Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లాకు కనీసం వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని బహిరంగ వేలం నిర్వహించి అమ్మేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత దుర్మార్గ విధానానికైనా ఆకర్షణీయమైన పంచదార పూత అద్దే కళలో నిష్ణాతులైన ఏలినవారు ''అత్యవసరంగా ప్రజోపయోగ అవసరాలులేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశం ఉన్న'' ప్రభుత్వ భూములను నిధుల సమీకరణలో భాగంగా అమ్మదలిచామని ప్రకటించారు. అత్యవసరమైన విషయాల్లో కూడ నిర్ణయాలు తీసుకోవడానికీ, తీసుకున్న తర్వాత అమలు చేయడానికీ ఏళ్లకేళ్లు తాత్సారం చేసే ప్రభుత్వం ఈ నిర్ణయం అమలుకు శరవేగంగా పని చేస్తున్నది. భూముల విక్రయానికి సంబంధించిన విదివిధానాలు ఖరారు చేసింది. వేగంగా అమ్మకాలు పూర్తి చేయడం కోసం అధికారుల స్టీరింగ్ కమిటీనీ, మంత్రివర్గ ఉపసంఘాన్నీ నియమించింది. అమ్మదలచుకున్న భూముల మీద వివాదాలను తొలగించమని కలెక్టర్లను ఆదేశించింది. ఆయా భూముల్లో లేఔట్లకు వెంటనే అనుమతులు ఇవ్వాలని పురపాలక సంస్థలను ఆదేశించింది. వేలం ముగిసిన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడం మాత్రమే కాదు, వేలం పాటలో దక్కించుకున్నవారికి మూడు వారాల్లో భూమి స్వాధీనం చేయాలని, వారంలో నిర్మాణాలకు అనుమతించాలని కూడ నిబంధనలు విధించింది. ఈ మొత్తం భూముల అమ్మకం ద్వారా ఈ సంవత్సరం ఇరవైవేల కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్రమంతటా అన్ని ప్రభుత్వ శాఖల దగ్గర వృథాగా పడి ఉన్న భూమిని గుర్తించాలనీ, పట్టణ ప్రాంతాల్లో, జిల్లా కేంద్రాల చుట్టుపట్ల ఉన్న భూములను అమ్మకం కోసం గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది.
అసలింతకీ ఇలా అమ్మదలచుకున్న ప్రభుత్వ భూమి ఎవరిది? దాన్ని అమ్మడానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న అధికారం ఎంత? ప్రభుత్వం అనేది గతంలో ఎప్పుడూ భూమి కొన్న దాఖలాలు లేవు. అది భూయజమాని ఎలా అయిందో, ప్రభుత్వ భూమి అనే మాటకు అసలు అర్థం ఏమిటో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. మామూలు అర్థంలో చెప్పాలంటే ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటున్నారు గనుక ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రభుత్వం చేసిన నిర్ణయంలో ప్రజల భాగస్వామ్యం ఎంత, తమ భూమి ఇలా పందారం చేయడానికి ప్రజలు అనుమతించారా వంటి ప్రశ్నలు వేయవచ్చు.
ఆ ప్రశ్నలు అలా ఉంచి, తెలంగాణ చరిత్ర తెలంగాణలో ''ప్రభుత్వ భూమి'' గురించి ఆశ్చర్యకరమైన వాస్తవాలు చెపుతుంది. తెలంగాణను, తెలంగాణతో పాటు కన్నడ, మరాఠీ జిల్లాలనూ పద్దెనిమిదో శతాబ్ది మొదటి నుంచీ 1948 వరకు పాలించిన అసఫ్ జాహి పాలనాకాలంలో అతి ఎక్కువ భూమి మీద యాజమాన్యం రాజుకూ, ప్రభు వర్గీయులకూ, భూస్వాములకూ ఉండేది. రాచరిక యుగంలో రాజ్యమంతా రాజుదే అనే అవగాహన ఉన్నప్పటికీ, అసఫ్ జాహి రాజులు తమ సొంత ఖర్చు, ఇంటి ఖర్చు (సర్ఫ్ ఎ ఖాస్) కోసం రాజ్యం మొత్తం ఐదు కోట్ల ఎకరాల భూమిలో పదో వంతు, యాభై లక్షల ఎకరాల భూమిని ప్రత్యేకంగా కేటాయించుకున్నారు. అది కాక, పాయెగాలు, ఉమ్రాలు, ఇలాఖాలు, ఇజారాలు, సంస్థానాలు, జాగీర్లు, మక్తాలు, దేశముఖ్ లు, దేశపాండేలు వంటి అనేక భూస్వామ్య అంతరాల రూపంలో మరొక రెండు కోట్ల ఎకరాల భూమి ప్రభు వంశీయుల, భూస్వాముల వ్యక్తిగత ఆస్తిగా ఉండేది. 1954-55ల్లో అర్థశాస్త్రవేత్త ఎ ఎం ఖుస్రో నేతృత్వంలో జరిగిన వివరమైన అధ్యయనం ప్రకారం, రాజ్యంలో 1961 గ్రామాల్లో సర్ఫ్ ఎ ఖాస్ భూమి, 1194 గ్రామాల్లో పాయెగా భూమి, 1243 గ్రామాల్లో ఉమ్రాలు, ఇలాఖాల భూమి, 497గ్రామాల్లో సంస్థానాల భూమి, 3122 గ్రామాల్లో జాగీర్లు, వగైరాల భూమి ఉండేది. అంటే రాజ్యం మొత్తం మీద ప్రతి గ్రామంలోనూ ఈ భూములు ఉండేవన్నమాట. ఒక్క సర్ఫ్ ఎ ఖాస్ మాత్రమే లెక్కించినా మొత్తం 1961 గ్రామాల్లో 900 తెలంగాణ ప్రాంతానివి. అందులోనూ 600 గ్రామాలు అత్రాఫ్ బల్దా జిల్లాలో, అంటే ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు చెందినవి.
ఈ లక్షల ఎకరాల మీద వ్యక్తిగత యాజమాన్యం హైదరాబాద్‌పై సైనిక చర్య తర్వాతి పరిణామాల్లో రద్దయింది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్నాక, సైనిక ప్రభుత్వం 1949 ఫిబ్రవరిలో సర్ఫ్ఎ ఖాస్ రద్దు చట్టాన్ని ప్రకటించింది. 1949 ఆగస్ట్‌లో జాగీర్ల, ఇనాంల రద్దు చట్టం ప్రకటించింది. ఈ రెండు చట్టాల ద్వారా హైదరాబాద్ రాజ్యంలోని విస్తారమైన భూమి భూస్వామ్య బంధనాల నుంచి విముక్తి అయిందనాలి (ఆ విముక్తి నిజమైన విముక్తి కాదనేది వేరే కథ). ఆ తర్వాత 1950, 1954ల్లో హైదరాబాద్ ప్రభుత్వం చేసిన కౌల్దారీ రక్షణ చట్టాల వల్ల ఈ భూమిలో కొంత ఆ భూమిని కౌలుకు చేస్తుండిన రైతులకు దక్కింది. అయితే అప్పటికీ, కౌలుదార్లులేని భూమి, పడావు భూమి, అటవీ భూమి, కొండల భూమి, చెరువుల, కుంటల భూమి ఒక్క కలం పోటుతో ప్రభుత్వ భూమి అయిపోయింది. లేదా అన్యాక్రాంతమై పోయింది. అదే సమయంలో ఉన్నత, ప్రభువంశీక భూస్వాములు కొందరు పోలీసుచర్య తర్వాత ఇతర దేశాలకు తరలిపోవడంతో వారి స్థిరాస్తులు, భూమి, భవనాలు లావారిస్ ఆస్తులుగా ప్రభుత్వాధీనంలోకి వచ్చాయి.
అందువల్ల హైదరాబాద్ ప్రభుత్వం హఠాత్తుగా లక్షల ఎకరాల భూస్వామి అయింది గాని ప్రభుత్వం ఆ భూమిని వాస్తవంగా స్వాధీనం చేసుకోని చోట్ల, వివాదాలు ఉన్న చోట్ల కబ్జాదార్ల రాజ్యం మొదలైంది. తెలంగాణ - ఆంధ్ర విలీనానికి, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పునాది అయిన పెద్దమనుషుల ఒప్పందంలో 'తెలంగాణలో భూముల క్రయవిక్రయాలు తెలంగాణ ప్రాంతీయ మండలి ఆమోదం మేరకే జరగాలి' అనే నిబంధన ఇటువంటి భూములను పరిరక్షించడానికి చేరినదే.
ఈ విస్తారమైన భూమి మీద కన్నువేసిన పాలకవర్గాలు తెలంగాణలోనూ హైదరాబాదులోనూ ప్రభుత్వ భూములను ఆక్రమించడం, ఆశ్రితులకు అప్పగించడం ప్రారంభించారు. ఈ భూ ఆక్రమణకు ప్రోత్సాహకాలు, కానుకలు అని పేర్లు పెట్టారు. లేదా కారుచౌక కిరాయికి 25సంవత్సరాల, 49సంవత్సరాల, 99సంవత్సరాల సుదీర్ఘకాలపు లీజుకు ఇచ్చారు. అడ్డికి పావుసేరుగా అమ్మేశారు. వేలం వేశారు. భూమి ఉచితంగా ఇస్తే జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు వస్తాయని దొంగమాటలు చెప్పారు. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలై, చంద్రబాబునాయుడు, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న కాలాల్లో విచ్చలవిడిగా సాగిన వేలాది ఎకరాల హైదరాబాద్ భూపరాధీన గాథలు విస్తారమైనవి, విషాదకరమైనవి.
కాని ఎవరు తమ సొంత ఖర్చులకు అట్టిపెట్టుకున్నా, ఎవరు ఆక్రమించినా, ఎవరు సొంతదారులమని చెప్పుకున్నా, ఎవరు ఎవరికి అప్పనంగా రాసి ఇచ్చినా, అడ్డికి పావుసేరుగా అమ్మినా, అసలు ఈ భూమి ఎవరిది అనే ప్రశ్న మిగిలే ఉంటుంది. 'భూమి నాది యనిన భూమి పక్కున నవ్వు' అని వేమన రాసినట్టుగా ఇది ఏ ఒక్కరూ తనదని చెప్పుకునేది కాదు. ఈ భూమి సమాజానిది. అది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీ కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులదీ కాదు, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుదీ కాదు, అది ప్రజలది. ఆ భూమిలో ఎవరి నెత్తురు చెమట అయిందో, ఎవరి నెత్తురుతో చెమటతో ఆ భూమి తడిసిందో వాళ్లదే ఆ భూమి. ఎవరి గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసి రాజులు ప్రపంచంలోకెల్లా సంపన్నులై, ఈ భూమి తమదని అన్నారో, వారిదే ఈ భూమి.
అటువంటి భూమిని అమ్మే నైతికాధికారం ప్రభుత్వానికి లేదు. ఆ భూమిని ఆంధ్రప్రదేశ్ పాలకులు అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించిన, నిరసన ప్రదర్శనలు జరిపిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ అదే పని చేస్తున్నది. ఇవాళ మాత్రమే కాదు, అధికారానికి వచ్చిన మరుసటి సంవత్సరమే ఇలా భూముల అమ్మకాలు ప్రారంభించింది. కాకపోతే అప్పుడు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన అమ్మకాలను ఇప్పుడు రాష్ట్రానికంతా విస్తరిస్తున్నది.
ఈ భూమిని అమ్మడం కోసం అది వృథాగా పడి ఉన్నదనీ, ప్రజోపయోగ అవసరాలకు ఉపయోగపడనిదనీ, ఆక్రమణలకు గురవుతున్నదనీ సాకులు చెపుతున్నారు. ప్రతి దళిత కుటుంబానికీ మూడు ఎకరాల భూమి ఇస్తాననే వాగ్దానం అమలు చేయకపోవడానికి భూమి లేకపోవడమే కారణమన్నారు. డబుల్ బెడ్ రూం గృహాల నిర్మాణం లక్ష్యం ప్రకారం జరగకపోవడానికి భూమి దొరకకపోవడమే కారణమన్నారు. హఠాత్తుగా జిల్లాకు వెయ్యి ఎకరాలు వృథాగా పడి ఉన్న భూమి ఎక్కడ దొరుకుతున్నది? అది నిజంగా పాలకులు చెపుతున్నట్టు ప్రజోపయోగ అవసరాలకు ఉపయోగపడనిదే అయితే దాన్ని కొనుక్కునేవాళ్లు మాత్రం ఎందుకు కొనుక్కుంటారు? పైగా అమ్మకం నిబంధనలు ఈ అమ్మకాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనని చెప్పకనే చెపుతున్నాయి. లే ఔట్ల అనుమతుల గురించి మాట్లాడాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల లేఔట్లు వేయగలిగిన చోట డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరగడానికి అవకాశం లేదా? ఇంత శక్తిమంతమైన ప్రభుత్వానికి ఆక్రమణలను అరికట్టడానికి అమ్మకం తప్ప మరొక మార్గం లేదట! దూడగడ్డి కోసమే తాటి చెట్టు ఎక్కాననే వారి తర్కం కూడ ఇంతకన్న విశ్వసనీయంగా ఉంటుంది.
ఇప్పుడిట్లా పందారం చేస్తూ పోతే, ప్రభుత్వానికే భవిష్యత్తులో భూమి అవసరాలు వస్తే ఏం చేస్తారు? సమీపగతం ఉదాహరణే చూడాలంటే కొత్తగా 23జిల్లా కేంద్రాలు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలకు భూమి అవసరమైంది. ఉన్నభూమిని ఇప్పుడు అమ్ముకుని, ఇటువంటి అవసరాలే ఇంకొక ఐదేండ్లకో పదేండ్లకో వస్తే ఏం చేస్తారు? అవన్నీ అలా ఉంచి, ఐదు సంవత్సరాల కోసం అధికారానికి వచ్చినవారికి తరతరాల, వేల, వందల సంవత్సరాల సామాజిక సంపదను అమ్మే, కొల్లగొట్టే అధికారం ఎలా వస్తుంది? అధికారం ఇచ్చింది మెరుగైన పాలన కోసమా, ఆస్తులను తెగనమ్మడం కోసమా?
అంత మాత్రమే కాదు, ఇలా ఉన్నది పోగొట్టుకుని సాధించేదేమిటనే ప్రశ్న కూడ కీలకమైనదే. పదిహేను వేల కోట్ల, ఇరవై వేల కోట్ల రూపాయలు సంపాదించబోతున్నామని భారీ అంకెలు చెప్పి మాయ చేయవచ్చు. కాని ఆ పదిహేను, ఇరవై వేల కోట్ల రూపాయలు నిజంగా వచ్చినా, అవి ఎక్కడ, ఎలా ఖర్చు చేయబోతున్నారు? కాళ్లు మొక్కే కలెక్టర్లకు, ప్రజా అసంతృప్తి నుంచి రక్షించే పోలీసు బలగాలకు అనవసర వాహనాలు కొనీచ్చినట్టుగా పప్పు పుట్నాలకే కరిగిపోతుందా, ప్రజల అవసరాలకూ అభివృద్ధికీ సంక్షేమానికీ రూపాయిలో పది పైసలైనా మిగులుతాయా? మిగులుతాయో లేదో భవిష్యత్తు చెపుతుంది గాని, తక్షణమే జరిగేది మాత్రం విలువైన తెలంగాణ భూములు ఆశ్రితులైన రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి చిక్కుతాయి. వాటి విలువ నానాటికీ పెరిగిపోతూ రియల్ ఎస్టేట్ మాఫియా మరింతగా బలిసిపోతుంది. అందులో రాజకీయ నాయకత్వానికి అందే ముడుపుల వాటా కూడ పెరిగిపోవచ్చు.
ఈ తెలంగాణ భూమి సాధారణమైనది కాదు. అద్భుతమైన భూపోరాటం జరిపి చరిత్రకెక్కిన సీమ తెలంగాణ. ఈ భూమి కోసమే చరిత్ర పొడవునా అనేక యుద్ధాలు జరిగాయి. ఈ భూమి తమదే అనుకున్న రాజులూ ఈ భూమిని ఆక్రమించదలచిన రాజులూ ఈ నేల కోసమే రక్తాలు ప్రవహింపజేశారు. ఈ భూమి తన అమ్మకం గురించి ఇప్పుడేమనుకుంటున్నదో! ఈ భూమి పుత్రులు ఏమాలోచిస్తున్నారో!
- ఎన్. వేణుగోపాల్
సెల్:9848577028