Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ దర్శకురాలు, లక్ష ద్వీప్‌కు చెందిన ఐషా సుల్తానా జాతీయ సమగ్రతకు ముప్పు కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిందని, ఒక బీజేపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నేరారోపణ చేస్తూ ఆమెపై కేసు నమోదు చేశారు. తర్వాత ఆమె ముందస్తు బెయిల్ మంజూరు కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించగా, జూన్ 17న కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో, సుల్తానాకు నిర్బంధం నుంచి ఉపశమనం కలిగింది. త్వరలో కోర్టు తన కడపటి ఆజ్ఞలను జారీ చేస్తుంది. దేశంలో ఇటీవల అనేక మందిపై నమోదైన దేశద్రోహం కేసుల్లో సుల్తానాది ఒక కేసు. లక్షద్వీప్‌లో, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ప్లేకార్డ్లు, పోస్టర్లు ప్రదర్శించినందుకు ప్రజలపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. పాలకవర్గాలు, తమ రాజకీయ వ్యూహంతో నిరసన కారులను భయభ్రాంతులకు గురి చేస్తాయని సుల్తానా కేసు కూడా రుజువుజేస్తుంది.
ఇటీవల కాలంలో లక్షద్వీప్‌లో జరుగుతున్న పరిణామాలపై, దాని సంస్కరణల డ్రాఫ్ట్ పై ఒక టీవీ చానల్లో జరిగిన చర్చలో సుల్తానా 'బయోవెపన్' (జీవాయుధం) అనే పదం ఉపయోగించిందని ఆమెపై ఆరోపణలు చేశారు. 2020లో ఏ ఒక్క కోవిడ్-19 కేసు నమోదుకాని లక్షద్వీప్‌లో, అక్కడి పాలనాధికారి చర్యలు కరోనా వ్యాప్తికి దోహదం చేశాయనే ఆరోపణలు ఉన్నాయని చెప్పే సందర్భంలో ఆమె ఆ పదం ఉపయోగించింది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లోను, ఒక టీవీ చానెల్ చేసిన ఇంటర్వ్యూలో కూడా 'బయోవెపన్' అనే పదం ఉపయోగించడం 'తప్పేనని', తాను వలలో చిక్కుకున్నానని పేర్కొంది.
హిందూత్వ శక్తులు, ఆమెపై చేస్తున్న ఆరోపణలను పటిష్ట పరిచేందుకు, ఆమె బహిరంగంగా ఉపయోగించిన 'పదం' పైనే ఎక్కువగా కేంద్రీకరించారు. తద్వారా తమ వాదనలను బలపరచు కొనేందుకు, తప్పుడు అర్థాన్ని సృష్టించి నైతికంగా, చట్టబద్ధంగా విజయం సాధించేందుకు ప్రయత్నం చేశారు. సుల్తానా ఒక రాజకీయ పార్టీ కార్యకర్త కాదు. జాతికి సంబంధించిన అంశాల గురించి ఆమె బలంగా వాదనలు వినిపించలేక పోవచ్చు. ఆమె పాక్షికంగా తనపై తానే నేరాన్ని ఆరోపించుకోవడం, లేదా ఆ 'తప్పును' తానే ఏదో ఒక విధంగా ఒప్పుకుంటున్నట్టు కనపడుతుంది. కానీ, ఈ స్వీయ నేరారోపణ సహేతుకం కాదు. ఇది ప్రభుత్వ తప్పుడు చర్యలకు చట్టబద్దత కల్పించినట్టే అవుతుంది.
దేశ ఉదారవాద విలువల గురించి ఆలోచించే వారికి సుల్తానా కేసు ఒక నమూనాగా నిలుస్తుంది. దేశద్రోహ నేరానికి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 (ఏ)ను కోడ్‌లో 1870లో చేర్చారు. 1922లో జరిగిన విచారణలో, దేశద్రోహ నేరం ఆరోపించబడిన మహాత్మా గాంధీ, ''భారత శిక్షా స్మృతిలో పౌరుల స్వేచ్ఛను అణచివేయడానికి ఉద్దేశించబడిన రాజకీయ చట్టాలలో బహుశా ఇది యువరాజు'' అని వర్ణించాడు. స్వయంగా న్యాయవాది అయిన గాంధీజీ, మార్చి 18, 1922లో చేసిన తన ప్రకటనలో రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, ఆయన ఆనాడు ఉన్న పాలన పట్ల ద్వేషభావాలను బోధించిన అంశాన్ని అంగీకరించాడు. రెండవది, ఆయన తన చర్యను సమర్థించు కొని, ''బ్రిటిష్ రాజ్య పాలనా వ్యవస్థ పట్ల ప్రేమాభిమానాలు ఉండటం పాపం'' కాబట్టి నేను ఆ పని చేయడం నా విధి అని అన్నాడు. అదే విధంగా ''ప్రేమాభిమానాలను క్రమబద్ధం చేయటం గానీ లేదా తయారు చేయటం గానీ చట్టాలు చేయలేవు. ఒక వ్యక్తికి, ఒక వ్యక్తి లేక వ్యవస్థ పట్ల ప్రేమాభిమా నాలు లేనట్టయితే, హింసను ప్రేరేపించనంత వరకు, హింసను ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచన చేయనంత వరకు, ఆ వ్యక్తి తనకున్న అసంతృప్తిని స్వేచ్ఛగా వ్యక్తీకరించాలని'' గాంధీజీ అన్నాడు. ఇది రాజకీయ ప్రకటనే కాదు, న్యాయపరమైనది కూడా. ఆసక్తి కరంగా, గాంధీజీ న్యాయస్థానంలో చేసిన ఈ ప్రకటనను, 'కేదార్ నాథ్' (1962) కేసులో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరోక్షంగా చట్టం చేసింది. హింసా ప్రేరేపిత చర్యలు దేశద్రోహ నేరాల సారం అని ఆ కేసులో చెప్పడం జరిగింది. ఈ ప్రతిపాదనను, ఉన్నత న్యాయస్థానం వినోద్ దువా(2021) కేసు వరకు నిలకడగా అనుసరించింది. ఈ కేసులో కోర్టు, అసమ్మతిని వ్యక్తీకరించే జర్నలిస్టులపై దేశద్రోహం నేరాలు మోపకూడదని చెప్పింది.
గాంధీజీ దోషిగా నిర్థారణ అయి, శిక్షింపబడినప్పుడు ఈ చట్టం ఏమిటో స్పష్టమైంది. నేరం చేశాడని ఆరోపణలు చేయడం రాజకీయం, చట్టబద్ధం కాదు. ఆఖరికి నేడు రాజకీయ ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా నేరాలను మోపి, పాశవిక చట్టాల కింద వారిపై కేసులు నమోదు చేయడం (అది చట్టబద్ధమైన రూపం తీసుకున్నప్పటికీ కూడా) ఒక రాజకీయ చర్యే.
అలాంటి నేరారోపణలకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ రాజకీయ, న్యాయపరమైన రక్షణ వ్యవస్థలను నిర్మించాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యాజ్యం మాత్రమే ఈ నేరారోపణలకు నష్టపరిహారం పొందే సాధనం కాదు. 'రాజకీయ సెక్షన్'ల కింద నేరారోపణలు చేసినప్పుడు, వాటిని 'రాజకీయ ఆచరణతోనే' ఎదుర్కొనవలసిన అవసరం ఉందని గాంధీజీ అన్నాడు. ఎటువంటి వాస్తవాధారాలు లేకుండా పౌరులపై దేశద్రోహ నేరాలను ఆరోపిస్తున్న ప్రభుత్వ నీచమైన చర్యలను, 'రాజకీయ ఆచరణ' మార్గాలే బట్టబయలు చేస్తాయి. అలాంటి ప్రతిఘటనలు మాత్రమే మన న్యాయ వ్యవస్థలకు నూతన మార్గాల గురించి చారిత్రాత్మకంగా, రాజ్యాంగబద్దంగా ఆలోచించే పాఠాలునేర్పి, ద్వంద్వతర్కపు ప్రజాస్వామ్యాని (డైలాజిక్ డెమోక్రసీ)కి హామీ ఇస్తాయి.
దురదష్టవశాత్తు సుల్తానా ఆ తరువాత వ్యక్తం చేసిన విచారం ఈ రాజకీయ పరీక్షను సాధించలేదు.ఆమె టీవీ చానెల్లో ఉపయో గించిన పదం 'సరియైనదని' నొక్కిచెప్పి ఉండాల్సింది. లక్షద్వీప్‌లో నైతిక నియమాలు లేని పాలకుల విధానాలను బహిర్గతం చేసే తన (ఊహాత్మక ఆలోచనలు కలిగించే) భాషను సమర్థించుకోవడం ఆమెకు సాధ్యమయ్యేది.
ఒక ప్రసంగం లేదా ఒక రచన ఫలితంగా హింస చెలరేగిందనీ, లేదా కనీసం ఒక బహిరంగ చర్యకు, సామాజిక అల్లర్లకు మధ్య ఒక సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నప్పుడు, బ్రిటిష్ పాలకులు పాశవిక చట్టాలను ఉపయోగించే వారు అనే విషయం ఇక్కడ ప్రస్తావించటం అవసరం. 1897లో తన యాజమాన్య నిర్వహణలో ఉన్న మరాఠీ పత్రిక 'కేసరి' హింసను ప్రేరేపించే వ్యాసాల ప్రచురణ, ఇద్దరు బ్రిటిష్ అధికారుల హత్యలకు దారి తీసిందనే ఆరోపణలపై బాలగంగాధర తిలక్‌ను దోషిగా నిరూపించి, 18 నెలల పాటు కఠిన కారాగార శిక్షను విధించారు. 1908లో ఆయనను 'దేశద్రోహ' పూరితమైన వ్యాసాలు రాశాడనీ, వాటిని సామాజిక హింసకు ముడిపెట్టడం ద్వారా మరొకసారి శిక్షను విధించారు. స్వాతంత్య్రానంతరం, కేదార్నాథ్ సింగ్ కేసులో నేరారోపణ చేయబడిన వారిలో ఒకడైన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కేదార్నాథ్, ''విప్లవ జ్వాలల్లో పెట్టుబడిదారులు, జమీందారులు, భారత దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాడి మసైపోతారని'' విప్లవం పట్ల తనకున్న విశ్వాసాన్ని నొక్కి వక్కాణించాడు. కానీ, కోర్టు ''ఆ వ్యాఖ్యలను చాలా బలంగా వినిపించాడని, ప్రభుత్వ చర్యలపై అవి ఆక్షేపణ వ్యక్తం చేశాయని, సామాజిక హింసను ప్రోత్సహించే ప్రేరేపిత భావాలు లేవని'' అభిప్రాయపడింది. బల్వంత్ సింగ్ (1995) కేసులో, స్వతంత్ర సిక్కు దేశం కోసం ఇచ్చిన నినాదాలు హింసను ప్రేరేపించే, దేశద్రోహ పూరితంగా లేవని గుర్తించారు. ఈ ముఖ్యమైన కేసుల్లో కూడా నేరాలు మోపేందుకు వారిరువురు ఉపయోగించిన పదాల పైన కేంద్రీకరించలేదు. కానీ 2014 తరువాత కాలంలో మాట్లాడిన, రాసిన, ట్వీట్ చేసిన పదాలపైన ఆధారపడి తరచుగా, కావాలని దేశద్రోహం కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ప్రజా ఉద్యమాల పైన గగుర్పొడిచే ప్రభావాన్ని చూపుతాయి. ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికే ఈ చట్టాన్ని ఉపయోగించడం లో ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యం దాగి ఉంది. ఒక రకంగా పాశవిక చట్టాలలో దేశద్రోహ చట్టాన్ని ఉంచడానికి దేశం మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. అందువలన ప్రభుత్వం విమర్శలను, నిరసనలను అణచివేయడానికి ఈ పాశవిక చట్టాలను ఉపయోగించిన సంఘటనలపై భారత సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులు కూడా సూమోటోగా విచారణ చేపట్టాలి. ఇది కష్టమే అయినప్పటికీ, అసాధ్యం కాదు. ఇలాంటి సుమోటో విచారణ ప్రక్రియ మనం కోరుకునే న్యాయవ్యవస్థ క్రియాశీలతను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో స్వేచ్ఛను ముఖ్యమైన అంశంగా పరిగణించి, దాని కోసం చర్యలు చేపట్టే న్యాయనిర్ణేతల ధర్మాసనం కోసం నిరంతరం డిమాండ్ చేయడం ద్వారా న్యాయ వాద సంఘాలు తమ విమోచనవాద పాత్రను పోషించాలి. ''ద హిందూ'' సౌజన్యంతో
అనువాదం బోడపట్ల రవీందర్,
- కాళీశ్వరం రాజ్
సెల్:9848412451