Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రాహ్మణులు, కోమట్లు, షేక్‌లు, సయ్యద్‌లు పెద్ద కులాలకు చెందినవారు. కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, సాలె, మాల, మాదిగ మొదలైన వారు చిన్న కులాలవారు. వీరి సంఖ్య 90శాతం దాకా ఉంది. కుల విభేదాల వల్ల వీరి మేథస్సు బందీ అయిపోయింది. వీరిని పైకి తెస్తే తప్ప, దేశ పునర్నిర్మాణం అసంభవం. కాళ్ళూ, చేతులు కదిలించలేకపోతే, శరీరానికి పక్షవాతం వచ్చినట్టు.. అలాగే, ఈ దేశానికి పక్షవాతం వచ్చింది. సమాజంలో వీరిని ఎక్కడికక్కడ పాతరేసి అణగదొక్కారు. కదలిక లేకుండా చేశారు. బానిసత్వానికి మూలకారణం ఇదే. ఇప్పటికన్నా మారకపోతే దేశం మరోసారి బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంది. - డాక్టర్ రామ్ మనోహర్ లోహియా.
ఈ దేశానికి పక్షవాతం వచ్చింది.. ఇది ఇప్పుడు మనం అంటున్న మాట కాదు. స్వాతంత్య్ర సమరయోధుడు, సోషలిస్ట్ పార్టీ నాయకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (1910-67) ఎప్పుడో చెప్పిన మాట. ఏండ్లు గడుస్తున్నా దేశంలోని ఈ పరిస్థితిని మార్చుకునే పనేలేదా?
భారతదేశంలోని కొన్ని సంచార జాతులైన చెంచు, కోయ, గోండు, లంబాడ, ఎరుకల మొదలైన వారికి సొంత భాషలున్నాయి. అయితే వాటికి లిపి లేదు. మొసపటోమియా నాగరికతలోని ఇరాన్, ఇరాక్ లాంటి ప్రాంతాల్లో సంచార జీవనం చేసిన వారే - ఆర్యులు. వీరు అక్కడ అనాగరికులు, ఆటవికులు, వీరి భాష సంస్కృతం. దీనికీ లిపిలేదు. ఆర్యులు మనదేశానికి వచ్చాక, ఇక్కడి నాగ లిపిని జోడించి, తమది 'దేవ భాష' అని ప్రకటించుకున్నారు. దేవనాగరి (దేవ+నాగ) లిపిలో సంస్కృతాన్ని రాసుకోవడం ప్రారంభించారు. ఆర్యులు నిజానికి అనాగరిక సంచార జాతులు. వీరి ప్రధాన ఆహారం ఆవు మాంసం. వీరు పాషాణ హృదయులు, వావి వరుసలు లేని విశృంఖల లైంగిక కార్యకలాపాలు సాగించేవారు. అందుకే వీరి పురాణాలలో నాగరిక కట్టుబాట్లు లేని విశృంఖల శృంగారం కనిపిస్తుంది.
గుడి అంటే గుడిచేది అని అర్థం. మధ్య యుగాలలో గుడులలో సామూహికంగా, బహిరంగంగా స్త్రీ పురుష సంగమాలు జరిగేవి. చరిత్ర అదే చెపుతోంది. అందుకు ఆనవాళ్ళుగా గుళ్ళపైన స్త్రీ పురుష నగ శిల్పాలు ఉన్నాయి. సంగమ భంగిమలూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక్క ఖజురాహౌ మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో అలాంటి శిల్పాలు కనిపిస్తున్నాయి. 'పండగ నాడు కూడా పాత మొగుడేనా?' లాంటి మాటలు ఇప్పటికీ చలామణిలో ఉన్నాయి. తాపీ ధర్మారావు పుస్తకాలు చదవని వారు తప్పక చదవాలి. 'దేవాలయాల మీద బూతు బొమ్మ లెందుకో' ఆయన వివరంగా రాశారు. స్త్రీలకు సిగ్గు బిళ్ళ పేరుతో ఇనుప కచ్చడాలు వేసి, స్వేచ్ఛను హరించి, హిసించిన వైనం అర్థమవుతుంది. దేవదాసి, జోగిని, బసివి వంటి వ్యవస్థలు ఎవరు ఏర్పాటు చేశారో, అవి ఇప్పటికీ మన సమాజంలో ఎందుకు కొనసాగుతున్నాయో విశ్లేషించుకోవాలి!
'ఆఖరి మనిషి అంతరంగం'లో రచయిత జి. కళ్యాణ్‌రావు ఇలా రాస్తారు.. ''ఏ బ్రాహ్మణవాది ఏ గ్రంథం రాశాడో తెలియదు. కాని, తమ భావాల్ని బలంగా చెప్పాలనుకున్న చాలా గ్రంథాలకి రుషుల పేర్లు తగిలించి అద్భుతం చేశారు. చంపేవాడు తను చంపుతున్నాననుకుంటాడు. చచ్చేవాడు తను ఛస్తున్నాననుకుంటాడు. నిజానికి చంపేవాడు లేడు. చచ్చేవాడూ లేడు. ఇలాంటి మాటలతో జ్ఞానానికి ఎంత లోతు గొయ్యి తవ్వితే అది శాశ్వతంగా సమాధి అవుతుందో, అంత లోతు గోతులు తవ్వారు - మనువాద మేథావులు. ఆ గోతుల మీద ఆత్మల్ని ప్రతిష్టించారు. విచిత్రం ఆ ఆత్మలకి చావు లేదు. పుట్టుక లేదు. భగవద్గీత అంతా ఈ పాయింటు మీదనే నడిచింది!''.. విషయం ఎవరు చెప్పారని కాదు. ఎంత స్పష్టంగా ఎంత సులభంగా చెప్పారన్నది మనం గ్రహించాలి. చెప్పిన దాంట్లో నిజం ఉంటే తప్పక స్వీకరించాలి! ఆధునిక రచయిత జి. కళ్యాణ్‌రావు అభిప్రాయం ఇలా ఉంటే, పురాతన సంప్రదాయ రచనలో ఎలాంటి మేజిక్కులున్నాయో గమనించండి. కృష్ణ యజుర్వేదం 2-1-1-7లో ఇలా ఉంది.. ''ఈ లోకమున ప్రజాపతి అనేవాడు ఒకడు ఉండేవాడు. అతను ప్రజలను, పశువులను సృష్టించదలచి, తన ఉదరం నుంచి ఒక భాగాన్ని ఖండించి తీసి, దాన్ని అగ్నిలో వేశాడు. అంతే- కొమ్ములు లేని మేక పుట్టుకొచ్చింది. తన రూపంలో ఉన్న ఆ మేకను దేవతకు బలి ఇచ్చాడు. దాంతో అతను శక్తివంతుడు, యుక్తివంతుడు అయిపోయాడు. అప్పుడిక అతను ప్రజల్ని, పశువుల్ని సృష్టించాడు'' ఇలా బలులిస్తే శక్తులు వస్తాయని దుష్ప్రచారాలు చేసే రచనలు ఆధునికుడికి అవసరమా? ఛార్లెస్ డార్విన్ ఇలాంటి వేదాలు చదవక పోవడం వల్ల బతికిపోయాడు. డార్విన్ మొదలు ఇప్పటి ఆధునిక వైజ్ఞానికుడి వరకు ఎవరికీ అంతుపట్టని ''సృష్టి'' అంతా మన వేదాలలో ఉందట?
శూద్రులు దేవుడి పాదాల నుండి పుట్టారని కదా అగ్రవర్ణాలవారు చెపుతారు? సరే మరి.. భక్తులంతా మొక్కేది ఆ దేవుడి పాదాలనే కదా? అంటే అందరు మొక్కే స్థానంలో నుండి పుట్టిన వాణ్ణి ఎందుకు వెలివేశారూ? ఎందుకు అస్పృశ్యుణ్ణి చేశారూ? మనువాదుల పిచ్చి భ్రమలు కాకపోతే, తల నుండి భుజాల నుండి ఇంకా ఇతర భాగాల నుండి మనుషులెలా పుడతారూ? వినేవాడు చెప్పేవాడికి లోకువా? అలా అని ఎన్ని శతాబ్దాలు జనాన్ని మోసం చేస్తారూ? విశ్వ విఖ్యాత పోరాట యోధుడు బిర్సాముండా వారసుడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఆదివాసీలు హిందువులు కాదని - అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేశారు. బ్రహ్మ కాళ్ళ నుండి పుట్టామని అంగీకరించడమెందుకూ? ఊరికి దూరంగా అంటరాని వాళ్ళుగా బతకడమెందుకూ? ఈ మతం వద్దు. ఈ వివక్షా వద్దు. అణచివేతా వద్దు.. అని కొందరు ఇస్లాంలో చేరారు. కొందరు క్రైస్తవంలో చేరారు. ప్రత్యేకంగా ఉంటామని మరికొందరు తమని తాము సిక్కులుగా ప్రకటించుకున్నారు. అభ్యుదయ వాదులైన వారు బౌద్ధంలో చేరారు. కులాల అహాలు తగ్గించుకుని, మనుషులంతా ఒక్కటే.. అని ఆధునిక జన్యుశాస్త్రం చెప్పింది చెవికెక్కించుకుంటే సమాజం ముందుకు పోతుంది.
వేదాలూ, పురాణాల పేర్లు చెప్పి గొప్పలు చెప్పుకునే మనువాదులు సృష్టించిన హిందూ దేవుళ్ళంతా ఈజిప్టు సంస్కృతిలోంచి కాపీ చేసి తెచ్చుకున్నవేనని ఆధారాలు దొరికాయి. అంతే కాదు, పురాణ పురుషులతో పాటు పురాణాలు కూర్చిన వ్యాసుడు కూడా కాపీయే! ఉదాహరణకు వ్యాసుని పేరు 'కృష్ణ ద్వైపాయనా' అంటే ఒక ద్వీపంలో జన్మించిన నల్లరంగు గల వ్యక్తి - అని అర్థం. ఈజిప్టు సంస్కృతిలోని హౌరస్కు ఈ వ్యాసునికి పోలికలున్నాయి. హౌరస్ కూడా నల్లరంగు గలవాడే. చిత్తడిలో జన్మిస్తాడు. వ్యాసుని తల్లికి హౌరస్ తల్లికి కూడా పోలికలున్నాయి. వ్యాసుని తల్లి సత్యవతికి మూడు ముఖ్యమైన లక్షణాలున్నాయి. 1. ఆమె శరీరం నుండి ఎప్పుడూ సువాసన వెలువడుతుంది. 2. ఆమె బిడ్డను ప్రసవించిన తర్వాత కూడా కన్యగానే ఉంటుంది. ఇక 3. సత్యవతి అంటే సత్యం మాట్లాడేది అని అర్థం. ఈ మూడు లక్షణాలు హౌరస్ తల్లి అయిన ఈజిప్టు దేవత ఐసిస్‌కు కూడా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటీ కాపీ పేస్ట్ గాళ్ళయిన మనువాదుల కుట్రలన్నీ బయటికొస్తున్నాయి.
ఇక భాష విషయానికొస్తే భారతదేశంలో 1652 భాషలున్నాయి. అందులో 22 ప్రధానమైనవిగా గుర్తించబడ్డాయి. కానీ, ఈ దేశంలోని హిందూ దేవుళ్ళకు సంస్కృతం తప్ప మరో భాష తెలియదు. ద్రవిడ భాషలే ఇక్కడి దేశీయ భాషలు. సంస్కృతం - హీబ్రూ, లాటిన్ భాషా కుటుంబాలకు చెందింది. అంటే అది విదేశీ భాష. దానికి లిపి లేదు. భారతదేశంలోని ఏ భాషలోనైనా దాన్ని రాయొచ్చు. ఇక్కడి దేవనాగరి లిపిలో దాన్ని రాయడం ప్రారంభించి, దానికి దేవభాష అనే గౌరవం ఆపాదించారు. పండితులకి పరిమితమైన ఆ భాష, ప్రజల భాషగా ఎప్పుడూ లేదు. అందుకే చూడండి సంస్కృత మంత్రాలకు అర్థం ఏమిటీ అని ఎవరూ ఆలోచించడం లేదు. ఆ భాష... అందులోని మంత్రాలు, వాటితో జరిపే పూజా కార్యక్రమాలు అన్నీ ఒక ''తంతు''లాగా మిగిలిపొయ్యాయి. పది రూపాయల విలువ గల వస్తువు వందకు అమ్మితే అది దగా, మోసం అని గగ్గోలు పెడతారు కదా! నిజమే, అది మోసమే.. అలా చేయగూడదు. కానీ, దేవుడు, దయ్యం, స్వర్గం, నరకం.. అని చేసే కోట్ల వ్యాపారాన్ని ఏమందాం? ఇందులో హిందూమత మొక్కటే కాదు, అన్ని మతాల భాగస్వామ్యం ఉంది. ఇక్కడ ఈ దేవుడూ, స్వర్గం అనేవి పది రూపాయలు కాదు కదా అసలు విలువే లేనివి. పూర్తి ఉచితంగా లభించే భ్రమలూ బ్రాంతులు. మరి వాటితో మతాలన్నీ వ్యాపారాలెందుకు చేస్తున్నాయి? అది తప్పు కాదా? ఆ వ్యాపారాలతోనే కదా మత సామ్రాజ్యాలు విలసిల్లుతున్నాయీ?
''చాతుర్వర్ణం మాయా స్పష్టం గుణకర్మ విభాగశ: తస్య కర్తార మపిమాం విద్ద్యకర్తార మవ్యయమ్''
(భగవద్గీత: 4-13)
దీని అర్థం ఏమిటంటే.. గుణకర్మ విభాగాలను అనుసరించి నాలుగు వర్ణాలను నేనే సృష్టించాను. వారి సృష్టికి నేను కర్తను అయినప్పటికీ నన్ను అకర్తగానే గుర్తించుము.. అని. ఇందులో ఉన్న తిరకాసు ఏమిటంటే తనే కర్తనని (ఆ భగవానుడు) గట్టిగా చెప్పడం లేదు. తనను 'అకర్త'గా గుర్తించమని అంటున్నాడు. అంటే మరి కర్తఎవరు? దేవుడి పేరుతో అబద్ధాలు ప్రచారం చేసిన మనువా? లేక మనువు పేరు చెప్పి అవే అవే ప్రచారం చేస్తున్న వైదిక ధర్మ ప్రభోదకులా? ఇలాంటి వాటిని ప్రజాకవి వేమన నిర్ద్వందంగా ఖండిస్తూ వచ్చారన్న విషయం జనం గుర్తుపెట్టుకోవాలి!
''వేనవేలు చేరి వెర్రి కుక్కల వలె / అర్థ హీన వేద మరచు చుండ్రు / కంఠశోషకంటె, కలిగెను ఫలమేమి / విశ్వదాభిరామ వినురవేమ''
వైదిక పండితులు వేల కొలదిగా చేరి పిచ్చికుక్కలు అరిచినట్లు అర్థము తెలియని, అర్థములేని వేదములను చదువుచుందురు. వారికి కంఠశోషయే మిగులును. ఆ బడాయితో వారికి గానీ, ఇతరులకు గానీ కలిగే ఫలితము ఏమీ ఉండదు - అని వేమన పద్యం యొక్క తాత్పర్యం! ఇలాంటి విషయాలు జనం సత్వరం గ్రహిస్తూ ఉండాలి.
- వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు