Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గ్రామాల అభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలుస్తోంది.. అక్కడి ప్రభుత్వం చేపడుతున్న విధానాలను అధ్యయనం చేయండి.. ఇందు కోసం కలెక్టర్లు, పంచాయతీ అధికారుల బృందం వెళ్లండి..' ఇటీవల ప్రగతిభవన్‌లో పల్లె, పట్టణ ప్రగతి అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు ఇవి. అధికారంలో ఉన్న ఏడు సంవత్సరాల్లో కేరళ అభివృద్ధి నమూనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు మాట్లాడారు. అయితే ఆ విధానాలు అమలు చేయడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా అధికారాల బదలాయింపు చేయకపోవడమే కాకుండా.. కొత్తకొత్త చట్టాలు తీసుకువస్తూ ప్రజలచేత ఎన్నుకోబడ్డ గ్రామ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడాంటే అధికారాలు, విధులు, నిధుల బదలాయింపు జరగాలి. గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు స్వావలంబన సాధించడం. అయితే స్థానిక సంస్థలకు 29అధికారాలు బదలాయించి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ప్రభుత్వాలు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యాంగంలో 73వ సవరణ చట్టం ద్వారా 1991లో పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబడింది. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994లో ఆమోదించబడింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే అనేకసార్లు సవరించారు.
కేరళలో ఇలా..
గ్రామపంచాయతీల అభివృద్ధిలో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ రాష్ట్ర నమూనాను అమలు చేయడానికి పాలకులు వెనకడుగు వేస్తున్నది మాత్రం నిజం. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు ఇవ్వాల్సిన 29 అధికారాలనూ కేరళలో ఎప్పుడో బదలాయించారు. సర్పంచులకు తెలియకుండా పంచాయతీల్లో ఎలాంటి పనులు జరగవు. పంచాయతీరాజ్ సిబ్బందే కాకుండా, గ్రామ పరిధిలో పనిచేసే విద్య, వైద్యం, వ్యవసాయం, పశువైద్యం, ఇంజనీరింగ్, సంక్షేమ విభాగాలపై పర్యవేక్షణ కూడా గ్రామ పంచాయతీలకు ఉంటుంది. సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. ముఖ్యంగా కేరళలో ఉద్యోగుల పనిని పర్యవేక్షించే అధికారం పంచాయతీలకే ఉంటుంది. నిధులు, విధులు వారి చేతుల్లోనే ఉంటాయి. లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, అమలు పూర్తిగా పంచాయతీలదే. పంచాయతీలు తమ బడ్జెట్‌ని తామే తయారు చేసుకుంటాయి. రాష్ట్ర బడ్జెట్లో సుమారు 40శాతం నిధులు నేరుగా పంచాయతీలకు వస్తాయి. వీటికితోడు ఆర్థికసంఘం నుంచి వచ్చే నిధులతో పాటు, సొంత ఆదాయ వనరులు కూడా అధికంగానే ఉంటాయి. గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయతీల రూపంలో కేరళలో పటిష్టమైన మూడంచెల వ్యవస్థ ఉంది. ప్రతి పంచాయతీకీ వెబ్సైట్ ఉంటుంది. బడ్జెట్, ఆడిట్ నివేదికలు, పథకాల లబ్ధిదారుల వివరాల్ని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరుస్తారు. గ్రామసభలకు విశేషాధికారాలుంటాయి. లబ్ధిదారుల ఎంపిక, ప్రాధాన్య క్రమంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్ని గుర్తించడం, సోషల్ ఆడిట్ వంటివి గ్రామసభల్లో నిర్వహిస్తారు. నిధుల బదలాయింపునకు నిర్దిష్టమైన వ్యవస్థ ఉంది. ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్‌తో పాటు, పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ విభాగాల నిర్వహణకు అవసరయ్యే నిధులూ ఆయా శాఖల బడ్జెట్ల నుంచి వస్తాయి. గ్రామపంచాయతీల రోజువారీ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా ఉండదు. పంచాయతీ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలన్నా అంబుడ్స్ మన్, అప్పిలేట్ ట్రైబ్యునళ్లతో సంప్రదించాల్సి ఉంటుంది. బడ్జెట్‌ను ఆమోదించనప్పుడు, మెజార్టీ వార్డుసభ్యులు రాజీనామా చేసినప్పుడే పంచాయతీల పాలకమండళ్లను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మిగతా సందర్భాల్లో అంబుడ్స్ మన్ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.
తెలంగాణలో ఇలా..
ఉమ్మడి రాష్ట్రంలోనైనా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అధికారాల బదలాయింపు జరిగింది మాత్రం నామమాత్రమే. ఇంకా 16 అధికారాలు... సామాజిక అడవులు, ఇంధనం, పశుగ్రాసం, ఖాదీ, గ్రామీణ కుటీర పరిశ్రమలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, విద్యుత్ పంపిణీ, గ్రామీణ విద్యుదీకరణ, ఆహారశుద్ధి, చిన్నతరహా పరిశ్రమలు, కుటుంబ సంక్షేమం ఇలా పలు అధికారాలను బదలాయించాల్సి ఉంది. పంచాయతీలకు అప్పగించిన 13 అధికారాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారాలను బదలాయించకపోగా, కొత్త కొత్త చట్టాలను తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల సర్పంచులను స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదనే విమర్శలు ఎదుర్కొంటోంది. పంచాయతీ రాజ్ చట్టం-2018ని తీసుకువచ్చి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికైన సర్పంచులు ప్రజలకే జవాబుదారీగా ఉండాలి. కానీ ఈ చట్టం ద్వారా కలెక్టర్లకు జవాబుదారిగా మారాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పాలనాపరమైన ఒత్తిళ్లు, ఇబ్బందులకు వారు గురవుతున్నట్టు కనబడుతోంది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు దక్కిన హక్కులు, అధికారాలను ఈ చట్టం హరించడమే కాక, వారిపై బాధ్యతలను పెంచి వాటిని నిర్వహించకపోతే కలెక్టర్ల ద్వారా సస్పెన్షన్, తొలగింపు లాంటి శిక్షలకు గురి చేస్తోంది. రాజకీయ కక్ష సాధింపులకు సైతం అవకాశమిస్తోంది. పంచాయతీల అధికారాలను గుప్పిట్లో ఉంచుకుని అధికారులతో పాలన సాగిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో మూడు నెలల క్రితం గుడ్డిలో మెల్లగా గ్రామానికి వచ్చే నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా పంచాయతీ పాలకవర్గాలు ఖర్చు చేసుకునేలా ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి జీవో 18ని సైతం విడుదల చేసింది. గతంలో పంచాయతీల్లో రూ.లక్ష నిధులు ఖర్చు చేయాలంటే డీఎల్పీవో అనుమతి, ఆపైన ఖర్చు చేయాలంటే డీపీవో, కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు గ్రామసభ ఆమోదంతో ఎన్ని లక్షల రూపాయల విలువైన పనులైనా చేపట్టవచ్చు. కానీ చేసిన పనుల బిల్లులు ఏడాదికి పైగా పెండింగ్ లో ఉండడంతో సర్పంచులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. పూర్తి స్థాయిలో అధికారాలను బదలాయిస్తేనే గ్రామాలు సర్వతోముఖాభివద్ధి చెందే అవకాశముంటుంది. పర్యటనలు, అధ్యయనాల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా, ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయమిది.
- మహమ్మద్ అరిఫ్
సెల్:9618400190