Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడేండ్లు పూర్తిచేసుకుని ఎనిమిదో యేడులోకి అడుగు పెట్టింది. ఎంతోమంది పోరాటాలు, విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందా? రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కార్‌పై జనం పెట్టుకున్న ఆశలు నెరవేరాయా? అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలు, మెనిఫెస్టోలో పెట్టిన అంశాలు అమలయ్యాయా?. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన పెద్దలు వాటి అమలుకు తీసుకున్న చర్యలేంటి? ఆలోచిస్తే ఒక్కసారి మనం ఏడేండ్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉన్నది...
రాష్ట్రం రాకముందు కన్నీటి తెలంగాణ.. తర్వాత ఉద్యమాల తెలంగాణ.. అధికారంలోకి వచ్చాక ధనిక తెలంగాణ.. ఇప్పుడు అప్పుల తెలంగాణ. ఏడేండ్ల ఆర్థిక ప్రగతి చూస్తే ఆందోళనే కనిపిస్తోంది. భవిష్యత్తు తరాన్ని చూస్తే బాధేస్తోంది. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రం మిగుల్లో ఉంది. దానికి తగినట్టుగానే రాష్ట్ర బడ్జెట్‌ను కూడా ఏడాదికేడాది పెంచుకుంటూ వచ్చారు. 2020-21 బడ్జెట్ దాదాపు రూ.1.82లక్షల కోట్ల పైమాటే. పేరుకు పెద్ద బడ్జెట్ కానీ.. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యయా అంటే లేదనే చెప్పాలి. ప్రజల కొనుగోలు శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే అభివృద్ధి. కానీ పైపై మెరుగులను అభివృద్ధి అని చెప్పుకోవడమంటే ఇంత కన్న ఆశ్చర్యం వేరే ఉండదు. ప్రజలకు విద్యా, వైద్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక సదు పాయాలు ఏర్పాటు చేయాలి, ఉపాధితో పాటు జీవన భద్రత కల్పించాలి. కానీ ఆది జరిగిందా? ఇప్పుడు వైద్యం కోసం తెలంగాణ ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. పైగా ప్రజలపై భారాలు మోపే చర్యలకే ప్రభుత్వం మొగ్గుచూపిందనేది వాస్తవం. సర్కార్ 4లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చిందని ఆర్థికవేత్తలు, ప్రతిపక్ష నాయకుల వాదన. ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోనే రూ.2.86, 804 లక్షల కోట్లు, కార్పొరేషన్ల ద్వారా మరో లక్షా 20వేల కోట్ల అప్పులు పేరుకుపోయినట్టు సమాచారం. ఈ లోటును ఎలా పూడుస్తారో పాలకుల దగ్గర సమాధానం లేదు. ఈ అప్పులు సగటున రాబోయే కాలంలో తెలంగాణలోని ప్రతి ఒక్కరిపై రూ.1.25లక్షల భారం ఉంటుందనేది వాస్తవ అంచనా. దేశంలోనే రాష్ట్రం ధనిక తెలంగాణ అని, భవిష్యత్తులో ఒక సింగపూర్, డల్లాస్‌లా మారుస్తామని, హైదరాబాద్‌లో ఆకాశహార్మ్యాలు నిర్మిస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంటే దాన్నుంచి బయటపడే మార్గాలను అన్వేషించకపోగా భూముల అమ్మకం ద్వారా 5వేల కోట్ల రూపాయల రాబడి లక్ష్యంగా పెట్టుకోవడం విచారకరం. 'పలుకుబడి ఉన్నోడికే అప్పులిస్తారు. అప్పులు తేకుంటే అభివృద్ధి ఎలా చేస్తారు' అని అసెంబ్లీలో పలికిన ఆయన ప్రభుత్వ ఆస్తులనే అమ్మకానికి పెడితే భవిష్యత్తు తరానికి ఇచ్చే భరోసా ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకం.
ఇక నిరుద్యోగుల పరిస్థితి చూస్తే దయనీయం. టీఆర్ఎస్ మెనిఫెస్టోలో పెట్టిన లక్ష ఉద్యోగాల ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అటకెక్కినట్టే. నిరుద్యోగ భృతి మరిచారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే లక్షా7వేల ఖాళీలున్నాయని, ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పిన కేసీఆర్ అడపా దడపా ఈ ఏడేండ్లలో 40వేలకు మించి ఉద్యోగాలివ్వలేదు. నియామకాల్లోనూ ఎక్కువగా పోలీస్ శాఖకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఎప్పటికప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఆచరణలో చేసిందేమీ లేదు. ప్రస్తుతం రిటైర్మెంట్ అయిన వారితో కలుపుకుని రెండు లక్షల వరకు ఖాళీలున్నా పట్టింపులేదు. కాలపరిమితి ముగిసిన టీఎస్పీఎస్సీకి పాలకవర్గాన్ని నియమించడంలోనే మొన్నటివరకు జాప్యం చేశారు. పైగా మైనింగ్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, సాంస్కృతిక యునివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రయివేటు యూనివర్సిటీలకు రెడ్‌కార్పెట్ పరిచారు. ఉద్యోగుల రిటైర్మెంట్ మరో మూ డేండ్లు పెంచడంతో నిరుద్యోగుల ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. పట్టభద్రులు ఉద్యోగాల కోసం ప్రయివేటు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి.
రాష్ట్రమొస్తే తమ భవిష్యత్తు ఉజ్వలమవుతుందని విద్యార్థులు, నిరుద్యోగులు కలలు కన్నారు. రాష్ట్ర విభజన కోసం అలుపెరగని పోరాటాలు చేశారు. తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినప్పుడల్లా ఉస్మానియా ఉవ్వెత్తున ఎగిసిపడిందనేది వాస్తవం. మలిదశ ఉద్యమంలో విద్యార్థుల పోరే అగ్రభాగం. ఎంతో మంది లాఠీదెబ్బలు తిన్నారు. ఇంకెంతో మంది కేసుల పాలయ్యారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా సర్కార్‌పై వారి పోరాటం తప్పలేదు. డీఎస్సీని ప్రకటించాలని, లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు ఆందోళనలు చేసిన నేపథ్యంలో ఉద్యోగాల కోసమైతే డీఎస్సీని వేయమని అసెంబ్లీలోనే సీఎం ప్రకటించారు. 1200 మంది బలిదానాల అమరత్వం మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరుద్యోగులను గుర్తించడం లేదంటే వారి త్యాగాలను విస్మరించడమే తప్ప మరోటి కాదు. కనీసం కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులర్ చేసారా అంటే అదీ లేదు. ఎంతోకాలంగా అరకొర వేతనం, పని భారంతో తమ జీవితాలను, కుటుంబాలను నెట్టుకొస్తున్నా కనికరం లేకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టే నిర్ణయాలే తీసుకుంటున్నారనేది స్పష్టం. ఇటీవల ఉద్యానవన శాఖలో ఆఫీస్ అసిస్టెంట్లు, గార్డెనింగ్, కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేసే సుమారు 500 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. నష్టాల పేరుతో ఆర్టీసీలో సుమారు 300మంది హౌం గార్డులను డ్యూటీలనుంచి తప్పించారు. విద్యుత్ విభాగంలో పనిచేసే ఆర్టిజన్ కార్మికులు, ప్రజల ఆరోగ్య రక్షణకు శ్రమిస్తున్న ఆశాలు, శిశు సంరక్షణలో పని చేస్తున్న అంగన్వాడీలు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏండ్లుగా పోరాడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.
నీళ్ల గురించి చూస్తే అతిపెద్ద ప్రాజెక్టులైన మల్లన్నసాగర్, కాళేశ్వరం ఎత్తిపోతలను వేగంగా పూర్తి చేసి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని వాగ్దానం చేసింది. కానీ నీటిని నింపేందుకు చెరువులను పునరుద్ధ రిస్తామని ప్రారంభించిన మిషన్ కాకతీయను ఇప్పుడు పట్టించుకోవడమే లేదు. ఇక ప్రాజెక్టుల డిజైన్లలో లోపాలున్నాయని సాగునీటిరంగ నిపుణులు చెప్పినా వినిపించుకోలేదు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే డిజైన్లు మార్చినట్టు ఆరోపణలు లేకపోలేదు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద భూమిని కోల్పోయిన 14 గ్రామాల ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమివ్వకపోగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీలోనూ అవతకతవకలకు పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. నేటికీ వేములఘాట్ నిర్వాసితులు తమ నిరసనలను కొనసాగించడం పాలకులు జీర్ణించుకోలేని నిజం. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన మోటార్లకు రెండువేల కోట్ల రూపాయల బిల్లు రావడమంటే మాటలు కాదు. అభివృద్ధి మాట కాలమెరుగు కానీ ఈ వేల కోట్లతో ఎంత మంది పేదల బతుకులు మార్చవచ్చనేది ఇప్పుడు చర్చించాల్సిన విషయం. పరిశ్రమల్లో పెట్టుబడులు, వ్యవసాయానికి సాగునీరు, ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి ఉంటుందని చెప్పినదంతా ఉత్తదేనా?. ఇదే అనుమానం ఇప్పుడు ప్రజల్లో గుండెల్లో గూడుకట్టుకుంటున్నది. నాడు సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయం జరిగిందని గళం విప్పిన విద్యావంతులు, మేధావులు నేడు తెలంగాణ పాలనను ప్రశ్నించకపోవడం ఒకింత ఆశ్చర్యమే! ప్రతిపక్ష పార్టీలు పాలకుల వైఫల్యాలను ఎండ గట్టకపోవడం, ఇదే అదనుగా మతతత్వ పార్టీలు బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం.. ప్రజల గొంతుకగా పనిచేస్తూ ప్రత్యామ్నాయం చూపించే వామపక్షాలను అణగదొక్కే చర్యలు చేపట్టడాన్ని ప్రజలు గమనిస్తు న్నారన్న విషయం పాలకులు గుర్తెరగాలి. ఎన్నో ఆకాంక్ష్షలతో ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి పాలనాతీరును మార్చుకుని వారిపై భారాలు మోపే చర్యలు మానుకోవాలి. లేదంటే ఈ ఉద్యమాల తెలంగాణలో ప్రజలు స్వపరిపాలన పైనా తిరుగుబాటు బావుటా ఎగరేయడం ఖాయం...
- ఎన్. అజయ్ కుమార్
సెల్: 9490099140