Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా తగ్గుతున్నవేళ ప్రపంచ దేశాల ప్రధానులంతా కలుద్దామని కూడ బలుక్కున్నారు. ప్రధానులు లేనిచోట అధ్యక్షులు రావచ్చు. ప్రపంచమంతా రకరకాల వ్యాపారాలు ఎలా చేయాలి, వ్యాక్సిన్ వ్యాపారం ఇంకా బాగా ఎలా చేయొచ్చు, అమెరికా, జపాన్ లాంటి దేశాలు భూమండలం దాటి తమ టూరిజంను అంతరిక్షంలోకి, చంద్రమండలం మీదికి, గురుగ్రహం పైకి విస్తరింపజేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నాయి అన్న వాటి గురించి తెలుసుకోవాలనుంది అందరికీ. వాళ్ళు తమ పనులు తాము చేసుకుంటుంటే చారు అమ్ముతామని అక్కడ మనమో స్టాల్ పెట్టుకోవడం ఎలా అని కొందరు, తమకూ ఇంత భాగస్వామ్యం ఇస్తారేమో అని కొందరు ఇలా రకరకాల ఆలోచనలతో, కోర్కెలతో ప్రధానులు, అధ్యక్షులు అక్కడికి చేరుకున్నారు. కొందరేమో కరోనా భయం వల్ల, ఇంకొందరేమో తమ గడ్డం ఇంకా సరిగా పెరగలేదన్న కారణాన డైరెక్టుగా పోక, పోలేక ఆన్ లైన్లో పాల్గొన్నారు.
ప్రపంచ పోలీసులాంటి ఒక దేశాధినేత అభివధ్ధిలో ముందుకు దూసుకుపోతున్న ఇంకో దేశంపై ఆంక్షలు విధించాలని చెబితే కొందరు ఒప్పుకోలేదు. గోడమీది పిల్లులలాంటి నాయకులు కొందరు ఎప్పటిలాగే తమ నస బయటపెట్టుకొని ఎటూ కాకుండా బయటపడ్డారు. ఒక రాష్ట్రం తరువాత ఒక దేశాధినేత ఐన ఒక పెద్దాయన కన్ను ప్రపంచం మీద పడింది. ఎలాగైనా ప్రపంచానికంతటికీ నాయకత్వం వహిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనొచ్చింది ఆయనకు. పక్కనున్న మిత్రులను అడిగాడు. ఇంకేముంది, నీవు దేశమొదిలేస్తే మాకు ఛాన్సు ఎక్కువవుతుంది కదా అనుకున్నారేమో ఇప్పుడు ప్రపంచానికి నీ అవసరం ఉందన్నారు.
''నా పెపంచ పెజలారా, సారీ నా ప్రపంచ ప్రధానులు, అధ్యక్షులారా మేరా ప్రణాం. ఆజ్ మెరే మన్ కీ బాత్ బతానా చాహతాహూ''
కొందరు నాయకులు తమను కోతి అంటున్నాడా, లేదా కోతినుండి మానవుడు, తరువాత ఈ ప్రధానులూ పుట్టాడంటున్నాడా అని అనుమానం వ్యక్తం చేస్తే వెంటనే వారి వారి దుబాసీలు సర్ది చెప్పారు.
''మనకంతా కలిపి ఒకటే ప్రపంచం ఉంది. మనమంతా మానవులం. ఒకే జాతి జనులం. అదే మానవ జాతి. నన్ను కొందరు మొసలి అన్నారు. అంటే మానవులు కోతినుండి ఉద్భవిస్తే ప్రధానులు మొసళ్ళనుండి ఉద్భవిస్తారా!! మీరే చెప్పండి'' అని కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు. దుబాసీలు వాళ్ళ వాళ్ళ నాయకులకు చెప్పారు ఎందుకు కన్నీళ్ళొస్తున్నాయో!!
''మనకున్నది ఒకటే కరోనా. మరి వ్యాక్సిన్లు ఎన్ని? అందుకే ఆ ఒకేవొక్క కరోనాకు ఒకే ఒక్క వ్యాక్సిన్ ఉండాలి. మనం ఎన్నికలంటూ ఒక్కో దేశంలో ఎంతెంతో ఖర్చు పెడుతున్నాం. మనకు నిధులిస్తున్న మన మిత్రులకు ప్రజల సొమ్మంతా దోచిపెడుతున్నామని మన మీద అభాండాలు'' మళ్ళీ కన్నీళ్ళు, మళ్ళీ దుబాసీలు మొసలి కన్నీళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ నాయకులకు చెప్పారు.
''అందుకే అందుకే.......''
''చెప్పండి, ఆపొద్దు మంచి ఫ్లోలో ఉన్నారు!!''
''మీకో విషయం చెప్పాలి''
''చెప్పండి''
''మీరేం అనుకోవద్దు మళ్ళ''
''అనుకోము''
''మీరనుకుంటారబ్బ''
''పర్లేదు చెప్పండి''
''మీకో విషయం చెప్పాలంటున్నా, ఏమీ అనుకోద్దంటున్నా నా మనసులో ఏముందో మీకర్థమైతలేదా''
''మీరు ఇన్ని సార్లు తడబడుతున్నా, చెప్పండి, ఏమీ అనుకోమంటున్నా , మా మనసులో ఏముందో మీకర్థమైతలేదా''
''ఏముంది''
''ప్రపంచానికి మొత్తంగా ఒకే ప్రధాని ఉండాలి''
''అదెలా సాధ్యం? ఐనా ఆ పని మనకంతా అప్పులిచ్చే, ఆయుధాలిచ్చే పెద్ద దేశం చేస్తోందిగా? ''
''ఇండైరెక్టుగా చేయడం కాదు, డైరెక్టుగా ఒక మాంచి గడ్డమున్న డైనమిక్ మనిషిని అందుకు ఎంపిక చేద్దాం మనం'' అని గడ్డం నిమురుకుంటాడు సుతారంగా నేనే దానికి తగినోణ్ణి అన్నట్టు.
''ఓర్నీ ఆశ సల్లంగుండా..! మస్తు ప్లానుతో ప్రిపేరై వచ్చినట్టున్నావే!! ఇప్పుడే ఓటింగ్ పెడదాం గడ్డం ఉన్నవాడా, లేనివాడా!! గడ్డం లేనివాడే ప్రపంచ ప్రధానిగా ఉండాలి అని సమర్ధించేవాళ్ళు చేతులెత్తండి. వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు తమ స్క్రీనులోనే చేతులెత్తండి. ఆ.... ఆ... లేనివాళ్ళకే ఎక్కువమంది చేతులెత్తారు కాబట్టి గడ్డం ఉన్నవారికోసం మళ్ళీ చేతులెత్తే అవసరమే లేదు. అందుకే...'' ఇంకా చెప్పుకుపోతున్నాడో ప్రతినిధి.
ఒక ఆన్ లైన్ కాల్ అర్ధాంతరంగా కట్ ఐంది. ''అరే కోన్ భారు ఉధర్ , నాకు గడ్డం పెంచమని సలహా ఇచ్చిందెవరు'' అని తనకొచ్చిన అన్ని భాషల్లో అరుస్తున్నాడు గడ్డం వాలా!!
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298