Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో కరోనాతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచ దేశాలపై, వర్గాలపై దేశాల మధ్య తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం పేదదేశాలపై ఎక్కువ పడింది. వ్యక్తులు, కుటుంబాలు ఇందుకు అతీతం కాదు. ఇలా దిగువ మధ్యతరగతి పేదల మీద చూపుతున్న ప్రభావ తీవ్రత అంచనాలకు అందకపోగా, వాళ్లు విపత్తునుంచి బయట పడడానికి ఎంతకాలం పడుతుందో అర్థం కాక అగమ్య గోచరంగా మారబోతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. పేదరికాన్ని తగ్గించడానికి అందించాల్సిన సహాయ సహకారాల్ని, ప్రయత్నాలను కరోనా మూలంగా ప్రభుత్వాలు గత కొంతకాలంగా వెనక్కు నెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని కోట్ల జనాభాను కొత్తగా పేదరికంలోకి నెట్టేశాయి. ఇలాంటి విపత్కర వేళ కరోనాను అదుపులోకి తెస్తేనే, ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణకు అవకాశం మెరుగుపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికి టీకాలు వేస్తేనే కొవిడ్ మహమ్మారిని కట్టడి చేయగలరు. పేదదేశాలతో పోలిస్తే, ధనిక దేశాలలో టీకా కార్యక్రమం పాతికరేట్ల వేగంతో సాగుతుంది. ఇలా వ్యాక్సిన్ కొనుగోలు, పంపిణీ అసమానతలు అమానవీయ పద్ధతి, ఆత్మహత్య సదృశ్యమని గమనించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ''ప్రతి ఒక్కరు సురక్షితం కానిదే ఏ ఒక్కరి భద్రతకు భరోసా లేదనేది'' విస్మరించరాదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం నుంచి బయటపడేలా సంఘటిత, శాస్త్రీయ విధానాలతో ఈ భూమండలంలోనే కరోనా లేకుండా నిర్మూలించాల్సిన ఆవశ్యకతను గ్రహించాలి. ఈ సంక్లిష్ట సమయంలో అసమానతలను వీడి కరోనా రహిత వ్యవస్థల్ని సమాజాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగాల్సి ఉంది.
మనదేశంలో కరోనా సంక్షోభం ప్రజల ప్రాణాలతో పాటు వారి జీవనోపాధుల్ని తుడిచిపెట్టింది. ఇలా కరోనా కోరల్లో రెక్కాడితే గాని డొక్కాడని అసంఘటిత కార్మికుల్లో ఉపాధి కోల్పోయిన 45కోట్లమంది బడుగులు, తాడిత, పీడిత జీవులు కటిక దారిద్ర(పేదరిక)ంలోకి జారిపోయి అలమటిస్తున్నారు. వీరిలో కరోనా మరణాలకన్నా ఆకలిచావులు ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం 80కోట్ల మందికి ఆహార ధాన్యాలు సరఫరా చేయబూనుకుంది. కానీ దీనికి జనగణలో లెక్కల్లో లేకపోవడం వలన, వేలిముద్రలు చెరిగిపోయి, బయోమెట్రిక్ యంత్రాలు గుర్తించని మూలంగా ఎందరో ఆహార ధాన్యాలు పొందలేక పోతున్నారు. అలాగే వలస కూలీల అగచాట్లు, వెతల్ని సొంత ఊళ్లకు వెళ్లవలసిన వాళ్లకు సొంత ఊళ్లో ఉన్న వలస కూలీలు పనులు దొరకక అగచాట్లు పడుచున్నారు. పాలకులు గత అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యతను మరువరాదు. ఉపాధి కోల్పోయి ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోయిన అసంఖ్యాక పేద, మధ్య తరగతి ప్రజలకు పక్కాగా ఆహార ధాన్యాల సరఫరాలో అవస్థలు వెరిసి, ఆకలి మంటలను చూస్తుంటే మనిషనే వారినెవ్వరినైనా కదిలించక మానదు.. ఇలా రిక్షా కార్మికులు, చిరువ్యాపారులు, అసంఘటిత రంగశ్రామికులు ఎందరో ఆకలితో మాడిపోతూ, దుర్భర, దయనీయ స్థితి అంతకంతకూ పెరిగిపోతున్న మానవ మహావిషాదాన్ని చూస్తున్నాము.
మనదేశంలో ఆహార దిగుబడులు ఏటికేడు ఘనంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆకలి బాధ సూచిలో 107 దేశాలలో మనదేశం 94వ స్థానంలో నిలిచింది. మరోప్రక్క కరోనా మహమ్మారి రెండో దఫా ఉపాధి అవకాశాల్ని తెగ్గోసేయడంలో వలస కూలీలతో పాటు, నిరుపేదల జీవన హక్కు నేడు పెను ప్రమాదంలో పడింది. ఇలా కోట్లమందికి ఇప్పుడు తిండిలేదు. పనిలేనందువలన తరుచూ పస్తులుండాల్సి వస్తుంది. దయనీయంగా మీడియా ముందు వాళ్ల బాధలను వెల్లబుచ్చుతున్న దృశ్యాలు చూస్తున్నాము. అప్పటికీ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు మానవీయ కోణంలో వారికి ఆహారాన్ని, సరుకులను అందిస్తూ వారి దాతృత్వాన్ని చాటుచున్నారు. కరోనా మహమ్మారి కన్నా పేదరికం పెద్దరోగంగా మారి, మా జీవితాలను, ప్రాణాలను తుడిచి పెడుతుందని విలపిస్తున్నారు. మన ప్రభుత్వాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో కావాల్సిన దానికన్నా మూడు రేట్లు ఎక్కువ ఆహార నిల్వలు గోదాముల్లో మురిగి పోతున్నాయి/ పేరుకుపోతున్నాయి. పేద మధ్య తరగతి అనే భేదం లేకుండా అర్హులైన వారందరికీ ఉచిత రేషన్ ఇవ్వాల్సిన సమయమిది. ఒకవైపు కోవిడ్ మరణాలకు తోడు ఆకలి చావులు జత కలవకుండా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలకు పూనుకోవాలి. పౌరుల జీవన భద్రతకు రాజ్యాంగ స్ఫూర్తితో పాలకులు ముందడుగు వేయాలి.
ప్రభుత్వాలు ఖర్చు చేసేటప్పుడు ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని, ఉపాధి అవకాశాల్ని మెరుగుపరుస్తూ తక్షణ సహాయక చర్యలను చేస్తూ, మధ్య, దీర్ఘ కాలంలో ఆర్థిక వృద్ధితోపాటు, కరోనా నిర్మూలనకు అందివచ్చే అవకాశాలను సద్వినియగం చేసుకోవాల్సి ఉంది. సార్వజనీన ఉచిత టీకాను అందరికి అందించి ఆకలి, పేదరికం లేని ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోవాలి. ఇందుకు పాలకులు, పాలితులు, ఉమ్మడిగా ముందడుగు వేయాల్సి ఉంది. కరోనా మరణ మృదంగం వలన పదే పదే లాక్డౌన్ ప్రకటించడం వలన సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, వలస, దినసరి, కూలీలు, చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయి అష్టకష్టాలపాలౌతున్నారు. వారి బతుకు జీవనానికి గొడ్డలిపెట్టుగా మారింది. ఈ విషాద ఘటనలు పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు వీరి వెతలను కండ్లకు కట్టినట్టు ప్రపంచానికి చూపేవరకు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలు, దాతలు, మానవీయతను చాటినారు. కోర్టుల సూచనలతో... ఉపాధి కోల్పోయి ఆకలితో ఉన్న పేదలను, కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన వారిని గుర్తింపు నమోదు ఆధారంగా తక్షణమే గుర్తించి ఈ కష్టకాలంలో వారికి అండగా నిల్వాలన్న సూచనల అమలుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇది అర్హులైన వారందరికి అందేలా చిత్తశుద్ధి చాటాలి. కరోనా, పాలకులు ఆర్థిక అసమానతల అఘాధాన్ని పెంచేస్తున్నాయి. ఇలాంటి వేళ కూడా ఉన్నోని ధనం గుట్టలుగా పేరుకుపోతుంది. పేదోడి పేగు మాడుతుంది. సమసమాజ నిర్మాణానికి మరో ఉధ్యమం తప్పదేమో...
- మేకిరి దామోదర్
సెల్:9573666650