Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక క్రూరుడికి మాత్రమే విజ్ఞప్తి చేసుకునే స్థితిలో ప్రజలు ఉంటే, వారి ముందు రెండే మార్గాలు మిగులుతాయి. ఒకటి తిరగబడటం, రెండవది ఆ క్రౌర్యానికి మౌనంగా బలైపోవడం'' అన్నాడు ఎంగెల్స్.
ప్రస్తుతం మనం, భారత దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే, దేశంలో వినాశకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైద్య సదుపాయం అందనందువల్ల ఒక ప్రాణం పోయిందని వైద్య సిబ్బందిపై ఒక పౌరుడు దాడి చేసినా, మరొక పౌరుడు పేవ్ మెంటుపై ఆక్సిజన్ సిలిండరుతో శ్వాసించడానికి ఇబ్బంది పడుతున్నా, అది అనేక సంక్షోభాలకు చిహ్నంగా భావించాల్సి ఉంటుంది.
వ్యవస్థ పతనం కంటే, ప్రభుత్వ వైఫల్యం కంటే ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ప్రభుత్వ మద్దతు దారులు, భారతదేశం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈ సంక్షోభానికి ప్రభుత్వానిది బాధ్యత కాదని వాదించడం. ఇది నిస్సందేహంగా నిరసించదగినది. ఇలాంటి సమర్థనల ఫలితంగా భారత ప్రజాస్వామ్యం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటుంది.
ఎంగెల్స్ చెప్పినట్లు, బ్రిటిష్ ప్రభుత్వం, శ్రామికుల పని పద్ధతుల్లో, వారి జీవనంలో భయంకరమైన పరిస్థితులను సృష్టించింది. జీవించడానికి అవసరమైన అవకాశాలు, ఉపాధిలేక అనారోగ్యానికి గురవడమేకాక, అకాల మరణం చెందారు. ఎంగెల్స్ దీనిని సామాజిక హత్యగా పేర్కొన్నాడు. ఇది ఒక వ్యక్తి చేసిన హత్య లాంటిదే.ఈ రెండింటికీ తేడా ఏమంటే, ఈ హత్య కనబడని రూపంలో ఉండి, ఎవరూ హంతకుడిని చూడలేరు.ఈ మరణం సహజ మరణంగానే కనబడుతుంది.
మనం మనచుట్టూ గమనిస్తున్న సామాజిక హత్యలకు, ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడంలో మన అసమర్థత కనబడుతుంది. 1840లలోని, ఎంగెల్స్ నాటి ఇంగ్లాండుకు, ఈనాటికీ ఒకే ఒక్క తేడా ఏమంటే, ఆనాడు శ్రామిక వర్గమే, మహమ్మారి వల్ల సర్వనాశనమయింది. నేడు భారత దేశంలో మహమ్మారి కేవలం పేద వర్గాలను మాత్రమే వేటాడడంలేదు కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఇకపై కనిపించదు.
భారత దేశంలోని మహమ్మారి మొదటి దశలో లక్షలమంది అంతర్ రాష్ట్ర వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచిన విషాదభరితమైన దయనీయస్థితి ఎవరికీ కనబడలేదు. అదీ ఒక సామాజిక హత్యే. ఆనాడు దానిని సరియైనదని సమర్థించిన వారి వాదన ఏమంటే, అది కేవలం కార్మికులు స్వచ్ఛందంగా, ఆ ప్రయాణాన్ని కొనసాగించారు కాబట్టి, అది వారి బాధ్యతే అని వారి వాదన. సెకండ్ వేవ్‌కు కారకులు ప్రజలే అయినట్టు, కాబట్టి దీనికి బాధ్యత వారిదే అయినట్టు వాదిస్తున్నారు. అయినా, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఫిబ్రవరిలో కోవిడ్- 19ను విజయవంతంగా జయించామని బీజేపీ ఒక అధికారిక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానంలో ప్రజలకు కాకుండా, నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆ గొప్పదనాన్ని ఆపాదించింది.
సాధారణ ప్రజలకు, మహమ్మారి విషయంలో నిపుణుల సలహాలు తీసుకునే అవకాశం లేనప్పుడు, తమ పొరపాట్లకు తామే బాధ్యత వహించాలని ప్రభుత్వ పెద్దలు చెపుతున్నారు. బలమైన నటనా శక్తిగల ఎలక్షన్ కమిషన్, బెంగాల్లో 8 దశల ఎన్నికలు నిర్వహించడం, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కుంభమేళాను సమర్థించడం, రెండు లక్షల మంది భారతీయులు వైరసుకు గురైన సమయంలో, భారత ప్రధాని పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారీ ర్యాలీని చూసి ఉత్తేజపడడం లాంటి ప్రభుత్వ చర్యలు క్షమించరానివి.
ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించకపోవడం సామాజిక హత్యలను ప్రోత్సహించడమే. హిందువులకు పవిత్రమైనది కాబట్టి, దహనాలను మీడియా చూపించకూడదనడం సామాజిక హత్యలలో భాగమే. దానికి భిన్నంగా, స్పష్టమైన, అవాస్తవమైన మోసకారితనమేమంటే, హిందువుల అంత్యక్రియలను టెలివిజన్‌లో చూపించడంగాని, రికార్డు చేయటం కానీ చేయరాదనే నిబంధన విధించడం. కనీసం ఆక్సిజన్ అందించడం వల్ల ఎంత మంది ప్రాణాలను కాపాడ కలిగి ఉండేవాళ్ళం అనేది ఈ నేపథ్యంలో ఎదురయ్యే ప్రశ్న. ప్రజలు తమకు ప్రీతిపాత్రులైన వారిని వాహనాలు నిలిపే స్థలంలో, పేవ్ మెంట్స్‌పై గత్యంతరంలేక దహనం చేస్తున్నారు. ఈ కథనాలను, వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయడం, అకారణ, అకాల మరణాల కంటే అవమానకరమైనదా అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.
గత ఏడు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం విభిన్న ధోరణులతో పరిపాలన చేస్తున్నది. సామాజిక శాస్త్రవేత్త మాక్స్ వెబర్ దీనిని పితస్వామ్య సంబంధమైన విషయంగా చెప్తారు. దీని ప్రకారం, పాలకుడు సాంప్రదాయకమైన అధికారాన్ని చలాయిస్తాడు. పరిపాలన మత వ్యవస్థకు, పవిత్రమైన ధర్మాలకు అనుగుణమైన అనైతిక సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. హేతుబద్ధమైన, చట్టబద్ధమైన ఉద్యోగ స్వామ్యానికి విరుద్ధంగా నడుస్తుంది. మెజారిటీ మత ప్రాతిపదికన, జాతీయవాదం పై, చట్టబద్ధమైన ఎన్నికల విజయాలపై ఆధారపడి ఉంటుంది. ప్రజల బాధ్యత, దేశభక్తి మొదలైనవి కీలకమైన పదాలుగా మారుతాయి.
హాస్యాస్పదమైన విషయం ఏమంటే, ఈ పితృస్వామిక ప్రభుత్వం, తనని తాను పేద వారికి అనుకూలమైన, ఆపదలోఉన్న వారిని ఆదుకునే ప్రభుత్వంగా గర్వంగా చెప్పుకుంటుంది. ఉపకారం ద్వారా, దయతో, ధర్మగుణంతో సమస్యలను పరిష్కరించే ప్రభుత్వంగా చెప్పుకుంటుంది. కానీ, రాత్రికి రాత్రే ఎవరి సహాయం లేకుండా ఆక్సిజన్ సిలిండరును సమకూర్చుకోవాలని, అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరింది. దీని ఫలితంగా, అత్యంత శక్తివంతులు మాత్రమే, మనుగడ సాగించగలరనే సోషల్ డార్వినిజం వైపు దారి తీసింది.
కేంద్ర ఆరోగ్య మంత్రి ఏనాడూ, ఎలాంటి ఆక్సిజన్ కొరత లేదని వాదిస్తాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ఎవరైనా ఆక్సిజన్‌ను కోరినట్లయితే వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. ఇక హర్యానా ముఖ్యమంత్రయితే, చనిపోయిన వారు తిరిగిరారు కాబట్టి, లెక్కకురాని మరణాల గురించి చర్చించడం అర్థరహితమని అంటాడు. అందరి అభిప్రాయాల సారాంశమేమంటే, ఈ నోవెల్ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో వారి ఆలోచనల యొక్క దయాగుణాన్ని, ధర్మగుణాన్ని తెలియ జేస్తుంది.
పండితులు గుర్తించిన ప్రకారం, ఒక విధంగా పితృస్వామికంలో, మౌలికమైన సమస్య ఏమంటే జవాబుదారీతనానికి హామీ లేకపోవడం. మహమ్మారి సమయంలో ఒక విధంగా పితృస్వామిక ప్రభుత్వం కనుమరుగవుతుందనిపిస్తుంది. మరోవైపు ప్రధానమంత్రి ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేయకపోవడం, పరిపాలనను కేంద్రీకతం చేయటం, క్యాబినెట్ మంత్రులతో సమావేశం కావడం, వారు ఏకీభావంతో కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. దీనితోపాటు, ప్రపంచం, ఆశ్చర్యపోయే వాస్తవ విషయం ఏమంటే, ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రి అయివుండి కోవిడ్-19 కు సంబంధించి ఒక్క విలేకరుల సమావేశం కూడా నిర్వహించకపోవడం.
ఈ మధ్య కాలంలో, స్వీడిష్ ప్రధానమంత్రి కోవిడ్-19నిర్వహణ, దిద్దుబాటుకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ... ''భారత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు సున్నితమైన సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంలేదు'' అని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతానికి, అలహాబాద్ హైకోర్టు చేసిన అర్థవంతమైన లోతైన పరిశీలన ద్వారా ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోవడం మనేది మారణహౌమం కంటే తక్కువ కాదని చేసిన వ్యాఖ్యలతో సంతప్తి పడవలసి ఉంటుంది.
ఎంగెల్స్ వాదన ఏమిటంటే బ్రిటిష్ పాలక వర్గం, వర్గ పక్షపాతం, ముందస్తు ఆలోచనలతో, మతిలేని అంధత్వంతో కట్టివేయబడింది . ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న సామాజిక హత్యలపై, వాటి ప్రభావలపై ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించడంలేదు. మహమ్మారి నేపథ్యంలో భారతదేశం భిన్నమైన వివక్షతను చవిచూస్తున్నది. ముందే నిర్ణయించుకున్న అభిప్రాయాలు, లేక మూర్ఖపు ఆలోచనలు సామాజిక హత్యల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. ప్రజలు, పితృస్వామిక పాలనలో బానిసలుగా కాక పౌరులుగా మారనట్లయితే, మహమ్మారి వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితులతో భారత ప్రజాస్వామ్యానికి చీకటి భవిష్యత్తు దాపురించే సూచనలు కనబడుతున్నాయి.
ద హిందూ సౌజన్యంతో
అనువాదం: మల్లెంపాటి వీరభద్రరావు
- నిస్సిమ్ మన్నాతుక్కరిన్
సెల్:9490300111