Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొంతకాలంగా దేశానికి ఒక మూల ప్రధానమైన భూభాగం నుండి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో వున్న ఓ అందమైన చిన్న లక్ష్యద్వీప్ గురించి జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరుగుతున్నది. నిజానికి దేశవ్యాపితంగా ఈ చర్చ జనం మధ్యకు ఈ పాటికే వచ్చేయాలి. ఎందుకంటే బీజేపీ రూపంలో పచ్చి మితవాద హిందూత్వ శక్తులు గుజరాత్, కాశ్మీర్ లోయలో మాదిరిగానే తమ మతోన్మాద రాజకీయాలకు ఆ దీవులను అడ్డాగా మారుస్తున్నారు. ఈ దాడి లక్ష్యద్వీప్‌తో ఆగదు. అండమాన్ నికోబార్, డయ్యూ డామన్వంటి ఇతర ద్వీపాలకు కూడా విస్తరించనున్నది. లక్ష్యద్వీప్ కాశ్మీర్లాగా (370 అధికరణం) భారత రాజ్యాంగం ధృవీకరించే లౌకిక, ఫెడరల్, ప్రజాతంత్ర విలువలకు ప్రతిరూపం. వీటిని ఒక్కొక్కటిగా ధ్వంసం చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ అసలు లక్ష్యమైన రాజ్యాంగ విధ్వంసం పూర్తవుతుందని అనేకమంది మేథావులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు గట్టిగా వాదిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యద్వీప్నే ఎందుకు ఎంచుకున్నారు?
సహజంగానే ద్వీపాలు ప్రకృతి అందాలకు నిలయంగా ఉంటాయి. ఈ అందాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అనేక ప్రకృతి రహస్యాలు వీటిలో ఇమిడివుంటాయి. సహజంగానే లాభాపేక్షతో నడిచే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రకృతి అందాలను, మానవాళికి అవసరమైన ప్రకృతిలోని అనేక ప్రక్రియలను కూడా వ్యాపారమయం చేస్తుంది. ఇప్పుడు లక్ష్యద్వీప్‌ను బీజేపీ సర్కార్ లక్ష్యంగా ఎంచుకోవడంలో యిది ఒక కీలక అంశం. అయితే దానిని మించి వారి హిందూత్వ ఎజెండాలో కాశ్మీర్‌లోయ తరువాత ఈ లక్ష్యద్వీప్ సరిగ్గా సరిపోతుంది. ఈ లక్ష్యద్వీప్ అనేది 36 చిన్న చిన్న ద్వీపాల కలయిక. కేవలం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. జనాభా 70 వేల లోపు. ఇది అరేబియా మహా సముద్రంలో కేరళలోని కొచ్చిన్ ఓడరేవుకి దగ్గరలో ఉండే ద్వీపం. తరతరాలుగా కేరళ రాష్ట్రానికి ఈ ద్వీపంతో చారిత్రక, సామాజిక, వ్యాపార పరమైన బలమైన బంధాలు ఏర్పడివున్నాయి. అత్యధికులు మాట్లాడే భాష మళయాళం. ఈ ద్వీపం కేరళ హైకోర్టు పరిధిలో ఉంది. జనాభాలో 96శాతం ముస్లింలు, పైగా వీరందరూ ఎస్టీ కేటగిరీలో ఉన్నారు. ప్రధాన ఆహారం చేపలతో పాటుగా అనాదిగా గొడ్డుమాంసం. అత్యధికమంది వృత్తి చేపల వేట. ఒకే ఒక్క ప్రభుత్వ డైరీ నడుస్తున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ద్వీపానికి అడ్మినిస్ట్రేటర్‌గా మొట్టమొదటసారి ఐఏఎస్ అధికారి కాని 'ప్రపుల్లఖోడా పటేల్'ను 2020 డిశెంబర్లో పంపింది. ఈయన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌం మంత్రిగా పనిచేశాడు. ఈయన తండ్రి గుజరాత్లో ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు. దాద్రా నగర్ హవేలికి ఏడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకోబడ్డ మోహన్ బేల్కర్ తన ఆత్మహత్యానోట్ (సూసైడ్ నోట్)లో తన మరణానికి కారణంగా పేర్కొన్న 15మందిలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న ఈ పటేల్ ఒకరు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ జరుపుతున్నది. డయ్యూ డామన్కి కూడా అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన అడుగుపెట్టింది మొదలు హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చాడు.
ముప్పేట దాడి
సరిగ్గా కాశ్మీర్ ప్రత్యేక హౌదాని రద్దుచేసిన పద్ధతిలోనే లక్ష్యద్వీప్‌లో ఉన్న ప్రజల చారిత్రక, సాంస్కృతిక పునాదులపైనే దాడి ప్రారంభించారు. లక్ష్యద్వీప్ డెవలప్మెంటు అధారిటీ రెగ్యులేషన్ చట్టం 2021, అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం 2021 (గూండా యాక్ట్), జంతు సంరక్షణ చట్టం 2021 వంటివి రూపొందించారు. వీటితో పాటుగా సున్నితమైన పర్యావరణాన్ని నాశనం చేసే గనులు తవ్వటం, ఖనిజాలను భూగర్భంనుంచి తోడేయటం వంటి పనులకు అనుమతులు యివ్వడం ప్రారంభించారు. ఎక్కడా 5కిలోమీటర్ల నిడివి రోడ్డులేని ఈ చిన్న ద్వీపంలో పర్యాటకుల కోసం రోడ్లు వెడల్పు చేయటం, హైవేలు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. అందుకు స్థానిక ప్రజల నివాసాలు కూల్చి వారిని తరిమివేయటం ఖాయం. అలాగే భూములను ఆదివాసీ చట్టం నుంచి బయటకు లాగి ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు కుదవబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. ప్రక్కనే ఉన్న చిన్న దేశం మాల్దీవులలాగా లక్ష్యద్వీప్ని పర్యాటకస్వర్గంగా మారుస్తామంటున్నారు. అంటే పర్యావరణం గుల్లయిపోతుంది. వీటికి తోడు గొడ్డు మాంసం అమ్మటం, నిల్వ చేయడం, తినటం వంటి వాటిని చట్టరీత్యా నేరంగా మారుస్తూ కొన్ని బీజేపీ రాష్ట్రాలలో లాగా చట్టాలను తెచ్చారు. బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూ నుంచి మాంసం, గొడ్డు మాంసం, చికెన్ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దశాబ్దాలుగా ఈ ద్వీపంలో కొనసాగుతున్న మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. సముద్రతీర పరిరక్షణ చట్టం పేరిట మత్స్యకారులు చేపల వేట కోసం ఏర్పరచుకున్న కట్టడాలన్నీ కూల్చివేశారు. ఉన్న ఒక ప్రభుత్వ డైరీఫామ్ని ఎత్తివేసి గుజరాత్‌లోని అమూల్ డైరీ నుంచి పాలు, పాల పదార్థాలు కొనాలని ఆదేశించారు. వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులను అర్థంతరంగా తొలగించేశారు. అంగన్వాడి కేంద్రాలను మూసివేశారు. కేరళ లేక మళయాళ సమాజంనుంచి లక్ష్యద్వీప్ ప్రజలని, వారి బంధాలను విడగొట్టడానికి వ్యాపార లావాదేవీలు కొచ్చిలోని 'బైపోర్' ఓడరేవు నుంచి కాకుండా బీజేపీ పాలిత కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరు పోర్ట్ నుంచి జరగాలని ఆదేశించారు. అలాగే లక్ష్యద్వీప్‌ను కేరళ హైకోర్టు పరిధినుంచి తొలగించి కర్నాటక హైకోర్టు పరిధిలోకి మారుస్తున్నారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్నవారు పంచాయతీ ఎన్నికలకు అనర్హులని చట్టం చేశారు. దేశంలోనే అతి తక్కువ జనన రేటు (1.6శాతం) ఉన్న ప్రాంతమిదే. కాశ్మీర్‌లోనే కాదు దేశ వ్యాపితంగా ఆదివాసీ నివాస ప్రాంతాలలో ఆదివాసీలు కానివారు భూములు కొనే హక్కు ఉండదు. ఇప్పుడు పటేల్ లక్ష్యద్వీప్‌లో ప్రజలు తమ భూమిపై ఉన్న యాజమాన్యహక్కు మూడు సంవత్సరాలకు ఒక్కసారి రెన్యువల్ చేయాలని, లేకుంటే భారీ మొత్తంలో అపరాధరుసుంలు చెల్లించాలని, లేదా శాశ్వతంగా హక్కు కూడా కోల్పోవాల్సి ఉంటుందని ఆదేశాలిస్తున్నారు. వెరసి ఈ అడ్మినిస్ట్రేటర్‌కు సర్వాధికారాలను కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టినట్టు కనబడుతున్నది. స్థానిక ప్రజలతో కాని, స్థానిక సంస్థలతో కాని ఏ విషయమూ చర్చించాల్సిన అవసరం లేకుండా చట్టాలను సవరిస్తున్నారు. ఈ తతంగమంతా 'నిటి ఆయోగ్'కి అప్పగించారు. నిటి ఆయోగ్ ప్రస్తుతం పది వేలుగా ఉన్న పర్యాటకుల సంఖ్యను రానున్న కాలంలో 10 లక్షలకు పెంచుతామని ప్రకటిస్తున్నది. అంటే లక్ష్యద్వీప్ అనేది ధ్వంసమైపోతుంది.
రేగుతున్న ''లక్ష్యద్వీప్‌ను రక్షించండి'' ఉద్యమం
''లక్ష్యద్వీప్‌ను రక్షించండి'', ''ఖోడా పటేల్‌ను తొలగించాలి'', ''ప్రజా వ్యతిరేక, పర్యావరణ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి'' అన్న నినాదాలు లక్ష్యద్వీప్‌లో మార్మోగుతున్నాయి. బీజేపీ మినహాయించి మిగిలిన అన్ని పార్టీలతో ఏర్పడ్డ ''సేవ్ లక్ష్యద్వీప్'' పేరిట ఉద్యమం రోజురోజుకు బలపడుతున్నది. ఈ రోజు లక్ష్యద్వీపాన్ని ఖోడా పటేల్ వైరస్ ఆవహించిందని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. దీని ప్రకంపనాలు కేరళలో విస్తరిస్తున్నాయి. తమిళనాడులో కూడా సంఘీభావ కార్యక్రమాలు మొదలయ్యాయి. దేశంలోనే నేరాల పట్టికలో అతి తక్కువ స్థాయిలో ఉన్న ఆ ద్వీపంలో పటేల్ అడుగుపెట్టిన నాటినుంచి గూండా యాక్ట్ క్రింద అనేకమందిని కనీస విచారణ లేకుండా అదుపులోకి తీసుకుంటూ నిర్భంధాన్ని సాగిస్తున్నారు. తాజాగా లక్ష్యద్వీప్‌లో ప్రారంభమైన ప్రజాపోరాటాన్ని అణచడానికి ఆందోళనకారులందరినీ గుండా యాక్ట్ క్రింద నిర్భంధిస్తున్నారు. పటేల్‌కి బహిరంగంగా లేఖ రాశారన్న నెపంతో ముగ్గురు బడిపిల్లలను అరెస్టు చేశారు. నిటిఆయోగ్ పెద్దలు, స్థానిక కలెక్టర్ తాజాగా లక్ష్యద్వీప్‌లోని ఆందోళనకారుల పైన, వారికి మద్దతుగా కేరళ, తమిళనాడులలో జరుగుతున్న ఆందోళనలపైన విషం గ్రక్కుతూ ప్రకటనలు చేస్తున్నారు. 70యేండ్లుగా అభివృద్ధికి నోచని లక్ష్యద్వీప్‌ను బీజేపీ ప్రభుత్వం పధకం ప్రకారం అభివృద్ధి చేయబూనుకుంటే దాన్ని అడ్డుకుంటున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. కాని మరో ప్రక్క అనేకమంది మేథావులు, రచయితలు ఈ వాదనలను తిప్పికొడుతున్నారు. కేరళ ప్రముఖ నటులు గీతు మోహనదాస్ ''లక్ష్యద్వీప్ ప్రజల ఆక్రందనలు, మనోవ్యధను వాస్తవికంగా అర్థం చేసుకోవాలి'' అన్నారు. లక్ష్యద్వీప్ ప్రజల జీవితంపై ''ఫ్లష్'' వంటి చిత్రాన్ని రూపొందించిన ఆయేషా సుల్తానా వంటి ప్రముఖ చిత్ర దర్శకురాలిపై రాజద్రోహం కేసు పెట్టారు. లక్ష్యద్వీప్‌లోని ఒక సర్పంచ్ డాక్టర్ మునీర్ ''కేంద్ర ప్రభుత్వానికి మేమక్కరలేదు, మా భూమి మాత్రం కావాలి. ఇది ఒక రకంగా ఆంతరంగిక వలస వాదంగా తయారయింది'' అని ప్రశ్నించారు. లక్ష్యద్వీప్ విధ్వంసానికి కారకుడైన ప్రపుల్ల పటేల్‌ని తొలగించాలని కేరళ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. తమిళనాడు ముఖ్యమంత్రి తీవ్ర పదజాలంతో ప్రకటన చేశాడు. పార్లమెంటులో ప్రతిపక్షాలు తీవ్రమైన చర్చ చేయడమే కాకుండా ప్రధానికి ఉత్తరం రాయడం జరిగింది. 93మంది మాజీ ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతూ ప్రధానికి లేఖ రాశారు. తాజాగా లక్ష్యద్వీప్ బీజేపీలో ముసలం పుట్టింది. బీజేపీకి చెందిన 15మంది నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అందులో లక్ష్యద్వీప్ శాఖ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హమీద్, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ఉముల్ ఖులూస్ వంటి ప్రముఖులున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ''ద్వీప వాసుల ఆవేదనలోని నిజం, వాళ్లనుంచి, వారి ప్రజా ప్రతినిధుల నుంచి తెలుసుకున్నాక ఏ నిర్ణయం అయినా చేయడం మంచిది, కాని అలా జరగకపోవడం దురదృష్టకరం'' అని ప్రకటించాడు. కాని కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి గానీ ఏమీ పట్టనట్టు నోరు మెదపడంలేదు. ఈ తంతు అంతా చూస్తుంటే కాశ్మీర్లో 370 అధికరణ రద్దు సమయంలో మాదిరిగానే కనబడుతుంది. లక్ష్యద్వీప్ మీద దాడి ద్వారా మొత్తం మైనారిటీల మనోభావాలను, ఆదివాసుల భూ హక్కులను కాలరాచే ప్రక్రియ మరింత ముమ్మరం అయింది. ఇది అక్కడతో ఆగుతుందనుకోవడం తెలివితక్కువే. స్థానిక సంస్థలను, ప్రజాత్రినిధులను ఒక్క మాటలో చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నే హిందూత్వ ఫాసిస్టు శక్తులు అపహాస్యం చేస్తున్నాయి. 1935లో జర్మనీలో ఫాసిస్టు నాజీలు ''లెబర్ స్రౌమ్ (నివశించడానికి జాగా)'' పేరిట జర్మనేతరులపై మారణకాండ సృష్టించారు. ఈరోజు అదే పద్ధతి లక్ష్యద్వీప్‌లో కనపడుతోందని అనేకమంది హెచ్చరిస్తున్నారు. లక్ష్యద్వీప్‌లో స్థానిక ప్రజలు ఈ మతోన్మాద నయా ఉదారవాద పాలనకి వ్యతిరేకంగా సల్పుతున్న పోరాటానికి మద్ధతుగా కేరళ, తమిళనాడులలోనే కాదు దేశవ్యాపితంగా ప్రజలందరూ గొంతు కలపాల్సిన సమయమిది.
- ఆర్. రఘు