Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూన్ 21, 2021 నుంచీ కేంద్ర ప్రభుత్వం 18ఏండ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులు, వ్యాక్సిన్ వేయటానికి ఉన్న మౌలికవసతులు, వేయించుకోవాల్సిన జనాభా మోతాదు నేపథ్యంలో రేపటి భారతం ఎదుర్కోబోయే సమస్యల గురించి చర్చించేందుకు ఒక ప్రయత్నం చేద్దాం.
జూన్ 19 నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తేశారు. వివిధ రాష్ట్రాలు కూడా తరతమ స్థాయిల్లో లాక్డౌన్ సడలింపులు అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు సైతం లాక్డౌన్ ఎత్తేయాలన్న దిశగానే ఉన్నాయి. జూన్ 21 నుంచీ దేశంలో వ్యాక్సినీకరణ ప్రపంచం కనివినీ ఎరుగని స్థాయిలో జరుగుతుందనీ, ఇక కోవిడ్ భయం ఉండనక్కర్లేదన్నది ప్రభుత్వం, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేవారి వాదన. కానీ నిపుణుల అవగాహన దీనికి భిన్నంగా ఉంది. ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ గులేరియా ఎన్డీటీవీతో మాట్లాడుతూ ''మొదటి, రెండో కోవిడ్ ఉప్పెనల నుంచి భారతదేశం పాఠం నేర్చుకున్నట్టుగా కనిపించటం లేదు. తిరిగి జనసంచారం సాధారణ స్థాయికి అందుకోనుంది. ఇలాగే కొనసాగితే ఆరువారాల్లో తిరిగి కోవిడ్ విజృంభించటం ఖాయం'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ముప్పై శాతానికి పైగా వ్యాక్సిన్ వేసినట్టు ఫేక్‌న్యూస్ చక్కర్లు కొడుతున్నప్పటికీ వాస్తవంగా పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ తీసుకున్న జనాభా ఐదుశాతం మాత్రమే. మొదటి, రెండో కోవిడ్ ఉప్పెనల మధ్య సుమారు ఎనిమిది నెలలు ఊపిరి తీసుకునే సమయం ఉంటే రెండు-మూడు నెల్ల వ్యవధిలోనే మూడో ఉప్పెన ముంచెత్తనుందని కాన్పూర్ ఐఐటి నిర్వహించిన అధ్యయనం హెచ్చరిస్తోంది. ఈ ప్రమాదం నుంచి దేశం బయటపడాలంటే సత్వర సార్వత్రిక వ్యాక్సిన్ కార్యక్రమం ఊపందుకోవాలి. మరి దీనికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా అన్నది ప్రశ్న.
కనీసం ఈ రెండునెలల్లో యాభైశాతం జనాభాకు వ్యాక్సిన్ డోసులు వేస్తే తప్ప మూడో ఉప్పెన ముప్పు నుంచి దేశాన్ని కాపాడటం కష్టమని చెన్నై కేంద్రంగా పని చేసే గణితశాస్త్ర అధ్యయనాల సంస్థ ప్రకటించింది. హర్డ్ ఇమ్యూనిటి అభివృద్ధి చేయటానికైనా ఈ మాత్రం డోసేజి అవసరం. దేశంలో ప్రస్తుతానికి మూడు రకాల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్, సీరం కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, రెడ్డి ల్యాబ్స్ దిగుమతి చేసుకుంటున్న స్పుత్నిక్. అదనంగా బయోలాజికల్ ఇ, మరో రెండు సంస్థలకు కేంద్రం ప్రొడక్షన్ కాంట్రాక్టు ఇచ్చింది. సీరం కంపెనీ వాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని మే నెల్లోనే 10కోట్ల డోసులకు పెంచుతామని హామీ ఇచ్చినా ఉత్పత్తిలో వచ్చిన అవాంతరాల కారణంగా జూలై వరకూ 6-7 కోట్లకు మించి ఉత్పత్తి అయ్యే అవకాశాలు లేవని ముందస్తు సమాచారం ఇచ్చింది. కోవాక్సిన్ ఉత్పత్తి కూడా ఆగస్టు నాటికి 6.5కోట్ల నుంచి ఏడు కోట్లకు చేరుకుంటుందని, సెప్టెంబరు నాటికి 10కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. స్పుత్నిక్ వాక్సిన్ 83కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరినప్పటికీ ఎప్పటిలోగా ఈ ఉత్పత్తి సాధ్యమవుతుందన్న విషయంలో స్పష్టత లేదు. రెడ్డి ల్యాబ్స్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు కోటి 20లక్షల డోసులు మాత్రమే. ఏవిధంగా చూసుకున్నా అక్టోబరు నాటికి దేశంలో 61కోట్ల డోసులుకు మించి వ్యాక్సిన్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ నిల్వలు సాధ్యమైతే అక్టోబరు నాటికి కనీసం 30కోట్లమందికి మాత్రమే మొదటి డోసు దొరికే అవకాశం కనిపిస్తోంది. జూన్ మొదటివారం నాటి సమాచారం ప్రకారం అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ అతితక్కువ జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చింది. మొత్తం ఉత్తరప్రదేశ్ జనాభాలో రెండు శాతం ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ దక్కింది. ఉత్తరప్రదేశ్‌లో కనీపం 30కోట్ల డోసులు పంపిణీ చేస్తే తప్ప బీజేపీ యంత్రాంగం ఎన్నికల్లో పైచేయి సాధించే అవకాశం లేదు. కాబట్టి ఈ డోసేజీ పంపిణీలో సైతం అనేక అసమానతలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలు చేరుకోవాలంటే అక్టోబరు నాటికి కనీసం 100కోట్ల డోసులు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం సమన్యాయం పాటించకుండా ఎన్నికల ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్ని రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.
పై అంచనాల ప్రకారం మూడో ఉప్పెన అక్టోబరు నాటికి కలవరపెట్టే స్థాయికి చేరనుంది. ఆ సమయానికి దేశంలో యాభైశాతం ప్రజలకు వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకోవటానికి కూడా 40కోట్ల డోసుల వ్యాక్సిన్ కొరత ఉంటుంది. ఫైజర్, మోడర్నా వంటి విదేశీ వ్యాక్సిన్లు డిసెంబరు తర్వాత కానీ దేశంలో విస్తృత స్థాయిలో అందుబాటులో ఉండే సూచనలు కనిపించటం లేదు. ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినీకరణ వేగంతో పోల్చి చూస్తే అక్టోబరు నాటికి దేశంలో అందుబాటులో ఉన్న డోసులు మొత్తం సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయగలిగితే అక్టోబరు నాటికి సుమారు 30 కోట్ల ప్రజానీకం వ్యాక్సిన్ పొందగలుగుతుంది. ఇందులో రెండు డోసులు పొందగలిగే వారిక సంఖ్య 10కోట్లకు లోపే. వ్యాక్సిన్ కంపెనీల లాభాల పరంగా చూస్తే ఇంత తక్కువ కాలంలో అంత స్థాయిలో వ్యాక్సిన్ అమ్మకాలు కంపెనీలకు మంచి లాభాలు గ్యారంటీ చేయగలవే కానీ సార్వత్రిక ప్రజారోగ్యం కోణంలో చూస్తే ఈ వేగం అవసరానికి తక్కువగానే ఉంది. కొన్ని కోట్లమంది ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితులు తెచ్చిపెడుతోంది.
అక్టోబరు నాటికి కనీసం 50శాతం జనాభాకు వ్యాక్సిన్ అందచేస్తే తప్ప హర్డ్ ఇమ్యూనిటి అభివృద్ధి అయ్యే అవకాశం లేదన్న వైద్యరంగ నిపుణుల హెచ్చరికలు గమనిస్తే ప్రభుత్వం సన్నద్ధత, పైన వెల్లడించిన వివరాలు మరింత ఆందోళనకర స్థితిని దేశం ముందుంచుతున్నాయి. మొదటి దఫా ఉప్పెన దేశమంతా ఒకేసారి వ్యాపించలేదు. అయినా దేశమంతా ఒకేసారి లాక్డౌన్ ప్రకటించి కోరి కష్టాలు నెత్తిన పెట్టింది కేంద్రం. కానీ రెండో ఉప్పెన దాదాపు నెలరోజుల్లోనే దేశమంతా విస్తరించింది. అయినా లాక్డౌన్ విధి విధానాలు రూపొందించటానికి మే నెల వరకూ కేంద్రానికి సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ మరణాల్లో 2021 మార్చి నుంచి మే మధ్యకాలంలో జరిగిన మరణాలే అత్యధికం. మూడో ఉప్పెనకు ఇంకా గడువు ఉందని, ఈలోగా మోడీ మాజిక్‌తో దేశమంతా వ్యాక్సిన్ అందుతుందన్న ప్రచారం మొదలైంది. ప్రచారం చేసేవాళ్ల ప్రయోజనం మోడీ ప్రతిష్టను పెంచటమే తప్ప ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించటం కాదన్నది వాస్తవం. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో మూడో ఉప్పెన వివిధ మోతాదుల్లో ప్రవేశించిందన్న వార్తలు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్త సగటు ఆధారంగా నిర్ణయాలు చేయకుండా రాష్ట్రాలు, ప్రాంతాల్లో నమోదయ్యే కేసులు, వెలుగు చూసే కొత్త వ్యాధి లక్షణాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వాల సామర్ధ్యాలు, భక్తుల ఇష్టాయిష్టాలను బట్టి వైరస్ విస్తరణ ఉండదన్న వాస్తవాన్ని గుర్తించి సమస్త ప్రజానీకం, స్థానిక స్వయంపాలన సంస్థలు మొదలు కేంద్ర ప్రభుత్వం వరకూ సమగ్ర సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ప్రజలను తప్పుదారి పట్టించే మరో ప్రచారం కూడా జరుగుతోంది. వైరస్ మ్యుటేషన్ జరగటం, సాపేక్ష వాక్సినేషన్ కలిసి వైరస్ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది ఆ వాదన. కానీ అమెరికా, ఇటలీ, గ్రీస్ అనుభవాలు చూస్తే ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ రూపాంతరం చెందుతున్న వైరస్లు మరింత ప్రమాదకరంగా ఉన్నాయన్నది వాస్తవం. మూడో ఉప్పెనలోనే అమెరికాలో అత్యధిక మరణాలు సంభవించాయి. అందువల్ల ఒకే అంచనాలు, అంకెల ప్రాతిపదికన అధ్యయనం చేస్తే మొత్తం వైరస్ వ్యాప్తి దృశ్యం మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ పని చేయాలన్నా శరీరంలో రోగనిరోధక శక్తి తగిన పాళ్లల్లో ఉండాలి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం వ్యాక్సినీకరణ వేగవంతం చేయటంతో పాటు ప్రజల రోగనిరోధక శక్తిని పెంపొందిం చేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులు, అవకాశాలు ఉపయోగించుకుని సమ్మిళిత వైరస్ నియంత్రణ వ్యూహాన్ని రూపొందించాలి.
- కొండూరి వీరయ్య
సెల్: 8971794037