Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సకల చరాచర సృష్టిలోని ప్రతీ జీవికి పుట్టుక, ముగింపూ ఉంటాయి. మనిషి తయారు చేసే ప్రతి వస్తువుకు కాల పరిమితి ఉంటుంది. దాన్నే ఎక్సపయిరీ డేట్ అని అంటారు. అలాగే నాటకానికి ముగింపు, సినిమాకు ఎండింగూ కంపల్సరీగా ఉంటాయి. కానీ అదేంటో తెలియదుగాని... తెలుగు సీరియళ్లకు మాత్రం అవేవీ వర్తించవు. దేశంలో జీవ నదులైనా ఎండిపోవచ్చుగానీ వీటి ప్రవాహానికి మాత్రం అడ్డనేదే ఉండదు. సంవత్సరం మొత్తంలో ఆదివారాలు మినహా మిగతా అన్ని రోజుల్లోనూ నిర్ణీత సమయానికి ఠంచన్‌గా ఇవి టీవీ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతూ మనకు 'టైం పంక్చువాలిటీ'ని నేర్పుతుంటాయి. కాకపోతే ఒకటే చిక్కు. అత్యధిక సీరియళ్లలో ఆడవాళ్లనే విలన్లుగా చూపిస్తుంటారు. ఒక భర్తకు ఇద్దరు భార్యలు, అత్తా కోడళ్లకు మధ్య తగవులాటలు, ఆడ బిడ్డలకు.. వదినలకు పడకపోవటం... ఈ క్రమంలో ఒక పాత్రను చంపేందుకోసం ఇంకో పాత్ర రకరకాల కుట్రలు, కుతంత్రాలు పన్నటం పరిపాటిగా మారింది. మరోవైపు విపరీతమైన భావోద్వేగాలను పండిస్తూ.. విఠలాచార్య సినిమాలో మాదిరిగా మాటి మాటికి భయంకరమైన శబ్దాలు, విచిత్ర విన్యాసాలతో అవి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయనేది ఇప్పుడు ఇండిస్టీలో టాక్. పోనీ అదైనా ఒక వంద, రెండొందల ఎపిసోడ్లకైనా పరిమితమవుతున్నాయా...? అంటే ఏకంగా ఐదొందలు, వెయ్యి ఎపిసోడ్ల వరకూ దౌడు తీస్తూ ఏండ్ల పాటు జీడిపాకంలాగా సాగుతుండటం గమనార్హం. చిన్న పిల్లలు ఇప్పుడు మొబైల్ ఫోన్లకు, వీడియో గేమ్‌లకు వ్యసనపరులుగా మారినట్టు... టీవీ సీరియళ్లకు ఇంటిల్లిపాదీ ఎడిక్ట్ అవుతున్నారనేది ఇటీవల ఒక పరిశోధనలో తేలిన అంశం. ఇదే సమయంలో ఆయా సీరియళ్లలోని పాత్రల్లాగా కొన్ని కుటుంబాల్లోని వారు చిన్న చిన్న విషయాలకే విపరీతమైన ఎమోషన్స్‌కు గురవుతున్నారనేది కాదనలేని సత్యం. అందుకే ధారా వాహికలు తీసే నిర్మాణ సంస్థలు... ఈ విషయాలపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు సామాజిక వేత్తలు.
-బి.వి.యన్.పద్మరాజు