Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దేశంలో - బాల బాలికలు భావి భారత పౌరులుగా ఎదగాలి. ఒక విధంగా రాబోవు సమాజానికి వారే ఆస్తి. వీరి అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యం, వసతి, క్రీడలు తదితర రంగాలలో వీరిని అభివృద్ధి పరచాలి. అన్ని దేశాల్లో 18ఏండ్లలోపు వయస్సు కలిగిన వారికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పిల్లల అభివృద్ధి సంస్థలు, క్రేచీలు, ఆటల కేంద్రాలు, రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ భారతదేశం అందుకు విరుద్దంగా సాగుతున్నది. పిల్లల మనస్థత్వంలో అల్లరి చేయడం, తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్ది ముందుకు తీసుకెళ్ళడానికి వీరి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు, వ్యవస్థలు పని చేయాలి. నేరాలు చేశారన్న పేరుతో 18ఏండ్లలోపు పిల్లలను ''జువెనైల్హౌమ్''కు ''అబ్జర్వేషన్ హౌంకు'' తరలించి వారికి శిక్షలు అమలు జరుపుతున్నారు. శిక్షా కాలంలో పౌష్టికాహారంతోపాటు విద్య, వైద్య సౌకర్యం కూడా కల్పించాలి. వారిని పౌరులుగా సంస్కరించాలి. భారతదేశంలో 1957లో ప్రభుత్వం అత్యంత పెద్ద జైల్ ''తీహార్ జైల్'' నిర్మాణం చేసింది. ఇందులో అనేక రకాల నేరస్తులు ఉంటారు. ఈ జైల్లోనే బాలల జైల్ కూడా ఉంది. బాలలపై ఇతర నేరస్తులు అనేక అకృత్యాలు చేస్తుంటారు. అకృత్యాలు చేసే వారికి జైల్ సిబ్బంది సహకరిస్తుంటారు. భారత్‌లో 815జువెనైల్హౌమ్లు ఉన్నాయి. ఇందులో 17లక్షల మంది ఉండటానికి అనుకూలంగా ఉన్నట్లు ఎన్సీఆర్బీ (జాతీయ క్రైం రిపోర్టు బ్యూరో) చెప్పింది. కానీ లక్ష్యానికి మించి బాలనేరస్తులను ఈ జైళ్ళలో కుక్కారు. 12-18ఏండ్ల వారికి కనీసం మూడేండ్లు మించకుండా శిక్షలు విధించాలి. జువెనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం బాల నేరస్తులను సంస్కరించే ప్రయత్నం చేయాలి. బాల నేరస్తుల జైళ్ళల్లో మానసిక స్థితి సరిగాలేని వారు, ఆంగవైకల్యం ఉన్నవారు, పౌష్టికాహార లోపం ఉన్నవారు ఉన్నారు. వీరిపై జరుగుతున్న ఆకృత్యాలు వర్ణించ వీలులేనివి. తోటి నేరస్తులు, సిబ్బంది వీరిపై నిరంతరం లైంగికదాడులు చేస్తుంటారు. వీరికి వస్తున్న ఆహార కోటాలను కాజేస్తూ ఉంటారు.
'ఆసియాన్ సెంటర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్'' సంస్థ సర్వే ప్రకారం 39మంది పిల్లలపై లైంగికదాడులు జరిగినట్టు నివేదిక చెప్పింది. ఢిల్లీ అలీపూర్ జాతీయ జైల్లో పిల్లలకు సెక్స్ వల్ల హెచ్ఐవీ సోకినట్టు నిర్ధారించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2019లో గుజరాత్లో (వడోదర) 91నేరాలు పిల్లలపై కేర్‌టేకర్/ఇన్చార్జ్ చేసినట్టు నివేదిక వచ్చింది. 2018లో పిల్లలపై 439 నేరాలు జరిగినట్లు రికార్డు అయినాయి. చాలా చోట్ల సిబ్బంది తక్కువగా ఉంది. 1670 మందిని ఢిల్లీ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల హౌంలకు పంపించారు. కొంతమందికి జరిమానాలు వేసి విడుదల చేశారు. దేశంలోని 19పట్టణాల్లో జువెనైల్ హౌమ్‌లు ఉన్నాయి. ఆహమ్మదాబాద్లో 76మందిపై ఆకృత్యాలు జరిగాయి. 2019 నేరాల నివేదిక ప్రకారం 196.53లక్షల నేరాలు జరిగినట్టు పోలీసులకు దరఖాస్తులు రాగా, 51.56లక్షల కేసులు మాత్రమే ఎఫ్ఐఆర్ చేసినట్టు ప్రభుత్వ నివేదిక చెప్పింది. స్పెషల్, లోకల్ చట్టాల ప్రకారం నేరాలు జరిగే సంఖ్య పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో జువెనైల్ హౌమ్ల పరిస్థితి
తెలంగాణలో 6 కేంద్రాలు ఉన్నాయి. పరశీలక గృహాలు, ప్రత్యే గృహాలతోపాటు హైదరాబాద్‌లో బాల నేరస్తుల కోసం ప్రత్యేక సదనం ఉంది. 3 పరిశీలక గృహాలలో 1001మంది ఉండగా ఈ కరోనా వలన 914 మందిని వారి కుటుంబాలకు అప్పగించారు. బాల సదనంలో 708మందికి 574 మందిని ఇండ్లకు పంపారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్లో ఈ నేరస్తులైన పిల్లల కోసం నిర్వహణ పద్దు కింద రూ.9.43 కోట్లు, ప్రగతి పద్దు కింద 1.1కోట్లు మొత్తం 10.54 కోట్లు మాత్రమే వ్యయం చేస్తున్నారు. సహజంగా మొత్తం రాష్ట్రంలో 3,669 మంది బాల నేరస్తులు మొదటి నుంచి ఉన్నారు. కరోనా వల్ల ఈ సంఖ్యను తగ్గించారు. ప్రగతి పద్దుకు కేటాయించిన 1.11కోట్లు ఏ మూలకు? ఈ కేటాయింపుల కింద విద్యా సౌకర్యం, మానసికంగా, శారీరకంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, బలవర్థకమైన ఆహారం, బట్టలు సర్దుబాటు చేయడం సాధ్యమేనా? దీనికి తోడు ఈ రాష్ట్రంలో జరిగిన ఆకృత్యాలు అత్యంత దుర్మార్గమైనవి. కరీంనగర్ జిల్లా (వెలిచాల, స్వాదార్హౌమ్)లో పరిస్థితులు ఆధ్వానంగా ఉన్నట్టు ఆకస్మికంగా పర్యటించిన హైకోర్టు జడ్జీ పి.నవీన్‌రావు ప్రకటించాడు. మగ పిల్లల హౌంలో ఆహార వసతులు బాగాలేవని, పౌష్టికాహారం ఇవ్వడం లేదని సూపర్వైజ్ చేసే మెకానిజం కొరతగా ఉందని ఆరోపణలు చేశారు. పిల్లలు తమపై జరుగుతున్న నేరాలను వారికి వివరించారు. జస్టిస్ నవీన్‌రావు కరీంనగర్ ప్రిన్స్‌పుల్ జడ్జిని ఆదేశిస్తూ ఫిబ్రవరి 4లోపు బాలదసన్ను పర్యటించి నివేదిక ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రిన్సిపుల్ సెక్రెటరి (జైళ్ళ శాఖ), మహిళా శిశు సంక్షేమశాఖ డీజీపీ వెలిచాల సదనంలో జరుగుతున్న నేరాలపై స్పందించారు. తెలంగాణలో ఆనాధ పిల్లలు ప్రతి పట్టణంలో తిరుగుతున్నారు. హైదరాబాద్‌లోనే 20వేల మంది ఉన్నట్టు ఒక సర్వే తెలిపింది. వీరు అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో పని చేయడమేగాక ఆవాసాలు లేక బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో కాలం వెళ్ళదీస్తున్నారు. దాదాపు ప్రతి జిల్లాలో ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా ఉంది. వీరిని సమీకరించి అబ్జర్వేషన్ కేంద్రాలలో పోషించడం ద్వారా మంచి పౌరులుగా తీర్చి దిద్దవచ్చు. కానీ పాలకులు, పోలీసులు వీరిని నేరాలకు ప్రోత్సహించి నేరమయ సమాజం పెరగడానికి ఊసిగోల్పుతుండటం వాస్తవం. 18ఏండ్ల లోపు వయస్సుగల పిల్లల మానసిక స్థితిని గమనించి వారికి మంచి భవిష్యత్ చూపడం కన్నా, నేరాలపై కేంద్రీకరించే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల తెలంగాణ సమాజంలో కూడా భావి భారత పౌరులుగా ఎదగవల్సిన పిల్లలు ఎందుకు కొరగాకుండా పోతున్నారు. బడ్జెట్లో వీరికి కేటాయించిన నిధులు గమనిస్తేనే ప్రభుత్వానికి వీరిపైగల శ్రద్ద ఏపాటిదో తెలిసిపోతుంది. రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి అతిధులు వచ్చినప్పుడు వీరు రోడ్లపై కనబడకుండా చేస్తారు. ఆ తరువాత ప్రతి కూడలిలో బిక్షాటనతో పాటు నేరాలు చేస్తుంటారు. పోలీసులకు కేసులు తక్కువ వచ్చినప్పుడు వీరిపై నేరాలు మోపీ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక పోలీసు స్టేషన్లో ఒక నెలపాటు ఏ నేరాలకు సంబంధించిన కేసులు రాకపోతే అక్కడి వారు సక్రమంగా పని చేయడం లేదని పై అధికారులు ఆరోపణ చేస్తారని నేరాలు లేకున్నా కేసులు నమోదు చేయడం అనుభవంలో చూశాం.
కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే పిల్లల హక్కులకు రూ.18 కోట్లు, దత్తత తీసుకోడానికి రూ.10 కోట్లు, ఆడ పిల్లల అభివృద్ధికి (11-14ఏండ్ల వయస్సు గల వారికి) రూ.50 కోట్లు, పిల్లల రక్షణకు రూ.821 కోట్లు, స్వాదార్ ఇండ్లకు రూ.25 కోట్లు మాత్రమే కేటాయించారంటే కేంద్ర ప్రభుత్వానికి పిల్లలపై ఉన్న శ్రద్ద ఏపాటిదో కనబడుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద వహించి భావి, భారత పౌరులు కావాల్సిన పిల్లలకు, బాల బాలికలకు అత్యధిక నిధులు కేటాయించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. వారిపై జరుగుతున్న నేరాలను ఆరికట్టి మానసికంగా నేర సమాజంవైపు నెట్టకుండా మంచి పౌరులుగా అభివృద్ధి చేయాలి. ఇందుకు ప్రభుత్వాలు పూనుకుంటాయా?
- సారంపల్లి మల్లారెడ్డి
సెల్: 9490098666