Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిధిలో పని చేస్తున్న కూలీలను ఎస్సీ, ఎస్టీ ఇతర కులాలు వారిగా విభజన చేసి వేతనాలు ఇవ్వాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలఫ్‌మెంట్ ఫండ్స్, ఎస్సీ, ఎస్టీ కూలీల జాబ్కార్డ్సు బైబర్ గేషన్ పేరుతో చేసిన వేతనాలను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఈ రెండు నిర్ణయాలు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్దమైనవి. పార్లమెంట్లో తెచ్చిన చట్టానికి జీవోల ద్వారా మార్పులు చేసే ప్రయత్నం పార్లమెంటరీ పద్ధతికి వ్యతిరేకమైనది. ఈ నిర్ణయం పట్ల వ్యవసాయ కార్మిక సంఘాలు ఇతర సామాజిక, పౌర సంఘాల నుంచి దేశవ్యాప్తంగా నిరసన ఆందోళనలు పెళ్ళుబుకుతున్నాయి.
గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా దేశంలో 15కోట్ల జాబ్‌కార్డులు 23కోట్ల మంది సభ్యులు తమ పేర్లు నమోదు చేసుకోని ఉన్నారు. వీరిలో 19కోట్ల మంది దళితులు, 16కోట్ల మంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 56లక్షల జాబ్‌కార్డులతో కోటి 19లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో దళితులు 16లక్షల మంది, గిరిజనులు 14లక్షల మందికి పైగా ఉన్నారు.
కూలీల కులవిభజన చట్ట విరుద్ధం : 18ఏండ్లు నిండిన ప్రతి పౌరునికి గ్రామీణ ఉపాధి హామీ చట్ట ప్రకారం జాబ్‌కార్డు, పని పొందే హక్కు ఉంది. కులం-మతం- ప్రాంతం, లింగ వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి విధిగా 100రోజుల పనిని కల్పించే బాద్యత ప్రభుత్వాలది. సమాన పనికి-సమానవేతనం ఇవ్వాలి. పని కల్పించ కుంటే చట్ట ప్రకారం నిరుద్యోగ భృతిని ప్రభుత్వం నుంచి పొందే హక్కు ఉంది. దీని వలన గ్రామీణ ప్రాంత పేదల మద్య ఐక్యత పెరిగింది. పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళే వలసలు తగ్గాయి. ఆర్థికావసరాలకోసం గ్రామీణ పెత్తందారుల మీద ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబనను సాధించు కున్నారు. గ్రామీణ పేదల మీద రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా తమ పట్టు సడలిపోవడాన్ని చూసి తట్టుకోలేని పెత్తందార్లు, వడ్డీ వ్యాపారస్థులు, రాజకీయ నాయకులు కుమ్మకై ఈ చట్టాన్ని నీరు గార్చాలని అనేక దష్ప్రచారాలను ముందుకు తేస్తున్నారు. పని చేయకుండానే వేతనాలు తీసుకొంటున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈచట్టం పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూలీలు, మేథావుల నుంచి వస్తున్న వ్యతిరేకత వలన తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. కాని దొడ్డిదారిన కూలీల మధ్య ఉన్న ఐక్యతని విచ్చిన్నం చేయడానికి కూలాల వారిగా వేతనాలు చెల్లింపు ఆలోచనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది.
కులాల వారిగా కూలీల విభజన - వాదనలు : గ్రామీణ ఉపాధిహామితో ఉపాధి పొందుతున్నవారు ఎక్కువ మంది దళితులు, గిరిజనులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించే సాదారణ నిధులకు ఆదనంగా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలఫ్‌మెంట్ నిధులను కలపడం వలన బడ్జెట్ పెరుగుతుందని, అదనపు నిధులోస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఉప ప్రణాళిక నిధుల ద్వారా దళిత, గిరిజన కూలీలకు వేతనాలు ఇస్తామని చెబుతున్నారు. వాస్తవానికి ఉపప్రణాళిక నిధుల లక్ష్యం వ్యక్తిగత వేతనాలు చెల్లింపుకోసం కాదు. వీటిని ఆయా తరగతుల కమ్యూనిటీ హాల్స్, శ్మాశన వాటికలు, అప్రోచ్ రోడ్లు, మంచినీటి, కరెంట్ సౌకర్యాలు వంటి సామూహిక అభివృద్థి కోసం ఖర్చు పెట్టాలి. ఈ విధంగా డైవర్ట్ చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
ఇప్పటికే ఆచరణలో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని రద్దు చేసి ఉపప్రణాళికగా మార్చిన బీజేపీ ప్రభుత్వం సార్వజనీన పనులకు ఈ నిధులను ఎట్లా కలుపుతారో చెప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజనుల జనాభా పొందికకు, వివిధ రాష్ట్రాలల్లో ఉన్న దళిత, గిరిజనుల జనాభా పొందికకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. జనాభా ప్రతి ప్రాధికన కేటాయింపులు చూపుతున్న ఉప ప్రణాళిక నిధులను దేశ జనాభా ఆదారంగా మాత్రమే కేటాయించడానికి అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాలల్లో హెచ్చుతగ్గులు ఉన్న జనాభాను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. అంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలల్లో అనివార్యంగా నిధుల కొరత పేరుతో దళిత, గిరిజనులను ఉపాధి పనికి దూరం చేసే ప్రమాదం పొంచిఉంది. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలల్లో ఉపాధి నిధుల్లో భారీ కోత పడే ప్రమాదం ఉంది. స్పెషల్ డెవలప్మెంట్ చట్టం పేరుతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కేటాయిస్తున్న నిధులు డైవర్టు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కోత్తగా ప్రతిపాదిస్తున్న నిర్ణయం వలన ఈ దుర్వినియోగం మరింత పెరిగే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల కోసం కేటాయిస్తున్న జనరల్ నిధుల్లో తమకు వాటా రావడం లేదని దుగ్ధతో ఉన్న గ్రామీణ ప్రాంత పెత్తందారీ కాంట్రాక్టర్లకు డైరెక్టుగా జేబులు నింపడానికి పాలకులు దొడ్డిదారిన సిద్ధపడుతున్నారు. ఇప్పటికే యూపీఏ కాంగ్రెస్ కాలంలో 30శాతంగా ఉన్న మెటీరియల్ కాంపోనెంట్ నిధులను 49శాతానికి పెంచి ఉపాధి పనిని కాంట్రాక్టర్లకు బీజేపీ ప్రభుత్వం అప్పగించింది.
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి: గ్రామీణ ఉపాధి పనులకు వెళితే వేతనాలు రావు అనే భయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారమే సృష్టిస్తున్నాయి. పని చేసిన వారం రోజుల్లో వేతనాలు చెల్లించాలనే చట్టం డైరక్షన్ ఎక్కడా అమలు కావడం లేదు. కనీస వేతనం రూ.245 ఎక్కడా పడటంలేదు. వేతనాల్లో తీవ్ర వ్యత్యాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులను ఆర్థిక శాఖకు డైరెక్టుగా ఇవ్వడం వలన రాష్ట్ర ప్రభుత్వాలు మొదట తమ అవసరాలకు వాడుకుంటున్నాయి. వెసులు బాటు అయినప్పుడు కూలీలకు విడుదల చేస్తున్నాయి. ఫలితంగా 11వారాలు దాటినా బిల్లుల రావడం లేదు. చాలా చోట్ల గత సంవత్సరం బకాయిలు నేటికీ రాలేదు. కొత్త జాబ్‌కార్డు పొందాలంటే మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్ళాల్సి వస్తుంది. ఆధార్ కార్డు, జాబ్కారు,్డ బ్యాంకు ఎకౌంట్ అనుసంధానం కాలేదనే పేరుతో వేతనాలను పెండింగ్‌లో పెడుతున్నారు. ఆధార్ కార్డులేని మారుమూల ప్రాంతాల పేదలు, ఆదివాసీ గిరిజన గూడేల్లో ఉన్న పేదలు ఉపాధి జాబ్‌కార్డులున్నా పనిని పొందలేక పోతున్నారు. ఇది చట్ట విరుద్ధమైన చర్య.
ఎలాంటి నిబంధనలు లేకుండా గ్రామ పంచాయతీ ద్వారా జాబ్‌కార్డు పొందే అవకాశం కల్పించాలి. బ్యాంకులు లేని గ్రామాలలో పోష్టాఫీసుల ద్వారా వేతనాలు చెల్లించాలి. విధిగా పే స్లిప్ ఇవ్వాలి. వారం వారం చేసిన పనికి వేతనాలు చెల్లించాలి. అప్పుడే ఎక్కువ మంది ఉపాధి పనులను పొందగల్గుతారు.
నిరుద్యోగభృతి చెల్లించాలి: పనులు కల్పించలేని పరిస్థితుల్లో చట్ట ప్రకారం సరాసరి వేతనంలో మూడవ వంతు నిరుద్యోగ భృతిని చెల్లించాలి. కరోనా తీవ్రత వలన చాలా గ్రామాలలో గ్రామ పంచాయతీలే ఉపాధి పనిని స్పచ్ఛందంగా బంద్ పెట్టాయి. అక్కడక్కడ పని జరిగినా నామ మాత్రంగానే కూలీలు పనికి వెళ్ళుతున్నారు. పనికి వచ్చే వారికి రక్షణకోసం ప్రభుత్వం మాస్కులు, శానిటైజర్, బ్లౌజులు లాంటివి ఇవ్వడానికి సిద్ధం కావడంలేదు. భౌతిక దూరం పాటిస్తూ చేసే పనులు కూడా కల్పించడం లేదు. ఫలితంగా కరోనా బారిన పడిన వారిలో ఉపాధి కూలీలే అధికంగా ఉన్నారు. చనిపోయిన వారు కూడా అధికమే. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదు.
కరోనా ప్యాకేజీ కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తేవాలి : కరోనాతో వ్యవసాయ రంగం, అసంఘటిత రంగం పని చేస్తున్న కోట్లాది మంది గ్రామీణ పేదలు ఉపాధిని కోల్పోయారు. పట్టణాల్లో ఉన్న అసంఘటిత కార్మికులు తిరిగి గ్రామాలకు వలసలు వెళ్ళుతున్నారు. గ్రామాలలో ఉన్న వ్యవసాయ కూలీలకు అదనంగా పట్టణ వలస కార్మికులు తోడవడం వలన కూలీల సంఖ్య పెరిగింది. పనులు లేక, ఆదాయం లేక పస్తులతో కాలం వెళ్ళదీస్తున్నారు. కరోనా బారిన పడితే చనిపోవడం తప్ప ప్రత్నామ్నాయం లేదు. గ్రామీణ పేదలను ఆదుకోవడం కోసం ఇన్‌కం టాక్స్ పరిధిలోకి రాని ప్రతి కుటుంబానికి 50కేజీల బియ్యం, నెలకు రూ.7500 నగదు సాయం ఇవ్వాలని, ఉపాధి పని దినాలు 200 రోజులకు, రోజు కూలి రూ.600 పెంచాలని, ఉపాధి పనులు పట్టణాలకు విస్తరింపజేయాలని, రేషన్ షాపుల ద్వారా 16రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మీద వత్తిడి తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలి. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి.
- బి. ప్రసాద్
సెల్ : 9490098901