ఉప ఎన్నికల నాటికి కాని తేలనివిషయం. ఆయన కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నిటికీ కేంద్ర బిందువుగా మారతారని అతిగా ఆశపెట్టుకున్నవారికి వెంటపడి కలుసుకున్నవారికి కూడా నిరుత్సాహమే మిగిలిందని చెప్పాలి. వీటికి దూరంగా ఉండిపోయిన కమ్యూనిస్టుపార్టీలపై అనవసరంగా వ్యాఖ్యలు చేసి ఉభయ పార్టీల కార్యదర్శులతో అక్షింతలు వేయించుకోవడం ఈటెల స్వయంకృతం. ఇందుకు గాను కమ్యూనిస్టులను తప్పు పట్టేవారు, బీజేపీలో చేరితే తప్పేమిటని ప్రశ్నించేవారు రాజకీయ భావజాలం పట్ల విలువల పట్ల గౌరవం లేనివారే. ఆయన మాటలకు ఆయనే వ్యతిరేకంగా వ్యవహరించారు గనక ఆ ప్రశ్నలన్నీ వచ్చాయిగాని ఆత్మరక్షణకు ఉపయోగపడే అధికార పార్టీలో చేరతానని ఆయన మొదటే ప్రకటించి ఉంటే ఏ విమర్శ ఉండేది కాదు. టీఆర్ఎస్ను ఎవరైనా వ్యతిరేకించవచ్చు. దాని విధానాల మీద పెరిగే ప్రజా సమస్యల మీద తప్పక పోరాడవచ్చు. కాని ఆ పేరుతో బీజేపీని తెచ్చి ప్రతిష్టిస్తామంటే దేశమంతటా సాగుతున్న వారి పాలనపై పెల్లుబుకుతున్న విమర్శలే వెక్కిరిస్తాయి. ప్రత్యామ్నాయం ఎప్పుడూ మెరుగైందిగా ఉండాలి తప్ప ప్రగతి నిరోధకమైతే ఎలా? తెలుగు రాష్ట్రాలలో ఇటీవల చాలామంది ప్రముఖులు బీజేపీలో చేరారు. వారు చాలా నిరీక్షణ తర్వాత ఆ పార్టీలో కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అయ్యారేమో గాని ఎన్నికల రంగంలో తాముగా విజయం సాధించింది లేదు. తెలంగాణలోనే అలాంటి చాలాపెద్ద జాబితా ఉంది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీలో చేరిన వారు ఘర్ వాపసీ అంటూ తిరిగి టీఎంసీలో చేరిపోతున్నారు. యూపీ, కర్నాటకల్లో చక్రం తిప్పిన యోగి, యెడ్యూరప్పలే భవిత గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ బృందం టీబీజేపీిలో చేరి ప్రజలకు ప్రజాస్వామ్యానికి వొరగబెట్టేదేమిటన్నది ప్రశ్నగానే ఉంటుంది. ఏదిఏమైనా ఇది ఆరోపణలకు గురై వెళ్లగొట్టబడిన ఒక నాయకుడి అస్తిత్వ ఆరాటమే గనక అంత పెద్ద ప్రశ్నలు అడగడం కూడా అనసరమే. విజ్ఞులైన ప్రజలు ఎప్పుడు ఎవరికి నేర్పాల్సిన పాఠాలు వారికి నేర్పిస్తారు.
- తెలకపల్లి రవి