Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మే 23న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు, భారతీయ జనతా పార్టీల ఉన్నత స్థాయి కమిటీ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ, హౌం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సునీల్ బన్సాల్, ఆరెస్సెస్ కార్యదర్శి దత్తాత్రేయ హాసబేల్లు హాజరయ్యారు. సంఫ్‌ుపరివార్ ఉన్నతస్థాయి రహస్య సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ప్రధాన స్రవంతిలో వచ్చే వ్యక్తీకరణలతో పాటు మీడియాలో వస్తున్న కథనాలను చర్చించారు.
మీడియా కథనాల ప్రకారం.. ఈ సమావేశం ముఖ్యోద్దేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పనితీరును, ముఖ్యంగా యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంలోని ప్రభుత్వ తప్పుడు విధానాలను సరిచేయడం. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ను గానీ, యూపీ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌ను గానీ ఆహ్వానించలేదు. ఈ వాస్తవాన్ని పేర్కొంటూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజల వ్యతిరేకత వలన వాటిల్లే నష్టాలను నివారించేందుకు ఈ సమావేశం జరుగుతుందనీ, యోగీ, రాష్ట్ర అధ్యక్షుడు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ చర్యలను సమర్థించుకుంటుంటే, వారి వల్ల పక్కదారి పట్టడం ఉన్నత స్థాయి నాయకత్వానికి ఇష్టం లేదని, మీడియా, సోషల్ మీడియా విశ్లేషకులు అంటున్నారు.
ప్రధాని నియోజకవర్గమైన వారణాసి లాంటి ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కోవిడ్-2 నివారణా చర్యలను అత్యంత విచారించదగిన విధంగా నిర్వహించిన తీరు సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి ముందు అనేక మంది సీనియర్ బీజేపీ, ఆరెస్సెస్ సభ్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫిర్యాదులు చేశారు. తమ నియోజకవర్గాలలో పడకలు, ఆక్సిజన్ల సరఫరా, అంబులెన్స్‌లు సమకూర్చడంలో పాలనా యంత్రాంగం వైఫల్యం చెందుతుందని పేర్కొంటూ ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వైద్య విధానాలను విమర్శించారు. మే 23న సమావేశం తర్వాత, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు అదేపనిగా ప్రాధాన్యత ఉంటుండగా, యూపీ, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఆరెస్సెస్, వీహెచ్‌పీ సీనియర్లు మాత్రం ఇతర రాజకీయ, పాలనాపరమైన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెప్పారు. అదేవిధంగా ఈ సమావేశం కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులను, ముఖ్యంగా ప్రధానమంత్రి రాజకీయ, పాలనా యంత్రాంగం చేసిన తప్పులను కూడా చర్చించింది.
యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని నిర్దిష్టమైన మార్పులు జరుగుతాయనీ, ఇప్పటివరకు ముఖ్యమంత్రికి ఉన్న కొన్ని అధికారాలను తగ్గించే విధంగా మార్పులు ఉండవచ్చనీ, పాలనా విస్తరణ, సమర్థతను పెంచడం ప్రధానమైన లక్ష్యంగా ఉంటుందనీ, యోగీతో పాటు మోడీ సాధించిన విజయాలు, వైఫల్యాలు కూడా ఆరెస్సెస్ ఉన్నత స్థాయి నాయకుల పరిశీలనలో ఉంటాయనే సూచనలు కనిపిస్తున్నాయని సీనియర్ ఆరెస్సెస్ నాయకులు అన్నారు. ఆకస్మికంగా ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ చేతిలో ఓటమితో ప్రతికూలమైన ఫలితాలు సాధించిన వెంటనే ఉత్తరప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు రెండింటికీ సంబంధించిన ప్రాధాన్యతలు, దిశా నిర్దేశాలు చేయడం జరిగిందని అదే సంఫ్‌ుపరివార్ సీనియర్లు అన్నారు.
ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు సాధించిన వెంటనే ఆరెస్సెస్ సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ చొరవతో ఏర్పాటు చేసిన 'అపరిమిత అనుకూలత'కు సంబంధించిన వరుస ప్రసంగాలు, మే 15న స్వయంగా భగవత్ చేసిన ప్రసంగం ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సూచికలే. వాస్తవానికి వరుస ప్రసంగాల ప్రక్రియ నష్ట నివారణకు, తగ్గిపోతున్న మోడీ ప్రతిష్టను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగమే. ఒక సందర్భంలో మోహన్ భగవత్, ప్రభుత్వ, పాలనా యంత్రాంగం పర్యవేక్షణపై, ఉదాసీనతపై నిరసన తెలపండి అని ప్రజలను కోరాడు. ఏడు సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ బహిరంగంగా విమర్శించడం ఇదే ప్రథమం.ఆరెస్సెస్ ఉన్నత స్థాయి నిర్ణాయక కమిటీ అయిన 'ఆఖిల భారతీయ ప్రతినిధి సభ' మార్చి, 2021లో మోడీ నాయకత్వంపైన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఒక ఏకగ్రీవం తీర్మానం చేసింది. సంఫ్ుపరివార్లోని ప్రధాన అనుబంధ సంస్థల సభ్యులు, 'అఖిల భారతీయ ప్రతినిధి సభ' తొందరపడి చేసిన ప్రశంసలు అసహ్యంగాను, అసమంజసంగాను ఉన్నాయని భావించారు. ప్రత్యేకించి వందే భారత్ మిషన్, వ్యాక్సిన్ మైత్రి ప్రచారం, ప్రత్యేక శ్రామిక రైళ్ళు, కోవిడ్ వ్యాక్సిన్లను ఉదహరిస్తూ, మోడీ నాయకత్వం కోవిడ్‌తో పోరాడిన తీరును ఆ తీర్మానం ప్రశంసించింది. కానీ, రెండవ వేవ్ కోవిడ్‌ను నివారించడంలో బాగా వైఫల్యం చెందిన ఫలితంగా ఏర్పడిన పరిణామాలు, అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగా అమలు జరుగలేదని రుజువు చేశాయి. ఈ అవగాహనే మే 23 సమావేశానికి కారణం అనేది స్పష్టం.
ప్రభుత్వ పాలన పట్ల స్వయం సేవకులకు, సంఫ్‌ుపరివార్ సంస్థల కార్యకర్తలకు మధ్య ఉన్న ఆగ్రహం కేవలం ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదు. అనేక రాష్ట్రాల్లో వందల సంఖ్యలో సంఫ్‌ుపరివార్ కార్యకర్తలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి, కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును వ్యతిరేకిస్తూ, నిరుత్సాహంతో క్రమానుగతమైన నివేదికలు పంపుతున్నారు. రాజకీయంగా, ఎన్నికల పరంగా, ప్రజలను ఎదుర్కొనలేని అసమర్థత పెరుగుతుందని దాదాపు అన్ని నివేదికలు హెచ్చరించాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇవే రుజువు చేశాయి. ప్రభుత్వం, పాలనా యంత్రాంగాల పర్యవేక్షణ తీరును, ఉదాసీనతను నిరసించమని మోహన్ భగవత్ ప్రజలను కోరడం, సంఫ్‌ుపరివార్ సైద్ధాంతిక ప్రముఖులపై క్షేత్ర స్థాయిలో కార్యకర్తల ఒత్తిడిని సూచించింది. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన ఒత్తిడికి, కార్పొరేట్ ప్రముఖు లతో పాటు విభిన్న వర్గాల నుంచి ఆరెస్సెస్ ఉన్నత స్థాయి నాయకత్వానికి సమకూర్చే ఆర్థిక వ్యవస్థలోని సమస్యలు తోడైనాయి. ఆరెస్సెస్ ఉన్నత స్థాయి నాయకత్వం, ప్రభుత్వ పాలనపై ఆర్థిక నిపుణులు, కార్పొరేట్ పెద్దలతో మాట్లాడే విషయం తెలిసిందే.
ఆరెస్సెస్ అనుబంధ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో 'విప్రో' సంస్థ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ మాట్లాడుతూ.. ''మంచి శాస్త్రం యొక్క ముఖ్య భావన సత్యాన్ని అంగీకరించడం లేదా ఎదుర్కోవడం. ఆ శాస్త్రం, సత్యం పునాదులపై ఆధారపడే మనం ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చని'' అన్నాడు. సంఫ్‌ుపరివార్ ఉన్నతస్థాయి నాయకత్వానికి సలహాదారు, మరొక కార్పొరేట్ దిగ్గజం, కటక్ మహేంద్ర బ్యాంకు చైర్మన్ ఉదరు కటక్, మే 27న మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ జీడీపీలో 1శాతం నగదును ప్రభుత్వం ప్రజల చేతుల్లోకి పంపించాలని అన్నాడు.
తొమ్మిది నెలల్లో జరగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంలో ఆరెస్సెస్ ఉన్నత స్థాయి నాయకత్వం, అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటుందని, ఈ ఎన్నికల దృష్టితో తీసుకొనే చర్యలు ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కావని, ఒక సీనియర్ ఆరెస్సెస్ నాయకుడు అన్నాడు.
'ఫ్రంట్ లైన్' సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్,
- వెంకటేష్ రామకృష్ణన్
సెల్:9848412451