Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయోధ్యలో సీతాదేవి కంగారుపడుతున్నది. రామాలయంలో తనతో పాటు కొలువైవున్న రాముడు కనబడుట లేదు. అయోధ్య అంతా వెదికింది. ఎక్కడా రాముడి ఆచూకి కూడా లభించలేదు. ఇక లాభం లేదని ఆంజనేయుడిని తలుచుకుంది.
''ఏమి తల్లి ఆనతి?'' అంటూ వచ్చాడు ఆంజనేయుడు.
''నీ తండ్రి కనబడుట లేదు నాయనా?'' అంది సీతాదేవి.
''ఆంజనేయుడు అదిరిపడ్డాడు! రాములవారు కనబడుట లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళినా సీతామాతకు చెప్పకుండా ఎలా వెళ్ళగలడు?'' అని పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు.
''ఏమి నాయనా మాట్లాడవు? ఎలాగైనా నీ తండ్రిని వెదికి తీసుకుని రా.. నాయనా? రాముడు లేని ఈ ఆలయంలో నేను ఎలా ఉండగలను?'' అని దు:ఖంతో ప్రశ్నించింది సీతమ్మ.
''తల్లీ! నా రాముడు జగదభిరాముడు! జగదేక వీరుడు! ఆయనకు ఏ సమస్య రాదు! అయినా సరే రాములవారిని తీసుకొని వచ్చి నీ చేతిలో పెడతాను! నన్ను నమ్ము తల్లీ!'' అన్నాడు ఆంజనేయుడు.
''నాయనా ఆంజనేయా! త్రేతాయుగంలో నా ఆచూకి రాముడికి చెప్పింది నీవే! ఈ కలియుగంలో రాముడి ఆచూకి నాకు చెప్పాల్సిందీ నీవే! ఇది నీ చారిత్రక బాధ్యత నాయనా?'' అన్నది సీతమ్మ.
''చిత్తం తల్లీ!'' అని బయటకు వచ్చాడు ఆంజనేయుడు. త్రేతాయుగంలో సీతమ్మను వెదకటంలో కొంత శ్రమ అన్పించినా ఎలాగోలా తాను విజయం సాధించాడు. మరి ఇదేమో కలియుగం! ఈ పవిత్ర భారతావనిని పరిపాలన చేస్తున్నది ''రామభక్తులే''. పైగా వారంతా సాధారణ భక్తులు కాదు. తనను మించినవారు! ఎందుకంటే తాను రాములవారికి ఎంత భక్తుడైనా ఎక్కడా గుడికట్టించలేదు! తన గుండెల్లో మాత్రమే రాముడికి గుడి కట్టాడు. అందుకు ఒక్కపైసా ఖర్చుకాలేదు! కాని ఈ కలియుగ ''భక్తులు'' ఏకంగా అయోధ్యలోనే రాములవారికి గుడికడుతున్నారు. అలాంటి గుడిలో నుండి వెళ్ళవలసిన ఆగత్యం రాముడికి ఏమొచ్చిందీ? ఆంజనేయుడికి ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు! ఒక పక్క ఆలోచిస్తూనే, మరో పక్క రాముడిని వెదుకుతున్నాడు!
ఎలాగైతేనేం! రాముడి ఆచూకి ఆంజనేయుడికి దొరికింది! భారతదేశం చివరన కన్యాకుమారిలో సముద్రపు ఒడ్డున కనబడ్డాడు! ఎగిరి గంతేశాడు ఆంజనేయుడు.
''తండ్రీ! మీ ఆలయం వదిలి ఇక్కడికి వచ్చారెందుకు?'' అక్కడ నాతల్లి సీతామాత మీ కోసం ఎంతో ఆందోళన పడుతున్నది! నా భుజాలపై కూర్చోండి! అయోధ్యకు తీసుకుని వెళతాను!'' అన్నాడు ఆంజనేయుడు.
రాముడు మాట్లాడలేదు!
''తండ్రీ అయోధ్యను వదిలి రావటం మాకందరికీ ఎంతో బాధగా ఉన్నది. పదండి! మీ ఆలయానికి పోవుదము!'' అన్నాడు ఆంజనేయుడు.
రాముడుమాట్లాడలేదు!
''తండ్రీ! ఇది వర్షాకాలము! నిలువనీడ లేదు! నీవు అయోధ్య వదిలి రోజులు గడిచాయి! అయోధ్యలో నీకు ప్రసాదము పెట్టేవారు! నీవు తిని ఎన్ని రోజులైందీ! ఆకలిగొని ఉంటావు! ఈ పండైనా తిను''! అంటూ మామిడిపండు ఇవ్వబోయాడు.. ఆంజనేయుడు.
కాని లాభం లేదు! రాముడు నిర్వికారంగా చూస్తున్నాడు.
''స్వామీ! నేనేమైనా తప్పు చేసితినా! కనీసం నాతో మాట్లాడటం లేదు. నాతో మాట్లాడకపోతే నా మీద ఓట్టే!'' అన్నాడు ఆంజనేయుడు.
''అంతమాటనకు ఆంజనేయా'' నీవంటి భక్తుడు తప్పు చేయటమా? అని అన్నాడు రాముడు.
''స్వామీ! ఈ కలియుగ భక్తుల ముందు నేనంత? నీకు కనీసం చిన్న గుడి కూడా నిర్మించలేకపోయాను! కాని కలియుగ భక్తులు నీ కోసం ఈ భూమిమీదే అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించుతున్నారు! అంతపెద్ద దేవాలయం నుండి బయటకు రావటం ఏమీ న్యాయంకాదు దేవా!'' అన్నాడు ఆంజనేయుడు నిష్టూరంగా.
''అస్తమానం అయోధ్యలో ఆలయం పేరెత్తకు హనుమా!'' అన్నాడు రాముడు చిరాకుగా.
''అదేమిటి స్వామీ! అయోధ్య నీ జన్మస్థలం! పైగా నీకు ''కలియుగ భక్తులు'' వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అతిపెద్ద ఆలయం నీకోసం నిర్మిస్తున్నారు! ఆనాడు కంచెర్ల గోపన్న భద్రాద్రిలో నీకు గుడి కట్టిస్తేనే నీవు ఎంతో ఆనందించి గోపన్నను జైలు నుంచి విడిపించావు! గోపన్నకో న్యాయం, ఈ భక్తులకో న్యాయమా? ప్రశ్నించాడు ఆంజనేయుడు.
''నాయనా! నీవు కట్టిస్తున్న గుడిని మాత్రమే చూస్తున్నావు! కాని గుడి కట్టిస్తున్న మనుషుల్లోని మతలబు నీకు అర్థం కావటం లేదు!'' అన్నాడు రాముడు ఆవేదనగా..
''నీ భక్తులు నీకు మందిరం కట్టిస్తున్నారు. ఇందులో మతలబు ఏమున్నదీ నాకు అర్థం కావటం లేదు!'' అన్నాడు ఆంజనేయుడు.
''అయోధ్యలో మందిరం కట్టించమని నేను ఎవరికల్లోకి వచ్చి చెప్పలేదు. అయినా మందిరం కట్టాలంటూ దేశమంతా ప్రచారం చేశారు. దానికోసం మరో మత మందిరం కూల్చేశారు! ఆ తర్వాత మందిరం కట్టాలన్న భక్తులే అధికారంలోకి వచ్చారు! అంటే ఒక్కమాటలో చెప్పాలంటే నన్నూ, నా మందిరం పేరు వాడుకుని రెండు ఎంపీ సీట్ల నుంచి ఏకంగా అధికారంలోకి వచ్చారు!'' అన్నాడు రాముడు.
''ఎంతో ఆనందం స్వామి! నీ నామం ఉచ్ఛరిస్తే మోక్షం లభిస్తుందని అంతా చెబుతారు! కాని కలియుగంలో అధికారమే లభించింది! ఇంకేమి కావాలి స్వామీ?'' అన్నాడు ఆంజనేయుడు భక్తి పారవశ్యంతో...
రాముడు తన విల్లును తలకేసి కొట్టుకున్నాడు.
ఆంజనేయుడు ఖంగారు పడ్డాడు..
''హనుమా! నీవు గొప్ప భక్తుడవనుకున్నాను. కాని గుడ్డి భక్తుడవని అర్థమైంది! ఈ కలియుగ భక్తులు అధికారంలోకి వచ్చి ఏమి ఉద్ధరిస్తున్నారో చూడు! కరోనా వచ్చి అల్లకల్లోలమైతే పట్టించుకునే దిక్కులేదు. పెట్రోలు నుండి నూనెల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అయినా ఉలుకూ పలుకూ లేదు! పరిపాలన చేతకావటం లేదని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నాయి. ఐనా స్పందన లేదు. ఇదేమి పాలన అంటూ న్యాయస్థానాలు చీవాట్లు పెడుతున్నాయి. అయినా స్పందన లేదు! ఇలాంటి వారు నా భక్తులంటే నాకెంత అవమానం?'' అడిగాడు రాముడు.
''నిజమే స్వామీ!'' అంగీకరించాడు ఆంజనేయుడు.
''పరిపాలన ఇంత ఘోరంగా ఉంది! మందిరం నిర్మాణంలో కూడా అనేక అవకతవకలు, అక్రమాలు చేస్తున్నారు! మందిర నిర్మాణం కోసం మూడువేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. నా మందిరానికి అంత ఖర్చుపెట్టమని అడిగానా? భయంతోనో, భక్తితోనే ఇచ్చిన డబ్బును ట్రస్టులోని సభ్యులే దుర్వినియోగం చేస్తున్నారు!'' అన్నాడు రాముడు.
''నీ మందిరం కోసం ఇచ్చిన డబ్బును నీ భక్తులే దుర్వినియోగం చేస్తారంటే నమ్మలేకపోతున్నాను స్వామీ!'' అన్నాడు ఆంజనేయుడు.
''నమ్మక తప్పదు! నాయనా! మందిరం నిర్మిస్తున్నది అయోధ్యలో, కాని అయోధ్యకు దూరంగా బాగీజైసీ గ్రామంలోని మూడు ఎకరాల భూమిని రెండు కోట్లకు మందిర ట్రస్టు సభ్యులు రవిమోహన్ కొని, పావుగంట తర్వాత అదే భూమిని పద్దెనిమిదిన్నర కోట్లకు రామమందిర ట్రస్టుకే అమ్మివేశారు. అంటే కేవలం పావుగంటలో పదహారున్నర కోట్ల రూపాయలు మందిరట్రస్టు సభ్యులు స్వాహా చేశారు. నా మందిరానికి ఏమీ ఉపయోగపడని ఆ భూమిని డబ్బులు స్వాహా చేసేందుకే కొన్నారు! ఇదీ నాయనా మందిరం వెనకనున్న మతలబు!'' అన్నాడు రాముడు ఆవేదనగా..
ఆంజనేయుడికి ఏమిచేయాలో, ఏమి మాట్లాడాలో అర్థం కావటం లేదు. భక్తులు అందునా ''రామభక్తులు'' ఇలా చేయగలుగుతారా? అన్నది తన ఊహకే అందటం లేదు! కలియుగంలో ''రామభక్తులు'' ఇంతకు తెగించారా? డబ్బుకోసం, అధికారం కోసం పరమ పురుషుడైన రాముడిని కూడా వాడుకుంటారా? ఇదేమి ఘోరం! అని మదన పడుతున్నాడు.
నాపేరు వాడుకుని, అధికారంలోకి వచ్చిన ఈ ''భక్తులు'' చేస్తున్న అరాచకాలు భరించలేకపోతున్నాను. ప్రజల క్షేమం పట్టడంలేదు. కార్పొరేట్ల గురించి తీసుకునే శ్రద్ధ, సంపద సృష్టించే రైతుల మీదా, కార్మికుల మీదా లేదు. ఆఖరికి నా కోసం కట్టిస్తున్న మందిరంలో కూడా కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు. అందుకే అయోధ్యలో ఉండలేకపోతున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో కూడా ఉండాలన్పించటం లేదు!'' అన్నాడు భారంగా రాముడు.
''నిజమే స్వామీ! ఈ నయా భక్తులు ఎంతకైనా తెగిస్తారు! అధికారం కోసం, డబ్బు కోసం, నీకు, నా తల్లి సీతమ్మకు కీడు తలపెట్టినా ఆశ్చర్యం ఏమీలేదు! అందుకే సీతమ్మతల్లిని అయోధ్య నుండి తీసుకుని వస్తాను! ఆ తర్వాత మీ ఇద్దరినీ తీసుకొని ఎక్కడికైనా వెళ్లి పోతాను! అక్కడ మీకు ఎలాంటి సమస్య ఉండదు'' అంటూ ఆంజనేయుడు అయోధ్యకు బయలుదేరాడు.
- ఉషాకిరణ్