Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధాని నరేంద్ర మోడీ చూడడానికి పూర్తిగా ఆధునిక వ్యక్తిగా కనబడతాడు. కాని, తనుకు తాను అతిగా మూఢ నమ్మకాలలో మునిగిపోతాడు. చంద్రమండలంపై పరిశోధన లను ప్రోత్సహిస్తాడు, అధునాతనమైన యుధ్ధ విమానాలకై ఆదేశిస్తాడు, మొదటి బులెట్ ట్రైన్ ప్రోజెక్ట్ను ప్రారంభిస్తాడు, భారతదేశాన్ని వ్యాక్సిన్ పవర్ హౌసుగా మారుస్తానని ప్రగల్భాలు పలుకడమే కాక, ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్‌తో పాటు ఆధునిక సైన్సుకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను కూడా పంపిణీ చేయగలమని చెపుతాడు. అదే సమయంలో సూడో సైన్స్ (బూటకపు శాస్త్రం) వైపు మళ్ళుతాడు. సార్స్ కోవిడ్-2ను పారద్రోలడానికి, విశ్వశక్తిని ప్రార్థించమని, శుభప్రదమైన సమయాల్లో పురాతన సంఖ్యా శాస్త్రం ప్రకారం, చేతిగంటలు మోగించమని, శంఖాలు పూరించమని ఉపదేశిస్తాడు. ఔషధ సంబంధిత ఆధారాలు గాని, పరిశోధనలు గాని చేయబడని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేత గుర్తించబడని, యోగా గురువు రాందేవ్ బాబాకు సంబంధించిన కల్పితమైన కల్తీ ఔషధాలను, మందులను తమ కాబినెట్ సహచరులు ప్రారంభిస్తుంటే ప్రధాని అభ్యంతరం చెప్పరు. గత పౌరాణిక కాలంలో ఏనుగు తలను గణేశుని మెడపైన అమర్చిన విధానాన్ని ఉదహరిస్తూ, ప్లాస్టిక్ సర్జరీని పాశ్చాత్య దేశాలు కనుగొనక ముందే మనదేశం ముందడుగులో ఉందని చెపుతాడు.
నోబుల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త, రిచర్డ్ ఫేమాన్ గడచిన అనేక యుగాలుగా ప్రచారంలో ఉన్న అన్ని విధాలైన సూడో సైన్స్‌ను ఊహాజనితమైన సైన్సుగా వర్ణిస్తూ, (కార్గో కల్ట్ సైన్స్) పురాతనమైన మంత్ర తంత్రాలు, ఊదూ (హైతీలో ఆచరించే మతం), భూత వైద్యులు, జ్యోతిషం, ఇంద్రియ జ్ఞానంతో విస్తరించిన చైతన్యం లైంగిక పటుత్వాన్ని పెంచడం కోసం ఖడ్గమృగం కొమ్ముల నుంచి తయారయ్యే మందు, ఇతర చర్చించదగిన అంశాలు అన్నీ కల్పితమైనవిగా తేల్చేశాడు. పసిఫిక్ మహాసముద్రంలోని దక్షిణ దీవుల్లో ఉన్న వారిని కార్గో కల్ట్ ప్రజలుగా చెపుతాడు. వీరు ప్రపంచ యుద్ధకాలంలో, విమానాలు వారి ప్రాంతంలో సరుకును దించడాన్ని గమనించారు. యుద్ధం తరువాత కూడా ఆకాశం నుంచి అలాంటి బహుమతులను స్వీకరించాలని భావించారు. కాబట్టి వారు రన్ వేస్ను పోలిన ఎయిర్ బేస్‌ను ఏర్పాటు చేసారు. ఇరువైపులా మంటలను ఏర్పాటు చేశారు. హెడ్ ఫోన్సులాగా కనబడే కర్రముక్కలను ఏర్పాటు చేసారు. ఏంటినాను పోలిన వెదురు కర్రలను పాతారు. తమకు తినడానికి అవసరమైన పదార్థాలను, సరుకులను ఇవ్వడానికి విమానాలు దిగుతాయని నిరీక్షించే వారు. పుల్లలను, మంటలను తిరిగి తిరిగి సరిచేస్తూ, ఎంతకాలం నిరీక్షించినా విమానాలు దిగలేదు. వారు ఏదో కోల్పోతున్నారు. వారు అంతా సవ్యంగానే చేశారు. కాని విమానాలు రాలేదు. వారు రూపాన్ని మార్చుకుంటున్నారే తప్ప వాస్తవాలపై ఆధారపడ లేదు. మనం వాస్తవంగా పనిచేయని అంశాలపైనే కేంద్రీకరించవలసిఉంది. అది సైన్స్ కాని సైన్సు అని ఫేమాన్ చెప్తారు. కార్గో కల్ట్ సైన్స్ (ఊహాజనితమైన సైన్సు) అనేది తాను పరిశోధనలో వాడిన పదాల సముదాయం, అది అనుకరణ శాస్త్రం. అయినప్పటికీ ఎప్పుడూ వాస్తవమైన ఫలితాన్ని ఇచ్చినట్టు కనబడదు. అది ప్రజల అంగీకారం పొందడానికి కఠినమైన పద్ధతులను అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది.
భారతదేశంలో ఎక్కువ మంది తమను విజ్ఞాన వంతులుగా చెప్పుకునేవారు, దేవధూతలు, భిన్నమైన నమ్మకాలున్న సాధువులు, స్థానిక ఆహార నియమాలను తెలియజేసే నిపుణులు, తమకు తాము డాక్టర్లుగా చెప్పుకునే వారు, పెరుగు, పాలు అమ్ముకొనే వారు, మందుల వ్యాపారులుగా మారి అనేక ప్రత్యామ్నాయ మందులతో వైద్యం చేయడం, సాంప్రదాయ వైద్యులు పరిమితమైన స్థాయిలో బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు తెలియజెప్పడానికి లాబ్సును ఏర్పాటు చేసుకోవడం, పాశ్చాత్య వైద్య పద్ధతిలో ఎక్స్‌రే, ఈసీజీ పరికరాలను సమకూర్చు కోవడం ద్వారా సైన్సుకు కట్టుబడినట్టు తమ పట్ల విశ్వస నీయత కలిగేటట్టు చేసుకుంటున్నారు. ప్రతిదీ నిగూఢ ఆహారాల చుట్టూ చక్కర్లు కొడుతూ, ఆవు పేడ, ఆవు మూత్రం అన్ని జబ్బులకు నివారణనీ.. కోవిడ్-19 వ్యాధికి కూడా అదే మందని చెప్పడం వల్ల దేశానికి ఎంతో నష్టంవాటిల్లింది. మధ్యతరగతికి వేదిక్ మందులు, కామేచ్ఛను, రోగనిరోధక శక్తిని పెంపొందించడం నుంచి తక్షణ మోక్షం పొందేవరకు హామీ ఇచ్చారు.
గృహ సంబంధిమైన ఔషధాలు తరచూ ఉపయోగకరమైనవే అనే విషయాన్ని తిరస్కరించలేం. బాగా జలుబు చేసిన వారికి నల్లమిరియాలు, పసుపు వేసి పాలలో కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. బాగా కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు మజ్జిగలో వెల్లుల్లి, అల్లం కలిపి తాగితే నెమ్మదిస్తుంది. కాళ్ళలో ఉన్న మొలలకు తాజా సున్నాన్ని పూయడం, పండిన అరటి పండు తొక్కతో ఇబ్బంది ఉన్న భాగాలపై చుట్టడం ద్వారా సర్జరీ లేకుండానే నివారించవచ్చు.
గృహ సంబంధమైన నివారణలనుంచి, ఆయుర్వేదం వరకు జబ్బులకు వివిధ రకాలైన నివారణా పద్ధతులు ఉపకరించాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు, గిరిజన తెగలు ఉపయోగించిన వైద్య విధానం ఉపయోగపడడమే కాక, తరతరాలుగా ప్రజలకు ఉపకారం చేస్తూ వస్తున్నది. కానీ వాటి పరిమితులను గుర్తించడమే కాక, అంగీకరించాలి. అధునాతనమైన మందులను, సైన్స్‌కు సంబంధించిన శాఖలుగా, ప్రస్తుత నమ్మకాలను, ఆచరించే విధానాలను ప్రశ్నించడమేకాక, ప్రయోగ పద్ధతులద్వారా మందులు పనిజేస్తున్నాయో లేదో కనుగొన్నారు. ఒకవేళ అవి పనిచేయకపోతే, కొత్త ఆలోచనలను ప్రోత్సహించారు. శాస్త్రీయ యుగానికి ఇది ప్రారంభం.
సైన్స్ రంగంలో గొప్ప వాళ్ళు తమకు తెలియని విషయాన్ని అంగీకరించినందు వల్లనే, ప్రశ్నించడానికి భయపడనందువల్లనే, శాస్త్ర విజ్ఞానాభివృద్ది సాధ్యపడింది. ప్రతి తరం విజ్ఞానం యొక్క మూలాలను తరువాత తరానికి అందించింది. ఎందువల్లనంటే, వారు తలుపులను తెలియనిదానికోసం తెరిచే ఉంచారు. ఏదీ ఏమైనా, సూడో సైంటిస్టులు సమాజానికి ప్రమాదకరమైన వారు. ఎందువల్లనంటే, వారు తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. అనుమానాల పట్ల, సందేహాల పట్ల అసహనంగా ఉంటారు. ఏది ఏమైనా, ఖచ్చితంగా తెలియని విషయం ఏమిటంటే, నిశ్చయంగా, పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అన్ని తలుపులనూ సూడోసైన్స్ మూసి వేస్తుంది, అభివృద్ధిని నిరోధిస్తుంది. ఇది నాగరికతకు ప్రాణాంతక మౌతుంది.
తిరిగి విషయానికి వస్తే, ప్రతి ఒక్కరూ మోడీ సైన్సుకు సంబంధించిన వాడా? లేక సూడో సైన్స్‌కు సంబంధించిన మనిషా? అనేది ఎవరినైనా ఆశ్చర్యానికి గురి చేయక మానదు. భిన్నమైన సందర్భాలలో పై రెండిటిని అతను ఎందుకు ముందుకు తెస్తున్నాడు? ఒకవేళ అది రాజకీయ వ్యూహంతో ఓటర్లను దృష్టిలో పెట్టుకొని, ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఒకవైపు అధునాతనమైన, హేతుబద్ధమైన, మరోవైపు సంప్రదాయబద్ధమైన మూఢనమ్మకాలతో ప్రయాణించినా, ఇటీవల జరిగిన ఎన్నికలలో పాచిక పారకపోగా, అనుకున్న ఫలితాలు రాలేదు. అతని పరస్పర విరుద్ధమైన సందేశాలు, ఆధ్యాత్మిక ప్రత్యేకవాదం, ప్రతీకారాత్మకవాదం, పురాణ రూపకాలు, ఇవేవీ భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో అధునాతన ఆర్థికవ్యవస్థగా ముందుకు తీసుకు వెళ్లాలని ఆసక్తితో ఉన్న ప్రధాని స్థాయికి పొసకనివి. మోడీ విధేయులు, అనుకూల శక్తులు పగసాధించే పద్ధతిలో వ్యవహరిస్తూ, ఒక దేశంగా భారతదేశానికి మచ్చ తేవడమే కాక, విజ్ఞానాభివృద్ధి వ్యతిరేకులుగా, అభివృద్ధి నిరోధకులుగా, అజ్ఞానులుగా, మూఢనమ్మకాలతో మధ్యయుగాలలోకి పోతున్న వారుగా గుర్తించలేకపోతున్నారు. మోడీ కార్యనిర్వాహకులు, శాస్త్రజ్ఞులు, ప్రణాళికలు రూపొందించే వారి నాయకత్వంలో అధికారంతో, తిరోగమన అభివృద్ధి నిరోధక, పూర్వాచార పరాయణుల చేతిలో లేక ప్రాబల్యానికి బందీఅయి, అభివృద్ధి స్తంభించిపోయింది. దీనివల్ల శాస్త్ర విజ్ఞాన పురోగతికి ప్రేరణ ఇవ్వలేక పోయింది. అదేవిధంగా తగిన వనరులతో అభివృద్ధికి తోట్పాటులేకపోవడం వల్ల భారతదేశం అభివృద్ధి అయిన ఆర్థిక వ్యవస్థల స్థాయిలో ఉండ లేకపోయింది. భారతదేశం ఇప్పటివరకు అభివృద్ధి అవుతున్న శక్తిగా ఉంది. ఆకస్మాత్తుగా మునిగిపోతున్న నావలా కనిపిస్తుంది. సూడో సైన్స్ అనే విపత్తు సముద్రంలో కూరుకుపోయినట్లనిపిస్తుంది.
భారతదేశ నాగరికత ప్రారంభ దశ నుంచి, జ్ఞాన సముపార్జన కోసం తపన పడుతూనే ఉంది. ప్రజల జీవితం యొక్క ఉనికిని అందజేసింది. మూడువేల సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టయితే, మన జాతి చరిత్రలో అవి సాహసంతో కూడిన ఆలోచనలే. ''మనిషికి తన సొంత చరిత్ర కంటే ఏది పవిత్రమైనది కాదు. మనం మన జాతిని దాని స్వభావాన్ని పరీక్షించు కోవాలన్నా, భారతీయులమైన మనకు ఉపనిషత్తులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంద''ని భారతీయ తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకష్ణన్ తెలియజేశారు. మన గతంలో అవమానకరమైన లోపాలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ జీవితానికి అవసరమైన అంశాలు అనేకం ఉన్నాయి. ప్రాథమికమైన ఉద్దేశ్యాలు, ప్రభుత్వం యొక్క ఆలోచనలు మన సంస్కృతికి అవసరమైన భాగాలుగా ఉంటాయి. అవి మన జీవితంలో భాగంగా స్వీకరించాలి.
ఈనాటి అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న వ్యక్తీకరణలను స్వీకరించవలసిన ఉంటుందని సర్వేపల్లి రాధాకష్ణన్ తెలియజేశారు.
మన ప్రధానమంత్రి పై విషయాలను ఆలకించాలి. అధునాతన సైన్స్ భారతీయ ఆలోచనలకు లేక చింతనలకు విరుద్ధమైనది కాదు. పరిశోధనాత్మక మేథస్సు, తెలుసుకోవాలనే ఆసక్తి, కొత్త ఆలోచనలను సేకరించడం, నూతన విజ్ఞానాన్ని సంపాదించడం, ఉపనిషత్తుల రోజుల నుంచి మన ఉనికిలోని ప్రధాన భాగంగా ఉంది. ఇంకేమాత్రం కాలయాపన చేయకుండా ప్రధాని మోడీ మన దేశాన్ని విజ్ఞాన శాస్త్ర మార్గంలోకి మళ్ళించాలి.
'ద హిందూ' సౌజన్యంతో
అనువాదం:మల్లెంపాటి వీరభద్రరావు
- జీ.ఆర్.గోపీనాథ్
సెల్:9490300111