Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల కోరల్లో ఇంటర్ విద్యామండలి బందీ అయ్యింది. ఇంటర్ బోర్డును పర్యవేక్షణ చేయాల్సిన ప్రభుత్వం కూడా రాజకీయ ప్రలోభాల ఊబిలో గాలికోదిలేసింది. గతంలోనే అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పరీక్షలు నిర్వహణకు అనుభవం లేని ''గ్లోబరీనా'' సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో 23మంది విద్యార్థులు బలవర్మణానికి కారకులయ్యారు. ఆ బిడ్డల తల్లిదండ్రుల రోదన ఎంత చర్చ అయ్యిందో, ఎన్ని పోరాటాలు జరిగాయో మనందరికీ తెలిసిందే. అయినా ఇంటర్ బోర్డు తీరు మారలేదు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల ప్రేమలో మునిగి తెలుతున్నది. కరోనా కారణంగా గత సంవత్సరం పరీక్షలు, ఈ సంవత్సరం పరీక్షలు రద్దు అయ్యాయి. కానీ ఈ పరీక్షల కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులు నుంచి లక్షలాది రూపాయాలు ఫీజుల పేరుతో వసూళ్లు చేశాయి. చదువులు చెప్పకుండానే ఇన్ని లక్షల రుపాయాలు వసూళ్లు చేస్తున్నా ఇంటర్ బోర్డు కానీ, ప్రభుత్వం గానీ నోరు మెదపలేదు. ఈ విద్యా సంవత్సరం కూడా పది ఫలితాలు రాకుండానే ఈ సంస్థలు ప్రవేశాలు మొదలుపెట్టాయి. గత లాక్డౌన్ సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పి, తర్వాత జీవో జారీచేశారు. కరోనా కారణంగా ప్రజలు తమ ఉపాధి కోల్పోయారు. ఫీజులు పాఠశాల నుంచి కళాశాల వరకు ఎవరూ కోత్తగా ఫీజులు పెంచకూడదు, ఉన్న ఫీజులు కూడా ''ఇన్స్టాల్మెంట్'' రూపంలో నెల, నెల తీసుకోవాలని చెప్పారు. ఒక్కశాతం ఫీజు కూడా గత సంవత్సరం నిర్ణయం చేసుకున్న దానికంటే పెంచకూడదు అని చెప్పినా ఆచరణలో ప్రభుత్వం పర్యవేక్షించింది లేదు. దానిని ఇంటర్‌బోర్డు అమలు చేసిందీ లేదు. ఈ విద్యాసంవత్సరం, చదువులు ఎలా ఉండాలి అనే దానిపై ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్చ చేయకముందే కార్పొరేట్ విద్యా సంస్థలూ, కోచింగ్ సెంటర్లూ విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, ఆన్లైన్ క్లాసులకే సంవత్సరానికి కనిష్టంగా రూ.లక్ష యాభై వేలు, గరిష్టంగా రూ.రెండులక్షల యాభై వేల రూపాయాల ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు రాకుండానే ప్రవేశాలు చేస్తూ, భౌతికంగా తరగతులు నడిపిస్తున్నా ఇంటర్ అధికారులు మాత్రం నిమ్మకు నిరెత్తినట్టుగా ఉన్నారు. పది పాసైన విద్యార్థుల డేటా అక్రమంగా పోంది, టెలికాలర్లను పెట్టుకుని తల్లిదండ్రులకు రోజుకు పదిసార్లు ఫోన్ చేసి మా కాలేజీలో చేరండి అంటూ ప్రలోభలకు గురిచేస్తున్నా ఇంటర్ బోర్డులో ఉలుకూలేదు, పలుకూలేదు. యథేచ్చగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులను వారి బుట్టలో వేసుకునేందుకు వారి నుంచి డబ్బులు దండుకునే విధంగా స్కాలర్ షిప్ టెస్టులను శ్రీచైతన్య ''ఎస్.స్కోర్'' నారయణ ''ఎన్.స్కోర్'' ఆకాష్, ఫ్రిడ్జ్ వందశాతం స్కాలర్ షిప్ పేరుతో ప్రతి విద్యార్థి నుంచి రూ.125 ఎంట్రన్స్ ఫీజు తీసుకుని పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు ద్వారా కోటి రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతోనే వసూళ్లు చేశారు. ఈ పరీక్ష గతంలోనే నిర్వహించే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. పైగా ఈ టెస్టులు నిర్వహణ చట్టరీత్యా నేరంగా పరిగణించినా, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఆన్లైన్లో మే 30న ఈ పరీక్ష నిర్వహించాయి. దీనిపై ఇంటర్ బోర్డుకు సమాచారం ఉన్నా, ఫిర్యాదులు వచ్చినా కనీసం పట్టించుకోలేదు సరికదా.. ఒక్క నోటీసు ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఇంత ప్రేమ అ విద్యాసంస్థలపై ఎందుకో ఆ అమాత్యులకే తెలియాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే కరోనా విజృంభిస్తున్నా నారాయణ విద్యాసంస్థ మాధాపూర్‌లో భౌతికంగా తరగతులు నిర్వహిస్తూ పట్టబడితే కేవలం షోకాజ్ నోటీసులతో వదిలిపెట్టారు. మెహదీపట్నంలో ఓ కళాశాల అప్పటికే అడ్మిషన్లు పూర్తి అయ్యాయని ప్రకటిస్తే దానిని కనీసం వివరణ కూడా అడగలేదు. ఆన్లైన్ తరగతుల షెడ్యూల్ వేసుకొని మరీ తరగతులు నిర్వహిస్తూ 50శాతం ఫీజులు కట్టి పుస్తకాలు తీసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నారు. ఫీజులే లక్షా 50 వేలు ఉంటే, అవిగాక అడ్మిషన్ ఫీజు రూ.10,500, పుస్తకాలు ఫీజు రూ.10,000, డ్రస్ రూ.3,000 ఇలా మళ్ళీ అదనపు ఫీజులు ఇవన్నీ ఆన్లైన్ క్లాసులకే వర్తింపజేస్తున్నారు. హస్టల్స్ ఉన్నా లేకున్నా హస్టల్స్ ఫీజులు కలిపి వసూళ్లు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశాలు చేస్తూ ఆరచకాలు చేస్తున్న ఈ కార్పొరేట్ సంస్థలపై చర్యలకు ఇంటర్ బోర్డు ఎందుకు జంకుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలి. కార్పొరేట్ దోపిడీ నియంత్రణకై ప్రత్యేక టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల గుర్తింపు రద్దుచేయాలి. అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న విద్యాసంస్థల గుర్తింపు శాశ్వతంగా రద్దు చేయాలి. ప్రభుత్వ విద్యారంగాని కాపాడాలి.
- టి. నాగరాజు
సెల్:9490098292