Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్19 వ్యాధికి గురై హాస్పిటల్స్‌లో ఇన్-పేషెంట్స్‌గా చేరుతున్న వారిలో సుమారు 20-30శాతం మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులున్నట్లు వైద్యనిపుణుల సర్వేలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్19 వ్యాధి బారిన పడ్డ మామూలు వ్యక్తుల కంటే కోవిడ్ సోకిన డయాబెటిస్ రోగుల్లో కోవిడ్ న్యూమోనియా, ఎక్యూట్ రెస్పిరేటరి డిస్ట్రెస్ సిండ్రోమ్ (A.R.D.S) వంటి కాంప్లికేషన్స్ 50శాతం ఎక్కువగా ఉంటున్నాయని తెలుస్తోంది. అందువల్ల వీరిలో ఆక్సిజన్ అవసరం, ఐ.సి.యు.లో చికిత్స శాతం ఎక్కువగా ఉంటున్నది. మనదేశంలో కోవిడ్19తో మరణించిన వారి సంఖ్యలో డయాబెటిస్ రోగులు ఎక్కువగా ఉండటం గమనార్హం. డయాబెటిస్ వ్యాధిలో ఎక్కువశాతంగా ఉండే టైప్-2 డయాబెటిస్ రోగుల్లో ఊబకాయం కూడా ఉండే అవకాశం ఉన్నందున కోవిడ్ వ్యాధి తీవ్రమయ్యే రిస్క్ వీరిలో ఎక్కువగా ఉంటున్నది. డయాబెటిస్ ఉన్న కోవిడ్ రోగుల్లో వ్యాధి లక్షణాలు తీవ్రమయ్యే పరిస్ధితి (severe covid) సంభవించడానికి ఈ క్రింది కారణాలు ప్రధానంగా దోహదం చేస్తాయి.
డయాబెటిస్ వ్యాధి కారణంగా ఆ వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్ధ పనితీరు గాడితప్పుతుంది (immune dysregulation).. దీని వలన వైరస్ ను ఎదుర్కొనే రక్షక కణాలైన ఫేగోసైట్స్, నేచురల్ కిల్లర్ సెల్స్ వంటి కణాల పని తీరులో సమతుల్యత దెబ్బతింటుంది. కోవిడ్ వైరస్ వలన అవయవాలు దెబ్బతినేలా దారితీసే వంటి వ్యాధిప్రక్రియకు అనుకూలమైన (pro-inflammatory) కణాల ప్రభావం ఎక్కువవుతుంది. ఇటువంటి మార్పుల ఫలితంగా డయాబెటిస్ రోగుల్లో కోవిడ్ వ్యాధి తీవ్రమయ్యే (cytokine storm) అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాక వ్యాధి నుండి కోలుకోవడానికి కూడా మామూలు రోగుల కంటే ఎక్కువరోజులు పడుతుంది.
నియంత్రణలోలేని హై బ్లడ్ షుగర్ (Uncontrolled Hyperglycemia) వలన మన శరీరంలో కోవిడ్ వైరస్ కణాలలోకి ప్రవేశించే ద్వారాలైన ఎ.సి.ఇ-2 గ్రాహకాల వ్యక్తీకరణ (ACE2 Receptors Expression) ఎక్కువవుతుంది. డయాబెటిస్ రోగుల్లో ఈ రకమైన పరిస్ధితి వైరస్ విస్తరణకు మరింత అనుకూలంగా మారుతుంది. నియంత్రణలోలేని హై బ్లడ్ షుగర్ వలన మోనోసైట్స్ వంటి రక్తకణాల్లో కోవిడ్ వైరస్ వేగంగా పునరుత్పత్తి (replication) జరిపి మరిన్ని కణాలకు విస్తరిస్తుంది. ఇది మరిన్ని అవయవాలకు, ఊపిరితిత్తులకూ విస్తరించి వ్యాధి తీవ్రమవుతుంది.
కోవిడ్19 విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రత్యేకంగా డయాబెటిస్ రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలు:బ్లడ్ షుగర్ లెవల్స్ ఖచ్చితంగా నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. సరైన మోతాదు మందులు క్రమం తప్పకుండా వాడాలి.జ్వరం, దగ్గు, ఆయాసం వంటి సాధారణ అనుమానిత లక్షణాలు కనబడ్డ వెంటనే అలర్ట్ అయ్యి కోవిడ్ టెస్ట్ చేసుకోవడం, డాక్టర్‌ను సంప్రదించి వెంటనే తగిన మందులు వాడటం చేయాలి.
కోవిడ్ వ్యాధి సోకి హౌమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారు రెగ్యులర్‌గా ఆక్సిజన్ శాచురేషన్ చెక్ చేసుకోవడంతో పాటు, గ్లూకోమీటర్ సహాయంతో బ్లడ్ షుగర్ (Self Monitoring of Blood Glucose) చెక్ చేసుకుంటూ నియంత్రణలో పెట్టుకోవాలి.
అవసరమైన సందర్భాలలో బ్లడ్ షుగర్ లెవల్స్, వ్యాధి లక్షణాలను బట్టి డాక్టర్ సలహాతో ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుని బ్లడ్ షుగర్ నియంత్రించుకోవాలి. కోవిడ్ వ్యాధి చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ అవసరమైనట్లయితే, మొదటి 5రోజుల తర్వాత తప్పనిసరి అయితేనే డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. స్టిరాయిడ్స్ విషయంలో సెల్ఫ్ మెడికేషన్, సోషల్ మీడియా నాలెడ్జి, నాన్-క్వాలిఫైడ్ వ్యక్తుల సలహాపై వాడకం వంటి అహేతుకమైన చర్యల వలన ఇప్పటికే బ్లాక్ ఫంగస్ (mucor mycosis) వంటి ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ చోటుచేసు కుంటున్నాయి. ఆహేతుకమైన స్టిరాయిడ్స్ వాడకం కలుగజేసే ఈ ప్రమాదకరమైన కాంప్లికేషన్ డయాబెటిస్ రోగుల్లో మరింత ఎక్కువగా ఉంటుంది.ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. పాలిష్ పట్టిన సన్న బియ్యం, ఆలుగడ్డ, బ్రెడ్, చక్కెర, జ్యూస్‌లు వంటి సరళ పిండిపదార్ధాలు (simple carbohydrates) తినవద్దు. ముడిబియ్యం, జొన్న, గోధుమ, యవ్వలు, తోటకూర, గోంగూర, బచ్చలికూర, మెంతికూర, బెండ, దొండ, దోస, టమాట, చిక్కుడు వంటి ఆకుకూరల రూపంలో సంక్లిష్ట పిండిపదార్ధాలు(complex carbohydrates), పీచుFiber)తో కూడిన ఆహారం తీసుకోవాలి. మాంసపుకత్తుల కోసం పచ్చసొనతో సహా కోడిగ్రుడ్డు రోజుకు ఒక్కటి తీసుకుంటే మంచిది. మాంసాహారులైతే చికన్, చేపలు వంటివి తరచుగా తీసుకోవచ్చు. రోగనిరోధకవ్యవస్ధను బలపరిచే యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే వాల్నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు వంటివి విరివిగా తీసుకోవాలి. విటమిన్-సి లభించే నిమ్మ, నారింజ(సంతరా), బత్తాయి (మోసంబి), కమలాలు వంటి పండ్లు తీసుకోవాలి. బెర్రీస్, ఆపిల్, జామ వంటివి కూడా విరివిగా తీసుకోవచ్చు.
హౌమ్ ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ డయాబెటిస్ రోగులు వీలైనంత చురుకుగా ఉండాలి. ఇంటిలోపల వీలైనంత స్థలంలోనే నడక, యోగా వంటి వ్యాయామాలు ప్రతిరోజూ చేయాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి.
అందుబాటులో ఉన్న కోవిడ్ వేక్సిన్‌ను వీలైనంత త్వరగా తీసుకోవాలి. వేక్సినేషన్‌కు ముందు బ్లడ్ షుగర్‌ను ఖచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి.
కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కూడా అందరిలాగే కోవిడ్ ప్రవర్తనావళి(Covid Appropriate Behaviour) అనుసరించాలి. పబ్లిక్ స్ధలాలలో, ప్రత్యేకించి సమూహాలకు దూరంగా ఉండటం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులు శుభ్రపర్చుకోవడం వంటివి తప్పనిసరిగా పాటించాలి.
గతంలో డయాబెటిస్లేని కొందరిలో కోవిడ్ వ్యాధి వలన కొత్తగా ''డయాబెటిస్'' వస్తున్నదా ?
ఈ ప్రశ్నకు సమాధానం అవుననే కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. స్పష్టంగా నిర్ధారించకపోయినా అనేక దేశాల్లో కోవిడ్ నుంచి కోలుకున్న కొందరు వ్యక్తులు కొత్తగా డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రెండు అంశాలు దోహదం చేస్తున్నట్లు వైద్యనిపుణులు అనుమానిస్తున్నారు.
1. ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే క్లోమగ్రంధిలోని బీటా కణాల పైన ఉండే ఎ.సి.ఇ-2 రిసెప్టార్ల (Aజజు2 =వషవజ్ూశీతీర) మీద కోవిడ్ వైరస్ కల్గించే ప్రభావం వలన బీటాకణాల పనితీరు దెబ్బతింటుదని తెలుస్తోంది. ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. 2. శరీరంలో అనేక అవయవాల్లో ఉండే ''డై పెప్టిడైల్ పెప్టిడేజ్-4 రెసెప్టార్స్'' (DPP-4 Receptors) ఇన్సులిన్-గ్లూకోజ్ మెటబాలిజంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈ రెసెప్టార్స్ కోవిడ్ వైరస్ ప్రవేశానికి అనుకూలంగా వ్యవహరి స్తున్నట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ రెండు అంశాల ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా ఇన్సులిన్ నిరోధకత వంటి మార్పులు జరిగి మునుపు డయాబెటిస్ లేని కొందరు కోవిడ్ రోగుల్లో కొత్తగా డయాబెటిస్ వ్యాధి మొదలవుతున్నట్లు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కానీ కొందరిలో కోవిడ్ వ్యాధి నుండి కోలుకున్న కొంతకాలం తర్వాత డయాబెటిస్ లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కొంతకాలం పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఏదేమైనా ఈ అంశంపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి వుంది.
డయాబెటిస్ రోగులకు కోవిడ్19 వ్యాధి సోకినట్లయితే వ్యాధి తీవ్రతకూ, కాంప్లికేషన్లకూ లోనయ్యే అవకాశం మామూలు వ్యక్తుల కంటే ఎక్కువగా ఉన్నందున, డయాబెటిస్ వ్యాధిని హై రిస్క్ కేటగిరిగా పరిగణించాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్, వద్దుల మాదిరిగా డయాబెటిస్ ఉన్న వారికి ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన కోవిడ్ వేక్సినేషన్ ఇవ్వబడేలా చర్యలు తీసుకోవాలి. డయాబెటిస్ రోగులు కోవిడ్19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సరైన అవగాహన కల్గివుండి, అలక్ష్యం చేయకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి.
- డా||కె.శివబాబు