Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కోవిడ్-19 విలయతాండవం చేస్తూంటే ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టకపోగా, మోడీ ప్రభుత్వం తమ హిందూత్వ ఎజండాను అమలు జరపడానికి, కార్పొరేట్ - అనుకూల చట్టాలతో ప్రజలమీద మరిన్ని భారాలను మోపడానికి తయారైంది. గత ఏడాది కాలంగా ఈ ప్రహసనాన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రామ్‌దేవ్ బాబా కరోనిల్ వ్యాపారం, కుంభమేళా వ్యవహారం, స్వయానా బీజేపీ మంత్రులు, నాయకులు సాగిస్తున్న మూఢవిశ్వాసాల ప్రచారం దేశంలో జోరుగా, నిస్సిగ్గుగా సాగిపోతోంది. ఇదేమని ప్రశ్నించిన వారిపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం, కొత్త ఐటి నిబంధనల పేరుతో సోషల్ మీడియాలో వెల్లవెత్తుతున్న విమర్శలను కట్టడి చేయబూనుకోవడం సంఘపరివారం అసలు రంగును బట్టబయలు చేస్తున్నాయి.
ఈ తరహా కార్యక్రమాలు ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ సాగిస్తోంది సంఘ పరివారం. విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, ఎకాల్ విద్యాలయ ఫౌండేషన్, ఇన్ఫినిటీ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ అనే అయిదు సంస్థలూ ఆరెస్సెస్‌కి అనుబంధంగా పనిచేస్తాయన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల అమెరికన్ ప్రభుత్వం తీసుకున్న కోవిడ్ ఉద్దీపన చర్యల్లో భాగంగా అమెరికన్ చిన్న పరిశ్రమల నిర్వహణ సంస్థ (యుఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - ఎస్బిఎ) వివిధ సంస్థలకు ఉదారంగా రుణాలిచ్చింది. ఆ రుణాలను ఉపయోగించి ఈ సంస్థలు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టవలసివుంది. పైన చెప్పిన అయిదు సంస్థలూ 8,33,000 డాలర్ల రుణాన్ని ఎస్‌బీఎ దగ్గర తీసుకున్నాయి. మన కరెన్సీలో ఇది సుమారు 625 కోట్లు. ఈ సంస్థల వ్యవహారాన్ని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే మానవ హక్కుల వేదిక ప్రతినిధులు సునీతా విశ్వనాథ్, రాజు రాజగోపాల్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అనే సంస్థ ప్రతినిధులు రకీబ్ నాయక్, రషీద్ అహ్మద్ తదితరులు వెలుగులోకి తెచ్చారు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టం వివక్షతో కూడుకున్నదని ఐరాస విమర్శించిన సంగతి తెలిసినదే. హిందూ అమెరికన్ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్ తదితర సంఘపరివార సంస్థలు పౌరసత్వ చట్ట సవరణకు అనుకూలంగా, కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా రద్దును సమర్ధిస్తూ, హిందూత్వ వాదనలను అమెరికాలో బలంగా ప్రచారం చేస్తున్నాయి. ముస్లింల పట్ల విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికీ తమే ప్రతినిధులమన్నట్టు వ్యవహరిస్తున్నాయి. వీటి బండారాన్ని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎప్పుడైతే బైట పెట్టిందో, ప్రభుత్వం ఇచ్చిన రుణాన్ని సహాయ కార్యక్రమాలకోసం కాకుండా హిందూత్వ ప్రచారానికి వాడుతూ దుర్వినియోగం చేస్తున్న వైనంపై విచారణకు ఎప్పుడైతే డిమాండ్ చేసిందో అప్పటినుంచీ సంఘపరివారం ఈ మానవ హక్కుల వేదిక కార్యకర్తలపై కత్తి గట్టింది.
హిందూ అమెరికన్ ఫౌండేషన్‌ను అప్రతిష్టపాలు చేయజూస్తున్నారంటూ హక్కుల వేదిక ప్రతినిధులపై దావా వేసింది. 750 లక్షల డాలర్ల నష్ట పరిహారాన్ని డిమాండ్ చేసింది. అయితే ఈ దావాను తాము కోర్టులో దీటుగా ఎదుర్కొంటామని హక్కుల వేదిక ప్రతినిధులు అంటున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన రుణం పక్కదారి పడుతోందని తాము ఫిర్యాదు చేస్తే హెచ్ఎఎఫ్ బుజాలు తడుముకుని కోర్టులో దావా వేయడాన్ని బట్టి తమ ఆరోపణ సరైనదని రుజువైందని హక్కులవేదిక ప్రతినిధి ప్రభుదాస్, రకీబ్ నాయక్ అంటున్నారు. టాక్స్ పేయర్ల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఇంకోవైపు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రచారం చేసి అమెరికాలో సామరస్య వాతావరణాన్ని కలుషితం చేయడం సహించరానిదని వారంటున్నారు.
హక్కులవేదిక ఈ విషయంపై చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ, ప్రముఖ మేథావులు మార్తా సి నుస్బామ్, కార్నెల్ వెస్ట్, నామ్ చామ్స్కీ, వెండీ డోనిగర్, పి. సాయినాథ్, రాజమోహన్ గాంధీ, రొమిల్లా థాపర్, షెల్డన్ పొలాక్, టి.ఎం. కృష్ణ, మణిశంకర అయ్యర్ తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు అత్యధికులు ట్రంప్, మోడీల దురహంకార, విద్వేషపూరిత రాజకీయాలను తిరస్కరించి ఇటీవల ఎన్నికలలో గుణపాఠం చెప్పారని, అయినా హెచ్ఎఎఫ్ వంటి సంఘపరివార సంస్థలు తమ హిందూత్వ విద్వేష రాజకీయాలను కొనసాగిస్తున్నాయని, ప్రవాస భారతీయులు ఈ శక్తులను తిరస్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
- కార్తికేయ