Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రండి బాబు రండి... ఆలోచించిన ఆశాభంగం...'', ''భలే మంచి చౌక బేరం...'' ఇలాంటి ప్రకటనలు మనం గతంలో అనేకం చూశాం. వివిధ వస్తువులను అమ్మేటప్పుడో లేదా వాటిని వేలం వేసేటప్పుడో వ్యాపారులు ఇలాంటి ప్రకటనలు చేస్తుండటం పరిపాటి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సైతం ఇదే తరహాలో వ్యాపారస్తుడి అవతారం ఎత్తింది. మొన్నటిదాకా మనది ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వ పెద్దలు... ఇప్పుడు గల్లా పేట్టే ఖాళీ అయిందనే నెపంతో తెలంగాణలోని ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టారు. ''కరోనా వల్ల సర్కారు ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడింది... మరోవైపు సంక్షేమ, అభివృధ్ధి కార్యక్రమాలను అమలు చెయ్యాలె... అందుకే భూములు అమ్ముతున్నాం'' అని సెలవిస్తున్నారు మన అమాత్యవర్యులు. సరే... కొద్దిసేపు వారి మాటే కరెక్టు అనుకుందాం. మరి ఈరోజు ఆదాయం కోసం భూములు అమ్ముతాం, రేపు అమ్ముతాం, ఇలా ఏడాది వరకు భూములు అమ్ముతాం... తద్వారా ప్రభుత్వాన్ని నడుపుతాం, మరి ఆ తర్వాత దేన్ని అమ్మాలి...? ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు...? ఇప్పుడు ఈ ప్రశ్నలకు అధికార పార్టీ దగ్గర సమాధానం లేదు. షరా మామూలుగా ఆ పార్టీ అనుయాయులకు, మద్దతుదారులకు ఈ ప్రశ్నలు నచ్చవు. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం భూములు అమ్మకానికి పెడితే ఇదే గులాబీ శ్రేణులు... బస్తీమే సవాల్ అంటూ లొల్లి లొల్లి చేసి, ఖబడ్దార్ అంటూ ఆనాటి సర్కారుకు సవాల్ విసిరాయి. ఇప్పుడు గద్దెకెక్కిన తర్వాత మాత్రం ఆనాటి హస్తం పార్టీ మాదిరిగానే భూములను విక్రయించేదుకు గులాబీ సర్కారు రంగం సిద్దం చేసింది. ఇక్కడే వారి చిత్తశుద్ధి బయటపడుతున్నది. అంటే వేరే వారు చేస్తే తప్పు, మనం చేస్తే ఒప్పు అన్నట్టుగా ఉంది కారు పార్టీ వైఖరి. ఇప్పటికైనా భూముల అమ్మకాలపై సర్కారు వైఖరి మారాలి.. భావి తరాల కోసం వాటిని కాపాడుకోవాలి.
-బి.వి.యన్.పద్మరాజు