Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేముల మహెందర్....
అమరుడా నీకు రెడ్ సెల్యూట్..
నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నడిచినవ్..
పేద ప్రజల బాగు కోసం తెగించి కొట్లాడినవ్..
ఎత్తిన ఎర్రజెండా సుత్తి కొడవలి సుక్క ఊరూరా ఎగరేసినవ్..
ప్రలోభాలకు లొంగలేదు..
ప్రత్యర్థి బెదిరింపులు నిన్ను కృంగదీయలేదు.
కొడుకు మరణం నిన్ను అడ్డుకోలేదు.
కుటుంబ బాధలు నిన్ను ఏమి చేయలేదు.
కష్టం వచ్చింది అంటే.. పార్టీ ఏదని చూడలేదు..
అందరికి నేనున్నానంటూ అర్థ రాత్రి
ఆపరాత్రి అని పట్టించుకోలేదు..
కడవరకు కష్ట జీవి సుఖం కోసం పరితపించిన
నీ మరణం ఓ విషాదం..
నిత్యం వలిగొండ చౌరస్తాలో
అందరిని అప్యాయంగా పలకరిస్తూనే ..
పార్టీ వ్యహాలను రచించిన నీ రూపం చిరస్మరణీయం..
అరుణపతాక రెపరెపల్లో నీవు అజరామరం..
అమరుడా నీకు రెడ్ సెల్యూట్..
మహేందర్ పుట్టిన నేల పులిగిల్ల. ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామాన్ని మినీ పశ్చిమ బెంగాల్ అని కూడా పిలుచుకుంటారు. సాయుధ రైతాంగా పోరాట కాలంలో ఎర్రజెండా అండతో అణగారిన వర్గాలకు దిక్సూచిగా మారి, తన ప్రజలను కాపాడుకున్న పోరుగడ్డ పులిగిల్ల. సుందరయ్య నేతృత్వంలోని నాటి సాయుధ పోరాట సారధులైన భీంరెడ్డి నర్సింహరెడ్డి, కష్ణమూర్తి వంటి వ్యక్తుల ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామం. నిజాం సేనలపై చిరుతపులుల్లా ప్రతిఘటించిన పులిగిల్ల పోరాట ఘాట్టాలు ఇప్పటికీ ఆ గ్రామ పెద్దలమాటల్లో చరిత్రను కళ్లకు కడుతాయి. అటువంటి పులిగిల్లలో నాటి అమరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారిలో వేముల మహేందర్ ఒకరు. ఈ గ్రామంలో పుట్టిన నేపథ్యమో లేదా అక్కడి మట్టి వాసనల ప్రభావమో తేలియదు కానీ.. గ్రామం అంతా నేటికీ ఎర్రజెండా నీడలోనే నడుస్తున్నది. అటువంటి పులిగిల్లలో 1966 మార్చి 6న వేముల రాములు-మాంకాలమ్మ దంపతులకు జన్మించారు మహేందర్. ప్రాథమిక విద్యాభ్యాసం సొంత ఊరిలో పూర్తి చేసి.. అనంతరం వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కుల్లో పదవ తరగతి చదువుకున్నారు. భువనగిరిలో ఇంటర్ చదవుతున్న సమయంలోనే ఆయన విధ్యార్థి ఉద్యమాల వైపు ఆకర్శితులయ్యారు. పూర్తికాలం పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారు. 1985 నుంచి విధ్యార్థి, యువజన సంఘాల్లో చురకైన పాత్ర పోషించారు. ఈ గ్రామం నాడు రామన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉండటంతో అక్కడ సంఘ నిర్మాణంలో కీలకంగా పాల్గొంటూనే సోంత గ్రామంలో పార్టీ నిర్మాణం కోసం అవిరళ కషి చేశారు. మహెందర్‌కు మార్గదర్శి అదే గ్రామానికి చెందిన సీనియర్ నేత కొమ్మిరెడ్డి లక్ష్మారెడ్డి. ఆ గ్రామానికి రెండు దశాబ్దాలకు పైగా సర్పంచ్‌గా పనిచేసిన ఆయనతో కలిసి పార్టీ నిర్మాణంలో పనిచేస్తూ మహేందర్ నాయకుడిగా ఎదిగారు. రైతులు, కూలీలు, హామాలీలు, యువతను పోగుచేసి చైతన్య పరిచారు. వారికి ఉద్యమ పాఠాలు చెప్పేందుకు రోజుల తరబడి గ్రామాల్లోనే మాకాం వేసారు. ఇదే సమయంలో పెత్తందార్ల అగడాలు, కాంగ్రెస్ వాళ్ళ భౌతిక దాడుల పరంపర, నక్సలైట్ల బెదిరింపులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ వంటివి అనేక ఇబ్బందులకు గురిచేసేవి. గ్రామపంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే చాలు కల్లోల ప్రాంతంగా ఉండే సమయంలో కూడా సామరస్యంగా, సావధానంగా ఎదుర్కొని ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేసే వారు. ఒక్క మాటలో మహెందర్ అంటే వలిగొండ మండల ప్రజలకు ఓ ధైర్యం అని చెప్పడం అతిశయోక్తి కాదు. యువత తప్పుదోవ పట్టకుండా నిత్యం చైతన్య పర్చేవారు. పార్టీ పిలుపులు జయప్రదం చేస్తూనే గ్రామాల్లో కార్యకర్తలను తయారు చేసే పనిలో ఉండేవారు. రవాణ సౌఖర్యంలేని గ్రామాలకు సైతం ఆపద వచ్చిందంటే ఆర్థరాత్రి అయినా చేరుకునేవారు. ఆర్థిక పరిస్థితులు సహాకరించకపోయినా.. చిరునవ్వుతో ఇంటికి వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా చూసుకునే వ్యక్తిత్వం తనది. భార్య, ఇద్దరు కూమారులు, ఓ కూతురు. చిన్న కొడుకు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ సంఘటన తీవ్ర మనోవేదనకు గురిచేసినప్పటికి.. వేంటనే తేరుకుని తనకు తాను ధైర్యం చెప్పుకుని పార్టీ పనిలో నిమగమయ్యారు. అటువంటి గుండె నిబ్బరం కలిగిన నాయకుడాయాన. ప్రత్యర్థులకు సైతం మహెందర్ వస్తుండంటే సమస్యకుపరిష్కారం దోరుకుతుందని నమ్మకం కలిగించిన కమ్యూనిస్టు అతను. మల్లెపూవు లాంటి తెల్లటి బట్టలు, భుజాన టవల్‌తో వలిగొండ ప్రధాన రోడ్డుపై నిత్యం ఎదో ఒక సమస్యపై పోరాడే యోధుడతడు. కమ్యూనిజం నేర్పిన క్రమశిక్షణకు నిలువెత్తు రూపం అతడు.
గత కొంత కాలంగా క్యాన్సర్ బారిన పడి... ఆయన జూన్ 21న నిమ్స్ హాస్పటల్లో కన్నుమూసారు. మద్యలో కాస్త ఆరోగ్యం మెరుగుపడడంతో కుటుంబ సభ్యులు, సహచరులు వారించినా పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మళ్ళీ వారం కింద ఆరోగ్య సమస్య తీవ్రమవడంతో నిమ్స్‌లో చేరి మృత్యు కౌగిలిలో చిక్కుకుపోయారు. భువనగిరి జిల్లాలో ఆయన తిరగని ఊరు లేదు, తొక్కని గడపలేదు. కమ్యూనిస్టు అనే వాడు ప్రజల్లో ఉంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహారణ, కరోనా సమయంలోనూ ఆయన అంతిమయాత్రకు హజరైన ప్రజానీకమే. జిల్లా సీపీఎం నిర్మాణంలో కీలకమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. 2001లో పులిగిల్ల ఎంపీటీసిగా ఎన్నికై వలిగొండ మండల ప్రజాపరిషత్ వైస్ ఎంపీపీగా పని చేశారు. 2006లో వలిగొండ జడ్పీటీసీ స్థానానికి సీపీఎం తరుపున పోటీ చేసి కేవలం 70లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. కేవీపీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా, యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులుగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆయన సేవలు మరువలేనివి. ఆయన మరణం తీరని విషాదమే అయినా, ఆయన జీవిత తరగని స్ఫూర్తి.
- రాజు కలుకూరి
సెల్ : 9676956966