Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం ఎదురుగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. ప్రస్తుతం మానవాళిని పొట్టనబెట్టుకుంటున్న కరోనా వైరస్‌కు అత్యంత నమ్మకమైన మిత్రుడుగా ఉన్నది పెట్టుబడిదారీ మేథో (సంపద) హక్కులే. ఎకనామిస్ట్ పత్రిక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన కోవిడ్ మరణాల సంఖ్య అధికారికంగా ప్రకటించిన ముప్పై లక్షలు గాక ఒక కోటి పైనే ఉంటుంది. అంతే గాక ఈ వైరస్‌ను ఇప్పుడిప్పుడే అంతం చేసే పరిస్థితి లేదు. ప్రపంచ జనాభా యావన్మందికీ వ్యాక్సినేషన్ చేస్తే తప్ప ఈ కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేం. ఈ విషయాన్ని ఐఎంఎఫ్‌తో సహా అందరూ అంగీకరిస్తున్నారు. మరిన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను ఈ మహమ్మారి పొట్టన పెట్టుకునే లోపు ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక వ్యాక్సినేషన్ అమలు జరగాలంటే వ్యాక్సిన్ ఉత్పత్తిని ఒక్కసారిగా అనేక రెట్లు పెంచడమొక్కటే మార్గం. కొన్ని బహుళజాతి ఔషధ కంపెనీలకు గల మేథోపరమైన హక్కులు (పేటెంట్లు) దీనికి ఆటంకంగా ఉన్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను కనుగొనడానికి ప్రజాధనాన్ని ఎక్కువగా ఉపయోగించారు. కానీ ఆ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడానికి తాము పెట్టిన పెట్టుబడులు (అవి పెద్దగా పెట్టుబడులు పెట్టిందేమీ లేదు) తిరిగి రావాలంటే వాటి ఉత్పత్తిపై తమకు గుత్తాధిపత్యం ఉండాల్సిందేనంటూ ఈ బహుళజాతి కంపెనీలు వాదిస్తున్నాయి. మానవజాతి ఎదుర్కుంటున్న ప్రస్తుత దయనీయ పరిస్థితి నుంచి లాభాలను పిండుకోవాలని చూస్తున్నాయి.
పేటెంటు హక్కులను తాత్కాలికంగా సడలించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించడం ఒక ముఖ్యమైన పరిణామం. అయితే ఆ సడలింపు అమలులోకి రావాలంటే అందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ వేదికపై ఒక ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. ఇందుకు యూరప్‌లోని పెట్టుబడిదారీ ప్రభుత్వాలు సుముఖంగా లేవు. తమ తమ దేశాలలోని బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలను కాపాడడం కోసం ఆ దేశాలు ఎటువంటి సడలింపూ ఉండరాదని గట్టిగా నిలబడ్డాయి. ఇప్పుడున్న పేటెంటు చట్టాలను పక్కనబెట్టి ప్రపంచం మొత్తం మీద ఉన్న వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యాన్నంతటినీ పూర్తిగా వినియోగించి ఉత్పత్తి చేపడితే ఈ సంవత్సరం తిరిగే లోపు ప్రపంచ జనాభాలో 60శాతానికి వ్యాక్సిన్ అందించవచ్చు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. కానీ జర్మనీ, తదితర దేశాలు పేటెంటు విషయంలో సడలింపు ఉండరాదని గట్టిగా వాదిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చలు నెలల తరబడి సాగలాగే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిదాకా కొనసాగినా ఆశ్చర్యం లేదు. రానున్న జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 2022 ముగిసేనాటికి ప్రపంచానికంతటికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసే లక్ష్యాన్ని ప్రతిపాదించబోతున్నారు. ఆ లక్ష్యాన్ని జీ-7 దేశాలు అంగీకరించి, ఆ లక్ష్యాన్ని సాధించినా, అప్పటికి మరెన్ని లక్షలమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో! పేటెంటు హక్కుల్ని పక్కనబెట్టి తక్షణమే అందరికీ వ్యాక్సిన్ అందించి వారి ప్రాణాలను కాపాడడం తక్షణ కర్తవ్యం. ఇది 2022 దాకా ఆగరాదు.
ఇప్పుడు చాలా మంది వ్యాక్సిన్ వివక్షత గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంతవరకూ ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌లో సింహభాగం సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తమ చేజిక్కించుకున్నాయి. మూడవ ప్రపంచ దేశాలకు దక్కినది చాలా తక్కువ. ఏప్రిల్ మాసాంతానికి అమెరికాలో 40శాతం, యూరోపియన్ యూనియన్ దేశాలలో 20శాతం జనాభా కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ను పొందగలిగారు. అదే ఆఫ్రికా ఖండంలో కేవలం 2శాతం మాత్రమే పొందగలిగారు. భారతదేశంలో పూర్తి వ్యాక్సినేషన్ జరిగింది ఇప్పటివరకూ 3శాతానికి మించదు. సంపన్న దేశాలు రాబోయే కాలంలో ఉత్పత్తి కానున్న వ్యాక్సిన్లలో కూడా అత్యధిక భాగాన్ని తమ చేజిక్కించుకున్నారు. తమ దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్లను అందించగా పోను, అదనంగా నిల్వలను కూడా ఉంచుకునే విధంగా తయారీకి ముందస్తుగా ఆర్డర్లు ఇచ్చారు.
ఈ 'వ్యాక్సిన్ వివక్షత'లో రెండు అంతర్భాగాలున్నాయి. రెండింటికీ మూలం సంపన్న దేశాల పెట్టుబడిదారీ వ్యవస్థే. పేటెంట్ హక్కుల కారణంగా ఉత్పత్తి కొద్ది గుత్త సంస్థలకే పరిమితం కావడం, ఆ సంస్థలు సంపన్న దేశాలలో ఉన్నందున ఆ వ్యాక్సిన్‌ను ఆ దేశాలే చేజిక్కించుకోవడం జరుగుతోంది. ఇక సంపన్న దేశాలు అందించినట్టు మూడవ ప్రపంచ దేశాలలో వ్యాక్సిన్ ఉత్పత్తి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఆ దేశాలు అందించలేక పోతున్నాయి. ఈ రెండు తరహాల దేశాల నడుమ ఈ విధమైన అంతరం కొంత కాలంగా కనిపిస్తూనే ఉంది. సంపన్న దేశాలలో కోవిడ్ బాధిత ప్రజలకు ఆ ప్రభుత్వాలు అందించిన సహాయం వాటి బడ్జెట్లలో 20శాతం వరకూ ఉంటే, మూడవ ప్రపంచ దేశాలలో కేవలం రెండు శాతం, కొన్ని దేశాల్లో అంతకన్నా కూడా తక్కువగా ఉంది. సంపన్న దేశాలలో ప్రజలకు అందించే వ్యాక్సిన్‌పై ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ ఎక్కువగా ఉంటే, మూడవ ప్రపంచ దేశాలలో అటువంటిది లేదు. దాని వలన పేద దేశాల ప్రజలు వ్యాక్సిన్లకు వెచ్చించవలసిన సొమ్ము వారి స్థాయికి అందనంత ఎక్కువగా ఉంది.
అందరికీ వ్యాక్సిన్ అందించాల్సిందే అని చెప్పిన ఐఎంఎఫ్ మూడవ ప్రపంచ దేశాలపై పొదుపు చర్యల షరతులను మాత్రం ఇంకా ఎక్కువగా రుద్దుతూనే ఉంది. పాత అప్పులను తిరగ రాసుకునే సందర్భాలలో గాని, కొత్తగా అప్పులకోసం ఒప్పందాలను చేసుకునేటప్పుడు కాని ఈ పొదుపు షరతులను అమలు చేయాల్సిందేనంటూ పట్టుబడుతోంది. అందుచేత మూడవ ప్రపంచ దేశాలు వ్యాక్సిన్లకోసం ఎక్కువ ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ద్రవ్య పెట్టుబడికి ఉన్న పెత్తనం కారణంగానే, ప్రభుత్వం జోక్యం అంతకంతకూ తగ్గాలనే దాని విధానం కారణంగానే ప్రస్తుత 'వ్యాక్సిన్ వివక్షత' ఏర్పడింది (అయితే భారతదేశంలో మాత్రం ఐఎంఎఫ్ షరతులేవీ ఇక్కడి వ్యాక్సిన్ కొరతకు కారణం కావు. మోడీ ప్రభుత్వపు అమానవీయ, మతిమాలిన తనమే దీనికి కారణం).
మొత్తం ప్రపంచ జనాభా అంతటికీ వ్యాక్సినేషన్ చేయాలంటే 5000 కోట్ల డాలర్లు అవసరం అని అంచనా వేశారు. ఈ పాటి సొమ్మును మూడవ ప్రపంచ దేశాలకు సహాయంగా అందించడం ఏమీ కష్టం కాదు. అందునా ''అందరికీ రక్షణ ఉన్నప్పుడే ప్రతీ వ్యక్తికీ రక్షణ కలుగుతుంది'' అని ప్రతీ ఒక్కరూ పదే పదే వల్లె వేస్తున్నప్పుడు ఈ విధంగా అందుకోసం అవసరమైన సొమ్మును అందించడానికి చొరవ సంపన్న దేశాలలో ఏ ఒక్క దేశమూ ఎందుకు ప్రదర్శించడం లేదో అర్ధం కాదు.
ఒకవేళ పేటెంటు చట్టం అమలుకు మినహాయింపు ఇవ్వడం ఇప్పుడే సాధ్యం కాకపోయినా, కంపల్సరీ లైసెన్సింగ్ విధానం ద్వారా వ్యాక్సిన్ల ఉత్పత్తిని వెంటనే విస్తరించవచ్చు. జాతీయంగా అత్యవసర పరిస్థితిని ఏ దేశమైనా ఎదుర్కుంటున్నప్పుడు పేటెంటు చట్టాల అమలు నుంచి మినహాయింపు పొందవచ్చునని ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల్లో ఉంది. ఇండియన్ పేటెంట్స్ యాక్ట్‌లోని 16వ చాప్టర్‌ను డబ్ల్యూటీవో ఒప్పందాలకు అనుగుణంగా సవరించినప్పుడు (ట్రిప్స్‌కి అనుగుణంగా) అందులో కంపల్సరీ లైసెన్సింగ్కి అవకాశం కల్పించారు.
పేటెంట్ చట్టం నిబంధనల నుంచి సడలింపు కోరుతున్నప్పుడు అందుకోసం ఏ కారణాలను చూపించామో, అవే కారణాలు కంపల్సరీ లైసెన్సింగ్ అమలు చేయడానికి కూడా వర్తిస్తాయి. అదే జాతీయ అత్యవసర పరిస్థితి వల్ల తక్షణమే వ్యాక్సిన్ ఉత్పత్తిని విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉంది. బహుళజాతి ఔషధ కంపెనీలు, సంపన్న దేశాలు వాటి గుత్తాధిపత్యం దెబ్బ తింటుంది కనుక కంపల్సరీ లైసెన్సింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. కాని పేటెంట్ నిబంధనల సడలింపును సమర్థిస్తున్న పలు సంస్థలు, వ్యక్తులు కూడా కంపల్సరీ లైసెన్సింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో పాటు పేటెంట్ నిబంధనల సడలింపును సమర్థించిన భారత ప్రభుత్వం కంపల్సరీ లైసెన్సింగ్ అమలు చేయడానికి మాత్రం సుతరామూ అంగీకరించడం లేదు. ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరించే నిటి ఆయోగ్ బహిరంగంగానే ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది.
ఇలా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్నది నిగూఢ రహస్యంగానే ఉంది. కంపల్సరీ లైసెన్సింగ్‌కు పూనుకుంటే అది బహుళ జాతి కంపెనీలను, వాటికి వత్తాసుగా నిలిచిన సంపన్న దేశాలను ధిక్కరించే ఏకపక్ష చర్యగా పరిగణించబడుతుందేమోనన్న భయం వలన బహుశా మోడీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నదని అనుకోవాలి. దాని వలన జరిగేది మరిన్ని ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మాత్రమే. గత రెండు వారాలుగా దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్ నిల్వలు తరిగిపోతున్నా మోడీ ప్రభుత్వం ఇంత పిరికితనంతో వ్యవహరించడం సిగ్గుచేటు.
అంతర్జాతీయ సహకారం గురించి, లేదా సార్వత్రిక వ్యాక్సినేషన్ ఆవశ్యకత గురించి ఎన్ని ధర్మోపన్యాసాలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు. వెంటనే పేటెంటు నిబంధనల సడలింపు జరగాలన్న డిమాండ్ ముందుకు తేవడం గాని, అది కుదరనప్పుడు కంపల్సరీ లైసెన్సింగ్‌కు పూనుకోవడం గాని తక్షణమే జరగాలి. ఇక్కడ ఒక మౌలికమైన విషయాన్ని తేల్చుకోవాలి. ఒక యూరోపియన్ లేదా అమెరికన్ పౌరుడి జీవించే హక్కు కన్నా ఒక భారతీయుడి, లేదా ఒక ఆఫ్రికావాసి లేదా ఒక లాటిన్ అమెరికన్ పౌరుడి జీవించే హక్కు ఏ విధంగా తక్కువ? ఒక సంపన్న దేశపు పౌరుడి జీవితంలాగే ఒక పేద దేశపు పౌరుడి జీవితం కూడా విలువైనదే అన్న ప్రాతిపదికన అంతర్జాతీయ సహకారం ఉండాలి. దీనిని నిరాకరించి అంతర్జాతీయ సహకారం గురించి మాట్లాడడం అంటే వొట్టి బూటకమే అవుతుంది.
ఏ దేశానికి ఆ దేశంలో గల పౌరుల ప్రాణాలు ముఖ్యం అవుతాయి, ఆ తర్వాతే అంతర్జాతీయ బాధ్యతలు వస్తాయి. నిజమే. కానీ ఇప్పుడు సంపన్న దేశాల ప్రభుత్వాలు ఆ విధంగా ఈ సమస్యను చూడడంలేదు. మేథోసంపత్తి హక్కుల రక్షణా లేక వ్యాక్సిన్ల కొరతను పూడ్చడమా, ఏది ముఖ్యం అన్నట్టు ఆ ప్రభుత్వాలు ఈ సమస్యను చూస్తున్నాయి. ఒక దేశ ప్రజలకు, మరో దేశ ప్రజలకు మధ్య పోటీ కాదిది. ప్రజల ప్రాణాలకు, కార్పొరేట్ల లాభాలకు మధ్య పోటీ ఇది.
విశేషమేమంటే, సంపన్న దేశాల ప్రజలు ఈ విషయాన్ని సరిగ్గానే అర్థం చేసుకుంటున్నారు. అందుకే వారిలో అత్యధికులు పేటెంటు నిబంధనలను వెంటనే సడలించాలన్న డిమాండ్‌ను బలపరుస్తున్నారు. ఎటొచ్చీ ఆ దేశాల ప్రభుత్వాలే, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాల ప్రభుత్వాలు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వాలు గుత్త పెట్టుబడిదారీవర్గ ప్రయోజనాలను కాపాడడానికి ప్రాధాన్యత ఇస్తుంటే ఆ దేశాల ప్రజలు మాత్రం అంతర్జాతీయ సౌహార్ద్రతను ప్రదర్శిస్తున్నారు.
స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్ పట్నాయక్