Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అన్నార్తుల జీవితాలతో నిరంతరం మృత్యు క్రీడలాడుతున్న నిశ్శబ్ద హంతకి పేదరికం. ఆధునిక సమాజ పరిణామంలో ఇప్పటికీ నెలకొన్న బానిసత్వం, వర్ణ వివక్ష వంద శాతం పాలకుల నిర్మితమే. వీటి కవల పిల్లలే ఆకలి, పేదరికం. మన దేశంలో పేదరికానికి గల ప్రత్యేక కోణం సామాజిక అణచివేత. అణగారిన సామాజిక వర్గాల వారే అత్యధిక సంఖ్యలో పేదరికం, నిరు పేదరికం అనుభవిస్తున్నారు. వీరిని ఆధునిక ఆర్థిక కార్యకలాపాలకు మళ్లించి, సామాజిక దోపిడీ నుంచి కూడా విముక్తం చేస్తేగాని వారి పేదరికం పోదు. అయితే పేదరిక నివారణకు కృషి ప్రణాళికాబద్ధంగా జరగక పేదరికం వ్యవస్థీకృతంగా మారింది. ఫలితంగా విస్తారమైన ప్రకృతి వనరులు, అపారమైన సహజ సంపద ఉన్న భారత్ మానవాభివృద్ధి సూచిలో మాత్రం ఎక్కడో అట్టడుగున మూలుగుతున్నది. స్వాతంత్య్రానంతరం గత 75ఏండ్లుగా స్వదేశీ పాలకులే అసమానతలు, వివక్షతను పెంచి పోషిస్తూ దేశం పేదరికాన్ని మూటగట్టుకునేలా అవలంబించిన ఆర్థిక విధానాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్షమే ఐక్యరాజ్యసమితి (యూఎన్డీపీ) నివేదిక. యూఎన్డీపీ నివేదిక ప్రకారం 189 దేశాలలో హెడీఐలో భారత్ 129వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో 124వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఏడేండ్ల ముందు అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం అసమానతలను తగ్గిస్తూ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను రూపొందించుటకు, రెండంకెల వద్ధిరేటు లక్ష్యంగా అడుగులు వేస్తున్నామనే, ఆకర్షణీయమైన నినాదాల డొల్లతనాన్ని ప్రపంచ ఆకలి సూచి -2020 బట్టబయలు చేసింది. ప్రభుత్వ విధానాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో ఈ ఆకలి కేకలు సజీవ సాక్ష్యంగా వినిపిస్తున్నాయి. దేశం విస్తృతమైన ఆకలితో పోరాడుతోందని, 2020 ఆర్థిక సంవత్సరంలో భారత జనాభాలో 14శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. ఐదేండ్లలోపు చిన్నారులు 37.4శాతం ఈ లోపంతో బాధ పడుతున్నట్టు తెలిపింది. అలాగే చైల్డ్ వెస్టింగ్ రేటు 17.3శాతంగా ఉన్నట్టు చెప్పింది. ఐదేండ్లలోపు శిశు మరణాల రేటు 3.7శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రధాని 2022 నాటికి ఆవిష్కరిస్తానని చెప్పిన 'దారిద్య్ర రహిత భారతం' సాధ్యమవుతుందా? తాజా ఆకలి సూచిలో 27.2 స్కోరుతో ఇండియా సీరియస్ కేటగిరీ జాబితాలోకి చేరింది. తగినన్ని క్యాలరీల ఆహారం తీసుకోలేని వారిలో ఎక్కువ మంది మన దేశంలోనే ఉండటం గమనార్హం. నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్, కార్పొరేట్, బహుళజాతి సంస్థల అనుకూల విధానాలను అనుసరిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన ర్యాంక్ దూసుకు పోతున్నదని గొప్పలు చెప్పుకుంటూ మీనమేషాలు లెక్కిస్తున్నది. దేశాభివృద్ధిని గురించి పదేపదే వల్లెవేస్తూ, ఫలితం ఇవ్వని మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి పథకాల గురించి గొప్పగా ప్రచారం చేస్తూ, దేశభక్తి గురించి తమకు మాత్రమే పేటెంట్ ఉన్నట్టు, తమ వ్యతిరేకులంతా దేశ ద్రోహులైనట్టు ప్రచారం చేసుకుంటూ, ప్రపంచ బ్యాంకు ర్యాంకుల కోసం ప్రజలను పస్తుల పాలు జేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషకులు జోసఫ్ స్టిగ్లిట్, అంగస్ డిటెన్, థామస్ పికెట్టీ, లూకాస్ ఛాన్సెల్, అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీలు పేదరికాన్ని, ఆకలిని బహుముఖంగా అధ్యయనం చేసి పేదరికం తీవ్రతను, పాలకుల వైఫల్యాలను వెలుగులోకి తెచ్చారు. ప్రభుత్వాధినేతలు, వారి ఆశ్రితులు, ప్రపంచ కుబేరులు సంపదను ఎలా పెంచుకున్నారో కండ్లు తిరిగే సత్యాలను గణాంకాలతో సహా వెల్లడించారు. ఈ వందేళ్లలో అంతరాలు ఏవిధంగా పెరిగాయో స్పష్టీకరించారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో నయా ఉదారవాద, స్వేచ్ఛా వాణిజ్యీకరణ, సరళీకరణ పేరుతో పెరిగిన రాజకీయ అవినీతి మూలంగా పేద, ధనిక అంతరాలు తీవ్రంగా పెరిగి, ప్రపంచ జనాభాలో 60శాతం (460 కోట్లు)వద్ద నున్న సంపదకు సమానంగా కేవలం 2153మంది శత కోటీశ్వరుల దగ్గర పోగు బడిందంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత దారుణంగా శ్రమ జీవుల సంపదను కొల్లగొడుతున్నదో విధితమవుతుంది.
ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా భారతదేశంలో అంతరాలు భారీగా పెరుగుతున్నాయని అనేక నివేదికలు ధృవీకరించాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏడు సంవత్సరాల నుంచి ఆకలి సూచిలో దేశం దిగజారుతూనే ఉంది. 2030 నాటికి భూగోళం నుంచి ఆకలిని రూపుమాపడం మిలీనియం సామాజికాభివృద్ధి లక్ష్యాల్లో ప్రధానమైనది. భారతదేశం ఇప్పటికే ఏడు సంవత్సరాలను కోల్పోయింది. కోవిడ్-19 ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించడానికి చేపట్టిన లాక్డౌన్, ఇతర చర్యలు మన ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయి. లక్షలాది మంది జీవనోపాధిని కోల్పోవడం వలన పేదరికపు గీతకు దిగువన నెట్టబడ్డారు. ఇది ఆకలి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రభుత్వాలు ప్రయివేటీకరణ మోజులో పడడంతో నేడు ప్రభుత్వ విద్య, వైద్యం అటకెక్కింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది పేదలే. అర్థాకలితో జీవించే వారికి జబ్బులెక్కువ కాబట్టి పేదలే వైద్యంపై అధికంగా ఖర్చు పెడుతున్నారు. అందువల్ల విద్య, వైద్యంపై ప్రభుత్వ వ్యయం భారీగా పెంచాలి. అప్పుడే మిలీనియం సామాజికాభివృద్ధికి అడుగులు వేసినట్టవుతుంది. లేదంటే 2030 నాటికి జీరో హంగర్ సాధించాలనే లక్ష్యం పగటికలే అవుతుంది. మన దేశంలో ఆకలి-2020 నివేదిక విడుదల సమయంలో, దేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ గిడ్డంగుల్లో 70మిలియన్ టన్నులకు పైగా ఆహార నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వానికి దార్శనికత కనుక ఉండి ఉంటే ఎవరూ ఆకలితో పస్తులుండే పనిలేదు. ఈ దేశంలో అత్యంత దుర్భర దారిద్య్రంతో బాధ పడుతున్న వర్గాలకు ఆహార భద్రత ఉండేలా 'జాతీయ ఆహార భద్రతా చట్టం-2013' నేడు అమలులో ఉన్నదన్న విషయం ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. ప్రభుత్వాలు దేశ ప్రజలను ఆకలితో మాడ్చి చంపే విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు దోచిపెట్టే వైఖరికి స్వస్తి పలకనంత వరకు ఈ ఆకలి సమస్య దేశాన్ని వెంటాడుతూనే ఉంటుందని గుర్తించాలి.
- నాదేండ్ల శ్రీనివాస్
సెల్ : 9676407140