Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్యంలో ప్రజలు తెలిపే నిరసన హక్కుకు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉగ్రవాద చర్యకు మధ్యన ఉన్న గీతను చెరిపేందుకు ఎవరూ పాల్పడరాదని ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఉపదేశం చేసింది. ఈ గీతోపదేశం నేడున్న పరిస్థితుల్లో ఎవరికైనా శిరోధార్యమే.
స్వార్థ ప్రయోజనాలతో, దురద్దేశ్యాలతో ఈ గీతను ఎవరు చెరిపేసినా అది మన భారత ప్రజాస్వామ్యానికే తీరని ప్రమాదమని కోర్టు హెచ్చరిక చేసింది. ఉగ్రవాద చర్యల నిరోధక చట్టాలను విచక్షణారహితంగా ప్రయోగించే ప్రభుత్వాలకు కోర్టు మాటలు చెంపపెట్టులాంటివని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కరోనాకు పూర్వం బీజేపీ ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ చట్టాలకు (సీఏఏ, ఎన్ఆర్సీ) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు జరిగిన విషయం విదితమే. ఆ ఆందోళనలు అణచివేసే క్రమంలో అక్కడక్కడా అల్లర్లు, హింసాకాండా చెలరేగాయి.
గత ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో జరిగిన హింసాకాండలో 53మంది మృతిచెందారు. ఈ సందర్భంగా పోలీసులు ఓ కుట్రకేసును నమోదు చేశారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యారన్థినులు నటాషా, దేవాంగన, విద్యార్థి ఆసిఫ్లతో సహా 17మందిని ముద్దాయిలుగా పేర్కొన్నారు. ఉ.పా.ఉగ్రవాదం, ఆయుధ వినియోగం, ప్రజల ఆస్తులకు నష్టం వంటి కఠిన చట్టాలను వారిపై మోపారు. అయితే కోర్టు తాజాగా పైముగ్గురికి బెయిలు మంజూరు చేసింది. వారు విడుదలయ్యారు.
శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశమై నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు అని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తమకు వ్యతిరేకమైన ప్రభుత్వ చర్యలపై చట్టాలపై ప్రజలు ఆందోళన చేయడం, నిరసనలు తెలపడం అత్యంత సహజమైన ప్రజాస్వామ్య సాంప్రదాయమని నొక్కి చెప్పింది.
ఒకవేళ ఆ ఆందోళనలు అదుపుతప్పి భిన్న పరిస్థితులకు దారితీసినా, వాటిని ఉగ్రవాద చర్యలుగా పరిగణించరాదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. ఒక్కోసారి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో భారీ ఎత్తున వ్యతిరేకత నెలకొన్నప్పుడు, ఆగ్రహ ప్రసంగాలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు, రైల్ రోకోలు వంటివి చోటు చేసుకుంటాయనీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సర్వసాధారణమని కూడా కోర్టు విశదపరిచింది. అంతమాత్రాన వాటిని ఉగ్రవాద చర్యలుగా భావించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది.
మనదేశం, మన ప్రజాస్వామ్య పునాదులు చాలా ధృఢమైనవని పేర్కొంటూ.. కేవలం కొద్దిమంది విశ్వవిద్యాలయ విద్యార్థుల బృందం చేసే నిరసనలతోనే అవి కదలిపోవని వ్యాఖ్యానించింది.
పార్లమెంటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉ.పా) చేయడంలో, ఆ నేపథ్యం 2004, 2008లో ఉగ్రవాద దురాగతాలను గుర్తుచుస్తూ, దేశరక్షణకు, దేశ ఉనికికి అలాంటి పెనుప్రమాదం సంభవించే పరిణామాలను ఎదుర్కోవడమే ఆ చట్టం ప్రధాన ఉద్దేశ్యమని వివరించింది. అలాంటి ప్రమాదకర నేరాల అభియోగాలను అనవసరంగా సాధారణ ప్రజలపై రుద్దడం పార్లమెంటు ఉద్దేశ్యాలనే కించపరచడం అవుతుందని హితవు పలికింది. నేరం రుజువు అయిన తర్వాతనే నిందితులకు శిక్ష పడుతుందని చెబుతూ.. తీవ్రమైన నేరంగా అభియోగంలో పేర్కొన్నప్పటికీ, ముద్దాయిలకు బెయిలు నిరాకరించడం సరికాదని వివరించింది. క్రింది కోర్టు బెయిలు నిరాకరణ తీర్పును హైకోర్టు కొట్టివేసింది.
అంతేగాకుండా నిర్దిష్ట ఆధారాలు ఏమీలేకుండా అభియోగాలు ఎలా మోపుతారని ప్రశ్నించింది. నటాషా విద్యానేపథ్యం, జీవనశైలి చూశాక... ఆమె అల్లర్లను రెచ్చగొడ్తారని, ఆమె కోర్టు విచారణ ఎదుర్కొకుండా పారిపోతారని, సాక్ష్యాలు తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరించి విచారణకు ఆటంకాలు సృష్టిస్తారని కేసులో పేర్కొనడం సహేతుకంగా లేదని కోర్టు భావించింది.
నటాషా, దేవాంగన, ఆసిఫ్లకు బెయిలు మంజూరు కావడం పట్ల నేడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవిధంగా ధర్మాసనాల వ్యాఖ్యలు, తీర్పులు మరిన్ని రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇది నిజంగా ప్రజాస్వామ్య విజయమని దేవాంగన తల్లి కల్పన అన్నారు. గత ఏడాదిగా ఆమె జైలులోనే ఉండటం వలన ఎవ్వరం చూడలేకపోయామని వాపోయారు. అసమ్మతిని అణచివేయాలన్న ఆతృతలో ప్రభుత్వం, నిరసనతెలిపే హక్కుకు, ఉగ్రవాద చర్యకు తేడా గమనించడంలేదని కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని సీపీఐ(ఎం) ప్రస్తావించింది.
హక్కుల ఉల్లంఘన అనేది నేరవిచారణ సందర్భంలో సైతం తరచూ జరుగుతున్నది. ఫలితంగా దోషులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. నిర్దోషులు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇప్పటి ఈ తీర్పు ప్రజాస్వామ్య ఆశలను చిగురింపజేస్తున్నది. అన్యాయంగా ప్రజలను జైళ్ళల్లో నిర్బంధించినప్పుడు న్యాయం తనకు తానుగా వెలుపల నుంచి కూడా మద్దతు కూడకట్టుకుంటుందన్న బెర్నార్డ్ షా మాటలు స్ఫురణకు వస్తున్నాయి.
- కె. శాంతారావు
సెల్: 9959745723