Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండేండ్లుగా కరోనా ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తూనే ఉన్నది. సోకిన సమయంలోనే అరిగోస పడి బతుకుజీవుడా అని కోలుకున్నోళ్లు కొందరైతే, కరోనా అనంతర అనారోగ్య సమస్యలతో అవస్తలు పడ్తున్నోళ్లు ఉన్నరు. 'పగోడికి కూడా గిసోంటి పరిస్థితి రావొద్దు' అని వచ్చిపోయినోళ్లు నెత్తీనోరూ బాదుకుంటుంటే...కరోనా తమ తాత చుట్టం అనుకున్నరో ఏమోగానీ కొందరైతే 'మాకేమైతది' అని కనీస జాగ్రత్తలు మరిచి ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నరు. కనీసం మాస్కులు కూడా పెట్టుకుంటలేరు. కరోనా బాధితుల బాధలు కండ్లకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా 'ఉంటే ఉంటం..పోతెపోతం.. భయపడుకుంట బతుకుడేందిర బై' అన్న నిర్లక్ష్య ధోరణితో ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నరు. మరీ పోరగాళ్లయితే చెప్తె వింటె ఒట్టు. బయటికి వెళ్లి కాల్జేతులు కడుక్కోని ఇంట్లోకి రారిరయ్యా అని అమ్మయ్య జాగ్రత్తలు చెబితే 'మీ అనుమానం పాడుబడ. ఊకె ఏందీ గోల' అన్నట్టు పైకీకిందికి చూసి కసురుకుంటున్నరు. మరోవైపేమో 'లాక్డౌన్లు ఉంటేంది.. లేకుంటేందిరబై... మాస్కులు పెట్టుకోరా? జాగ్రత్తలు తీసుకోరా? మీ అంతు చూస్తా' అన్నట్టు కరోనా కోరలు చాచుకుని బుసలు కొడుతూనే ఉన్నది. గివన్నీ పట్టకుండా లాక్డౌన్ ఎత్తయేంగనే ఇగ కరోనా పోయినట్టేననీ, ఇగ మాకేం కాదన్న ధోరణితో బయట పనీపాట లేకుండా తిరుగుతున్నవాళ్లతో ఇటు కుటుంబ సభ్యులకూ, అటు సమాజానికీ తిప్పలు మొదలైనయి.
- సిరి