Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలోని కొందరు చైనా వ్యతిరేక వ్యూహకర్తలు చైనా పట్ల శత్రుత్వంతో, కరోనా వ్యతిరేక పోరాటంలో భారతదేశానికి చైనా అందించిన, అందిస్తున్న సహాయాన్ని విస్మరిస్తున్నారు. చైనాను దూషించడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి తమ ప్రయత్నాలను వారు ఎన్నడూ నిలిపి వేయటం లేదు.
న్యూఢిల్లీకి చెందిన భౌగోళిక వ్యూహకర్త బ్రహ్మ చెల్లానీ, గత ఏడాది భారతదేశం యొక్క ''కఠినమైన కరోనా లాక్డౌన్''ను సద్వినియోగం చేసుకుని ''భారతదేశంలోని ఎత్తైన లడఖ్ ప్రాంతంలోని కీలక సరిహద్దు ప్రాంతాలలో దొంగతనంగా చొరబడటానికి'' చైనా ప్రయత్నించిందని ఆరోపించారు. చైనా యొక్క ''దురాక్రమణ'' చైనాకే ''స్వీయ-నష్టం''గా మారిందనీ ఎందుకంటే ఇది ''న్యూఢిల్లీని వాషింగ్టన్కు మరింత దగ్గరగా నడిపిస్తోంది'' అని, ఇలా చైనా తన అతిపెద్ద పొరుగుదేశాన్ని శాశ్వత శత్రువుగా చేసుకుంటోంది అని ఆయన పేర్కొన్నారు.
చైనాపై కొందరి అభిప్రాయాలు అసత్యాలు, వక్రీకరణలతో గుడ్డి వ్యతిరేకతతో నిండి ఉంటున్నాయి. చెల్లానీ అభిప్రాయాలు వాటికి అద్దం పడుతున్నాయి. చెల్లానీ వంటి చైనా వ్యతిరేక వ్యక్తులు ఎల్లప్పుడూ చైనాను శత్రువుగానే పరిగణిస్తారు. చైనా ''భారతదేశాన్ని శాశ్వత శత్రువుగా'' చూస్తున్నట్టయితే, అది పదే పదే సంయమనం పాటించి, సరిహద్దు సంఘర్షణల సమయంలో శాంతియుత పరిష్కారానికి ఎందుకు పిలుపునిచ్చింది? మన దేశాన్ని నాశనం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి యొక్క రెండవ తరంగంతో పోరాడటానికి భారతదేశానికి అవసరమైన మద్దతు, సహాయం అందించడానికి తన సుముఖతను వ్యక్తం చేసిన మొదటి దేశాలలో చైనా ఒకటిగా ఎందుకు ఉంది?
భారతదేశం చేస్తున్న కరోనా పోరాటానికి చైనా గొప్ప సహకారం అందించిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఏప్రిల్ నుంచి చైనా 5,000కుపైగా వెంటిలేటర్లు, 21,569 ఆక్సిజన్ జనరేటర్లు, 21.48మిలియన్ మాస్క్లు, సుమారు 3,800టన్నుల మందులను భారతదేశానికి సరఫరా చేసిందని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ఆఫ్ చైనా గణాంకాలు చెబుతున్నాయి. ప్రాణాలను కాపాడే ఈ సరఫరాలు భారతదేశం యొక్క అంటువ్యాధి వ్యతిరేక పదార్థాల కొరతను తగ్గించడానికి సహాయపడ్డాయి. ఏంతో మంది ప్రాణాలను కాపాడాయి.
చైనా దురాక్రమణ భారతదేశాన్ని అమెరికాకు దగ్గరగా నడిపిస్తోంది కాబట్టి అది వారికి స్వీయనష్టం అని చెల్లానీ అంటున్నారు. భారతదేశం అమెరికా, పశ్చిమ దేశాలకు దగ్గరగా వెళ్లడం చూసి అతను, అతని లాంటి వారు సంతోషంగా ఉన్నారు. కానీ ఇది భారతదేశం ఊహించినవిధంగా చైనాపై వ్యూహాత్మక ఒత్తిడిని సృష్టించదు. బదులుగా భారతదేశం అమెరికా యొక్క చైనా వ్యతిరేక లాబీగా ఉపయోగించబడటం, అమెరికా రథానికి కట్టబడటం జరుగుతుంది. ఇది మరింత వినాశకరమైనది.
భారతదేశంలో పెచ్చుమీరిన అంటువ్యాధి సందర్భం, అమెరికా నమ్మదగిన మిత్ర దేశమేమీ కాదనీ, సంక్షోభంలో ఉన్నప్పుడు సహాయమేమీ చేయదనీ మళ్లీ నిరూపించింది. కొందరు వ్యూహకర్తలు అని పిలువబడే వారికి భారతదేశం యొక్క ప్రాథమిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నవేమిటో తెలియదు. వారు భారతీయ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చైనా గురించి ప్రతికూలంగా ప్రభావితం చేయటమే పనిగా పెట్టుకున్నారు.
భారతదేశం, చైనా కలిసి సంయుక్తంగా ఎదగవచ్చని చైనా భావిస్తోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ 2014, 2016లో భారతదేశాన్ని సందర్శించి నప్పుడు ''చైనా, భారతదేశం సంయుక్తంగా జాతీయ పునరుజ్జీవాన్ని సాధించాలని'' పిలుపునిచ్చారు. అయితే భారతదేశంలోని చైనా వ్యతిరేక వ్యూహకర్తలు చైనా పెరుగుదలను అంగీకరించడానికి ఇష్టపడరు. పైగా చైనా పెరుగుదలను భారతదేశానికి సవాలుగా చూస్తున్నారు. వారు చైనాతో ఘర్షణను ప్రేరేపిస్తున్నారు. చైనాను భారతదేశానికి శాశ్వత శత్రువుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సుహృద్భావం, మానవతావాదం, అంతర్జాతీయ బాధ్యతగా చైనా, భారతదేశం యొక్క అంటువ్యాధి పోరాటానికి అవసరమైన సహాయం, మద్దతును ప్రకటించింది. కానీ ఇది చైనా-భారత సంబంధాలలో ఏదైనా మెరుగుదలకు దారితీస్తుందా? అంటువ్యాధి పరిస్థితి మెరుగు పడకపోయినా, ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి తీవ్రమైనా, ప్రజల దృష్టిని మళ్లించడానికి చైనా సంబంధిత అంశాలు మళ్ళీ రేకెత్తించబడతాయి. చైనా వ్యతిరేక ప్రచారంతో ప్రయోజనం పొందుతారు. దేశ ప్రయోజనాలను బలి చేస్తారు.
- డా||ఎస్.జతిన్ కుమార్
సెల్:9849806281