Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మార్చటం గురించి గత నెల రోజులుగా అటు ఆరెస్సెస్-బీజేపీ మధ్య జరిగిన మంతనాలు, ఇటు పత్రికల్లో వస్తున్న విశ్లేషణలకు తాత్కాలిక విరామం దొరికింది. మోడీ-షా ద్వయానికీ యోగి బృందానికి మధ్య నెలరోజులుగా సాగిన యుద్ధ మొహరింపులను ఉభయపక్షాలు విరమించుకున్నారు. ఇందుకు దారితీసిన పరిణామాలు వాటి నేపథ్యం బీజేపీలో 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల గురించి పెరుగుతున్న ఆందోలనను తెరమీదకు తెచ్చాయి. క్లుప్తంగా పరిణామాల వరుసక్రమాన్ని పరిశీలిద్దాం.
మోడీ-షా అనుయాయుడు మాజీ ఐఎఎస్ అధికారి ఎకె శర్మను హడావుడిగా ఉత్తరప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా నియమించారు. అతనికి యోగి మంత్రిమండలిలో స్థానం కల్పించటం, ద్వారా యోగి ప్రభుత్వంపై కేంద్రం అజమాయిషీ పెంచాలన్నది అధిష్టానం ఆలోచనగా ఉంది. ఈ ప్రతిపాదనను యోగి తిరస్కరించాడు. కోవిడ్ రెండో ఉప్పెన నియంత్రణలో యోగి ప్రభుత్వం ఘోరంగా విఫలం కావటం ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు గురికావటం, ఈ కాలంలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాని ప్రాతినిధ్యం వహించే వారణాసితో సహా బీజేపీకి పరాభవం ఎదురవడం జరిగింది. దీంతో యోగి స్థానంలో మరో ముఖ్యమంత్రిని నియమించాలన్న వాదన యోగి వ్యతిరేకవర్గం ముందుకు తెచ్చింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారటంతో యోగి వైఫల్యాల వలన వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే శాసనసభ ఎన్నికల ఫలితాల గురించిన ఆందోళనతో మాత్రమే ఈ వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి తప్ప యోగి పరిపాలన వైఫల్యాన్ని సమస్యగా గుర్తించినందున కాదు. గత నెలలో మోడీ ప్రభుత్వానికి రెండు ఇటువంటి సందర్భాలు ఎదురయ్యాయి. మొదటిది యోగి నుంచి ప్రతిఘటన కాగా రెండోది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత నుంచి ఎదురైన ప్రతిఘటన. ఈ రెండు సందర్భాల్లో బీజేపీ అధిష్టానం, ప్రత్యేకించి మోడీ-షా ద్వయం అనుసరించిన ద్వంద్వ ప్రమాణాలు కూడా మన కండ్లముందున్నాయి.
చివరకు తెరవెనక ట్రాక్-2 దౌత్యం నడిపిన తర్వాత యోగి ఢిల్లీ వచ్చి అమిత్‌షా, మోడీ, జేపీ నడ్డాలను ముఖా ముఖీ కలిసి వెళ్లారు. గతవారం జరిగిన ఈ మూడు సమావేశాల్లోనూ యోగి ఒక్కడే పాల్గొన్నాడు. రాష్ట్రం పార్టీ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ మరో ప్రతినిధి ఈ సమావేశాల్లో లేకపోవటం గమనించాల్సిన విషయం. ఈ సమావేశాల్లో చర్చనీయాంశాల గురించి ఎవరి వ్యాఖ్యానాలు వారికున్నాయి. స్థూలంగా యోగిని ముఖ్యమంత్రి పదవి నుండి మార్చే అవకాశాలు ఇప్పట్లో లేవన్నది మాత్రం వాస్తవం. అంతమాత్రాన బీజేపీ అధిష్టానం మీద యోగి విజయం సాధించాడని భావించటానికి వీల్లేదు. ఉభయపక్షాలు కొంత మెత్తబడ్డాయన్నది వాస్తవం.
కోవిడ్ నియంత్రణలో వైఫ్యలమే ముఖ్యమంత్రిని మార్చటానికి ప్రాతిపదిక అయితే సుప్రీంకోర్టు చివాట్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం చర్చకు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాక మధ్యప్రదేశ్, కర్నాటక, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు కూడా దారుణంగా విఫలమయ్యారన్న మరో చర్చ కూడా ముందుకొచ్చే ప్రమాదం ఉంది. దాంతో ఈ వాదనను బీజేపీ అధిష్టానం చాపకిందకు నెట్టేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యోగిని కదిలిస్తే దాని ప్రభావం మొత్తం బీజేపీ ఎన్నికల మంత్రాంగంపై పడే ప్రమాదం ఉండటం కూడా ఇందులో భాగమే. బీజేపీ అధికారంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ పరివార్ మార్క్ రాజకీయాలకు కీలకమైన రంగస్థలం. మిగిలిన రాష్ట్రాల్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాలు పరివార్ మార్క్ రాజకీయాలకు ప్రయోగశాలగా మారలేకపోయాయి. స్వయంగా ఓ బీజేపీ నేత చెప్పినట్లు ఆయా రాష్ట్రాల్లో అక్షరాస్యత, అంతో ఇంతో అందివస్తున్న అభివృద్ధి అవకాశాలు అందుకు కారణం. గతంలో ఇటువంటి ప్రయోగశాలగా గుజరాత్ ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లో పరిపాలన వైఫల్యం ప్రధాన ఎజెండాగా మారితే తమ పరివార్ మార్క్ రాజకీయాలు వెనకపట్టు పట్టే ప్రమాదం ఉంది. దీంతో మరికొన్ని సంవత్సరాల్లో ఆరెస్సెస్ శతజయంతి సందర్భంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించటం కష్టంగా మారుతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో హిందూత్వ మార్క్ రాజకీయాల వేడి రాజేస్తే తప్ప 2024 నాటికి ఆ అగ్గి దావానలంగా మారే అవకాశం లేదు. ఈ కారణంగానే ఢిల్లీ-లక్నోల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలతను తగ్గించటానికి ఆరెస్సెస్ రంగంలోకి దిగింది. పత్రికలన్నీ ఆరెస్సెస్ ప్రతినిధుల ముఖం మీద యోగి తలుపేశాడని రాసినా ఆచరణలో వాస్తవం దానికి భిన్నంగా ఉంది. యోగి ఆరెస్సెస్ శరణువేడుకోవటంలోనే మొత్తం పరిణామాల దశ దిశ మారింది. ఈ మొత్తం వివాదంలో ఆరెస్సెస్ పాత్రను అర్థం చేసుకోవాలంటే మనం కొంత సమకాలీన చరిత్రను గుర్తు చేసుకోవాలి. బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఈ తరహాలో ఘోరంగా విఫలం చెందటం, మృత్యు బేహారులుగా మారటం ఇదే మొదటిసారి కాదు. 2002లో గుజరాత్ నరమేధం నమూనా ఉండనే ఉంది. వాజ్‌పేయి హయాంలో గుజరాత్ నరమేధం ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని అప్రతిష్టపాల్చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ నరమేధం దేశ రాజకీయ వ్యవస్థను ఒక్క కుదుపు కుదిపింది. నరమేధానికి ముందే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీకి ఇండియా టుడే పత్రిక దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా కితాబు కూడా ఇచ్చింది. కానీ నరమేధం పట్ల దేశంలో ఎదురైన ప్రతిఘటనతో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం మోడీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అప్పుడు కూడా అద్వానీ వాజ్‌పేయి ప్రతిపాదనను తిరస్కరించాడని, వాజ్‌పేయి ప్రతిపాదనకు ఆరెస్సెస్ అధిష్టానం ఆమోదం ఇవ్వలేదని అప్పట్లో విశ్లేషకులు రాశారు. నాటి పరిణామాల్లో కీలక పాత్ర పోషించిన మదన్ దాస్ దేవి వెల్లడించిన వివరాలు ఇక్కడ ప్రస్తావించటం ఉపయోగకరంగా ఉంటుంది.
నాటి పరిణామాల్లో ఆరెస్సెస్ మోడీ పక్షాన నిలవకపోతే ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేయాల్సివచ్చేదని న్యూస్ నెట్వ్ర్క్ 18కు ఇచ్చిన ఓ ఇంటర్వూలో మదన్ దాస్ దేవి తెలిపారు. దానికి కారణం ఆయన మాటల్లోనే గుజరాత్లో బీజేపీలో ఉన్న ముఠా కుమ్ములాటల నేపథ్యంలో అప్పట్లో పార్టీ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న మోడీని గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపాల్సి వచ్చింది. ఆ విధంగా రాష్ట్రంలో అధిష్టానం కోరిక మేరకు రంగ ప్రవేశం చేసిన మోడీ తర్వాతి కాలంలో రాష్ట్రంలో తనతో విబేధించేవారినందరినీ తొలగించుకుంటూ నేడున్న స్థానానికి వచ్చాడు. మోడీ తరహాలోనే యోగి కూడా 2017 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల వరకూ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కరుడుకట్టిన హిందూత్వ ఎజెండాను ముందుకు తేవటంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో మోడీ లాగే నేడు యోగి కూడా ఆరెస్సెస్ జోక్యంతోనే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రిగా రంగం మీదకు వచ్చాడు. మోడీ తరహాలోనే రాష్ట్రంలో తనకంటూ అసమ్మతి లేకుండా చేసుకునే ప్రయత్నంలో నిమగమయ్యాడు. ఈ క్రమంలో పరిపాలన బొందలగడ్డపాలైంది. అయితే నాడు వాజ్‌పేయి తరహాలో కనీసం రాజధర్మం గురించి యోగిని హెచ్చరించే స్థాయి కలిగిన నాయకులెవరూ బీజేపీలో మిగల్లేదు.
ఈ పోలిక గమనించినప్పుడు ఓ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. 2002లో గుజరాత్‌ను హిందూత్వ ప్రయోగశాలగా మార్చే క్రమంలోనే నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ మోడీకి అండగా నిలిచింది. నేడు కూడా ఉత్తరప్రదేశ్‌ను రెండో దశ పరివార్ ప్రయోగశాలగా మార్చే క్రమంలో కీలక పాత్ర పోషిస్తున్నందునే నేటి కేంద్ర ప్రభుత్వ ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ యోగికి అండగా నిలిచింది. నాడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపటానికి కనీసం వాజ్‌పేయి రాజధర్మం గురించి హెచ్చరించాల్సి వచ్చింది. ఈ సారి ఆ మాత్రం విభీషణ హెచ్చరికలు కూడా చేసే నాధుడు లేకపోయాడు. దేశ రాజకీయాలు ఈ స్థితికి రావటానికి బీజేపీ, సంఫ్‌ుపరివారం ప్రత్యేకించి మోడీ అనుసరించిన ఎత్తుగడలు, వ్యూహాలే కారణం. తన అడుగుజాడల్లోనే యోగి ఆదిత్యనాథ్ నడుస్తూండటంతో యోగి సాగిస్తున్న ఆగడాల గురించి మోడీ పల్లెత్తి మాట్లాడలేకపోతున్నారు. సంఘపరివారం మార్గదర్శకత్వంలో యోగి అమలు చేస్తున్న హిందూత్వ రాజకీయాలు నాడు వాజ్‌పేయిని వాడుకుని వదిలేసినట్లు నేడు మోడినీ వాడుకుని వదిలేయవన్న గ్యారంటీ ఏమీలేదు. అందువల్లే నేటి ఉత్తరప్రదేశ్ పరిణామాలు నాటి గుుజరాత్ పరిణామాలను మోడీకి నిలువెత్తు అద్దంలో నిలబెట్టి చూపిస్తున్నాయి.
- కొండూరి వీరయ్య
సెల్: 8971794037