Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ పెట్రో ధరల పెరుగుదలకు అంతే లేకుండా పోయింది. రోజువారీ ధరల సమీక్ష విధానాన్ని అమలు చేస్తూ ప్రజల జేబులను గుల్ల చేస్తున్నది. సెలవు రోజన్నది కూడా మరిచి (ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రోజుల్లో తప్ప) ప్రతిరోజూ బాదుడు తప్ప మరో ధ్యాస లేదన్నట్టుగా సాగుతున్నది. అడ్డూ అదుపూ లేకుండా పెట్రోల్ ధరలు దూసుకెళ్తున్నాయి. ఈ ధరలతో సామాన్యుడికి భవిష్యత్తులో బండి బయటకు తీయడం సాధ్యమేనా అన్న భయాన్ని కేంద్రం సృష్టించింది.
కరోనా మహమ్మారి సమయంలో ఇంతటి మహా విపత్తు ఉన్నప్పుడు కొంత అయినా ప్రజల పట్ల సానుభూతి చూపాల్సిన అవసరం ఉంది. కరోనాతో మెజార్టీ ప్రజలు చెల్లాచెదురయ్యారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థంగాక ఆందోళనచెందుతున్నారు. నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. రేపు ఏమవుతుందో అర్థం గాక బిక్కుబిక్కుముంటున్నారు. అయినా మోడీ ప్రభుత్వం కనికరం చూపడం లేదు. ఆరువారాల్లో 24 సార్లు పెట్రోల్ రేట్లు పెంచారంటే.. ఎంత భారం మోపారన్నది అర్థం చేసుకోవచ్చు. ఒక్క దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేట్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 96.41, డీజిల్ 87.28లకు చేరుకుంది. మిగతా రాష్ట్రాల్లో ధరల్లో తేడాలున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలతో పాటు లడక్ వంటి కేంద్ర పాలిత రాష్ట్రాల్లో వంద రూపాయలు దాటింది. కరోనా బారి నుంచి రక్షించడానికి టీకా ఇస్తున్నామని తియ్యటి మాటలు చెబుతూ మరోవైపు ప్రజల నడ్డివిరిచేలా రేట్లు పెంచుకుంటూ పోవడం నీచాతినీచం. నొప్పి తెలియకుండా కత్తి గుచ్చుతూ చివరికి పెట్రోల్ లీటర్కు వంద రూపాయలు చేసిందంటేనే మోడీ ప్రభుత్వం ఎవరికి కొమ్ముకాస్తుందన్నది స్పష్టం. గతేడాదే వంద రూపాయలు దాటాల్సి ఉన్నా.. ఎన్నికల కారణంగా మధ్యమధ్యలో కొద్దిరోజులు నిలుపుదల చేసింది. తర్వాత రేట్లు తగ్గించినట్టు చేసినా ఆ మురెపం ఎన్నోరోజులు లేదు. భవిష్యత్తులో ఈ థరలు పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు కనుచూపుమేరలో లేవన్నది సృష్టం. ఇదంతా కాషాయ ప్రభుత్వ పుణ్యమే. దీనికి మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణం. ఈ ధరలు పెరగడానికి చమురు సంస్థలే కారణమన్నట్టుగా కేంద్రప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునేందుకు పాత మాటలే వల్లించడమంటే.. వాటికి అడ్డుకట్ట వేసే మార్గం ప్రభుత్వం వద్ద లేదానుకోవాలా? ఆ సంస్థలు చెప్పినట్టు.. వాటి యాజమాన్యాలు చెప్పినట్టు మోడీ ప్రభుత్వం నడుస్తుందని అనుకోవాలా? ఇలాంటి సమయాల్లో ప్రజలు ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు అన్ని మార్గాలను ప్రభుత్వం ఆలోచించాలి. పన్నులు, ధరల రూపంలో బాదడం గాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలి.
పెట్రో ధరల విషయంలో బీజేపీ ప్రభుత్వం అధికారిక దోపిడీకి పాల్పడుతున్నది. 2014 ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన 'అచ్ఛేదిన్' ఇప్పుడు కనుచూపు మేరలో లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయంటూ కేంద్రం ధరలు పెంచేసి ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నది. ముడిచమురు ధరలు పెరుగుతుండటమే వల్లే భారం వేయాల్సి వస్తుందంటున్నది కేంద్ర ప్రభుత్వం. ఇది పచ్చి అబద్ధం. అంతర్జాతీయ ముడిచమురు ధరలు గతంలో 120 డాలర్లు ఉన్నప్పుడు లీటర్కు 60 నుంచి 70 రూపాయల లోపే డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయి. ప్రస్తుతం 70 డాలర్లు కూడా దాటని క్రూడాయిల్ ధరలకు పెట్రోల్, డీజిల్ ధరలు 100 దాటడమంటే దోపిడీ గాక మరేమంటారు. 2013 వరకు పెట్రో ఉత్పత్తులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల శాతం కేవలం 44 శాతం మాత్రమే. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 110 శాతం పన్నులను విధిస్తున్నాయి. గతంలో పెట్రోరేట్లు భారీగా పెరిగినప్పుడు ఆనాటి ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తూలనాడిన మోడీ, ఇప్పుడు తన ఏడేండ్ల ఏలుబడిలో లెక్కలేనన్ని సార్లు ధరలు పెరుగుతున్నా వాటిపై నియంత్రణ విధించకుండా చూస్తుండటాన్ని ఏమనాలి? పైగా మున్ముందు మంచిరోజులు వస్తాయని చెప్పడం దొంగనాటకాలు తప్ప మరోటి కాదు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రో రేట్ల వల్ల నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలు చుక్కలంటుతున్నాయి. ఈ ధరలు రైతులతో పాటు అల్పాదాయ, మద్యతరగతి ప్రజలకు సెగలు పుట్టిస్తున్నాయి. పెట్రోల్ రేట్ల కంటే నూనెల ధరలు వంద రూపాయలు ఎప్పుడో దాటేశాయి. పన్నులు తగ్గితే తప్ప పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవు. ముందుగా కేంద్రం అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరుతో భారీగా విధిస్తున్న వడ్డనను తగ్గించాలన్న మేధావులు, నిపుణుల సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.
- వేణు మాధవ్
సెల్: 9490099023