Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెనకటికి ఒకాయన దారి తప్పి ఒక ఊరికి చేరుకున్నాడట. దారిన పోయే ఒకాయనను ఇది ఏ ఊరు అని అడిగాడట. వెంటనే సదరు వ్యక్తి టక్‌న ఇది ''వస్త కూసుండు'' అని చెప్పాడట. పాపం ఆ కొత్త వ్యక్తి ఎంతో అమాయకుడు. నాకు దారి చూపించడానికి అతను వస్తడనుకుని అక్కడే కూర్చున్నాడట. ఎండ సెగలు కక్కుతుందట. నీళ్లు, బువ్వలేదు. నీడ లేదు. కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ఆయన రాలే. సరిగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇలాంటి కథను మించిపోయింది. వస్త కూసుండు అన్నట్టుగానే... ''ప్రతి రోజూ కొత్త పీసీసీ ప్రకటన వస్తుంది.. వస్తుంది..'' అని కండ్లల్లో ఒత్తులేసుకుని నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. నిజమేననుకుని ఎవరికి తోచిన విధంగా వారు టీవీల్లో ప్రసారం చేస్తున్నారు. పత్రికల్లో కథనాలు రాస్తున్నారు. ఎవరో ఒకరు లీకులు ఇస్తుండటంతో.. అదే నిజమనుకుని టెన్షన్‌గా వార్తలు రాసి, రాసి ఆ వార్తను పాత చింతకాయ పచ్చడిలా తయారు చేశారన్నది టాక్. తేదీలు, సమయం, మూహుర్తం కూడా నిర్ణయించి, నేతల ప్రాపకం కోసం సోషల్ మీడియాలోనూ పుంఖాను పుంఖాలుగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అయినా ప్రకటన రావడం లేదు. ఇందులో వాస్తవం ఎంతున్నా ప్రతి రోజూ పీసీసీ ఆశిస్తున్న నేతలు మాత్రం ప్రచారంలో ఉంటున్నారు. ప్రచారంలో కొంత మంది ముందుంటున్నారు. కొంత మంది వెనకబడిపోతున్నారు. కొంత మందికి ఇది నచ్చకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మొత్తంగా కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన ''వస్త కూసుండు'' అన్నట్టు ఉందని విశ్లేషణలు చేస్తున్నారు.
- గుడిగ రఘు