Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలపూడి ప్రసాద్ సాహిత్య, పాత్రికేయ, సామాజిక రంగాలలో 'కొప్ర'గా చిరపరిచితుడు. జూన్ 6న అకాల మరణం చెందిన విషయం నమ్మశక్యంగా ఉండదు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కొప్ర మరణం తీరని లోటు. కొప్ర కుటుంబం అంటే తాను, తన భార్య, బిడ్డ. అదే ఆయన ఆస్తి కూడా. సాహిత్య, సామాజిక రంగాలలో ఆయన కృషికి ప్రత్యేకత ఉన్నది. ఆయన కవీ, రచయిత, అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) సిద్ధాంత కర్త. నవతెలంగాణ ప్రారంభంలో... ఒక రోజు నాదగ్గరకు వచ్చాడు. ''నవ తెలంగాణలో నాకు ఉద్యోగం ఇవ్వాలి సార్. నాకు నవతెలంగాణ కాకపోతే ఎవరిస్తారు సార్? నేనిక్కడ పని చేయవల్సిన వాణ్ణి. ఇక్కడే పనిచేస్తా''. ఆయన ఉద్యోగం అడిగిన తీరు ఇది. నవతెలంగాణలో పని చేయటం ఒక హక్కుగా భావించాడాయన. అందుకే ఎడిటర్‌తో ఒక హక్కుగానే అడిగాడు. ఓకే.. అన్న తర్వాత వెళ్ళాడు. తరువాత కాలంలో ఆయన రచనలు చూస్తే అర్థమైంది... నిజంగానే నవతెలంగాణ లాంటి పత్రికలో పనిచేయటం ఆయన హక్కు.
మొదటి నుంచీ వామపక్ష సాహిత్యరంగంలో చురుకుగా పనిచేసారు. నెల్లూరుజిల్లాలో అతివాద సాహిత్యరంగంలో బాధ్యతలు నిర్వహించిన ఆయన, క్రమంగా ఉద్యమం ప్రజలకు దూరమవుతున్నదనీ, సాయుధ పోరాటం నేల విడిచి సాము చేయటమేనని గ్రహించానని ఆయనే స్వయంగా చెప్పాడు. కాని తుదిశ్వాస విడచే వరకూ వామపక్షవాదిగానే నిలిచాడు. మార్క్సిజాన్ని మించిన సిద్ధాంతం లేదని నమ్మాడు. దోపిడీ రహిత సమాజం కోసం తపించాడు. దానికోసమే రాసాడు. బతుకు తెరువు కోసం ఏ పత్రికలలో పనిచేసినా, ఆయన లక్ష్యం మాత్రం వీడలేదు. తన శక్తి సామర్థ్యాలను పాలకవర్గాలకు అమ్ముకుంటే బాగానే సంపాదించగలిగేవాడు. నమ్మిన సిద్ధాంతాన్ని, రచనా సామర్థ్యాన్ని పాలకవర్గాలకు తాకట్టుపెట్టి సొమ్ము చేసుకున్నవారెందరో ఉన్న సమాజమిది. కానీ సంపాదన బతకడానికి సరిపోతే చాలుననుకున్నాడు. తలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడలేదు. ఉదారవాద విధానాలు పాత్రికేయ, సాహిత్య రంగాలను కూడా ఆవహించిన కాలమిది. వ్యాపారమయమైన రోజులివి. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోలేదు. మధ్యలో కొంతకాలం మరో పత్రికలో పనిచేసినా.. త్వరలోనే తన రచనలకు అక్కడ స్థానం లేదనీ, నవతెలంగాణలో మళ్ళీ అవకాశం ఇవ్వాలనీ కోరి మరీ వచ్చాడు. ప్రపంచీకరణ కాలంలో ఉన్నాం. మీడియా మీద కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితులలో పాత్రికేయులు ప్రజల గొంతుకగా పనిచేయటం అంత సులభం కాదు. 'కొప్ర'ను వెన్నాడిన సమస్య కూడా ఇదే. నవతెలంగాణలో ఆయన రాసిన వ్యాసాలు గానీ, సంపాదకీయాలుగానీ, కథనాలు గానీ చదివిన వారెవరైనా వాటిలో 'కొప్ర' ముద్రను గమనిస్తారు. ఆయనదొక ప్రత్యేకశైలి. పేదల, బడుగు, బలహీన వర్గాల బాధలు హృదయానికి హత్తుకునేలాగా చెప్పగల సులభశైలి. కవితలు, గేయాలతో కలగలిపిన రచనలుగా సాగుతాయి. శత్రువు గుండెల్లో ఈటెల్లా గుచ్చుకుంటాయి. ఆయన ప్రత్యేకతలన్నీ నవతెలంగాణలో చార్వాక శీర్షికకు వన్నెతెచ్చాయి. ఆయన ప్రతి రచనలోనూ ప్రజల పట్ల నిబద్ధత కొలువుదీరుతుంది.
కుల వివక్ష, మహిళలపైన లైంగికదాడులు, మతోన్మాదం వంటి రుగ్మతలను చీల్చిచెండాడిన కలం ఆయనది. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన ఫిరంగులు ఆయన రచనలు. కేంద్రంలో మోడీ సర్కారు కొలువుదీరిన పూర్వరంగం, ఆ తర్వాత కాలంలో రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్న తీరును గ్రామీణ ప్రజలకు సైతం అర్థమయ్యే విధంగా రాయగల సమర్థుడు.
వెనుకబడిన తరగతుల ప్రజలను పాలకులు కేవలం ఓటర్లుగానే చూస్తున్నారనీ, మనుషులుగా చూడ నిరాకరిస్తున్నారనీ నిరంతరం ఆవేదన చెందాడు. ఆ ధోరణి వల్లనే వెనుకబడిన తరగతులలో కూడా జనాధిక్య కులాల మీదనే కేంద్రీకరించారనీ, సంక్షేమ పథకాల పేరుతో వారికి వలవేసారనీ గుట్టు విప్పాడు. సంచార జాతులనూ, సేవా కులాలనూ అందుకే విస్మరించారనీ బట్టబయలు చేసాడు. వీరిని అత్యంత వెనుకబడిన తరగతులుగా నామకరణం చేసాడు. వీరి హక్కుల కోసం నడుం బిగించాడు. అయితే... వర్గదృక్పథం మాత్రం వీడలేదు. కులంలో నోరుగలవారినీ, కుల నాయకులనూ పాలకవర్గాలు చేరదీసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని స్పష్టంగానే అర్థం చేసుకున్నాడు. కుల భావజాలాన్ని కాపాడుతున్నది ఆధునిక పెట్టుబడిదారీ వర్గమేననీ గ్రహించాడు. వర్గపోరాటం ఉధృతం చేయకుండా సామాజిక సమస్యలకూ పరిష్కారం లేదని గుర్తించాడు. కుల వివక్ష మీద పోరాడకుండా, కుల నిర్మూలనకు కృషి చేయకుండా భవిష్యత్లు లేదని బలంగా నమ్మినవాడు. ఈ భావాలనే పదునైన పదజాలంతో ప్రయోగించాడు.
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.. ఒక వైపు కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడుతున్నది. మరోవైపు రైతాంగం ఏడున్నర మాసాలుగా ఢిల్లీని చుట్టుముట్టింది. రైతు వ్యతిరేక చట్టాల మీద యుద్ధం ప్రకటించింది. కరోనా కాలంలో ప్రజలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. అంబానీలు, ఆదానీలు మాత్రం బలిసిపోతున్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాసు ధరలతో బాటు నిత్యజీవితావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. పాలకవర్గం మాత్రం కులాన్నీ, మతాన్నీ, సాధనంగా వాడుకుంటున్నాయి. ప్రజలను మతపరంగా విభజించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో 'కొప్ర' లాంటి పదునైన కలం జనానికి దూరం కావటం తీరని లోటు. యువ కవులు, రచయితలు 'కొప్ర' శైలినీ, రచనలో ఆయన పదునునూ సాధన చేయగల్గితే ప్రజా ఉద్యమాలకు మరింత తోడ్పడవచ్చు.
- ఎస్. వీరయ్య