Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనుషులకు కొదవ లేదు, మానవత్వమే కనిపించట్లేదు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను నిందిస్తే ఇక ఆ ప్రజలకు దిక్కెవరు? మూడున్నర వేల యం.ఆర్.పి. ఉన్న రేమీడేసివర్ను ముప్పై వేల రూపాయలకి నల్లబజారుల్లో అమ్ముతున్నా వ్యాపారులు. నిర్దిష్టమైన మందు, చికిత్సా విధానమేలేని కరోనా వైద్యానికి కార్పొరేట్లు వేసే ఐసీయూ బిల్లులు అంతరిక్ష దర్శనం చేయిస్తున్నాయి. సగటున రోజుకి అరవై వేల నుంచి రెండు లక్షల రూపాయాలు వసూలు చేస్తున్నారు వైద్య నారాయణులు. కోర్టు వ్యాజ్యాల్లో ఓడినవాడు రోడ్డు మీద ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడిచాడన్న చందంగా.. ఇంటెన్సివ్ కేర్‌లో కరోనాని గెలిచిన సామాన్యుడు పోయే ప్రాణాలు దక్కాయని సంతోషించాలో, ఉన్న ఆస్తులు పోయి రోడ్డు మీదకొచ్చినందుకు ఏడవాలో అర్థం కాని పరిస్థితి. అడ్డగోలు అద్దెలు వసూలు చేస్తున్న అంబులెన్సు డ్రైవర్లు, కరోనా పీడిత కుటుంబాలని సామాజిక బహిష్కరణకి గురిచేస్తున్న ఇరుగు పొరుగు వారు, అమ్మ నాన్నలని కోల్పోయి అనాధలయిన వారిని ఆదుకోని బంధువులు, వలసజీవులకు, రోజు కూలీలకు పట్టెడన్నం పెట్టని నిర్దయులు, ప్రభుత్వేతర బోధకులను పట్టించుకోని యాజ మాన్యాలు, ఆశీర్వాద్ గోధుమ పిండి కోసం ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసే వాహన దారులు, అనవసరంగా రోడ్ల మీదకొచ్చి పోలీసుల ఓపికను పరీక్షించే ఆకతాయిలు, భౌతిక దూరం పాటించని పాదచారులు, కనీస జాగ్రత్తలులేని సభలు, సమావేశాలు, బాధ్యత లేని శుభకార్యాలు, చార్టర్డ్ ఫ్లయిట్ వివాహ వేడుకలు, చివరికి స్లాట్ బుకింగ్ అంత్యక్రియలు, శ్మశానాల్లో శవ రాజకీయాలు... ఇదీ నేటి భారతం.
ప్రజలది బాధ్యతారాహిత్యం అంటున్నారు పాలకులు. కానీ, ప్రస్తుత పరిస్థితిని నిష్పక్షపాతంగా ఎలాంటి రంగు అద్దాలు లేకుండా పరిశీలిస్తే బాధ్యతలేనిది ప్రజలకా ప్రభుత్వాలకా, దోషం పౌరులదా పాలకులదా అనే విషయం సుస్పష్టం అవుతుంది. కరోనా మొదటి తరంగం విపత్తు నిర్వహణలో దొర్లిన పాలనా లోపాలను సరిదిద్దుకోకుండా, ఎన్నికల నిర్వహణలో జన సమీకరణలలో మునిగి తేలిన ప్రభుత్వాలది బాధ్యతారాహిత్యం కాదా? ఐదు రోజుల ఐసీయూ వైద్యానికి ఆరు లక్షల బిల్లులు చెల్లించమనే కార్పొరేట్ యాజమాన్యాలను కట్టడిచేయలేకపోవడం, ముందస్తు ప్రణాళికతో ఆక్సిజన్ కొరతను, వ్యాక్సిన్ల కొరతను, మందుల కొరతను అధిగమించకపోవడం, వ్యాధి చివరి దశలో పెద్దగా ప్రభావం చూపని ఒక డ్రగ్‌ని సంజీవనిగా ఫోకస్ చేసి లక్షల రూపాయలు దోచుకున్న డ్రగ్ మాఫియాని నియంత్రించలేకపోవడం, ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా? కరోనా మొదటి దశ విధ్వంసాన్ని చూసి కూడా రెండో దశ తరంగానికి సంసిద్ధం కాకపోవడం ఎవరి బాధ్యతా రాహిత్యం? ముమ్మాటికి ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యమే.
ప్రపంచంలోనే అతి పెద్ద టీకా ఉత్పత్తిదారుల్లో ఒకటైన భారతదేశంలో ఇవాళ వ్యాక్సిన్ల కొరత ఎందుకు ఏర్పడింది. జనవరి 16న దేశంలో వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించిన కేంద్రం ఆ మాసాంతానికి దేశవ్యాప్తంగా కేవలం 39లక్షల టీకాలు వేయగా ఒక కోటి అరవై లక్షల టీకాలని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసింది. ఫిబ్రవరి చివరి వారానికి దేశీయంగా కోటి టీకాలు వేయగా ఇతర దేశాలకి రెండు కోట్ల ఇరవై లక్షల టీకా డోసులని ఎగుమతి చేసింది. స్థూలంగా ''వ్యాక్సిన్ మైత్రి'' పేరుతో దాదాపు 95 ప్రపంచ దేశాలకి 66 మిలియన్ల వాక్సిన్ డోసులను ఎగుమతి చేసిందని స్వయానా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇందులో ఒక కోటి డోసులు ఉచితం కాగా, మిగతా ఐదున్నర కోట్ల డోసులు వాణిజ్య ఎగుమతులు. మనం ఆకలితో చచ్చిపోతామని తెలిసి ఉన్న నాలుగు గింజల్ని జారవిడవడం మంచితనమా? అవివేకమా?
నేరం ప్రజలదని, పార్టీలదని, ప్రభుత్వాలదని ఒకరినొకరు విమర్శించుకునే ఈ నిందా సంస్కృతికి ఇప్పటికైనా స్వస్తి పలకాలి. జాతి విపత్తు నిర్వహణ వైఫ్యల్యాన్ని కేంద్రం రాష్ట్రాలపై, రాష్ట్రాలు కేంద్రంపై నెట్టివేసే ఫక్తు పలాయన పోకడలకు చెల్లు చీటి రాయాలి. తప్పెవరిది అనే రంధ్రాన్వేషణ మాని, తప్పెక్కడ అనే సత్యాన్వేషణ జరిపి ఆ రంధ్ర బంధనం చేసినప్పుడే గదా జాతి నౌక మునగకుండా కాపాడుకోగలిగేది. పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులు, విద్యార్థి తప్పు చేస్తే గురువులు మెత్తగా మందలించి సరైన దారిలో పెట్టిన చందంగా, పిల్లల్లాంటి అమాయక ప్రజలు దారి తప్పినప్పుడు ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా వారికి దిశ నిర్దేశం చేయాల్సిన బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వాలదే. ఒక వైపు నల్లబజారుల్లో సామాన్యున్ని నిలువు దోపిడీ చేసే దుర్మార్గులను శిక్షిస్తూ, ఇంకొకవైపు రెక్కాడితే గాని డొక్కాడని పేదల ఆకలి కేకలకి ఆపన్న హస్తం అందిస్తూ గత సంవత్సర కాలంగా ఉపాధిని కోల్పోయి బతుకు భారంగా మారిన వారిని రక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం.
వారం క్రితం పుస్తెలమ్ముకుని ముప్పై వేలకి కొన్న రేమీడేసివర్ అసలు మందే కాదు పొమ్మంది డబ్ల్యూహెచ్ఓ. నిన్నటి వరకు ప్లాస్మా దాతల కోసం పరితపించిన ప్రజలు ప్లాస్మాథెరపీ పనే చేయదని తెలిసి తలలు బాదుకుంటున్నారు. వ్యాధి చివరి దశలో కళ్ళెం వేయలేని కరోనాని తొలిదశలో గుర్తిస్తే మాత్రం తప్పక ప్రాణాలు కాపాడవచ్చన్న నిపుణుల భరోసాతో తక్షణం వైవిధ్య ప్రజాచైతన్య కార్యక్రమాల్ని రూపొందించుకుని ప్రజలకి మరింత అవగాహన కల్పించాలి. అమ్మ నాన్నలని, అయిన వాళ్ళని కోల్పోయి అనాధలయిన వారి బాధ్యతని తక్షణమే ప్రభుత్వం స్వీకరించాలి.
యూకే స్ట్రెయిన్, సింగపూర్ స్ట్రెయిన్, సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్, బ్రెజిల్ స్ట్రెయిన్, డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ వంటి వైవిధ్య ఉత్పరివర్తనాలతో విరుచుకుపడు తుందేమో అనుకుంటున్న థర్డ్ వేవ్‌ని నిర్వీర్యం చేయడానికి బహుముఖ వ్యూహ రచన జరగాలి. వైరస్ ఏరోసాల్ రూపంలో గాలిలో వ్యాపిస్తుందన్న అనుమానాలు, అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సినూ నూటికి నూరు పాళ్ళు రక్షణ కల్పించలేదనే వాదనలు రాబోయే ప్రమాద తీవ్రతను సూచిస్తున్నాయి. కాబట్టి వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దేశ, రాష్ట్ర సరిహద్దుల్ని, కంటైన్మెంట్ జోన్లను కట్టడి చేయాలి. దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే స్వీయ పరీక్షా పరికరాల తయారీకీ, వెంటీలేటర్ల తయారీకీ, ఆక్సిజన్ ఫ్లాంట నిర్మాణానికీ కేంద్రం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి.
జరిగిన పొరపాటును సరిదిద్దుకుని కేంద్రం దిద్దుబాటు చర్యలతో దేశీయ అవసరాలపై దృష్టి పెట్టాలి. ఈ డిసంబర్ చివరి కల్లా 75కోట్ల కోవిషీల్డ్ డోసులు, 55కోట్ల కొవ్యాక్సిన్ డోసులు, 15 కోట్ల స్పుత్నిక్, 30 కోట్ల బయాలజికల్ ఈ 20 కోట్ల నోవా వ్యాక్సిన్, 6 కోట్ల జీనోవా, 5 కోట్ల జైడస్ మరో పది కోట్ల భారత్ బయోటెక్ నేసల్ డోసులతో మొత్తం 216 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని నిటిఆయోగ్ సభ్యులు వికె పాల్ ప్రకటించడం సంతోషించ దగిన విషయమే. కానీ, ఆచరణలో ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించినప్పుడే ఇది సాధ్యం. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కోటిన్నర పైగా టీకాలు వేయగా, దక్షిణ భారతంలోనే అత్యల్పంగా కేవలం 58లక్షల డోసుల టీకాలతో వెనకబడిన తెలంగాణ రాష్ట్రం వేగంగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వాలు ప్రజలను నిందించే ''బ్లేమింగ్ కల్చర్''కి ముగింపు పలికి, ప్రజలు ప్రభుత్వం పర్యాయ పదాలన్న విషయం మనసుకెక్కించు కుని ''బేరింగ్ కల్చర్''కి ఆహ్వానం పలకాలి. పార్టీలు, ప్రాంతాలకతీతంగా ప్రతి పౌరుడు కరోనా యోధుడు కావాలి. నిజానికి ఈ కష్ట కాలంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇతోవిధంగా తోటి వారికి తోడుగా నిలిచి, తమ పెద్ద మనసును చాటుకున్నారు.
దేశ రక్షణ కోసం వేల కోట్ల ఆయుధ సంపద ఎంత అవసరమో, వేల కట్టలేని పౌరుల ఆరోగ్యం అంతా కన్నా ముఖ్యమని ప్రభుత్వాలు గుర్తెరిగి స్వీయ క్రమశిక్షణ, ముందుచూపు, పటిష్ట పాలనా పటిమతో భారతావనిని సురక్షిత తీరాలకు చేరుస్తారని ఆశిద్దాం.
- కనకశ్రీ విజరు రఘునందన్
సెల్: 9652377886